Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం  పేజి 11

    "ప్లీజ్... మీకు నామీద కోపం, పగా ఉంటే ఇంకోసారెప్పుడైనా తీర్చుకోండి. కానీ ఈసారికి నన్ను వదిలెయ్యండి. నేను అతి ముఖ్యమైన పనిమీద వెళ్తున్నాను.
    "ఏం పని....?" అడిగాడు రెండో రౌడీ మెడమీద అరచేతిలో రుద్దుకుంటూ.
    "నేనూ రిక్షా కొనుక్కోడానికి వెళ్తున్నాను... పవిత్రమైన నా తల్లి పోపుల డబ్బాలో దాచుకుని కూడబెట్టిన డబ్బు నాకు ఇచ్చింది రిక్షా కొనుక్కోమని" గోపీ కుడిచేయి గుప్పిలి విప్పి చూపించాడు.
    పచ్చనోట్లు!... నలుగురు రౌడీల కళ్ళూ ఆ నోట్లమీద పడ్డాయ్.
    "ఇంక నన్ను వదిలిపెడతారా?" రిక్వెస్టింగ్ గా అడిగాడు.
    "ఒరేయ్... వీడిని వదిలి పెట్టాలంటారా. హ హ హ" పకపక నవ్వాడు మూడో రెడీ.
    "అలాగే వదిలి పెడతాం నాలుగు తన్ని  డబ్బులు లాక్కుని వదిలి పెడతాం. హ్హ హ్హ హ్హ" నవ్వాడు నాలుగో రౌడీ.
    "నన్ను తంతే తన్నండిగానీ ఈ డబ్బుని మాత్రం ముట్టకండి. ఇది పవిత్రమైన నా తల్లి పోపుల డబ్బాలో ఇన్ని సంవత్సరాలూ దాచిన డబ్బు!ప్లీజ్" అన్నాడు గోపీ దీనంగా.
    రౌడీలు ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూస్కున్నారు.
    వాళ్ళు గోపీని చుట్టుముట్టగానే అతను నలుగుర్ని అప్పట్లా చితకతన్ని కాలవలోకి తోసేసి పోతాడనుకుని ఎంతో ఆశపడి వచ్చారు. కానీ ఇప్పుడు ఇలా బ్రతిమలాడ్తున్నాడేమిటీ?
    అప్పుడు అంత విజ్రుభించి తన్నినవాడు ఇప్పుడు ఇంత బేలగా ఎందుకు సవర్తిస్తున్నాడో వాళ్ళకి అర్ధం కాలేదు.
    గోపీ అలా బ్రతిమాలాడేసరికి వాళ్ళ నలుగురికీ అతడు లోకువ అయ్యాడు.
    అంతే... వాళ్ళు నలుగురూ ఇష్టం వచ్చినట్లు తంతూ ఉంటే గోపీ వాళ్ళకి శరీరం అప్పజెప్పేశాడు కానీ కాస్త కూడా ఎదురు తిరగలేదు.
    గోపీని అలా పదినిముషాలు తన్నిన తర్వాత నలుగురు రౌడీలు ఆగారు.
    గోపీ నేలమీది నుండి మెల్లగా లేచాడు.
    "అయిపోయిందా? మీ పగ చల్లారిందా. ఇంక నేను వెళ్తాను." అని రెండడుగులు ముందుకు వేశాడు.
    "ఎక్కడి పోతావ్ బే.... ఆ డబ్బులు ఇచ్చి పో" అన్నాడు మొదటి రౌడీ.
    గోపీ ఆందోళనగా చూస్తూ వెనక్కి అడుగులు వేస్తూ అన్నాడు. "వద్దు. నన్ను కసితీరా తన్నారుగా? ఈ డబ్బుల జోలికి మాత్రం రాకండి పవిత్రమైన నా తల్లి ఇచ్చినది."
    "నీయమ్మ పవిత్రమైన పోపుల డబ్బాలో పవిత్రంగాదాచుకున్నది. రెండో రౌడి పకపక నవ్వుతూ గోపీ చెయ్యి మెలిపెట్టాడు. చేతిఎముక కరకరా శబ్దం చేసింది.
    గోపీ బాధగా అరుస్తూ గుప్పిలి విప్పాడు. అంతే. అతని చేతిలోని పచ్చనోట్లు నేలమీద పడ్డాయ్.
    డబ్బులు క్రిందకి వంగి ఏరుకుంటూ మూడో రౌడీ అన్నాడు "ఈ డబ్బుల కోసం ఏడుస్తావేంట్రా. మా రాయుడుగారి దగ్గరకు నీపెళ్ళాన్ని పంపు. ఇంతకు పదిరెట్లు డబ్బు ఆయన ఇస్తారు."
    మిగతా ముగ్గురు రౌడీలు పకపకా నవ్వారు.
    అంతే! గోపీలోని ఆవేశం కట్టలు తెంచుకుంది.
    "ఒరేయ్... ఏం కూశావ్ రా." అంటూ ఆ రౌడీ కాలరు పట్టుకుని గెడ్డం క్రింద గట్టిగా ఓ దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రౌడీ కళ్ళు బైర్లు కమ్మాయ్. గోపీ క్షణం ఆలస్యం చెయ్యకుండా ఆ రౌడీ చేతిలోనిడబ్బు లాక్కుని జేబులో పెట్టేస్కున్నాడు.
    అంతలో మరో రౌడీ మెరుపులా మీదికి వస్తే వాడి చెయ్యి పట్టుకుని వెనక్కి మెలేసి వీపుమీద ఒక్క గుద్దు గుద్దాడు. వాడు "బేర్ ర్" అన్నాడు.
    తర్వాత నలుగుర్ని వంతులవారీగా చితక్కొట్టి ఒక్కొక్కళ్ళనీ కాలువలో పడేలా తన్నాడు గోపీ.
    "ఇందాక పుట్ బాల్ లా తన్నేసిన తర్వాత వెళ్ళిపోవలసింది. అనవసరంగా అతని డబ్బుల జోలికి వెళ్ళి కాలువలో పడేలా తన్నించుకున్నాం." అనుకున్నారు రౌడీ కాలవలో చేతులూ కాళ్ళూ తపతపాకొట్టుకుంటూ.
    గోపీ కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళడు. ఈలోగా కాలవలోంచి ఒక రౌడీ బయటికి వచ్చి ఒక పెద్ద బండరాయిని అందుకుని గబగబా నడిచి, గోపీ వెనకాలచేరి ఆ బండరాయితో గోపీ తలమీద ఒక్కటిచ్చాడు.
    "అమ్మా..." ఆక్రందన చేస్తూ గోపీ నేలమీద పడ్డాడు.
    గోపీ కళ్ళు తెరిచేసరికీ అతనికి సీతాలు మొహం కనిపించింది. సీతాలు మొహం మీద మొహం పెట్టి చూస్తూంది. గోపీ కళ్ళు తెరవగానే సీతాలు మొహం వికసించింది.
    "నేనెక్కడ ఉన్నాను?" నీరసంగా సీతాలుని అడిగాడు గోపీ.
    "నా ఒళ్ళో ఉన్నారు బాబుగారూ."
    "అబ్బా! అదికాదు. పోనీ మనిద్దరం ఎక్కడ ఉన్నాం?" అని అడిగాడు.
    "మా ఇంట్లో వున్నాం బాబుగారూ"
    "నేను ఇక్కడికి ఎలా వచ్చాను?"
    "నిన్నెవరో తలమీద గాయంచేసి రోడ్డుమీద పడేస్తే నేనే తీసుకొచ్చాను బాబుగారూ."
    గోపీకి గుర్తుకొచ్చింది. రాయుడు మనుషులు తనని ఆటకాయించడమూ, వాళ్ళకి తనకీ మధ్య ఘర్షణ జరగడం... అంతా గుర్తొచ్చింది.
    "నన్ను రాయుడు మనుషులు వెనకనుండి దొంగ దెబ్బతీశారు అని సీతాలుకి చెప్పి తల తడుముకున్నాడు.
    తలకి ఇంత లావుగా బట్ట చుట్టేసి వుంది.
    "అయ్ బాబోయ్. తలకేంటి ఇంత లావుగా కట్టు కట్టావ్" అన్నాడు గోపీ.
    "అందరూ తలకి దెబ్బ తగిల్తే చీర చెంగు చింపి కట్టుకడ్తారు. కానీ నాకు మీరంటే దేదో ఇది బాబూ. అందుకనే నేను నాచీర మొత్తం మీ తలకి చుట్టేశాను బాబూ. వట్టిది కాదులే. ఆకుపసరేసి చుట్టాను బాబూ." అంది సీతాలు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ.
    గోపీ సీతాలువంక కృతజ్ఞతగా చూశాడు.
    "నువ్వు నిజంగా దేవతవి సీతాలూ." అన్నాడు గోపీ సీతాలు మెడచుట్టూ చేతులు వేస్తూ.
    "శ.... ఊర్కోండి బాబూ... ఏంటా మాటలు?" సీతాలు సిగ్గుపడింది.
    "బాబూ అయ్యా అంటూ ఏంటా పిలుపులూ... గోపీ అని పిలువ్" చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు గోపి.
    "అలాగే గోపీ బాబూ!"
    "అదిగో మళ్ళీ బాబూ?"
    సీతాలు కిలకిలా నవ్వింది.
    "అలాగే గోపీ!"
    గోపి చుట్టూ పరికించి చూశాడు.
    "ఇంట్లో ఎవరూ లేరా?" అని అడిగాడు.
    "ఎవరుండాలి?" అడిగింది సీతాలు.
    "మీ అమ్మా, అయ్యా!"
    "నాకు అమ్మా, అయ్యా ఎవరూ లేరు."
    కళ్ళనీళ్ళు పెట్టుకుంది సీతాలు.
    "అయ్యొయ్యొ" బాధగా అన్నాడు గోపి.
    హఠాత్తుగా సీతాలు పకపకా నవ్వేసి కన్నీళ్ళు తుడిచేస్కుంది.
    "ఇదివరకు ఎవరూ లేరుగానీ ఇప్పుడు నువ్వున్నావుగా?"
    "సీతాలూ.... నువ్వెంత మంచిదానిని సీతాలూ.... నిజంగా నువ్వు దేవతవి సీతాలూ."
అన్నాడు గోపీ గొంతునీ, పెదాలను వణికిస్తూ.
    "ఉండు గోపీ! నీకు మా గంగని పరిచయం చేస్తాను" అంటూ తన ఒళ్లోని గోపి తలని నేలమీదికి పెట్టి లేచి నిలబడింది సీతాలు.
     గోపి తల నేలమీద ఢాంమ్మని పడింది.
    "హమ్మా" బాధగా తల పట్టుకున్నాడు  గోపి.
    "అయ్యో... దెబ్బ తగిలిందా? నన్ను శమించు గోపీ" అంటూ గోపి తలని నిమిరింది.
    "మరేం పర్లేదులే.... నీకెవరూ లేరన్నావుగా .... మరి ఈ గంగెవరు?" అడిగాడు గోపి.
    "గంగ. గంగకన్న పవిత్రమైనది గోపీ... ఉండు నీకు పరిచయం చేస్తా" అంటూ.
    "గంగా...." అని పిలిచింది.
    వెంటనే అంబా అంటూ ఒక తెల్లని ఆవు పరిగెత్తుకుని అక్కడికి వచ్చింది.
    "ఇదే నాకు తోడూ, రక్షణా అన్నీ గోపీ" అంది సీతాలు గంగ మెడని నిముర్తూ.
    గంగ గోపీ వంక చూస్తూ ఆనందంగా 'అంబా' అని అరిచింది.

                                                                   10
    దెబ్బలు మాని పూర్తిగా కోలుకున్నాక గోపి తల్లి ఇచ్చిన డబ్బులతో రిక్షా కొనుక్కున్నాడు.
    గోపి రాత్రనకా, పగలనకా రిక్షా తొక్కి డబ్బులు సంపాదిస్తున్నాడు. రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఇంటిని స్వర్గసీమగా మలచుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS