"మా మీద" అనబోయి ఆగింది జుబేదా.
"వీణ నాన్నమ్మ వినిపించిన పతివ్రత కథలు మాకు వినిపిస్తున్నది" అని జుబేదా నవ్వుతూ అంది.
"డిటెక్టివ్ కథలు అనరాదూ?" చురచుర చూస్తూ పలికింది వీణ.
"అలా వదిలితే కోడిపుంజుల్లా పొడుచుకొంటారు. గాలి మరీ చల్లగా ఉంది. అలా కాంటీన్ లోకి వెళ్ళి కాఫీ తాగుదామా?" అంది సోఫియా.
క్షణం రాజీవ్ వైపు చూస్తూ, "నేను రాను" అంటూ గిరుక్కున వెనక్కి తిరిగింది వీణ. వెళ్ళిపోతున్న వీణవైపు చూస్తూ, "నిజంగానే కోపం వచ్చినట్లుంది. నే వెళ్ళనా?" అంది జుబేదా.
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక- "రాజ్! నీవు చిక్కి పోయావు! అంత ఎక్కువ వర్క్ ఉందా!" అంది సోఫీ.
"వీణ ఏమంటున్నది?"
"నిన్ను హేట్ చేస్తున్నది" అని సోఫియా చెప్పింది.
పకపక నవ్వేస్తూ, "ఏదో ఒకటి చేస్తున్నది కదా" అని అతడు తేలిగ్గా చెప్పినా, అతని గుండె బరువుగా ఉందనిపించింది.
వీణతో మాట్లాడాడు. నవ్వాడు. కలిసి తిరిగాడు. కాని, కాస్తకూడా చేరువ కాలేకపోయాడు. వీణ మనస్సు కరిగేది ఎలా? ఏం చేయాలి అని ఒక వైపు తలుస్తూ సోఫియాతో కాస్సేపు మాట్లాడి వెళ్ళిపోయాడు.
ఆలోచిస్తూ ధీమాగా నడిచిపోతున్న రాజీవ్ ను చూస్తూ ఉండిపోయింది సోఫీ.
రాక్షస స్త్రీల మధ్యనున్న సీతను ఒత్తిడి చేస్తున్న రావణుని ప్రేమించిన ధాన్యమాలిక అన్న రాక్షస స్త్రీ తనతో క్రీడించమని అడుగుతుంది రావణున్ని! అది తలపుకి రాగా విరక్తిగా తనలో తను నవ్వుకొంది సోఫియా.
* * *
సోఫియాకి పరీక్షలు దగ్గరి కొస్తున్నాయి. ఎక్కువ సేపు లైబ్రరీలోనే గడుపుతున్నది. రెండో సంవత్సరంఒక్క పరీక్ష! ఆర్గానిక్. కాస్త చదివేస్తే పాస్ అయి పోవచ్చు. పోయినా థర్డ్ ఇయర్ కి ప్రమోషన్ ఉంటుందన్న ధీమాతో కాస్త ఫ్రీగా ఉంటారు. స్టూడెంట్స్.
లేడీస్ కాలేజీలో ఎగ్జిబిషన్ జరుగుతున్నది. ఆ రోజు చివరి రోజు. ఎలాగైనా పోవాలని చక్కగా తయారయారు వీణ, జుబేదాలు.
రోడ్డు మీదకు వచ్చాక- "జుబ్! ఆ రాజీవ్ కంటబడక ముందే వెళ్ళిపోదాం" అంటూ రిక్షాలో ఎక్కింది వీణ.
"రాజీవ్ చాలా మంచివాడు, వీణా! అతణ్ణి నీవు ఎందుకు హేట్ చేస్తావో!"
"అతను హక్కున్న మేనమామలా ప్రవర్తిస్తుంటే ఒళ్ళు మండుతుంది. ఆ రోజు ఆ అబ్బాయి చెయ్యి విరిగింది. ఫిజియాలజీ డెమాన్ స్ట్రేటర్ ఇంటరెస్టింగ్ గా అన్నీ చెప్పుతాడు, విసుగు లేకుండా! నిన్న ఏమన్నాడో తెలుసా- రాజీవ్ మీకు రిలేషనా? ఆర్ యు ఎంగేజ్ డ్?" అని."
"ఆడెమ్మా! ఎప్పుడూ నీ చుట్టే ఉంటాడు. అందుకే ఎవరో చెప్పి ఉంటారు జాగ్రత్త పడమని."
"ఏమని?"
"ఏమో!" కొంటెగా వీణవైపు చూసింది.
ఏదో కారు ఎదురు వస్తున్నది. "ఆ కారు రాజీవ్ ది కాదుగదా? అబ్బా! ఈ మగవాళ్ళు రిక్షాలోకి తొంగి చూస్తున్నారు, ఆడవాళ్ళని ఎప్పుడూ చూడనట్లు. పరదా కట్టుకోవాలని, బురఖా వేసుకోవాలని నా మనస్సు తహతహ లాడుతున్నది, జుబ్!" అంది వీణ.
కాలేజీముందు దిగారు. రిక్షాకి రెండు రూపాయలివ్వాలి. ఐదు రూపాయలు ఇచ్చారు. మూడు రూపాయల కొరకు చేయి చాచింది జుబేదా. రిక్షావాడు స్పీడులో వెళ్ళిపోయాడు. చాపిన చెయ్యి చాపినట్లే ఉంది.
"వాడు వెళ్ళిపోయాడు. చెయ్యి వెనక్కు తీసుకో!" అంది వీణ.
"ఎంత మోసం!" పెదాలు బిగించింది జుబేదా.
"సంతోషించు పది రూపాయ లివ్వనందుకు."
గేటు దగ్గర టికెట్స్ కొనుక్కుని లోపలికి వెళ్ళారు. ఎగ్జిబిషన్ లో స్టాల్సుని చూసేకంటే స్టాల్సులో ఉండే అమ్మాయిలను చూడాలనిపించింది. దేశంలోని ఫాషన్లు, డ్రెస్సుల కన్నుల విందుగా ఉంది కాలేజీ అమ్మాయిలతో. ఝంకారగీతిక లాలపిస్తూ పుష్పాన్వేషణలో బారులు తీర్చిపోతున్న తుమ్మెదల గుంపుల్లా కాలేజీ అబ్బాయిలు ఉండనే ఉన్నారు.
చెయ్యి చెయ్యి పట్టుకొని ఎగ్జిబిషన్ లో తిరగ సాగారు. లైట్లు వెలిగాయి. చాలా సేపయింది. ఐస్ క్రీమ్ కొన్నారు." చలికాలమైనా మనలాంటి వారి కోసం ఐస్ క్రీములు తయారు చేస్తున్నారు" అనుకొంటూ తిన్నారు.
"హేయ్, జుబేదా!" అంటూ ఓ పైజామా పిల్ల వచ్చి జుబేదాను చుట్టేసింది. "ఎన్నాళ్ళకు కనిపించావే! రాధకూడా ఇక్కడే ఉంది" అంటూ జుబేదాను లాక్కుని పోయింది.
వీణ వెనకపడింది. ముందు పోయిన జుబేదా కనిపించలేదు. "వీణా!" వీణ దగ్గరలో పిలుపు. తిరిగి చూసేంతలో రాజీవ్ పక్కన నిలిచాడు. చెమట పట్టిన ముఖాన్ని తుడుచుకొంటూ వీణను కనుగొన్న రిలీఫ్ తో, "ఎగ్జిబిషన్ కు ఎవరు రమ్మన్నారు? త్వరగా పద, బయటికి" అన్నాడు.
"మీ పెర్మిషన్ తీసుకోవాలా? ఎప్పటినుండి ఈ గార్డియన్ షిప్?"
"వీణా!"
"ఇట్ ఈజ్ వాట్ యువర్ బిజినెస్!"
అతని ముందునుంచి గబగబ పోసాగింది. ఎటు వెళుతుందో తనకే తెలియదు.
అసహాయుడుగా వీణ వెనకనే వస్తున్న రాజీవ్, "వీణా! ఇప్పటికి నా మాట విను! ఇక్కడ గొడవ జరగబోతూంది. ముందు ఇక్కడినుంచి వెళ్ళిపోదాము" అన్నాడు.
తన తోటివారు పక్షుల్లా ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు. నవ్వుతున్నారు. తమ అతని కనుచూపు దాటి ఎక్కడికి పోకూడదు. పోనీయడు. ఏమిటీ రిస్ట్రిక్షన్స్ అనుకొంటూ, "ఎందుకు నన్నిలా వెంటాడు తున్నారు? మీ కెవ రిచ్చారీ అధికారం? అసలు మీ రెవరు?" అని జవాబు కావాలి అన్నట్లు అతణ్ణి నిలదీసి అతని వైపు చూస్తూ అంది.
కోపంతో విప్పారిన నేత్రాలలో ఎర్ర జీర కనిపించింది.
"నీవు నా దానివి! నా ప్రాణం!" అని ఎలా చెప్పగలడు? అతని పౌరుషం దెబ్బతిన్నది. క్రింద పెదవి పంటికింద నలిగిపోసాగింది.
వెక్కసంగా తల తిప్పి నడక సాగించింది.
గబగబ అయిదారడుగులు వేసిందో లేదో గప్ మని లైట్లారిపోయాయి. అరుపులు ఆ చీకటికి కళ్ళు ఇంకా అలవాటు కాలేదు. కెవ్వుమని అరిచా రెక్కడో! భయంతో స్తంభించిపోయింది వీణ. అంతలో ఎవరో వచ్చి తన పిట్ పట్టుకొన్నారు. "అమ్మా!" అంది వీణ.
మరెవ్వరో తన చెయ్యి గట్టిగా పట్టుకొన్నారు. మరలా అరవబోయేటంతలో "వీణా! నేను" అంటూ రాజీవ్ పైట పట్టుకొని లాగుతున్న అతని ఛాతీమీద ఒక్క గుద్దు గుద్దాడు. "అబ్బా!" అంటూ అతను వెనక్కి వాలాడు.
ఆ చీకట్లో రాజీవ్ వణుకుతున్న వీణను పట్టుకొని లాక్కుపోసాగాడు.
చీకటికి అలవాటుపడ్డ కళ్ళకి పరుగెత్తుతున్న అమ్మాయిలను తరుముతున్న మగవాళ్ళు కనిపిస్తున్నారు. భయంకరంగా అరుస్తున్న అమ్మాయిల కేకలు, ఏడ్పులు వినవస్తున్నాయి.
ఆ చీకట్లో మరెవ్వరో ఇద్దరు వచ్చి వీణను పట్టుకొన్నారు. కెవ్వుమంటూ రాజీవ్ ని పట్టుకుంది.
"మిస్టర్! దిస్ ఈజ్ మై గర్ల్!" అంటూ బిగపట్టి పలికాడు. రెండు చేతుల్లోకి వీణను ఎత్తు కొన్నాడు. ఆ అబ్బాయిలు వెకిలిగా నవ్వుతూ మరో వైపుకి పరుగెట్టారు.
రాజీవ్ చీకట్లో కళ్ళు చిట్లించి చూసి, మరో వైపు పరుగు లాటి నడకతో పోతూ కాలికి రాయి కొట్టుకొని తూలి పడబోయాడు.
పడిపోతానేమోనన్న భయంతో రాజీవ్ మెడను గట్టిగా చుట్టేసింది వీణ.
తన చేతుల్లో వీణ! గుండెల దగ్గరగా తనను చుట్టేసింది! క్షణం ఊపిరాడనట్లైంది. ఉద్వేగంతో గుండె జోరుగా కొట్టుకోసాగింది. చల్లగా, తీయగా ఉన్నట్లున్న వీణ ఊపిరి మెడకు తగులుతున్నది. కాలం అలా స్తంభించిపోతే శాశ్వతంగా వీణ తన చేతుల్లో ఉండిపోతుంది. కోరిక బలపడసాగింది. హృదయం పొంగింది. ఆమె అధరాలు రుచి చూడాలని, మెత్తని ఆమెను అతనిలోకి ఇముడ్చుకొని సొంతం చేసుకొని, తనెవ్వరో, ఆమెకి ఏమవుతాడో తెలియజెప్పాలని అతని లోని మగవాడి కోరిక అనంతం కాసాగింది.
ఆ టెంప్టేషన్ కి తట్టుకోలేక బలహీనుడు కాసాగాడు. తనను నమ్మి చేతుల్లో పిల్లలా ఇమిడి పోయిన వీణను బలాత్కరించినట్లవుతుంది. "వీణా! వీణా!" అంటూ ఉన్న హృదయం ఛాతీని చీల్చుకొని బయటికి వస్తుందనుకొన్నాడు.
'భగవాన్! శక్తిని ప్రసాదించు! స్త్రీ మంచి మహా మహా తపస్వులే తప్పించుకోలేకపోయారు' అనుకొంటూ అంతరంగ ఘర్షణకు తట్టుకోలేక,"మైగాడ్ ! గాడ్!" అని వణుకుతున్న స్వరంతో పైకి పలికాడు.
అతని హృదయస్పందన వింటున్న వీణకు "మైగాడ్!" అన్న రాజీవ్ మాట వినిపించి అతనూ భయపడుతున్నా డని మరీ భీతి చెంది, "రాజ్!" అంటూ మరీ గట్టిగా అతని మెడను చుట్టేసి, "మీకు భయంగా ఉందా?" అంది.
నీరసంగా నవ్వుతూ, "మెడను వదులు. ఊపిరి ఆడక చచ్చేలాగున్నాను" అన్నాడు.
ప్రహరీగోడ తగలగానే దింపుతూ, "డెబ్బై పౌన్లను కొన్నాను" అన్నాడు రొప్పుతూ, నవ్వుతూ.
గోడ కానుకొని పైట సరిచేసుకుంది. ఎక్కువ భయానికి ఏడ్పుకూడా రాలేదు. నోరు ఎందుకు పోయింది. జుబేదా జ్ఞాపకం వచ్చింది.
"జుబేదా!" అంది వణుకుతూ! దూరంగా వినిపిస్తున్న అరుపుల్లో, ఏడ్పుల్లో జుబేదా స్వరం లేదు కదా?
'భగవంతుడా! ఉపవాసం ఉండి నిన్ను పూజించింది. ఆమెను రక్షించవా!' అనుకొంటూంటే ఏడ్పు వచ్చేసింది. చేతుల్లో ముఖం దాచుకొని క్రింద కూర్చుండి పోయింది.
"వీణా! ఏడవకు. నీ జుబేదా క్షేమంగానే ఉంది."
"రాజ్!" చివ్వున పైకి లేచింది. చీకట్లో అతని ముఖం కోసం వెతకసాగాయి ఆమె కళ్ళు. ఆ చీకట్లో కూడా వీణ ముఖం తెల్ల తెల్లగా కనిపించింది.
"నీకు నేను ఏమీ కాను. కాని, నీవు నా భార్యవి" అంటూ ఆమెను దగ్గరకు తీసుకోవాలనుకున్నాడు. కాని, అతని అభిమానం అడ్డు వచ్చింది.
పోలీసు విజిల్స్ వినిపించాయి, వాన్స్ వస్తున్నట్లు-
"వీణా! త్వరగా పద" అంటూ వీణను ఆరడుగుల గోడ ఎక్కించి, అటు వైపుకి దూకి వీణను దించుతూ అర క్షణం హృదయం దగ్గరకు చేర్చుకొన్నాడు.
గుట్టల్లో నడుస్తూ బాటను చేరుకొన్నారు. లైట్లు వెలిగాయి. ఓ చెట్టు కింద ఉన్న కారు వీరి దగ్గరకు వచ్చి ఆగింది.
"వీణా!" అంటూ సోఫియా, జుబేదాలు సంతోషంగా అరిచారు.
వెనక సీట్లో ఉన్నవారితో కూర్చుంది. వాటర్ బాటిల్ ఇచ్చాడు రాజీవ్. వీణకు త్రాగించారు.
"మీ మేలు ఈ జన్మలో, ఏ జన్మలో మరిచిపోము" అంది జుబేదా.
"గోపాల్ కి థాంక్స్ చెప్పాలి. సమయానికి కారుతో వచ్చాడు" అన్నాడు రాజీవ్.
"ఆ రోజు స్టూడెంట్స్ వేసుకున్న ప్లాన్ తమాషాగా మాటల్లో రాజీవ్ తో అన్నాడు ఒక ఫ్రెండ్-"కరెంట్ కట్ చేస్తా"రని. అప్పుడు ఊహించలేదు రానున్న పరిణామాలు. హాస్పిటల్ కు వస్తూ ఆలోచిస్తే 'ఆ చిన్న తమాషా దేనికి దారి తీస్తుందో' అనుకొంటూ హాస్టల్ వైపు వెళ్ళాడు రాజీవ్.
సోఫియా అప్పుడే లైబ్రరీ నుంచి వచ్చింది.
రాజీవ్ ని చూస్తూనే- "పిల్లలు ప్రపంచాన్ని చూడాలని పోయారు" అని చెప్పింది.
రాజీవ్ క్షణం ఆలస్యం చేయలేదు. కారులో పోతున్న పరిచయస్థుడు గోపాల్ ని తీసుకొని వచ్చాడు.
గుంపులో ఉన్న జుబేదాని గోపాల్ పొమ్మన్నాడు. ఎదురు ప్రశ్న వేయక జుబేదా బయటికి వచ్చేసింది.
ఆ రోజు ఆ చీకటిలో ఎంతమంది శీలాన్ని కోల్పోయారో! దిగంబరులై ఆ చీకట్లో పరుగెత్తుతున్న వారికి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలాయో! తలుచుకుంటే గగుర్పొడిచింది వీణకు. మనస్సులో భగవంతునితో పాటు రాజీవ్ కి అంజలి ఘటించింది.
హాస్టల్ కి పోతూ కళ్ళతోనే ధన్యవాదాలు చెప్పింది వీణ. వీణ కళ్ళు నవ్వుతూ మాట్లాడాయి. రాజీవ్ కి ఆ రోజు మరువరాని రోజు.
* * *
