నిజంగా ఇతడో అద్భుతమైన వ్యక్తి! అనుకున్నాడు బాలు. కానీ అద్భుతమైన వ్యక్తి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతణ్ణి చూస్తూంటే ఆక్టోపస్ జ్ఞాపకం వచ్చింది బాలూకి.
సౌదామినివైపు చూసి "పద" అన్నాడు. ఇద్దరూ సన్నటి కాలిబాట వెంట అవతలి గేటువైపు నడిచారు. అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూశాడు. దూరంగా రెల్లుగడ్డి వెనక పాడైపోయిన భవంతి, కూలిపోతున్న చూరు, పొడవాటి వరండా కనబడ్డాయి. ఆ వరండాలో ఆంజనేయులు బ్రహ్మానంద- వాళ్ళిద్దరి ఆకారాలూ అస్పష్టంగా కనబడుతున్నాయి. చచ్చిపోయిందనుకున్న జంతువు లేచి పరిగెడుతూంటే చెట్టుమీద నుండి చూసే రెండు డేగలు గుర్తొచ్చాయి.
5
"నాకింకా ఇదంతా ఒక కలలాగా నమ్మశక్యం కాకుండా ఉంది" అంది సౌదామిని నడుస్తూ.
"ఇంకా ఎలా వుంది?" అన్నాడు.
"పంజరంలోంచి బైటకు వచ్చిన పక్షిలా ఎగిరి గంతులెయ్యాలని వుంది."
"ఇంకా?" అన్నాడు.
"అసలు మనని ఆయన ఇలా వదలిపెట్టేయటమే ఆశ్చర్యం."
"పిస్టల్ ని అతడికి తిరిగి అందించేసి కాల్చమనటంలో, బహుశా అతడికి నమ్మకం కుదిరి వుంటుంది."
"అవును అన్నట్టు అడగటం మర్చిపోయాను. రహస్యాలన్నీ నేను చెప్పానన్నారు. ఏం చెప్పాను?"
"ఏం లేదని నువ్వక్కడ అనకపోవటమే మనని రక్షించింది. బోన్ మిల్ నుంచి కోళ్ళఫారం వరకూ అంతా నాకు తెలుసని చీకట్లో బాణం వేశాను. కోళ్ళఫారం గురించి రహస్యం ఏమిటి?"
ఆమె జవాబు చెప్పలేదు.
ఇద్దరూ అతని గది చేరుకున్నారు. "ఏం అంత మౌనంగా వున్నావు?" అని అడిగాడు.
"బ్రహ్మానంద అంత సులభంగా మనని వదలిపెడతాడనుకోను" అంది సాలోచనగా.
"ఏం చెయ్యగలడు? ఏమీ చెయ్యలేడు."
ఆమె బాలూకి దగ్గరగా వచ్చింది. తల పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, "ఈ రెండు మూడు గంటల్లోనూ ఎన్నో రకాలుగా అతడి ఎత్తులకి మీరు పైయెత్తులు వేశారు. ప్రతీ ఎత్తులోనూ అతడిని ఓడించారు. నేనూ కాస్తో కూస్తో తెలివైనదాన్నే, మనిద్దరం కలిస్తే వాళ్ళిద్దర్నీ ఎదుర్కోవచ్చుననే అనుకుంటున్నాను. మీరన్నట్టు అతడు మన గురించి పట్టించుకాకపోతే అసలు గొడవే లేదు" అంది.
"నువ్వూ దాని గురించి మర్చిపో" అన్నాడు ఆమెను చేతుల్లోకి తీసుకుంటూ.
ఇది జరిగిన మూడు రోజులకి వాళ్ళ వివాహం అయింది.
సౌదామిని, బాలూకి- స్నేహితులు, స్నేహితురాండ్రు కలిసి పెళ్ళి జరిపించారు. పందెం ఓడిపోయినందుకు సుబ్బారావు, అహమ్మద్ కలిసి మంగళసూత్రం చేయించారు.
కొత్త సంసారానికి కావలసిన ఒకో వస్తువూ తలొకరూ చదివించారు.
* * *
ఇంతకాలం నుంచీ ఉంటున్న బ్యాచిలర్స్ రూంలో సౌదామిని కూడా ఉండడం సాధ్యంకాదు కాబట్టి కొత్త కాపురం కోసం చిన్న పోర్షన్ తీసుకోవలసిన అవసరం వచ్చింది. అప్పటికప్పుడు అద్దె ఇల్లు దొరకడం అంటే సులభం కాదు. కానీ అహమ్మద్ అసాధ్యుడు. అంత కష్టపడకుండానే ఆ పని సాధించుకొచ్చాడు. ఆ ఇంట్లో రెండు పోర్షన్ లు ఒక పోర్షన్ లో మళయాళీ కుటుంబం ఒకటి కాపురం వుంటోంది. రెండో పోర్షన్ చాలా చిన్నది. రెండే గదులు. అద్దె మాత్రం చాలా యెక్కువే. అయిదొందలు. ఇంటి ఓనర్ ఇంకెక్కడో వుంటాడు.
ఆ యింట్లో చేరేటప్పుడు కొత్త దంపతులకి తోడుగా అహమ్మదూ, సౌదామిని స్నేహితురాళ్ళు ఇద్దరు అమ్మాయిలూ వచ్చారు. కిరోసిన్ స్టవ్ అంటించి, పాలు పొంగించింది సౌదామిని. అందరికీ కాఫీలు పెట్టి ఇచ్చింది. కొత్త కాపురం పెడుతున్న దంపతులతోబాటు చుట్టుపక్కలు ఎవరూ రాకపోవడం పైగా ఒక ముస్లిమ్ కుర్రాడూ, ఇద్దరు కాలేజీ అమ్మాయిలు మాత్రమే రావడం, పక్క పోర్షన్ మళయాళీలకు తెగ ఆశ్చర్యాన్నే కాక, చచ్చేంత భయాన్ని కూడా కలిగించింది. కొత్తగా వచ్చి చేరిన ఈ కుర్ర జంటని ఎలాంటి తెగలో చేర్చాలో వాళ్ళకి అంతుబట్టలేదు.
ఒక అరగంట కూర్చున్నాక, ఫ్రెండ్స్ అందరూ "బెస్ట్ ఆఫ్ లక్" చెప్పి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో మొదటిసారిగా వంట మొదలెట్టింది సౌదామిని. పాపం అన్నీ అమర్చిన అహమ్మద్ ఉప్పు కారం మర్చిపోయినట్లున్నాడు.
"ఇంత ఉపకారం చేసినవాడు ఉప్పు కారం మర్చిపోవడమేమిటి నా మొహం" అని విసుక్కుంటూ షాపుకి వెళ్ళాడు బాలు.
బాలూ ఎప్పుడు బయటి కెళతాడా అని ఎదురు చూస్తున్న పక్కింటావిడ గబుక్కున లోపలికొచ్చేసింది. ఆమె చేతిలో చిన్న డిష్ వుంది.
"ఇది తినండి" అని అందించింది సౌదామినికి. ఆమె గొంతులో ఉధృతమైన యాస.
గిన్నెలోకి చూసింది సౌదామిని. అందులోవున్నా పదార్ధమేమిటో అంతుబట్టలేదు.
"ఏమిటిది?"
"గాగరాగా గూళ" అంది మళయాళీ ఆమె.
సౌదామిని అదిరిపడింది.
మళ్ళీ చెప్పింది ఆవిడ.
కష్టంమీద అర్ధమయింది సౌదామినికి. అది కాకరకాయ కూర అని.
"థాంక్సండీ, ఎలా చేశారు దీన్ని" అంది. కుతూహలం కొద్దీ కాకపోయినా, పరిచయం పెంచుకుందామనే ఉద్దేశ్యంతో.
"ఏముంది ఏమ్లే! మార్కెట్ గెళ్ళాళ, గాగరగాయళు దేవాళ, దళిగి బెళుగులో వేసి, ఎండలో బొద్దుణ బెట్టాళ, సాయంద్రం దియ్యాళ, మళ్ళా బొద్దుణ బెట్టాళ, సాయంద్రం దియ్యాళ, ణుణెళో వేయించాళ."
తమిళులలాగే మళయాళీలు కూడా కచటతపలకి గజడదబలకి తేడా తెలియకుండా పలుకుతారు.
ఆమె మాటల్లో యాస వుంది. ఆమె చూపుల్లో యావ వుంది. ఆరాగా చూస్తోంది ఇల్లంతా.
అటుపక్కా ఇటు పక్కా బంధువులెవరూ తోడు లేకుండా వచ్చిన ఈ అమ్మాయీ, అబ్బాయీ మర్యాదస్తులేనా? లేక మరో రకమా? నిజంగా పెళ్ళి చేసుకున్నారా? లేకపోతే లేచిపోయి వచ్చి మర్యాదస్తుల మధ్య చేరారా?
ఆమె భయాలు ఆమెకి వున్నాయి. పూటకో నేరం, రోజుకో ఘోరం జరిగే నగరం ఇది. ఎవరూ ఎవరినీ నమ్మడానికి లేదు.
"మీ ఆయన ఎక్కడ పనిచేస్తడు?"
"ఒక ఆర్కెస్ట్రాలో పని చేస్తారు" అంది సౌదామిని ఆమెకి అబద్దాలు చెప్పే అలవాటు లేదు. అలాగని పూర్తి నిజం చెప్పుకోదలుచుకోలేదు తను.
బాలూ బార్ లో గిటార్ వాయిస్తాడని చెబితే ఇప్పటికిప్పుడే పంచాయితీ పెట్టించి పారదోలేటట్లు వున్నారు వీళ్ళు.
బయట బాలూ చెప్పులు వదిలిన చప్పుడు వినబడింది. పక్కింటి ఆవిడ గబగబ తమ పోర్షన్ లోకి వెళ్ళిపోయింది. అసంపూర్ణంగా మిగిలిపోయిన తను ఎంక్వయిరీ తరువాయి భాగాలని భర్తకూ, పిల్లలకీ అప్పగించింది.
"ఇదేమిటి?" డిష్ లోకి తొంగిచూశాడు బాలూ.
"కనుక్కోండి చూద్దాం".
కళ్ళు చిట్లించి దాన్ని చూశాడు బాలూ. ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూశాడు. చివరికి నోట్లో ఒక ముక్క వేసుకుని తిన్నా అదేమిటో ఇతమిద్దంగా తేలలేదు.
నవ్వేసి, "అది గాగరగా గూళ!" అంది సౌదామిని.
"నువ్వు చెబుతున్నా అర్ధంకావటం లేదు" అన్నాడు బాలూ.
మళ్ళీ నవ్వి అదేమిటో చెప్పింది సౌదామిని.
"నువ్వు చెబుతున్నా అర్ధంకావటం లేదు" అన్నాడు బాలూ.
మళ్ళీ నవ్వి అదేమిటో చెప్పింది సౌదామిని.
ఉత్సాహంగా చూశాడు బాలూ. "కూర వచ్చేసిందిగా ఇంకేం చెయ్యకు. తొందరగా భోజనం చేసేసి, నెక్స్ ట్ ఐటమ్ కి వెళ్ళిపోదాం."
సౌదామిని మొహంలో నవ్వు తగ్గింది. "ఎప్పుడూ అదే ఆలోచనా! మరీనూ!" అంది కంచాలు పెడుతూ. మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది.
భోజనాల తర్వాత కాసేపు పడుకున్నారు.
ఆ కాసేపుని కూడా సద్వినియోగం చేసుకోవాలని చూశాడు బాలూ. కానీ సౌదామిని పడనివ్వలేదు. అతని సూచననీ, తన నడుముమీద వున్న అతని చేతిని తీసిపారేస్తూ "పగటిపూటా? ఇంకా నయం!" అంది.
"రోమాన్స్ కి టైముంటే చాలు! టైంటేబులక్కర్లేదు" అన్నాడతను. కళ్ళెత్తి సూటిగా అతనివైపు చూసింది సౌదామిని.
"రోమాన్స్ కే కాదు. జీవితంలో ప్రతిదానికీ టైంటేబుల్ వుండాలి. ఫలానిది సాధించాలి మనం అని లక్ష్యం పెట్టుకోవాలి. అంచెలంచెలుగా దాన్ని అందుకోవాలి. ఈ లైఫ్ లో మీతో కలిసి ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులు చెయ్యాలని వుంది నాకు. ఏం? మీకు లేదా?"
"నీతో కలిసి ఎన్నెన్నో పనులు చెయ్యాలని వుంది నాకు. కానీ అవి గొప్పవో కావో మాత్రం నాకు తెలియదు" అన్నాడు నవ్వుతూ సీరియస్ గా చూసి ఊరుకుంది సౌదామిని అతని చేతులు అల్లరి చేయడం మానలేదు.
కాసేపు ఓపికపట్టి, ఇంకిలా కుదరదని లేచి కూర్చుంది. "లేవండి! అక్కడ కనబడుతున్న గుడి రామాలయమే కదూ! కాసేపు వెళ్ళొద్దాం!"
"ఇప్పుడు రామాలయానికా! రామ రామ! సరిగ్గా సీను రక్తికట్టే సమయానికి నువ్వు...."
అతని మాటలనీ, చేతలనీ కూడా ముందుకి సాగనివ్వకుండా ఆపేసింది సౌదామిని. అతికష్టంమీద అతన్ని వదిలించుకుని లేచి నిలబడింది. అయిష్టంగానే అతనూ లేచాడు. బయటికి వచ్చాక, "గుడికి రేపెళ్ళొచ్చులెద్దూ! ఈలోగా మనం చెయ్యాల్సిన అర్జంట్ పని ఒకటి వుంది" అన్నాడు బాలూ.
"ఏమిటది?"
"మా ఆవిడకి అరడజను చీరలు కొనిపెట్టడం."
"ఇప్పుడు చీరెలూ, సారెలూ ఎందుకు? నాకు వద్దు."
"కట్టుకున్న చీరెతో వచ్చేశావు. పెళ్ళికి మీ ఫ్రెండ్స్ ఒక చీరె పెట్టారు. కొత్త పెళ్ళికూతురికి అరడజను చీరెలన్నా లేకపోతే, అబ్బే, ఏం బాగుంటుంది!"
"అన్నీ అక్కర్లేదుగానీ, చౌకరకంవి రెండు సింథటిక్ చీరలు కొనుక్కుంటే చాలు."
"సింథెటికా! వద్దొద్దు సౌదామిని!"
ఆశ్చర్యంగా చూసింది సౌదామిని "ఏం, ఎందుకని వద్దు?"
అతను మాట్లాడకుండా ఆమె మొహంలోకి చూస్తూ వుండిపోయాడు. "ఎక్కువ చీరెలు లేనప్పుడు వాటినే కట్టుకుని వంట చేస్తావు. అది ఎంత డేంజరో తెలుసా! కొంచెం మంట లేచిందంటే వంటికి అంటుకుపోతాయి సింథెటిక్స్! వద్దు సౌదామినీ, వద్దొద్దు."
