"బావా! ఇవి నీకని తెచ్చాను మురుకులు!"
"ఇలా ఇవ్వు! అమ్మ చూస్తే కోప్పడుతుంది, తరువాత తింటాను! పొట్లం గబుక్కున లాక్కొని తలగడ క్రింద దాచేశాడు! బొమ్మల్నీ, సంధ్యనీ చూచేసరికి లేని ఓపిక వచ్చేసి కాస్సేపు పక్కమీద కూర్చొని ఆడుకొన్నాడు.
"కాస్త జ్వరం ఇలా జారిందో లేదో అప్పుడే ఆట మొదలెట్టావు! అలసటకి మళ్ళీజ్వరం వస్తే? సంధ్య ఎక్కడికిపోదు! పడుకో!"
మధ్యాహ్నం పక్కదులిపేస్తుంటే మురుకుల పొట్లం బయట పడింది. "ఎక్కడిదిరా ఇది?"
"సంధ్య ఇచ్చిందమ్మా!" భయపడుతూ చెప్పాడు.
"దీని ప్రేమ చల్లగా! జ్వరం వచ్చినవాడికి చిరుతిళ్ళు తెచ్చిపెట్టి మళ్ళీ జ్వరం తెప్పిస్తుందా ఏమిటి?" సంధ్యని చీవాట్లు వేయడానికి తల్లి వెడుతూంటే సంధ్య పేరు ఎందుకు చెప్పానా అని బాధపడ్డాడు అరుణ్.
* * *
"బడికి టైం అయింది! ఫలహారం చేశావా నాకు?"
"అబ్బా! కట్టెలు మండక నేను చస్తూంటే!" మూడు రాళ్ళు పెట్టి, దానిమీద ఒక కట్టెపావు ఉంచి, ఉఫ్ ఉఫ్ మని ఊది తెగ ఆయాస పడిపోతూంది సంధ్య. దాంట్లో నిప్పుంటేగా మంటేది?
"ఆకలేస్తూందే! ఆకలేస్తూంటే పిల్లలకి పాఠాలు ఎలా చెప్పాలి?" అరుణ్ దీనంగా ముఖం పెట్టాడు పొట్ట చేత్తో పట్టుకొని.
"బొరుగులున్నాయి! తినేసి వెడతారా?"
"ఏవో పెట్టు!"
పావులన్నీ వెదికి, నాలుగంటే నాలుగు బొరుగులు తీసి అతడి ముందు ఓ డబ్బామూతలో పోసి పెట్టింది.
"స్కూల్ నుండి వచ్చేసరికి అన్నం చేస్తావా, లేదా?"
"పచ్చికట్టెలు నా మొహాన పారేసి వండమంటే ఎలా చచ్చేదీ?"
ఫక్కున నవ్వులు వినిపించి బిత్తరపోయి చూశారు పిల్లలిద్దరూ.
పొట్ట చేత్తో పట్టుకుని నవ్వుతున్నారు రుక్మిణీ, జానకీ.
"మీ ఆయనకి నాలుగు బొరుగ్గింజలతో ఆకలి ఎలా తీరుతుందనుకొన్నావే?" రుక్మిణి అడిగింది నవ్వు ఆపుకొంటూ.
సిగ్గుపడి తల్లి కుచ్చిళ్ళలో ముఖం దాచేసుకుంది సంధ్య.
"బొరుగులూ, పేలాలూ పెట్టి మీ ఆయన ఆకలి తీరుస్తావేమిటే?" జానకి సంధ్య బుగ్గ పిండింది.
* * *
"వదినా, సంధ్యొచ్చిందా మీ ఇంటికి?" కంగారుగా వచ్చింది రుక్మిణి.
"లేదే! అరుణ్ కూడా లేడు గంటపైగా! నాకు వాడిమీద ధ్యాసే లేదు! ఇద్దరూ కలిసివెళ్ళారేమో!"
"ఎక్కడికి వెడతారు? గుడిలోనూ, బంగ్లా వెనుకా చూసే వచ్చాను! లేరు! అలుగునిండుగా వెడుతూంది! నాకు భయం వేస్తూంది ఇంట్లో మీ అన్నయ్య కూడా లేడు!"
"అనవసరంగా కంగారు పడకు! మీ అన్నయ్యని పంపిస్తానుండు!"
పిల్లలిద్దరి కోసం ప్రసాద్ బయల్దేరాడు వెదకడానికి. మరో ఇద్దరు స్టూడెంట్స్ ని చెరో దిక్కు పంపించాడు. చివరకు ఒక గొల్లతను ఆచూకీ చెప్పగా కొండలయ్యగట్టుమీద తేలారిద్దరు! బోల్డెన్ని సీతాఫలాలు కోసుకు తినొచ్చు అని సంధ్యని తీసుకు వెళ్ళాడట అరుణ్. పళ్ళయితే దొరకలేదు గాని సంధ్య రాళ్ళమీద నుండి జారిపడి మోకాలిచిప్ప పగిలిపోయింది. బొట బొట కారిపోతున్న రక్తాన్నిచూసేసరికి అరుణ్ కి గాబరా ఎత్తింది! గబ గబా చెట్ల ఆకులు తెంచి రక్తాన్ని తుడవబోయాడు గాని రక్తం రావడం ఆగలేదు. ఇంటికి వెళదామంటే సంధ్యకి కాలు నడవనివ్వడం లేదు.
"నిన్ను చంకలోకెత్తుకొని నడవలేను గాని, వీపుమీద చాకలి మూటలా వేసుకొని నడవగలను! లే! ఆ గుండుమీద నిల్చుని నా మెడను వాటేసుకో!"
"ఛీ, ఛీ! చాకలి మూటలా నీ వీపుమీద ఎలా వ్రేలాడను? నాకు సిగ్గేస్తుందబ్బా!"
