Previous Page Next Page 
జొన్నలగడ్డ రామలక్ష్మీ కధలు -1 పేజి 11


                        మన చుట్టూ నేరస్థులు

                                                             జొన్నలగడ్డ రామలక్ష్మీ.

                          

    ఏ మనిషి పుట్టుకతో నేరస్థుడు కాడు. పరిస్థితుల ప్రభావం వల్ల మహాత్ముడు కూడా నేరాలు చేయవచ్చు.
    అయితే పరిస్థితుల ప్రభావ మన్నది ఒకోసారి నెపమే అవుతుంది.
    మనిషి తనకున్నదాని గురించి చక్కగా అలోచించి ఓ పద్దతిలో జీవితాన్ని నడిపించుకుంటూ వెడితే -- నేరాలు చేయాల్సిన అవసర ముండదు.
    కొండల్రావు జీవితం అందుకుదాహరణ.
    బ్రతకలేక బడి పంతులన్న సామెత కొండల్రావుకు వర్తించదు. ఉద్యోగం పురుష లక్షణమని తండ్రి ఆయన్ని బియ్యే బియ్యిడీ చేయించి పలుకుబడితో ఊళ్ళో ని కమిటీ స్కూల్లో లెక్కల మేష్టారు ద్యోగం వేయించాడు. ఉద్యోగంలో చేరినప్పుడాయనకు మూడు లక్షల రొక్కం, ముప్పై ఎకరాల పొలం, లంకంత యిల్లు ఉన్నాయి.
    తండ్రి కొండల్రావు ను గారంగా పెంచాడు. చాలా గోప్పవాడన్నభావాన్ని కలిగిస్తూ పెంచాడు.
    చిన్నతనం నుంచీ కొండలరావు అన్ని విషయాల్లోనూ దర్జాగా ఉండడానికి అలవాటు పడ్డాడు.
    అయన నెలనెలా కొత్త బట్టలు కుట్టించుకునేవాడు. "చాకలి స్వయంగా వచ్చి ఇంటి దగ్గరే బట్టలుతికి చలువ చేసి వెళ్ళేవాడు.
    అయన షాపులో ఏమన్నా కొనాలంటే - తన అభిరుచి కి కాక ధరకు ప్రాధాన్యత నిచ్చేవాడు. ఖరీదైనవి తప్ప - బాగున్నాసరే చౌక వస్తువులు కొనకూడదన్నది అయన సిద్దాంతం.
    నిప్పుకు గాలి తోడయినట్లు - కొండల్రావు భార్య సీతారావమ్మ కూడా కలిగినింటి నుంచి వచ్చింది. ఆమె కూడా కొండల్రావు పద్దతిలోనే తనింట్లో పెరగటం వల్ల - అభిరుచుల విషయం లో భర్త కూ ఆమెకూ సరిపోయింది.
    కొండల్రావుకు ముప్పై యిఏళ్ళప్పుడు తండ్రి పోయాడు. తండ్రి కర్మ కాండకు కొండల్రావు బోలెడు డబ్బు ఖర్చు పెట్టాడు.పెళ్ళి తంతు కంటే ఘనంగా ఒరిగిందని ఊరంతా ఓ పెద్ద విశేషంగా చెప్పుకున్నారు.
    కొండల్రావుకు ఇద్దరు కూతుళ్ళు, ముగ్గురు కొడుకులు. పెద్ద కూతురికి పదహారో యేట మంచి సంబంధం చూసి పెళ్ళి చేశాడు. పెళ్ళికి లక్ష రూపాయలు ఖర్చయింది. వియ్యాల వారు చిన్న తప్పు కూడా ఎత్తి చూపలేదు సరిగదా -- పెళ్ళిలోనే సెభాష్ ని మెచ్చుకున్నారు.
    చదువుకుంటున్నారని కొడుకు లిద్దరికీ అయన అడిగి నంతా డబ్బిచ్చాడు. ఆ కారణం గానే వారికి చదువు రాలేదు. ఎలాగో కష్టపడి ఇద్దరూ బియ్యే అనిపించారు. కొండల్రావు డబ్బు పారేసి వాళ్ళిద్దరికీ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాడు.
    వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి.
    కొండల్రావు ఖర్చు మనిషి కావచ్చు కానీ ఆయనకూ ఆదర్శాలున్నాయి. తనిచ్చే చోట ఘనంగానే యిచ్చినా కొడుకు లిద్దరికీ కూడా అయన పైసా కట్నం తీసుకోలేదు.
    ఇప్పుడా కొడుకులు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు.
    ఇంట్లో ఉన్నది --
    ఇంటర్మీడియట్ ఫస్టు క్లాసులో ప్యాసయిన ఆఖరి కొడుకు మురళి--
    బియ్యే రెండో సంవత్సరం లోకి వచ్చిన ఆఖరు కూతురు జానకి --
    కొడుక్కిఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలంటే పది హేను వేలు డొనేషన్ కట్టాలి. కూతురి పెళ్ళికి కనీసం పాతికవేలు కట్నం కావాలి.
    ఇవీ ప్రస్తుతం కొండల్రావు అవసరాలు.
    ఇవి కాక -
    కొండల్రావు ఏటా అల్లుణ్ణి పండుగలకు పిలుస్తాడు. కూతురు తృప్తి పడేలా వాళ్ళను సత్కరిస్తాడు.
    కొండల్రావు వంటి మామగారుండటం తన అదృష్టమని అల్లుడే కాదు - కోడళ్ళు కూడా అనుకుంటారు.
    కూతురితో సమంగా కోడళ్ళ నూ చూసుకుంటాడాయన.
    అయితే.....
    కూర్చుని తింటుంటే కొండలయినా కరిగిపోతాయి. కొండల్రావుకు పేరులో కొండలున్నా అయన ఆస్తిని కొండతో పోల్చడానికి లేదు.
    ఇప్పుడు కొండల్రావు కు నాలుగెకరాల భూమీ, ఇల్లూ మిగిలాయి. కొడుక్కి డొనేషన్ కట్టాలన్నా, కూతురి పెళ్ళి చేయాలన్నా అయన దగ్గర పూర్వపు ధైర్యం లేదు. ఉన్న ఎకరాలమ్మేస్తే - ఆ పైన ఏం చేయాలో అన్న భయం ఆయనకుండనే ఉంది.
    అప్పుడాయన మొదటి నేరానికి తలపడ్డాడు.
    నేరమంటే నేరం కాదు.
    ఒకళ్ళకు సాయపడటమే తప్ప ఒకరిని సాయమడగటం నేరంగా భావిస్తాడు కొండల్రావు.
    అది అయిన వాళ్ళయినా సరే!
    ఆ అయినవాళ్ళు కన్న బిడ్డలయినా సరే?
            
                                     2
    కొండల్రావు నాలుగెకరాల పొలమూ, యిల్లూ కూడా తాకట్టులో ఉన్నాయి. వడ్డీతో కలిసి ఆ అప్పు పన్నెండు వేలు. ఆ బాకీ తీర్చితే తప్ప వాటిని అమ్ముకుందుకూ లేదు. వాటి మీద అప్పు తెచ్చుకుందుకులేదు.
    అప్పిచ్చిన వ్యక్తీ పేరు అయ్యన్న. అతడి కాయన పొలం మీదా, యింటి మీదా కూడా ఆసక్తి ఉంది. తక్కువ ధరకవి చెల్లుబడి చేసుకుందామని అయ్యన్న ఆశపడుతున్నాడు.
    అయిన వాళ్ళ నెప్పుడూ అప్పడిగి ఎరుగని కొండల్ రావు కిప్పుడడగడం తప్పనిసరి అయింది.
    ముందాయన కొడుకుల నడిగాడు.
    విషయం తెలుసుకున్నాక కొడుకు లిద్దరూ తమ తమ భార్యలకు చెప్పారు. తర్వాత నలుగురూ కలిసి చర్చ లు జరిపారు.
    బాగా చర్చించేక ఓ విషయం గ్రహింపుకు వచ్చింది.
    అఫీసులోంచి అప్పు పుట్టించి యిద్దరూ చెరో అరుసేలూ పుట్టించి తండ్రికిచ్చి సాయపడొచ్చు. కానీ యిచ్చిన డబ్బు వెనక్కేలా వస్తుంది?
    తండ్రి కాబట్టి బాకీ తీర్చామంటే బాగుండదు.
    ఒకసారి అలవాటు పడితే తండ్రి మళ్ళీ మళ్ళీ డబ్బడగవచ్చు.
    లేదని చెప్పడం యిష్టం లేక - "నాన్నా! అమ్మ బంగారం తాకట్టు పెట్టలేక పోయావా?'  అన్నాడు పెద్ద కొడుకు.
    "ఇప్పుడు అమ్మకున్నదంతా నకిలీ బంగారం ....' అంటూ ఇబ్బందిగా నిజం బయట పెట్టాడు కొండల్రావు.
    "నీకు ప్రావిడెంటు ఫండ్ లో లోన్ దొరకదా!" అన్నాడు రెండో కొడుకు - తెలుసుకుందుకు అడిగినట్లు.
    "మొన్న ఉగాదికి లోన్ పెట్టాను... అంతా వచ్చి వెళ్లారుగా ...." అన్నాడు కొండల్రావు.
    తండ్రి వట్టిపోయడని కొడుకు లిద్దరికీ అర్ధమయింది .
    "నాన్న! నీ దగ్గిర్నుంచి తీసుకోడం అలవాటై ఉన్న డబ్బుతో సరిపెట్టుకోలేక పోతున్నాం. నిన్నడక్కపోవడమే ఓ విశేషంగా భావిస్తున్నాం. నీకు సాయపడాలన్న కోరిక మాలో బలంగా ఉంది. కానీ అక్కకిలా ఉన్న వాళ్ళం కాదు గదా! ఈమాట చెప్పడానికే సిగ్గుగా ఉంది మాకు...." అనేశారు వాళ్ళిద్దరూ.
    వాళ్ళు తెలివిగా తండ్రి దృష్టిని అక్క వైపుకి మళ్ళించారు.
    నిజంగానే కొండల్ రావు పెద్ద కూతురు పని బాగుంది .
    కానీ --
    ఆడపిల్ల దగ్గిర డబ్బు తీసుకొనడం ఆ యింటి ఆచారం కాదు. పైగా అది నేరంగా భావిస్తాడు కొండల్ రావు.
    అయితే విదిలేనప్పుడెం చేయాలి.
    కొండలరావు మొదటి నేరం చేసి భంగపడ్డాడు. రెండో నేరం చేయడానికి సిద్దపడి కూతురి దగ్గరికి వెళ్ళాడు.
    అయితే డబ్బు కావాలని అడగలేదు కదా!
    కొండల్ రావు లౌక్యంగా కూతురికి తన పరిస్థితి చెప్పుకుని- అప్పుకోసం తిరుగుతున్నట్లు చెప్పాడు.
    కొండల్ రావు కూతురు లౌక్యం లో తండ్రిని మించినది. చెప్పాలంటే ఆయనకు లౌక్యం తెలియదు. ఆమెకు తెలుసు.
    "నువ్వు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి నాన్నా! లేకపోతె నువ్వు అప్పులు చేయడమేమిటి?" అంటూ ముందు తండ్రిని బాగా మందలించింది. ఆ తర్వాత బాగుండదనుకుందో ఏమో -" ఆడపిల్ల సొమ్ము అప్పుగా కూడా తీసుకోకూడదన్న సిద్దాంతం నీది. లేకుంటే నే నిప్పుడున్న పొజిషన్లో -- నీకు సాయపడి ఉండేదాన్ని!" అంటూ ముందరి కాళ్ళకు బంధం వేసింది.     
    తనకలాంటి సిద్దాంతం లేదనడానికి కొండల్ రావు మొహమాట పడి దిగులుగా ఇంటికి తిరిగి వెళ్ళాడు.
    అయితే - రెండు నేరాలు చేసి ఫలితం పొందని తన దగ్గిరకు నేరస్థుడే వెతుక్కుంటూ వస్తాడని అయన అనుకోలేదు.
    సామాన్యుడి అవసరాల గురించి - నేరస్థులకు తెలిసినంతగా మరేవ్వారికీ తెలియదేమో!
    అందుకే రామచంద్రం వెతుక్కుంటూ కొండల్ రావు కోసం వచ్చాడు.
    
                                      3
    రామచంద్రం కొండల రావు బావమరిది. ఇంకా చెప్పాలంటే సీతారమమ్మకు ఒక్కగానొక్క తమ్ముడతడు.
    తండ్రికి ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల విలస జీవితాని కనలవాటు పడి జీవితంలో బాగా నష్టపోయాడు. అతడికి దురమవాట్లున్నాయనీ, చెడి పోయాడనీ బంధువు వర్గంలో అనుకునేవారు. నాలుగేళ్ల క్రితం అతడికి తండ్రి పోయాడు. తన మామగారి కుటుంబమెంతలా చితికి పోయిందో అప్పుడే తెలిసింది.
    కొండల్ రావు బావమరిది నాదుకుంటానంటే సీతారవమ్మే ఒప్పుకోలేదు.
    "వాడు దుబారా వెధవ. మీరేమిచ్చినా తగలేస్తాడు. ఎవరి కర్మ కెవరు కర్తలు ? వాడికేం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. మీరు మాత్రం పట్టించుకోకండి--" అని భర్తను వారించింది.
    తోడబుట్టిన అక్క తన గురించి అలా అన్నాక రామచంద్రం బావగారిని డబ్బు గురించి అడగనూ లేదు. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు తగ్గిపోయాయి.
    రామచంద్రం క్రమంగా కాస్త బాగుపద్దాడని కబురు తెలిసి సీతారావమ్మ మనసులో సంతోషించింది.
    ఇన్నాళ్ళ కు రామచంద్రం మళ్ళీ వచ్చి --
    "బావా! తాత్కాలికంగా నేను నీకు సాయపడగలను. కానీ బదులుగా నువ్వు నాకు యాభై వేలు అప్పివ్వాలి?' అన్నాడు.
    "అంటే?' అన్నాడు కొండల రావు.
    "నువ్వు పొలం తాకట్టు విడిపించాలను కుంటున్న నెందుకు? అమ్మడానికే కదా! అమ్మగా వచ్చిన డబ్బులో నాకో యాభై వేలు అప్పు కావాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాను. అందుకు పెట్టుబడి అవసరం! ఆర్నెల్లలో వడ్డీతో సహా నీ బాకీ తీరుస్తాను--"
    కొండల రావు భార్యను సలహా అడిగాడు.
    "నాకు తమ్ముడైతే అయ్యాడు కానీ వాడు నమ్మతగ్గ మనిషి కాడు...." అంది సీతారావమ్మ నిర్మొహమాటంగా .
    అయితే కొండల్ రావు మరో వైపు నుంచి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు బావమరిది డబ్బివ్వకపోతే పొలం ,ఇల్లు అయ్యన్న చెల్లుబడి చేసుకుని తనకు తోచిన ధర కట్టి మిగిలింది తనకిస్తాడు. అప్పుడు తనకు వచ్చే నష్టం చాలా ఎక్కువ. బావమరిది తన్ను మోసం చేయదనే అయన నమ్మకం.
    ఒకవేళ రామచంద్రం తనను మోసం చేస్తే - అయ్యన్న కొంత తినేబదులు -- రామచంద్రం అంతా తిన్నట్లు అవుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS