మంగులూ, కుక్కా ఇద్దరూ చెత్తకుండీ చుట్టూ పరుగులు తీశారు. చివరికి ఇద్దరూ ఆయాసంతో ఆగిపోయారు. చెత్తకుండీ అవతల మంగులు, ఇవతల ఊరకుక్కా.
కుక్క ఓసారి మంగులు వంక సీరియస్ గా చూసి ఆ తర్వాత తన భాషలో "భౌ....వ్....వ్వౌ వ్వౌ....వూ...." అని బూతులుతిట్టి అక్కడి నుండి పరుగున వెళ్ళి చీకట్లో మాయమైంది.
"దరిద్రపు ముండ....దీని గురించి కూడా కొవ్వొత్తులు ఆర్పి, శపధం చేయాల్సిన పరిస్థితి తెస్తుందేమో అనుకుని భయపడి చచ్చా...." అని దాన్ని తిట్టుకుంటూ కమీషనర్ లింగారావ్ ఇంటివైపు అడుగులు వేశాడు.
గేటు దగ్గర కాపలాకాస్తున్న గూర్ఖా గజదొంగ మంగులు కంటపడ్డాడు. అతను మెల్లగా ఇంటి వెనుకవైపుకి వెళ్ళి, కాంపౌండ్ వాల్ జంప్ చేసి లోపలికెళ్ళాడు. అక్కడ డ్రయినేజ్ పైప్ లైన్ పట్టుకుని పైకిప్రాకి బాల్కనీలోకి దుమికాడు.
పోలీస్ కమీషనర్ బెడ్ రూమ్ ఎక్కడుంటుందో తన వేగులద్వారా గజదొంగ మంగులు తెల్సుకున్నాడు. ఒక్క బెడ్ రూం ఏంటీ, ఆ యింటి ప్లాన్ మొత్తం మంగులుకి తెల్సు.
మంగులు కమీషనర్ లింగారావ్ బెడ్ రూం లోకి ఎంటరయ్యాడు. బెడ్ రూం కమీషనర్ పెట్టే గురకతో దద్దరిల్లి పోతుంది. శ్రీలక్ష్మి, దీప కూడా గాఢంగా నిద్రపోతున్నారు.
మంచాన్ని సమీపించి మంగులు జేబులోంచి ఓ పొట్లం తీసి అందులోని పొడిని చేతిలో వేసుకుని దీప మొహంమీద చల్లాడు. దీప మెడని ఓ ప్రక్కకి వాల్చేసింది.
మంగులు అతి జాగ్రత్తగా దీపని వాళ్ళిద్దరి మధ్యలోంచి తీసి తన భుజంమీద వున్న గోనెసంచిలో వేసుకుని గదిలోంచి బయటికి నడిచాడు. మెట్ల మీంచి క్రిందికి దిగి, హాలు తలుపులు తీసుకుని బయటికొచ్చాడు. కాంపౌండ్ వాల్ గేటు దగ్గర గూర్ఖా వుంటాడని ఇంటి వెనక్కి వెళ్ళి అక్కడ గోడ ఎక్కి బయటికి గెంతాడు. కానీ మూత్ర విసర్జన కోసం అప్పుడే ఇంటి వెనక్కొచ్చిన గూర్ఖాకి ఇంట్లోంచి భుజంమీద మూటతో బయటికి దూకిన మంగులు కనిపించాడు.
గూర్ఖా "చోర్....చోర్" అంటూ కంగారు కంగారుగా అరిచాడు. అంతకంటే కంగారుగా విజిల్ వూదాడు.
మంగులు భుజంమీది మూటతో పరుగు లంకించుకున్నాడు.
బయట గోలకి కమీషనర్ లింగారావ్ కి, శ్రీలక్ష్మి కి మెలకువ వచ్చింది. తమ మధ్య దీప లేకపోవడం వాళ్ళు గమనించారు.
"అమ్మా దీపా...." అంటూ శ్రీలక్ష్మి బావురుమంది.
ఇద్దరూ గబగబా మెట్లుదిగి హాల్లోకొచ్చారు. అప్పుడే బయటి నుండి లోపలికి గూర్ఖా వచ్చాడు.
"షాబ్....మనదీ ఇంటీ గోడమీంచి ఒకా మన్షీ దూకీ బయటికీ పోయాడు షాబ్....వాడ్కీ భుజంమీద ఓ పేద్ద మూట వుంది షాబ్...." ఆయాసపడుతూ చెప్పాడు.
"అమ్మా దీపా....ఆ మూటలో వున్నది నువ్వేనమ్మా...." అంటూ శ్రీలక్ష్మి మళ్ళీ బావురుమంది.
"నువ్వు వాడ్ని వెంబడించి పట్టుకోక వెనక్కివచ్చావేం?" అరుస్తూ అడిగాడు కమీషనర్.
"నేను పరిగెత్తలేకపోయాన్ షాబ్" అన్నాడు గూర్ఖా.
"ఏంటీ....భుజంమీద పెద్ద మూటతో....ఛీ ఛీ....మూటకాదు....భుజంమీద దీపతో వాడు ఈజీగా పరిగెత్తాడు. నువ్వు పరిగెత్తలేకపోయావా? ఎందుకని....ఎందుకని....ఎందుకని?" చిరాగ్గా అరుస్తూ అడిగాడు లింగారావ్ తలమీద మొట్టుకుంటూ.
"నాకు జోరుగా బాత్రూం వస్తుంది షాబ్" అని చెప్పి-"బాప్ రే...." అంటూ రెండు అరిచేతులూ పొత్తికడుపు కింద అడ్డం పెట్టుకుని స్పీడ్ గా పరుగుతీశాడు గూర్ఖా.
"ఈ స్పీడ్ లో వీడు ఇందాకే పరిగెట్టుంటే ఆ మంగులు దొరికే వాడే" విసుగ్గా అని టేబుల్ మీది వైర్ లెస్ సెట్ తీశాడు లింగారావ్.
వైర్ లెస్ పెట్ లో అన్ని పోలీస్ స్టేషన్ల కీ మంగులు దీపని ఎత్తుకెళ్ళిన సంగతి చెప్పి, అన్ని దారులూ క్లోజ్ చేయమని ఇన్ స్త్రక్షన్స్ ఇచ్చాడు కమీషనర్ లింగారావ్.
"దేవా....ఏడుకొండలవాడా....నా దీప నాకు క్షేమంగా దక్కితే మా వారి బొటనవేలిని సమర్పించుకుంటా స్వామీ...." అని మొక్కుకుంది శ్రీలక్ష్మి.
అది విన్న కమీషనర్ లింగారావ్ నెత్తిమీద బాధగా ఠపా ఠపామని మొట్టేసుకున్నాడు.
* * * *
అదే రాత్రి....
పోలీస్ స్టేషన్ లో....
"వాడు కక్కాడా లేదా?" ఇన్స్ పెక్టర్ అప్పారావ్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని అడిగాడు సెల్ లో దొంగని చూపిస్తూ.
"ఎలా కక్కుతాడు, ఏం కక్కుతాడు సార్....పొద్దున్నుండీ తినడానికి వాడికి మనమేం ఇవ్వలేద్సార్" బుర్ర గోక్కుంటూ అన్నాడు రాంబాబు.
"ఏం....జోకులేస్తున్నవా?" క్రూరంగా రాంబాబు వంక చూస్తూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
"నేనంటున్నది నిజం కక్కేడా లేదా అని."
"వాడు బండోడు సార్! లాఠీలతో కొట్టాం, కళ్ళలో కారంముద్దలు కూరాం...ఏం చేసినా వాడు నిజం చెప్పడంలేదు సార్" అన్నాడు కాని స్టేబుల్ చిన్నారావ్.
"మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడితో నిజం చెప్పించాలి....అంతే" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.
రెండు క్షణాలు ఆలోచించిన రాంబాబు "సార్....గుడ్ ఐడియా!" అన్నాడు.
"ఏంటది?" అడిగాడు ఇన్స్ పెక్టర్ .
రాంబాబు ప్యాంట్ జేబులోంచి ఓ కట్ట కాగితాలు తీశాడు.
