ఆప్యాయంగా లక్ష్మి చేతి నందుకుంది విశాలి. "మా ఇంటి కెప్పుడైనా రమ్మంటే మీరు రానేరావటం లేదు."
"తప్పకుండా వస్తాను." మనఃస్ఫూర్తిగా పలికింది లక్ష్మి.
వెళ్ళొస్తానని సదాశివంతో కూడా చెప్పి ఇంటి ముఖం పట్టింది విశాలి.
* * *
"విశాలీ! విశాలీ!" వస్తూనే హడావిడిగా పిలుస్తున్న అన్నయ్య గొంతు విని కంగారుగా వంటింట్లోంచి ఇవతలికి వచ్చింది విశాలి.
అన్నయ్య వెనకే వచ్చిన నూతన వ్యక్తిని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది.
"చూడు, విశాలీ! ఇతను రాజేంద్ర. నా చిన్ననాటి స్నేహితుడు. ఏదో పనిమీద ఈ ఊరు వచ్చాడు. మళ్ళీ రేపొద్దున్న వెళ్ళిపోవాలిట. వెళితే వెళ్ళావులే. వెళ్ళేవరకూ మా ఇంట్లో ఉండవచ్చు. హోటల్లో దిగవలసిన అవసరం లేదని చెప్పి లాక్కొచ్చాను."
"నమస్తే!" విశాలిని పరీక్షగా చూస్తూ పలికాడు రాజేంద్ర.
"నమస్తే!" ఒక్క క్షణం అతని ముఖంలోకి చూసి తల దించుకుంది విశాలి. ఇతను.....అవును, ఎక్కడో చూశాను. ఎక్కడ....అదే గుర్తు రాలేదు. లోపలికి వెళ్ళిపోయి పని చేసుకుంటూందన్నమాటేగానీ అతని రూపం కన్నులముందు స్థిరంగా నిలిచి మనసులో ఏవేవో భావాలు రేకెత్తిస్తూంది. చటుక్కున అప్పుడు గుర్తు కొచ్చింది అతన్నిదివరకు ఎప్పుడు, ఎక్కడ చూసిందీ? అవును! ఆ రోజు రాత్రి సువర్ణా, తనూ కాలేజీలో ఫంక్షన్ పూర్తయినాక ఇంటికి తిరిగి వస్తుండగా దొంగ చేతుల్లో పడ్డ తమని రక్షించిన యువకుడిత డేగా? ఆ రాత్రి తనకి తెలియకుండానే అతన్ని పరీక్షగా చూసి గుర్తుపెట్టుకుంది తన మనసు.
"ఎవరండీ వచ్చిందీ?" మంద్రస్వరంలో అడిగింది మహలక్ష్మి. చెప్పాడు రామం.
"ఊఁ" అంటూ చిన్నగా మూలిగి తన కేమీ పట్టనట్టు పక్కకి తిరిగి పడుకుంది మహాలక్ష్మి.
రాజేంద్ర, రామం ఎలిమెంటరీస్కూల్లో ఒకటి రెండేళ్ళు కలిసి చదివారు. అప్పుడిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. తరవాత తరవాత రామం చదివిన క్లాసే చదువుతూ వెనకపడిపోవడం, రాజేంద్ర చక చకా ఫస్టు మార్కులతో ముందుకు పోవడంతో రామంకి అమరిమితమైన బాధతోపాటూ రాజేంద్ర అంటే ఒక విధమైన ఈర్ష్య పుట్టింది. అందరూ రాజేంద్రని పొగిడేవాళ్ళే. తనని చూసి మాస్టార్లందరూ 'ఏరా, అటువంటి తెలివైనవాడు నీకు స్నేహితుడు కదా? వాడి తెలివిలో వందోవంతైనా నువ్వు సంపాదించు కోలేకపోయావేరా?' అంటూ ఎగతాళి చేసేవారు. దానితో ఒళ్ళు మండి రాను రాను రాజేంద్రతో స్నేహం తగ్గించుకున్నాడు రామం. ఇప్పుడు రాజేంద్ర కనపడితే ఇంటికి తీసుకురావడానికి ముఖ్య కారణం, తనకి చదువేమీ అంటకపోయినా, రాజేంద్రలా పెద్దచదువులు చదవకపోయినా డబ్బు కేమీ లోటు లేదనీ, సుఖంగా జీవిస్తున్నాననీ రాజేంద్రకి చూపించుకోవాలని, అంతేగానీ నిజంగా అతని మీద ప్రేమతో కాదు.
రాజేంద్ర స్వభావం చాలా వింతైనది.
జీవితానికి సార్ధకత కలిగించే పని ఒక్కటైనా చేయకపోతే మనిషి జన్మ ఎందుకనే తత్త్వం అతనిది. ఇంకొకరి కోసం కాకపోయినా, ఎవరి ఆత్మ సంతృప్తి కొరకు వారు జీవితపు చౌరస్తాలో మేలైన మంచి రాస్తా ఎన్నుకుని సాగిపోవాలి. ఇదే అతన్ని మంచి అనే బాటమీద ఏ జంకూ లేకుండా సాగేటట్టు చేస్తూంది. తన మనసుకి వచ్చిన ఏ ఆడదీ కనిపించక వివాహ బంధానికి అల్లంత దూరంలో ఆగిపోయాడు రాజేంద్ర.
ఇటు మేనల్లుడిని చూసుకుంటూ, అటు ఇంటిపని చేసుకుంటూ, మధ్య మధ్యలో మహాలక్ష్మి పిలుపులు అందుకుంటూ, హడావిడి పెట్టే అన్నయ్యకి కావలసినవి అందిస్తూ విసుగనేది లేకుండా తిరిగే విశాలిని చూసి రాజేంద్ర మనసు ఏవేవో భావనలు పోగుచేసుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు తను విశాలిని చూశాడు. చదువుకునే రోజుల్లో బుద్దిమంతురాలనీ, తెలివైనదనీ అందరి చేతా ఆ అమ్మాయి మెచ్చుకోబడడం అదే స్కూల్లో చదివిన తనకి తెలుసు. ఇప్పటికీ ఆ ముఖం చూస్తేనే చెప్పవచ్చు. మనిషి నెమ్మదైనదని.
విశాలి తన మనసులో రేకెత్తించిన భావాలకి రూపు రేఖలు దిద్దుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయాడు రాజేంద్ర.
భోజనాలు అయిన తరవాత, కాసేపు రాజేంద్రతో అవీ ఇవీ మాట్లాడి ఆ తరవాత లేచాడు రామం. "నే నో గంటలో వస్తాను. నువ్వు హాయిగా కాసేపు నిద్రపో."
"అబ్బే! కాదుగానీ! ఏవన్నా పుస్తకాలుంటే పడేయ్! చదువుకుంటూ కూర్చుంటాను. నిద్రపోను."
"ఓ! ఎస్! దానికేం భాగ్యం! ఇలా రా! కావలసినన్ని పుస్తకాలు" అంటూ విశాలి గదిలోకి దారి తీశాడు రామం.
తలంటుకున్న జుట్టు, వదుఉలుగా అల్లుకుని కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని 'వైతాళికులు' చదువుతున్న విశాలి, వాళ్ళని చూసి చటుక్కున లేచి నిలుచుంది.
"ఫరవాలేదు, కూర్చోండి." చనువుగా మాట కలిపాడు రాజేంద్ర.
"ఇదిగోనోయ్! ఇది మా చెల్లెలు గది. పుస్తకాల పిచ్చి దానికి ఎక్కువే. నీ కేం పుస్తకం కావాలో చూసుకో మరి నే వెళ్ళిరానా? కొంచెం పనుంది. తొందరగానే వచ్చేస్తాను" అంటూ గబగబా వెళ్ళిపోయాడు రామం.
ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా అన్న సందిగ్ధంలో పడిన విశాలిని, రాజేంద్ర పలకరింపుతో సందేహం తీరింది.
"ఏమిటి మీరు చదువుతున్నది? వైతాళీకులా? నాకు చాలా ఇష్టం ఆ పుస్తకం. మీకూ అంతేనా?"
విశాలి నోటినించి మధురంగా వెలువడింది "ఊఁ" అన్న శబ్దం.
"మీ లాగా నేనూ ఏదో......పుస్తక ప్రియుడినే. ఏదైనా మంచి పుస్తకం కనపడితే చదివేవరకూ తోచదు."
అతనలా చనువుగా మాట్లాడుతుంటే తనేమీ మాట్లాడకుండా ఉండటం భావ్యం కాదనిపించి మెల్లిగా నోరు విప్పింది విశాలి. "మంచి పుస్తకం కంటే సత్కాలక్షేపం ఏముంటుంది?"
"బాగా చెప్పారు."
నుదుటిమీద పడి నాట్యం చేస్తున్న ముంగురుల్ని ఎంత వెనక్కి తోసినా, ముందుకే వచ్చి వాలుతున్నా యని. వాటికి స్వేచ్చ నిచ్చి, తల ఆరిందో లేదోనని ఒకసారి తడిమి చూసుకుంది విశాలి, కొద్దిగా మెడని ఒక పక్కకి పంచి.
అదే క్షణంలో తల పైకెత్తిన రాజేంద్రకి విశాలి రూపం కన్నులముందు వింతకాంతి నిచ్చింది. కాటుక దిద్దిన కళ్ళు చెదిరే ముంగురులతో పోటీ చేస్తున్నాయి. అలాగే ఒక్క క్షణం విశాలిని చూసి తరవాత తన దృష్టి అక్కడున్న పుస్తకాలమీదికి మరల్చాడు రాజేంద్ర.
ఇంతలో మేనల్లుడి ఏడుపు వినిపించి, "మీరు చదువుకుంటూ ఉండండి" అంటూ లోపలికి వెళ్ళి పోయింది విశాలి.
* * *
"ఈ వేళ ఆదివారం. షాపు మూసేస్తారు కదా? అయినా ఇంత ఆలస్యంగా, ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు అంటూ మీ శ్రీమతి నిలదీసి అడగదూ?"
"ఆ భయం లేదులే. మా ఆవిడ ఒంట్లో ఎంత నీరసంగా, ఎంత అనారోగ్యంగా ఉంటూందంటే మరీ అత్యవసరమైతేనే తప్ప ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎందుకింత ఆలస్యంగా వస్తున్నారీ మధ్య? ఏమిటి సంగతి? అవి అడిగే ఓపికా, దెబ్బలాటకి దిగే శక్తీ లేవు దానికిప్పుడు. అడిగినా జవాబు చెప్పే తీరుబడి లేదు మనకి." పగలబడి నవ్వాడు రామం.
అతని నవ్వులో శ్రుతి కలిపింది విజయ.
ముందు టాక్సీని విజయ ఇంటి దగ్గర ఆపించి, విజయకి గుడ్ నైట్ చెప్పి ఇంటికి చేరుకుని టాక్సీని పంపించి తలుపు కొట్టాడు రామం.
అంతవరకూ ఏవో పుస్తకాలు తిరగేస్తూ మెలకువ గానే ఉండి, అప్పుడే ఒక కునుకు తీద్దామని మంచ మెక్కిన విశాలి ఉలిక్కిపడి లేచింది. తలుపు తీయగానే తనలో తనే నవ్వుకుంటూ లోపల అడుగుపెట్టాడు రామం.
బట్టలు మార్చుకుని వచ్చిమంచినీళ్ళు తాగబోయాడు. "అదేమిటన్నయ్యా? అన్నం తిందువుగాని రా! ముందే మంచినీళ్ళు తాగేస్తే ఎలా?"
"ఆకలిగా లేదు. పోనీలే, మజ్జిగా అన్నం తింటాను, పద." చెల్లెలి వెనకే వంటింట్లోకి నడిచాడు. హోటల్లో తను ఏవేవో తిన్న సంగతి చెప్పడం ఎందుకూ? అందులో ఒంటరిగా వెళ్ళాడా ఏమన్నానా తను? విజయతో కలిసి మరీ వెళ్ళాడయ్యే హోటల్ కి . ఇంక ఆకలి ఎక్కడుంటుంది?
"ఏమిటన్నయ్యా! ఈ మధ్య ఇలా అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటున్నావు? వదిన సంగతి నువ్వేమీ పట్టించుకోవటం లేదు. వదిన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించి పోతోంది..." ఎన్నో అడగాలని ఉంది విశాలికి. అన్నీ గొంతులోనే అణిగిపోతున్నాయి అడిగే ధైర్యం లేక.
చివరికి నిశ్శబ్దాన్ని భరించలేక అంది: "మీ అబ్బాయికి ఏం పేరు పెడతావన్నయ్యా? పేరు పెట్టాలన్న సంగతే గుర్తు లేనట్టుంది నీకు."
"ఆఁ! అవును! మరిచిపోయాను. అయినా దానిదేముంది, ఏదో ఒక పేరుతో పిలవడమేగా కావలసింది. ఏ ఇష్టమొచ్చిన పేరు పెట్టు. ఆ పేరుతోనే పిలుద్దాం."
"మధ్యన నా ఇష్టం దేనికీ? నీకు నచ్చిన పేరో, వదినకి నచ్చిన పేరో పెట్టు."
"అబ్బే! అదేం కుదరదు. నే నొకటి అన్నానూ అంటే అది జరిగి తీరవలసిందే. నీకు నచ్చిన పేరు చెప్పు." ఎప్పుడూ లేనిది అన్నయ్య తనతో అంత ఇదిగా మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగించింది విశాలికి.
రాజుగారికి ఆగ్రహమొచ్చినా, అనుగ్రహమొచ్చినా పట్టలేం అన్న సామెత గుర్తుకొచ్చి నవ్వుకుంది. ఈ వేళఏ కళనున్నాడోతనమీద ఇంత అనుగ్రహం చూపిస్తున్నారు! చివరికి మెల్లిగా వచ్చింది విశాలి నోటినుండి-"నాకు నచ్చిన పేరు రాజేంద్ర" అన్న మాట.
ఉలిక్కిపడి విశాలి ముఖంలోకి అదోలా చూశాడు రామం. ఆ చూపుల తాకిడికి తట్టుకోలేక తల వంచుకుంది విశాలి.
మనసులో మాట బయట పెట్టుకున్నందుకు సిగ్గుతో పాటు బాధకూడా కలిగింది.
ఏమనుకున్నాడో ఏమో- "సరే! ఆ పేరుతోనే పిలుద్దాం" అంటూ కంచంలో చెయ్యి కడుక్కుని లేచాడు.
తేలిగ్గా నిట్టూర్చింది విశాలి-
మనసులో ఏదో తెలియని ఆనందం.
పదే పదే పెదవులు రాజేంద్ర పేరునే ఉచ్చరిస్తున్నాయి.
కళ్ళముందు రాజేంద్ర రూపమే కదలాడుతూంది.
ఆ మర్నాడు వదినకి బత్తాయిరసం ఇస్తూ గతరాత్రి తనకీ, రామంకీ జరిగిన సంభాషణ వివరించి చెప్పింది విశాలి.
విని మౌనంగా ఉండిపోయింది మహాలక్ష్మి.
"వదినా! నీకు మీ అబ్బాయికి ఏం పేరు పెట్టాల నుందో చెప్పు. నేను ఊరికే ఏదో నాకు వచ్చిన పేరు చెప్పేశాను"-మహాలక్ష్మి కనుకొలకుల్లో నీరు నిలిచింది.
"ఎందుకు, వదినా, ఆ కన్నీరు? నా మాటలు నీకు బాధ కలిగిస్తే చెప్పు. నన్ను క్షమించు."
ఆప్యాయంగా విశాలి చేతులందుకుంది మహలక్ష్మి.
"లేదు, విశాలీ, లేదు. మేము నీకు కలిగించిన కష్టానికి నువ్వే మమ్మల్ని క్షమించాలి. నీ విషయంలో మీ అన్నయ్య ప్రవర్తన ఇంకా మారలేదు గానీ, నేను మాత్రం పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను. కన్న బిడ్డ సంరక్షణకూడా చేసుకునే ఓపికలేని నా పాలిటి దేవతవు నువ్వు. నువ్వు వాడిని అంత ప్రేమగా చూసుకుంటుంటే అవమానభారంతో నేను కృంగిపోతున్నాను. నిజంగా నీ మనసు నిర్మలమైనదనీ, నీకు నా మీద అయిష్టంలేదనీ అర్ధం చేసుకున్నాను. నాలో రగిలే బాధ నీతో చెప్పుకుని, నా మనసు తేలిక చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఆ శుభఘడియ ఈ రోజు రానే వచ్చింది. వాడిని కన్నది నేనేగానీ, తల్లిలాపెంచుతున్నది నువ్వు. ఆటువంటప్పుడు వాడి పేరు విషయంలో నీ కామాత్రం స్వాతంత్ర్యం లేదనుకుంటున్నావా?"ఆయాసపడుతూ ఆగింది మహాలక్ష్మి. ఆనందంతో మాట్లాడలేక ప్రేమగా వదిన కళ్ళలోకి చూసింది విశాలి.
"తోటి ఆడదానివైన నీకు ఏ సుఖం లేకుండా చేశాను. నన్ను క్షమించు, విశాలీ! క్షమించానని ఒక్క మాట అను చాలు."
"వద్దు, వదినా! అంత మాట అనకు." మరి మాట్లాడలేకపోయింది విశాలి-
'వదిన తనని అర్ధం చేసుకుంది. తనమీద వదినకి కోపం పోయింది. ఇంతకన్నా ఏం కావాలి?' విశాలి మనసు ఆనందంతో ఆకాశపుటంచులు తాకింది.
* * *
