
"బావా! ఎప్పుడూ ఏవో ఆలోచిస్తున్నట్టు ఎందుకిలా ఉంటున్నావు? నువ్వు నాతో సరదాగా కబుర్లు చెప్పి ఎన్నాళ్ళియిందో ఒక్కసారి ఆలోచించు. నా తప్పేమిటో చెపితే నేను సవరించుకుంటాను గానీ ఇలా మౌనంగా ఉంటే నే నెంత బాధపడతానో అర్ధం చేసుకో!"
"లేదు, సువర్ణా! నీ తప్పేమీ లేదు. అంతా నేను చేసుకున్నదే! నేను బాధపడుతూ నిన్నుకూడా బాధపెడుతున్నానని గ్రహించలేకపోయాను, నన్ను క్షమించు," విచారం గూడు కట్టింది సారధి గొంతులో.
"ఇంతకీ నీ మనసులో ఉన్న బాధ ఏమిటో నన్ను కూడా తెలుసుకొనీ!"
ఒక్క నిమిషం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉండిపోయాను సారధి.
పూలమొక్కల మధ్యలో కూర్చున్న ఆ ఇద్దరూ కూడా మనసులో లేని ప్రశాంతతని ప్రకృతి నించి పొందలేకపోతున్నారు. దుబ్బుగా పెరిగిన మల్లె పొదలు ఎన్నో విడిచీ విడవని మొగ్గల్ని తమలో దాచుకున్నాయి. దాగలేని సువాసన దిక్కులన్నీ తిరుగుతూంది.
నాజూకుగా నవ్వుతున్న సన్నజాజులు సన్నసన్నగా పరిమళాన్ని గాలిలో నింపుతున్నాయి. గాలి ఉయ్యాలలో గర్వంగా ఊగుతున్న సువర్ణగన్నేరు పసిడిరంగులో మిలమిలలాడుతున్నాయి.
ఉన్నట్టుండి అన్నాడు సారధి! "నిజమే, సువర్ణా! నా మనసులో బాధ నీతో చెప్పుకుంటేనైనా కాస్త ఉప
శమనంగా ఉంటుంది. విని నన్నర్ధం చేసుకో."
కుతూహలంగా భర్త ముఖంలోకి చూసింది సువర్ణ. చెప్పడం మొదలుపెట్టాడు సారధి.
"నేను యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు నాకు జూనియర్ అయిన సుహాసిని నన్ను ఆకర్షించింది. ఎవరి తోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. కానీ, నాతో మాత్రం నవ్వుతూ సరదాగా ఎంతసేపైనా కబుర్లు చెప్పేది. అది నాకు గర్వకారణంగా ఉండేది. పరీక్షలైపోయాక నేను ఒక ఉత్తరం వ్రాశాను సుహాసినికి. అందులో నా ప్రేమ వ్యక్తపరిచాను. ఎదురుగా ప్రేమ మాటలు మాట్లాడే దైర్యం లేక అనుకుంటాను, ఉత్తరం ద్వారా తెలియపరిచాను. దానికి జవాబుగా ఆ మర్నాడు పొద్దున్న తమ ఇంటికి రమ్మని వ్రాసి పంపింది.
"నా ఆనందానికి మేరలేదు.
తన మనసులో దాచుకున్న భావాలు తొందర చేయగా సుహాసిని నన్ను రమ్మని పిలుస్తోంది. ఈ ఊహతో గడియ ఒక యుగంగా గడిపాను ఆ మర్నాటివరకూ." ఒక్క క్షణం చెప్పటం ఆపి సువర్ణ ముఖం లోకి చూశాడు సారధి.
తరవాతేం జరిగిందో తెలుసుకోవాలన్న కుతూహలం తప్ప, ఈర్ష్యాసూయలు తొణికిసలాడలేదు సువర్ణ ముఖంలో.
దీర్ఘంగా నిట్టూర్చాడు సారధి. "మర్నాడు ఏ వేవో ఆలోచనలతో ఎలాగైతేనేం వాళ్ళింట్లో అడుగు పెట్టాను. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏమని పిలవాలో ఆలోచిస్తూ గుమ్మందగ్గరే నిలబడిపోయాను. ఇంతలోసుహాసిని అటు వచ్చింది. నన్ను చూసి, 'అరె! అక్కడే నిలబడిపోయారేం? ఇలా రండి' అంటూ కుర్చీ చూపించింది, నాకు ఎదురుగా తనుకూడా కుర్చీలో కూర్చుంది.
ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. కొంతసేపటికి సుహాసినే అంది! 'మా ఇంట్లో ఉండేది నేనూ, మా అమ్మా, చెల్లెలూ, నాన్నగారు పోయి అయిదేళ్ళయింది.'
ఇదేమిటి ఇవన్నీ చెప్పుకొస్తూందని చికాకు పడ్డాను నేను మనసులో, మళ్ళీ అంతలోనే, తన కుటుంబంలోని వ్యక్తులు ఎవరెవరైనదీ, ఏమిటీ నాతో చెప్పడం మర్యాదగా భావించి ఉంటుందని తృప్తి పడ్డాను.
'మనిద్దరం ఒకరినొకరు సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాం'. నిట్టూర్చిన సుహాసిని మాటలు పిడుగుపాటులా అనిపించాయి నాకు. తత్తరపాటుతో తల్లడిల్లి పోయింది నా మనసు.
'మీరు నా మీద కోపం తెచ్చుకోకండి. నన్నర్ధం చేసుకోండి. మాకు ఒక అన్నయ్య ఉండేవాడు! మీలో మా అన్నయ్య పోలికలు చాలా ఉన్నాయి' అంటూ ఒక్క క్షణం ఆగింది సుహాసిని నా కళ్ళలోకి చూస్తూ.
'ఇంక చెప్పద్దు, సుహాసినీ అంతా అర్దమైంది' అంటూ వాపోయింది నా మనసు, చెలరేగిన తుఫానులో చిక్కుకుని.
'మా అన్నయ్యంటే నాకు చెప్పలేని ప్రేమ. నే నంటే వాడికి ప్రాణం. వాడి మాట నేనూ, నా మాట వాడూ కాదని ఎరగం. ఎటువంటి అన్నయ్య ఏడాది క్రిందట మమ్మల్ని దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయాడు, కనుపించని లోకాలకి.
ఆరోగ్యం అసలే బాగులేని అమ్మ దిగులుతో మంచం పట్టింది. చెల్లెలు కష్టసుఖాలంతగా తెలియని అమాయకురాలు. నేనూ, అమ్మా ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నాం. మాకు కావలసినవాళ్ళుగానీ, దగ్గిరవాళ్ళు గానీ ఎవరూ లేరు.
మిమ్మల్ని కాలేజీలో చూసిన మొదటిరోజున, నే నింటికి వచ్చి ఎంతగానో ఏడ్చాను అన్నయ్య మనసంతా నిండిపోగా.
మీతో ఎంతో చనువుగా ఉంటూ వచ్చాను. అన్నయ్యే తిరిగి వచ్చాడన్నంత సంబరపడేదాన్ని మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా.
ఎన్నోసార్లు మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించాలనుకున్నాను. చివరి కో రోజు అమ్మతో మీ గురించి చెప్పి, మన ఇంటి కోసారి తీసుకువస్తానమ్మా అన్నాను. కానీ, ఎంతో ఆలోచించినమీదట వద్దంది అమ్మ. 'మగవాళ్ళు లేని ఇల్లు మనది. మనం మంచిగా ఉన్నా అపనింద వేస్తారు చూడలేని వాళ్ళు. రాకపోకలు మొదలు పెట్టకుండా ఉండటమే అందరికీ మంచిది' అంది అమ్మ. ఆ మాటలు ఎంత బాధపడుతూ అందో నే నర్దం చేసుకోగలిగాను' అంటూ కొంగుతో కన్ను లద్దుకుంది సుహాసిని. ఏదో తెలియని కోపం, ఓడిపోయానన్న భావన రెండూ కలిసి నాలో విచక్షణ జ్ఞానాన్ని మరుగునపరిచాయి. సుహాసిని మీద జాలీ, ఆప్యాయతా చూపవలసిన ఆ సమయంలో అసూయ నిండిన మనసుతో చటుక్కున లేచాను.
'నేను వెళతాను' అనేసి, జవాబు కోసమైనా చూడకుండా అక్కడినించి వచ్చేశాను.
నేను పొరబడ్డాననీ, ఇకనించీ మన మిద్దరం అన్నా చెల్లెళ్ళమనీ అంటూ అనురాగంతో తనని అర్ధం చేసుకుంటాననీ అనుకుని ఉంటుంది సుహాసిని.
నా ప్రవర్తనకి గుండె నిండిన బాధతో కుమిలిపోయి ఉంటుంది.
ఆ తరవాత నాకు రెండు మూడు ఉత్తరాలు వ్రాసింది. నేను మూర్ఖుణ్ణి. ఒక్కదానికీ జవాబు ఇవ్వలేదు.
ఆఖరి ఉత్తరం చెల్లెలిచేత వ్రాయించింది. అందులో తనకి టైఫాయిడ్ అనీ, లేచి తిరిగే ఆశ కలగటం లేదనీ, అమ్మనీ, చెల్లెల్నీ ఓదార్చేందుకికూడా ఎవరూ లేరనీ ఎంతో జాలిగా తన బాధ తెలియజేసుకుంది. 'నా ఆఖరి ఘడియల్లో ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది' అని మనసులో మాట చెప్పుకుంది. తన కోసం రావడం ఇష్టంలేకపోతే పోనీ కనీసం మిగిలిన ఇద్దరికీ ధైర్యం చెప్పడానికైనా రమ్మని కోరింది.
ఆ ఉత్తరం అందిన చాలా రోజులకి నా మనసు మారింది. నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడ్డాను. కానీ ఏం లాభం? నేను వాళ్ళింటికి వెళ్ళేసరికి నాకు కనుపించింది ఇంటికి వేలాడుతున్న తాళంకప్ప. వాకబు చేస్తే తెలిసిన దేమిటంటే..." చెప్పలేక అరచేతిలో ముఖం దాచుకున్నాడు సారధి.
"చెప్పు, బావా! ఏమిటి? ఏమైంది?"
బాధగా నిట్టూరుస్తూ కుర్చీలో వెనక్కి వాలాడు సారధి.
"ఏది కాకూడదో అదే అయింది. నా మూర్ఖత్వానికి బలైపోయింది సుహాసిని. ఆ దిగులుతో, మొదలే మంచం పట్టి ఉన్న వాళ్ళమ్మగారుకూడా ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. సుహాసిని చెల్లెల్ని ఎవరో దూరపు బంధువు వెంట తీసుకువెళ్ళాడట. ఇదంతా నా మూర్ఖత్వం వల్లే జరిగింది." సారధి కన్నులో నీరు తళుక్కుమంది.
"ఛ! ఊరుకో, బావా! ఇందులో నీ మూర్ఖత్వం ఏముంది? టై ఫాయిడ్ తో ఆ అమ్మాయి పోయింది."
"కాదు, సువర్ణా, కాదు! నీకు తెలియదు. నేను ముందే వెళ్ళి ఉంటే, సుహాసినికి ధైర్యం చెప్పి ఉంటే రెండు రోజుల్లో కోలుకొని ఉండేది. సంతోషం సగం బలం కాదూ? మనసు నిండిన సంతోషంతో మళ్ళీ మనుషుల్లో తిరిగేది." రెండు చేతుల్లో ముఖం దాచుకున్నాడు.
"ఊరుకో, బావా!" అంతకంటే మరి మాట్లాడలేకపోయింది సువర్ణ. ఓదార్చేందుకు మాటలు కరువయ్యాయి.
ఒక్క నిమిషం ప్రకృతి స్తంభించినట్లైంది. మేలిముసుగు జారిన రాజకన్య ముఖంలా మెరిసే నిశ్శబ్ధంలో కదలబోయి తడబడుతూ ఆగాయి ఆకులు. తెల్లబోయి అలాగే చూశాయి పూవులు.
సువర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుని, తదేకంగా చూస్తూ అన్నాడు సారధి! "నువ్వా మధ్య నీ ఫ్రెండ్ విశాలి గురించి చెప్పావు, గుర్తుందా?"
"అవును." కనుబొమ్మలు ముడిచి సాలోచనగా చూసింది సువర్ణ.
"అన్నయ్యతప్ప నా అన్నవాళ్లు లేనిది. అన్నంటే ప్రాణం ఇస్తుంది. కానీ ఏం లాభం? ఆ అన్నకేమో చెల్లెలిమీద కొంచెం కూడా ప్రేమ లేదు-అంటూ అతనిమీద నీ కోపం వెల్లడించావా రోజు. ఆ రోజు నించీ నా కళ్ళముందు సుహాసినే మెదులుతూంది. నా తప్పు నా గుండెల్లో మంట రగులుస్తోంది. అందుకే అప్పటినించీ ఎవరితోనూ, ఆఖరికి నీతోకూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను." ఒక్క క్షణం ఆగాడు సారధి.
"అంతా నీతో చెప్పాను. నా మీద కోపమే వస్తుందో, జాలే కలుగుతుందో మరి నీకు..."
"కోపం ఎందుకు, బావా? జరిగిందేదో జరిగి పోయింది. ఇంక బాధపడి ప్రయోజనం లేదు. సుహాసిని చెల్లెలు ఎక్కడైనా మనకి తటస్థపడితే, ఆ అమ్మాయి కేదైనా సహాయం కావలసివస్తే మనం తప్పకుండా చేద్దాం. ఆ విధంగానైనా నీ మనసులో బాధ కొంత ఉపశమిస్తుంది."
"ప్చ్!" బాధగా చూశాడు సారధి.
"ఆ అదృష్టంకూడా నాకు లేదేమో, సువర్ణా! ఆ అమ్మాయిని నే నెప్పుడూ చూడనైనా లేదు. ఆఖరికి పేరైనా నాకు తెలియదు."
చాలాసేపు మౌనంగా ఉండిపోయిన సువర్ణ ఉన్నట్టుండి దృఢస్వరంతో అంది: "ఆ అమ్మాయి ఎప్పుడో అప్పుడు తప్పకుండా కనుపించి, పరిచయం కలిగే ఘడియ భగవంతుడు ప్రసాదిస్తాడని నా కనిపిస్తోంది."
'ఆ శుభఘడియ త్వరలో రావాలి.' సన్నగా తనలో తనే గొణుక్కున్నాడు సారధి.
* * *
"టై మెంతయింది, విశాలీ?"
"పదిన్నరయింది, వదినా!"
"నువ్వన్నం తినేసెయ్యకూడదూ? ఆయన సంగతి నీకు తెలుసుగా? ఎప్పుడొస్తారొ ఏమో?"
"ఫర్వాలేదు, నాకేం తొందరలేదు." మహాలక్ష్మికి దగ్గిరగా వచ్చి కూర్చుంది విశాలి.
"వదినా! నేనొకటి అడుగుతాను-ఏమనుకోవుకదా?"
"ఎందుకనుకుంటాను, విశాలీ! నాకు నీ దగ్గిర దాపరికం ఏమీ లేదు. నన్ను చూసి మనసులో నవ్వుకుంటావని, నలుగురిలోనూ నా గురించి ఎగతాళిగా మాట్లాడుతూ ఉండి ఉంటావని నిన్ను అపార్ధం చేసుకున్నాను కొన్నాళ్ళు. తరవాత రాను రాను నీ మంచితనం బయటపడింది. నా తప్పు తెలిసి వచ్చింది. కానీ ఏం లాభం? నా తప్పు నాకు తెలిసివచ్చేసరికి, నీకు ఏ విషయంలోనూ కూడా సహాయం చెయ్యలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు మీ అన్నయ్య నా మాట వినిపించుకునే రకం కాదు. మనిద్దరి సంగతీ పట్టించుకునే స్థితిలో అంతకంటే లేరు." ఆప్యాయంగా విశాలి చేతులందుకుంది మహాలక్ష్మి. ఆగని కన్నీరు ఆ చేతులపై జారింది.
