Previous Page Next Page 
విశాలి పేజి 11

 

    ఆ రోజు విశాలి నిండుగా నవ్వినరోజు. మేనల్లుడు పుట్టాడు. అన్నా వదినలకంటే మిన్నగా మింటికుసింది విశాలి సంతోషం. ముద్దులు మూట కట్టే మేనల్లుడు. తన ఒడిలో కేరింతలు కొడుతూ, తన బుల్లి బుల్లి నవ్వులతో మురిపించి మరిపిస్తాడు. తన మనసంతా వెన్నెలపందిరి వేస్తాడు. ఆ పందిట్లో, వెన్నెలతో పోటీ చేసే మల్లియలా పరిమళాన్ని నింపుతాడు వాడు. అంతకన్నా తన జీవితానికి కావలసిందేమిటి?
    కొడుకు పుట్టిన సంబరంకన్నా, తండ్రి పోయిన ముఖం ఒక పాలు ఎక్కువగా ఉంది మహాలక్ష్మిలో.
    తండ్రి పోయిన షాక్ నుంచి పూర్తిగా కోలుకోక పోవడంవల్ల, తండ్రిని గురించిన జ్ఞాపకాలు తరంగాలు తరంగాలుగా కదిలివస్తూ కంటనీరు ఆరకుండా చేస్తున్నాయి. ఎంతమంది తన రూపాన్ని అసహ్యించు కున్నా తండ్రి మాహ్రం ఎటువంటి పరిస్థితిలోనూ కూడా తన నొక్క మాటకూడా అనకపోవడం, "నీ రూపం ఎలా ఉన్నా నువ్వు నా ప్రతిరూపానివి' అన్న చూపుతో లాలించి ఆప్యాయత చవిచూపడం మహాలక్ష్మి జీవితంలో మరువలేనివి. అసలే నీరసం, ఆరోగ్యం సరిగా లేదు. దానికితోడు అస్తమానం తండ్రిని తలుచుకుంటూ ఆ షాక్ నించి తేరుకోనందువల్ల రోజురోజుకీ మరింత నీరసించి పోతూంది. అలాగే మంచం పట్టింది. రవంత ఓపిక ఒంట్లో లేదు. రవంత ఉత్సాహం మనసులో లేదు. ఇదివరకు ఒంట్లో కొంచెం నలతగా ఉంటే చాలు, పక్కున కూర్చుని కబుర్లు చెపుతూ, నవ్విస్తూ కావలసినవి అందిస్తూ తెలియ కుండాకాలం గడిచిపోయేలా చేసే భర్త, ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండటం చూసి మనసులో వేదన మరింత పెంచుకుంది మహాలక్ష్మి.
    ఈ ఇద్దరిమధ్యా నోరు మెదపడానికి భయపడుతూ ఎవరికి కావలసినవి వారికి అందిస్తూ, మేనల్లుడి పోషణ భారం వహించి వాడి ఆటపాటలతో కాలం వెళ్ళబుచ్చుతూంది విశాలి.
    'రవ్వల్లా ఆకర్షిస్తాయిరా నీ కళ్ళు.' పదేపదే వాడి కళ్ళలోకి చూస్తూ ఆ కళ్ళు కనబరిచే కుతూహలాన్ని మురిపెంగా చూస్తుంది.
    'ఆ ముక్కు చూస్తేనే తెలుస్తూంది మూడు చెరువుల నీళ్ళూ తాగించే అల్లరి గడుగ్గాయివని.' తనలో తనే నవ్వుకుంటూ వాడి ముక్కు పట్టుకుని ఊపుతుంది.
    'ఏరా, ఇది నోరా? ఇంత చిన్న నోటితో బువ్వెలా తింటావురా? ఇవిగో, ఇవి బుగ్గలు కావు. మీ నాన్న పెళ్ళికి వండారే? బూరెలు. అవీ ఇవి.' పకపక నవ్వుతూ వాడి బుగ్గలమీద ముద్దులవర్షం కురిపిస్తుంది. తన రెండు చేతులతోనూ అత్త మెడని వాటేసు కుంటాడు వాడు మరింత ముద్దుగా.

                              *    *    *

    మామగారు పోవడం, షాపుమీది అధికారం, భార్య అనారోగ్యం -ఇవన్నీ వరసగా ఒక్కొక్కటే క్రమంగా రామం మనసులో మార్పుల్ని తెచ్చాయి.
    అంతులేని స్వేచ్చ అతని ముందు నిలబడింది. కొద్ది రోజుల్లోనే అతని షాపు కొత్త కొత్త మార్పులతో కొత్త పెళ్ళికూతురి పెదవి మీది నవ్వులా వింత కాంతితో వెలిగింది. అవధాని అనే ముసలిమొహం స్థానంలో విజయ అనే చిన్న మొహం చేర్చబడింది సేల్స్ గరల్ గా.
    విజయతో ఎన్ని కబుర్లు చెప్పినా ఇంకా చెప్పవలసినవి ఉంటూనే ఉన్నాయి రామానికి. మొదటిలాగా కొంచెం ఆలస్యంగా షాపుకి వెళ్ళడం, తొందరగా ఇంటికి వచ్చెయ్యడం పొరపాటునకూడా చేయటం లేదు.
    
                            *    *    *

    కూరలూ, వదినకోసం బత్తాయినళ్ళూ కొని ఇంటి ముఖం పట్టింది విశాలి.
    దోవలో లక్ష్మీ మెడికల్ స్టోర్స్ లోంచి బయటికి వస్తున్న సదాశివం కనుపించాడు. ముందు అతనే పలకరించాడు నవ్వుతూ: "కులాసానా?"
    నవ్వుతూ చిన్నగా తల ఊపింది విశాలి.
    "ఏమిటి, బాబూ! ఈ దుకాణంలోంచి వస్తున్నారు? మందులంటేనే తగనిభయం పట్టుకుంది లెండి నాకీ మధ్య."
    "భయం పుట్టించినా, భయం పోగొట్టినా ఇవేగా మసక? తప్పుతుందా మరి? ఈ రోజుల్లో మందులు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయాయి. ఏమంటారు?" విశాలితోపాటు నడక సాగించాడు సదాశివం.
    "నిజమంటాను. అనదిసరేగాని ఇంతకీ ఎవరికీ మందులు?" వాళ్ళమ్మగారి కోపం అయి ఉంటుందని ఊహించుకుంటూ అడిగింది విశాలి.
    "మా పాపకి."
    చటుక్కున తలెత్తింది విశాలి.
    "ఏం? పాపకేమిటి, జ్వరమా?"
    అతను తల ఊపాడు.
    అది అవునన్నట్టో, కాదన్నట్టో సరిగ్గా అంతుపట్టలేదు విశాలికి. అందుకే మళ్ళీ అదే ప్రశ్న అడిగింది.
    "ఊఁ" చేతిలో మందుల పొట్లం అటూ ఇటూ-కదిలిస్తూ ఉండిపోయాడు సదాశివం. ఒకటి రెండు సార్లు అతని ముఖంలోకి చూసి, అతని ఆలోచనలకి భంగం కలిగించడం ఇష్టంలేక మౌనంగా నడిచింది విశాలి. విశాలి మలుపు తిరగవలసిన సందు రాగానే అడుగులు వెయ్యడం ఆపి, "సెలవు. ఇంక ఉంటాను మరి" అంటూ ముందుకు నడవబోయాడు సదాశివం. జాలిగా అతని వంక చూస్తూ నవ్వింది విశాలి.
    "భలేవారే! మీ పాపకి జ్వరం అంటుంటే చూడకుండానే నా దోవన నేను వెళ్ళిపోతాననుకున్నారా? పదండి, మీ పాప నోసారి చూసి మరీ ఇంటికి వెళతాను."
    అతని ముఖంలో ఏ భావమూ వెల్లడవలేదు. "వస్తారా?" అని ఒక్క క్షణమాగి, "సరే! పదండి" అన్నాడు ఏదో నిశ్చయించుకున్నట్టుగా.
    అతని ప్రవర్తనకి చిన్నబుచ్చుకుంది విశాలి మనసు. "ఎందుకులెండి! నేను రావడం మీ కిబ్బంది కలిగించినట్టవుతుందేమో? రాను."
    "క్షమించండి. నాకే ఇబ్బందీ లేదు. మీతోనైనా చెప్పుకుంటే నా బాధకొంత తగ్గుతుంది. పదండి" అంటూ ముందుకి నడిచాడు సదాశివం. వింతగా అతని ముఖంలోకి చూస్తూ అనుసరించింది విశాలి.
    దోవలో చెప్పాడు సదాశివం. "పరిమళ ప్రవర్తన ఏమీ బాగులేదండీ! ఇంకొకళ్ళ గురించి చెడ్డగా చెప్పవలసి వచ్చినందుకు నాకే బాధగా ఉంది. కానీ నేను చెప్పేదానిలో మాత్రం అసత్యం లేదు. ఎంతసేపూ తననే అందరి చూపులూ ఆకర్షించాలన్నట్టుగా ప్రవర్తిస్తోంది ఆఫీసులో. పోనీ, అంతవరకే అయితే నాకేం నష్టం ఉండకపోను. ఆఫీసులోనూ, బయటాకూడా తనంతట తనే కల్పించుకుని నాతో కబుర్లేసుకోవాలని చూస్తుంటుంది. వాళ్ళిల్లుకూడా మా సందులోనే ఉండడం నాకిబ్బందిగానే ఉంది. ఆఫీసుకి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు నాతోనే వస్తుంది. నాతో కలిసి రావద్దని మొహంమీదే ఎలా చెప్పగలను? నడుస్తున్నంత సేపూ పగలబడి నవ్వుతూ, నేను వినకపోయినాకూడా ఏవేవో కబుర్లు చెపుతూ ఉంటుంది. రోడ్డుమీద ప్రతి ఒక్కరి దృష్టి మీ మీద ఉండటం ఎన్నిసార్లో గమనించాను నేను. సిగ్గుతో చితికిపోవటం, అవమ్నంగా భావించటం తప్ప మరేమీ చేయలేను నేను. 'పబ్లిగ్గానే సాగిస్తున్నాడే ప్రణయం' అంటూ నా గురించి నా వెనకే కొలీగ్స్ అనుకోవడం నాకు బాధ కలిగిస్తుందంటారా? లేదా?" చెప్పడం ఆపి ఒక్క క్షణం విశాలి కళ్ళలోకి చూశాడు సదాశివం.
    జాలిగా అతని వైపు చూసింది విశాలి.
    "పోనివ్వండి. ఎవరో, ఏదో అనుకుంటే నేను పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తానే అనుకోండి. కానీ.....కానీ"....గాద్గదికమైన కంఠాన్ని అదుపు లోకి తెచ్చుకుందుకు వ్యర్ధప్రయత్నమే చేశాడు.
    అతని ముఖంలోకి చూడటానికి భయపడింది విశాలి.
    "కానీ! కట్టుకున్న భార్యే అనుమానిస్తున్నప్పుడు జీవించడంన ఎంత కష్టమో ఊహించుకోండి."
    చటుక్కున తలెత్తింది విశాలి. నిజమా! అన్నట్టున్నాయి చూపులు.
    పరిమళమీద నిజంగానే కోపం ముంచు కొచ్చింది. అవును మరి! చిలకాగోరింకల్లా కలకలలాడుతూ సంసారం సాగిస్తున్న ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టిందయ్యో! ఇటువంటి స్త్రీలున్నారంటే స్త్రీ జాతికే తీరని అవమానం!

                              
    ఆ తరవాత ఇంటికి చేరుకునేవరకూ ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు, ఎవరి ఆలోచనల్లో వాళ్ళు-
    ఇంట్లో  అడుగు పెడుతూనే భార్యని కేకేశాడు సదాశివం.
    కొంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది లక్ష్మి. ఇదివరకులా చలాకీగా లేకపోవడం గమనించింది విశాలి. అవును మరి! అనుమాన పిశాచం పట్టి పీడిస్తుంటే హుషారుగా ఎలా ఉంటుంది?
    మందులపాకెట్టు భార్య చేతికిచ్చి లోపల పెట్టమన్నాడు సదాశివం.
    ముగ్గురూ పాప పడుకున్న గదిలోకి నడిచారు. పాప ఒంటి మీద చెయ్యివేసి చూచింది విశాలి. కాలిపోతూంది.
    తల్లి పిలవడంతో పక్క గదిలోకి నడిచాడు సదాశివం.
    లక్ష్మి, విశాలి మిగిలారు.
    "నేను కూరలు కొనుక్కుని వస్తుంటే మందుల షాపు దగ్గిర మీ వారు కనిపించారు. అడిగితే పాపకి జ్వరమన్నారు. పాపని చూశాకే ఇంటికి వెళదామని ఇటు వచ్చాను." పాప నుదుటిమీది ముంగురులు వెనక్కి సద్దుతూ అంది విశాలి. ఏదో అడగాలని కాస్సేపు తటపటాయించి, చివరికి అడగదలుచుకున్నది కాక మరోటి అడిగింది లక్ష్మి: "మీ ఉద్యోగం ఎలా ఉంది?"
    నవ్వింది విశాలి. "నే నుద్యోగం చెయ్యడం మానేసి చాలా రోజులైంది."
    "ఓ! అవును! ఎప్పుడో మాటల్లో మా వారు చెప్పారు. నాకే గుర్తు లేదు."
    ఒక్క క్షణం ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. అక్కడే ఉన్న స్టూల్ ముందుకి లాగి, విశాలిని కూర్చో మని, తనుకూడా పాప పక్కనే మంచంమీద కూర్చుంది లక్ష్మి.

    "ఇప్పుడింక ఎంతమంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారా ఆఫీసులో?" చాలా మామూలుగా ఏమీ తెలియని దానికి మల్లే అడిగింది లక్ష్మి.
    "ఒకత్తే. పరిమళ ఆవిడ పేరు." ఈ సమయం, సందర్భం వదల బుద్ధి కాలేదు విశాలికి. ఎలాగైనా లక్ష్మికి భర్తమీద అనుమానం పోతే అంతే చాలు. మళ్ళీ ఆ ఇద్దరూ కలకల లాడుతూ ఉంటే అదే పదివేలు. అందుకే లక్ష్మి అడగకపోయినా చెప్పుకొచ్చింది. "ఇంకొకళ్ళమీద నేరాలు చెప్పడం కాదుగానీ, ఆ పరిమళ అదో రకమైన మనిషి. ఎంతసేపూ మగాళ్ళని ఆకర్షించాలని చూస్తుంది తప్ప పనిమీద ధ్యాస  తక్కువ. ఏ మగాడు తనని అసహ్యించుకుని, తప్పించుకుని దూర దూరంగా తిరుగుతాడో ఆ మగాడినే అంటిపెట్టుకుని తిరుగుతుంది. అనవసరంగా నలుగుర్లోనూ ఆ మగాడి పేరుకూడా పాడు చేసే స్వభావం ఆమెది. ఇటువంటి ఆడవాళ్ళ మూలంగా పండంటి సంసారాలు నాశనం అవుతాయంటే అందులో అబద్ధం ఏమీ లేదు."
    చటుక్కున తల దించుకుంది లక్ష్మి. కన్నుల్లో ఉబికిన నీరు కనిపంచకుండా.
    "ఇంక మరి నే వెళతాను. ఇప్పటికే ఆలస్యమైంది."
    అలమారులోంచి కుంకంభరిణ అందుకుని ముందు తను పెట్టుకుని తరవాత విశాలి నుదుట బొట్టు ఉంచింది లక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS