అదంతా ఒక ఆట అనే భావం అతనికి పోలేదు, లేదూ అంటే గిరిజకు స్వస్థిచెప్పి కమలను పెళ్ళాడే విషయం మణితోనో, వాళ్ళ తల్లిదండ్రులతోనో కదుపుదామనే అనుకున్నాడు కాని గిరిజ విషయం, తను చిక్కుకున్న పరిస్థితులూ తప్పించుకున్నా తప్పినట్టు లేవు. ఇలా అనుకుంటూ మణి దగ్గరకు బయలుదేరాడు.
* * *

7
మణి యింటిదగ్గర్నుండి వచ్చేసరికి చాలా రాత్రి అయింది. ఆవేళ గడచిన గండం తలుచుకొని కళ్ళుమూసేడు గిరి. యధాప్రకారం ఎలారం మ్రోతకి తెలివి వచ్చింది. తెలతెలవారుతూండగా లేవడానికి బద్ధకంగా వున్నా. తప్పనిసరి అయిన కార్యక్రమం గుర్తుకి వచ్చి-లేచి- పనిముట్లతో సహా - వీధి గుమ్మంలోకి వచ్చాడు....... చీరవకటి చుట్టబెట్టుకుని - రాగానే..... గిరిజ కూడా వాళ్ళ వీధిగుమ్మం కడుగుతూ, కడుగుతూ, యిటువయిపు చూసి, ఆ సాయంత్రం జరిగిన చనువు పురస్కరించుకొని - "ఏమండోయ్! అక్కయ్యగారూ! లేవడం ఆలస్యం అయిందే!" అని పలకరించింది-
మళ్ళీ లోపలికి పోదామన్నా వీలయిందికాదు. గిరికి గుండె గుభేలు గుభేలు మంటూనే వుంది! ఏం జవాబు చెప్పడం? మణిగాడు కూడా లేడాయె! ఎలా నోరు విప్పడం!
"రోజూ నాకన్నా ముందే లేచి కడిగేస్తూండే వాడు, యివాళ దొరికిపోయారు!"
కొంప ములిగింది. ఎలా గొంతుక మార్చుకోవడం? గిరికేం ఆలోచన పోక తొందర తొందరగా పని ముగించి లోపలకు వెళ్ళిపోదాం అనుకున్నాడు వినీ వినబడనట్టు నటించి, కాని గిరిజ వూరుకోలేదు. మాటాడరే మండి అక్కయ్య గారూ! కోపం వచ్చిందా! నిన్న పేరంటానికొస్తే అంచక్కా మాటాడారే!" అని అడిగింది.....
-గిరికి దాగట్లోపడ్డ వెలక్కాయలా అయింది. అప్పటి కప్పుడే గిరిజకి అతని ప్రవర్తన అనుమానమయింది యింక అక్కడుంటే లాభం లేదని. ఎక్కడ పని అక్కడిలాగే వది లేసి ఒక్కదాటున గుమ్మంలోకి వెళ్ళిపోబోయే సరికి. అంతకన్నా ముందే.... గిరిజ వెనకాలే పరుగెట్టుకు వచ్చి-
"అమ్మదొంగా! ఎక్కడికలా జవాబు చెప్పకుండా పారిపోతారు! అంత కోపం దేనికో చెబితేనేగాని వదలను!" అని అంటూ చీర పట్టుకు లాగింది.... యింకేముంది ఆ చుట్టు గున్న చీరకాస్తా వూడింది ..." ముసుగులో రహస్యం బైటపడింది!!
గిరిజ చూసి-
"అ! మీరా!" అని అరచి - ఆశ్చర్యంతో వెనక్కి తగ్గింది.
గిరికి కాళ్ళాడలేదు, కాని వణకు ప్రారంభించాయి. శరీరమంతా చెమటలు పోసింది! హృదయం గబగబా కొట్టుకోసాగింది- ఎన్నాళ్ళ నుండో పడుతున్న భయం ఎదురయింది!- ఏం చేయడానికీ తోచక ఆమెతో నిజం చెప్పి బ్రతిమాలుకోవడం కన్నా గత్యంతరం లేదని-అనుకున్నాడు. ఆ పరిస్థితుల్లో అక్కడయితే యిద్దరికీ మంచిదికాదు అంచేత ఆ పాశంగా ఆమె చెయ్యి పట్టుకు యింట్లోకి లాక్కుపోయాడు-గిరిజకేమీ అర్ధంగాక విడిపించుకోలేక లోపలికి వెళ్ళింది అక్కడ విదిలించుకుని - లాగి ఒక్క లెంపకాయ కొట్టింది!
గిరికి కళ్ళు పచ్చబడి - బైర్లు కమ్మి గిరగిరా రానావానా చెల్లప్ప తిరిగేయి, అతను తమాయించుకుని తేరుకోకముందే?
"ఏఁమిటీ పని? ఎంతమోసం? ఇప్పుడే మా నాన్నగారితో చెబుతా నుండండి," అని అంది గిరిజ కోపంతో-
గిరి బుగ్గ తడుపుకుంటూ-
"నే చెప్పేది వినండి గిరిజాగారూ?" అని ప్రాధేయపూర్వకంగా అడిగేసరికి- అతని వాలకం చూచి తొందరపడి చెయ్యి చేసుకున్నందుకు సిగ్గుపడుతూ -
"ఏఁమిటి వినేది అక్కర్లేదు! నేను వెళుతున్నా-" అంటూ వెళ్ళబోయింది!
"అలాగనకండి! ఒక్క మాట విని వెళ్ళిపోండి!"
"అక్కయ్యగా రింట్లో లేరా?"
"లేరు అదే చెప్పనివ్వండి!" అని సమయం దొరికినందుకు వినియోగించుకున్నాడు.
"ఏమిటి చెప్పండి! ....ఆవిడ లేకపోతే మీరే చీరకట్టుగు చెయ్యాల్సిన ఖర్మ ఏం పట్టింది?"
ఇహ పర్వాలే దనుకున్నాడు -
జరిగిన దంతా- ఉద్యోగాన్వేషణ నిమిత్తం ఆ ఊరు రావడం - ఇంటికోసం తిరగడం -కుటుంబం వుంటేనేగాని ఈ యిల్లు అద్దెకు యివ్వరనడం- అందుకే ఈ నాటకం ఆడవలసిరావడం- అంతా పూసగుచ్చినట్టు చెప్పేడు.
"ఆమె అదంతా ఆశ్చర్యపోయి విని - జరిగిన సంఘటనలన్నీ ఎప్పుడో చూసిన సినిమాలా జ్ఞాపకం చేసుకుని అప్పుడప్పుడు తనకు కలిగిన అనుమానాలు ఉత్తి అనుమానాలు కావవి నిర్ధారణ చేసుకుంది.
అయితే అప్పుడపుడు కళ్ళాపి జల్లుతూనాతో మాట్లాడిన వారెవరూ? అనుమానం కలగకుండా వుండడానికి అప్పుడపుడు ఎవర్నన్నా తెచ్చేవారు కూడానా?"
"అబ్బె! ఎంతమాట నేను ఘోటక బ్రహ్మ చారిని నన్ను నమ్మండి! ఆ మాటాడింది! నా ఫ్రెండు మణి! మెకెఉ తెలిసి వుంటుంది! అప్పుడప్పుడు నాటకాల్లో స్త్రీ వేషాలు వేస్తూంటాడు టెలిఫోను ఎక్స్చేంజ్ లో పని చేస్తూ వుంటాడు...."
"ఆడగొంతులా వుంటుంది? ఆయనా?"
"మరేం...."
అది సరే, మరో రోజు! పేరంటాని కొచ్చిన పుడు....మాతో మాట్లాడి నామె ఎవరు? మీరెంత దూరంగా మోసంచేసినా ఆవిడ మాత్రం ఆడదే మీ మణిమాత్రం కాదు ఏమంటారు?"

"అవును నిజమేనండి!- ఆ రోజు మీ చెల్లెలు మా యింటికి మీరందరూ పేరంటానికి వస్తారని చెప్పగానే నా గుండె జారిపోయింది. ఆరోజే నా సంగతి తెలిసిపోతుంది అని అనుకున్నాను కాని అదృష్టవశాత్తూ, మా మణికి వంట్లో బాగు లేక అర్జంటుగా రమ్మని వాడి చెల్లెల్ని పంపేడు .....ఆ పిల్లని చూసి ప్రాణాలు లేచి వచ్చాయి. సరిగ్గా మీరు ఇంకో అరగంటకి వస్తారనగా ఆ అమ్మాయి వచ్చింది. ఎలాగో బ్రతిమలాడి ఒప్పించి, ఆగండం కాస్త గడుపుకున్నాను."
"బాగానే వుంది, మొత్తానికి గొప్పగా వుంది! ఎంతకయినా తగుదురన్న మాట! యింతకీ ఈ నాటకం ఆడడానికి మేమే దొరికామా! మా యిల్లేగాని. వేరే యిల్లు దొరకలేదా? అయినా యింటికోసమని - యింత దొంగాటమా? ఎంత ధైర్యం - యిప్పుడు మా నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది!"- అని అడిగింది.
అంతవరకూ రామాయణం అంతా చెప్పాడు గాని - రాముడికి సీత ఏమవుతుందో చెప్పలేదు గిరి అందుకే ఆ ప్రశ్న వేసింది-
ఆ సంగతి ముందే చెబితే యింకేమన్నా వుందా? ఆవిడ ఫోర్సు తగ్గేక వినిపిడ్దా మనుకున్నాడు. యిప్పటికయినా ఆమె ఏ అవతారం దాలుస్తుందో అని భయపడుతూనే తటపటాయిస్తున్నాడు...ఆవిడ తగిల్చిన చురక యింకా చెంప మీద చురచుర లాడుతోనే వుంది.... రెండోది గిరిమీద. కాస్తంత, జాలిగాని, సానుభూతిగాని యిష్టంగాని వున్నట్టు అవుపించలేదు. అంచేత మాటాడకుండా..... ఆ ఆడపిల్ల ముందు తల వంచుగున్నాడు ఆ అబ్బాయి.
"ఏం అలా నిలబడ్డారు! జవాబు చెప్పలేం?" అని అడిగింది.
"మీరేం అనుకోరు కదా?"
"అనుకుంటే మీకు వచ్చిన నష్టం, ఖాతరూ ఏమిటి?"
"అయితే మీరే కారణం" అని గబుక్కున నాలిక చివరిమాట వదిలేసి, బుద్దిగా, భయంగా అమాయకంగా చూస్తూ చేతులు కట్టుకు నుంచున్నాడు.
"ఏంఅన్నారూ? అని కళ్ళు పెద్దవి చేసింది -సందేహాస్పదంగా సంజాయిషీ కోసంచూస్తూ.
"నిజంగా చెబుతున్నా గిరిజా నిన్ను హృదయ పూర్వకంగా ప్రేమించాను ..... నువ్వే మనుకున్నా సరే ప్రేమిస్తున్నాను! నిన్ను చూసిన దగ్గర్నుండి. నీ కోసమే ఈ యింట్లో దిగాను. నిన్ను వదలలేకే ఈ నాటకాలూ, అబద్ధాలూ, ఆడి యింత ధైర్యం, సాహసం చేశాను!.... ఇన్నాళ్ళనుండీ నీకో మాటాడదామని, నా మనస్సులో నున్నది చెప్పుకుందామనీ, ఎంతో ప్రయత్నించాను గాని, నువ్వు యిటువయిపే, దృష్టి వుంచలేదు ఈ దీనుడి మీద దయ కల్పలేదు! నా కష్టానికి ఏ కొంచెం సహాయం నువ్వు చేసినా ఫలం దక్కేది రానురాను నా పని రామాయణంలో పీడకల వేట లాగయింది!.....నాకె భార్యాలేదు బద్దలూ లేదు - నువ్వు సరే అంటే - నిన్ను పెళ్ళాడతాను! గిరిజా! నే చేసినవన్నీ మన్నించి - నీ బాడిగా చేసుకోవూ?" అని ధైర్యంగా అనేశాడు గిరి! సమయం చూసి - ఏకవచన ప్రయోగం, చనువుగా చేసేడు - అది విని ఆమె తోకతొక్కిన త్రాచులా - లేచింది -
"ఆడదంటే మీకున్న అభిప్రాయానికి చాలా ఆనందించాం! మొగవాళ్ళకి యిష్టమయి, వాళ్ళు పెళ్ళిచేసుకుంటాం అనేస్తే చాలన్న మాట! మరి ఆడపిల్లలకి యిష్టాయిష్టాలుండవు!- చాలా సంతోషించాంగానండీ! మర్యాదగా మాటలు రానీండి! మీ కటాక్ష విక్షణాలకి ఎవరూ ఎదురు చూడడంలేదు, యింతవరకూ మీరు చేసిన ద్రోహానికి, ఏం చేసినా పాపం లేదు! యికనయినా ఇక్కడ నుండి -మర్యాదగా లేచిపోండి! లేదా మానాన్నగారితో ఈ సంగతంతా చెప్పి మిమ్మల్ని వీధిపాలు చేయవలసి వస్తుది! ఇలాటి పిచ్చి పిచ్చి వేషాలూ, దురాలోచనలూ మానుకోండి లేకపోతే పూజ జరగగలదు?" అని చండికలా అంది.
ఆమె అంత కఠిన హృదయంతో తృణీకరిస్తుందని అనుకోలేదేమో గిరికి తలకొట్టేసి నట్టయింది. -
"అంతేనంటారా? గిరి జగారూ?" అని తిరిగి బహువచనం ప్రయోగించాడు - ఎందుకయినా మంచిదని -
"ఇంకా సిగ్గులేదండీ అడగడానికి? మనిషికి ఒకమాట చాలంటారు. ఇక వదలండి! నేను నుంచి దాన్నిగాను, రేపీ పాటికి మీరు యిల్లు కాళీ చేసి వెళ్ళకపోతే, మా నాన్నగారితో చెప్పి మీ పరువు మర్యాద కూడ తీసి అవతలకు పంపించేస్తారు, అంచేత నలుగురి నోట్లో నీ పడక ముందే. వెళ్ళి పోండి! తెలిసిందా?" అని ఆమె వెళ్ళిపోయింది!
అంతే ఆతర్వాత, గిరి జీవితం చీకటి మయ మయింది! ముచ్చెమటలూ పోసినట్టు తెలుసుకున్నాడు, ఒక స్త్రీ చేత తిరస్కరించబడ్డా నన్న చిన్నతనం అడుగడుగునా బాధిస్తూంది! "ఛీ యింత చాతకాని వాడిలా కనబడ్డానా?" అని అనుకున్నాడు; గిరిజ అంత బ్లంట్ గా- కాదంటుందని అనుకోలేదు. కలలోకూడా, అంత అవమానం భరించి ఎలా బ్రతకగలనా అని అనుకున్నాడు, ఆత్మ హత్య వరకూ మనసు పోయినా, అది ఆడవాళ్ళ వని అని మానేశాడు! అయినా - ఆడదంటే ఒక సారే ప్రేమిస్తుందట! అలాగే వుండాలి కూడాను కాని మా వాడికేం ప్రేమించడం అన్నది పాత చొక్కా తీసి కొత్త చొక్కా తొడుక్కొటం లాటిది!...
ఆమె అన్నవన్నీ దులుపుకొని - ఆ మర్నాడే అక్కడనుండి మర్యాదగా జండా ఎత్తేయడానికి నిశ్చయించుకున్నాడు గిరి. జరిగిన దానికి ఆ గిరిజ ఎవరికయినా చెప్పి రభస చేస్తుందేమో అని భయపడినా- తెల్లారేక వాతావరణం అనుకూలంగా వుంది. దాసుగారు కనిపించి మర్యాదగానే పలకరించడంచేత కొంప ములగ లేదని స్థిమితపడ్డాడు.
ప్రొద్దున్న దాసుగారు కాఫీ త్రాగుతుండగా వెళ్ళి నమస్కారం చేశాడు!
"రా నాయనా! కూర్చో ఏం యిలా వచ్చావు? మొహం ఏం అలా గిరీశం లావుంది?" అని అడిగేశాడు-
గిరి ఎంత సంతోషం. ఉత్సాహం తెచ్చుకుందా మనుకున్నా దెబ్బ తగిలిన మనస్సు. వికలమై మనిషినే మార్చేసింది. ఆ విచారం, కొట్టొచ్చినట్టు మొహంలో కనబడుతూంది!
అబ్బే ఏం లేదండీ! మీతో ఒక విషయం చెబుదామని?" అని నసిగాడు.
"లాగే చెబుదువుగాని - ఏదీ అమ్మాయ్ ఒక కాఫీ యియా తీసుకురా మన గిరికి !" అని ఆర్డరిచ్చాడు.
గిరిజ, కాఫీ తెచ్చి యిచ్చింది- ఎలావుంటుందో అని గిరి గుండెలు కొట్టుకున్నా గిరిజ అతడిని చూసి, మార్పు చూపించలేదు. మా మూలుగా ఏం జరగనట్టే వుంది! ఎప్పుడూ అయితే ఆ పక్కనే ఉండి ప్రసంగం వింటూండేది గాని యిప్పుడు కాఫీ కప్పు అక్కడ పెట్టేసి వెనక్కయినా తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
అగ్నిపర్వతాలు గుండెల్లో బ్రద్ధలవుతున్నా నిశ్చలంగా, ఏమీ ఎరగనట్టు పైకి ఉండగలిగేది ఒక స్త్రీయేనేమో!
ఆమెని చూడ్డానికే గిరికి సిగ్గనిపించింది! కాని ఆఖరుసారిగా ఆమెకు చూడాలని అనిపించింది. పాపం!
"ముందా కాఫీ పుచ్చుకుని చెప్పు" అన్నాడాయన.
"మరేం లేదండి - ఈవాళ మీ ఇల్లు ఖాళీ చేసి - వెళ్ళిపోతున్నాను, నిన్న రాత్రే మా మామగారు వచ్చి నా భార్యని తీసుకువెళ్ళారు" అని గబగబా అనేశాడు "-
ఆ మాటలు విని ఆయన నిర్ఘాంతపోయాడు -
"కాళీచేసి వెళ్ళిపోతావా! అంత తొందరే మొచ్చిందబ్బా! అన్నాడు.
కారణం ఏమి లేదండి!"
"మరెక్కడికి వెళ్ళిపోతావు!"
"ఇంకా నిశ్చయం కాలేదు! కాగానే తెలియ పరుస్తాలెండి" అనేశాను.
"మంచిది అలాగేకాని-" అని ఊరుకున్నాడు అతనెప్పుడూ అంతే - అవతల మనిషికి, ఏదయినా చెప్పడం యిష్టంలేక దాస్తున్నట్టు తోస్తే మరేమీ నిర్భంధించి అడగడు. అంతకన్నామాట తుంచి మరీ మాటాడుతాడు. నా మాటల ధోరణి కనిపెట్టి అది గ్రహించి అడగడం మానేసేరు. -కాని నేను సెలవు అని లేవబోతూవుంటే-
"మంచివాడివి మా యింట్లో దిగానని సంతోషించాను. - ఏమిటో నిన్ను చూస్తే ఏదో ఆత్మీయత. అభిమానం పుడుతుంది నాకు. అందుకే అప్పుడప్పుడు నీతో కొంచెం చనువు తీసుకొని మాటాడేవాడిని - నీకు కష్టం కలిగించే సందర్భం ఏదయినా వున్నదంటే - ఏమీ అనుకోకు - అప్పుడప్పుడు కనిపిస్తూ వుండు" అని అన్నాడు. ఆ మాటలు విన్నాక గిరికి కళ్ళవెంట నీళ్ళు తిరిగేయి వదలలేక వదలలేక ఆ మధ్యాహ్నం ఇల్లు కాళీచేసి వెళ్ళిపోయాడు. ఆఖరిక్షణంలో కూడా గిరిజ కనబడలేదు, ఆమెకెంత విముఖత వుందో మరి! గిరి ప్రవర్తనను ఎంత అసహ్యించుకున్నదో!
