Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 11


    సుందరరామయ్యగారి కుమార్తె పేరు నీరజ. తండ్రి కూతురు యిద్దరూ కాలకృత్యాలు తీర్చుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు అందరినీ ఫలహారాలకు పిలిచారు. అకస్మాత్తుగా ప్రభాకరం యింకా నిద్ర లేవలేదన్న విషయం గుర్తుకు వచ్చింది అన్నపూర్ణమ్మగారికీ. పైకివెళ్ళి చూసింది ఆమె. గుర్రుపెట్టే నిద్రపోతూనే ఉన్నాడు. ఆ నిద్రలో పలవరిస్తున్నాడు. 'రోజా...! రోజా...! ఇలా దగ్గరగారా....! ఇంకా దగ్గరగారా...! హాయిగా గడుపుదాం. ఈ ఆనందం ఎల్లకాలం ఉండాలి' అని. అన్నపూర్ణమ్మగారు ఆశ్చర్యపోయారు. 'ఎవరీ రోజా? ఆ అమ్మాయికి వీడికి ఏమిటి సంబంధం? తొమ్మిది కావస్తున్నా వీడు నిద్ర లేవలేదే మిటి?' అని ఆలోచిస్తూ నుదురుతాకి చూసారు వారు. మామూలుగానే ఉన్నాడు. ఒళ్ళు ఏమాత్రం వేడిగాలేదు విసుగు పడుతూ గట్టిగా తట్టి లేపారు. ఎంతో అవస్థపడిన తర్వాతగాని లేవలేదు. 'కాఫీ...కాఫీ' పలవరిస్తూన్నట్లుగా అంటూ లేచాడు ప్రభాకరం.
    'ఒరేయ్! తొమ్మిధైంది. త్వరగా లేచి స్నానం చెయ్యి. మావయ్య నీరజవచ్చారు. ఫలహారాలుచేసే టైమైనా లేవకపోతే ఎలా...? మామయ్య ఏమనుకొంటాడు?'
    ప్రభాకరానికి నిద్రమత్తు ఒదిలిపోయింది. గబగబ, పదినిముషాలలో నిత్యకృత్యాలు తీర్చుకున్నాడు, తల దించుకుని ఉంది. అసలు త్రాగడమే క్రొత్త. ఎంతో బలవంతంచేసి త్రాగించింది రోజా. దాంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    అంతా ఫలహారాలకు కూర్చున్నారు. కులాసా కబుర్లతో ఫలహారాలు పూర్తి చేశారు. తనకు నిద్రవస్తున్నదనిచెప్పి పైకివెళ్ళి మళ్ళీ పడుకున్నాడు ప్రభాకరం. అసలు విషయం ఒక్క శ్రీపతి గారికి మాత్రమే తెలుసు.
    'బావగారూ...! అబ్బాయి నలిగినట్లు కనుపిస్తున్నాడేం?'
    'అబ్బే...! ఏంలేదు. నిన్న స్నేహితులంతా కలిసి పిక్నిక్ కు వెళ్ళారు. బాగా అలసిపోయినట్లున్నాడు. రాత్రి ప్రొద్దు పోయి వచ్చాడు. అందువల్ల నిద్ర ఆపుకోలేకపోతున్నాడు.'
    'అలాగా...!'
    'సరేగాని బావా....! ఈ మధ్య బొత్తిగా ఉత్తరాలు వ్రాయడం లేదేమిటోయ్! అంత తీరికలేని పనులుంటున్నాయా...? కనీసం నీవు వస్తున్నట్లయినా ఉత్తరం ముక్క వ్రాయలేదు.'
    'నా ఆరోగ్యం సరీగా ఉండడం లేదు. పైగా రెండు మూడు సంవత్సరాలనుండి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. విపరీతంగా దగ్గు, తెమడ ఆయాసం వస్తూ వుంది. అక్కా డాక్టర్ల కు చూపిస్తే నలుగురు నాలుగు రకాలుగా చెప్పారు. ఇక లాభంలేదని ఊహించి ఆస్తులన్నీ అమ్మి రావలసినవి వసూలు చేసుకొని, యివ్వవలసినవి యిచ్చి ఆ ఊరిలో ఋణం తీర్చుకొని వచ్చేశాను. అమ్మాయి మెడిసిన్ చదువుతానని అనడంవల్ల అమ్మాయిని ఒదిలి ఒంటరిగా ఉండడం యిష్టంలేక, ఇక్కడయితే అటు నా వైద్యము, ఇటు అమ్మాయి చదువూ రెండూ కొనసాగుతాయని ఊహించివచ్చాను.
    'మంచిపని చేశావ్! మీ చెల్లిలికి యింట్లో సందడిగా ఉంటుంది. సరే...! ఎలాగూ నీతోనాకు సందడే!'
    'అదేమిటండీ బావగారూ...! మీ యింట్లో ఎంతకాలమని ఉంటాము?' మీకు తెలిసినంతలో ఒక చిన్న జింకలా అందంగా ఉండేది ఉంటే చూసి బేరంచెయ్యండీ కొంటాను.'
    'అదేమిటోయ్! నీకేమైనా   ! చాదస్తమా! మనం అంత పరాయి వాళ్ళమా? ఇది నీ యిల్లేఅనుకో? రేపు ప్రభాకరానికి నీరజకు వివాహం జరిగితే యీ యింట్లో వేరేవాళ్ళెవరుంటారిక? నీకా ఆడదిక్కులేదు. ఎలాగూ అమ్మాయి దగ్గరే ఉండాలి. ఈ మాత్రానికే వేరే యిల్లు కావాలంటావా? బాగానే ఉంది.' అని తన భార్యను పిలిచి 'చూశావటే మీ అన్నయ్య ఏమంటున్నాడో...?' అని అన్నపూర్ణమ్మ గారికి ఈ విషయం వివరంగా చెప్పాడు.
    'అదేమిటన్నయ్యా.... ఇక్కడ ఉండతలచుకున్న తర్వాత మా యింట్లో ఉండవలసిందే! నీరజకు చిన్నతనం. అది యింటిని ఎలా చక్కదిద్దుకో గలుగు తుంది? ఇదివరకంటే ఎలాగో గడిచిపోయింది. ఇదిపట్నం. ఎవరినీ నమడానికి కిన్ని వీలులేదు. అది కాలేజీకి వెడితే ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ ఒక్కడినే యింట్లో ఉంటావా? వారైనా నీకు మేనబావ గారేకదా!'
    'అది సరేనమ్మా.....! ఇంతో, అంతో మీకు పెట్టవలసిన వాళ్ళం. మీ యింట్లో ఉండడం ఏం బాగుంటుందని అనుమానిస్తున్నాను.'
    'వోస్....! నీ అనుమానం చట్టుబండలుగాను. ఇంతకూ విషయం యిదా? సరేలే! రేపు కట్నంలో యివన్నీ లెక్కలు చూసి యిద్ధువుగాని మారు మాట్లాడకుండా యిక్కడే ఉండిపో. ఒకరికి ఒకరం అండగా ఉంటాం. పైగా రేపు వెళ్ళి కావలసిన వారిద్దరూ ఒకరిని మరొకరు అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.' నవ్వుతూ అన్నారు శ్రీపతి గారు. అందరూ వారి నవ్వులో శ్రుతి కలిపారు. నీరజ తన విషయం ప్రస్తావనకు రావడంతో సిగ్గుతో తలఒంచుకుంది.
    'సరే...! ఆలోచించుకొని చెబుతాను. ప్రభాకరంలో ఏమైనా మార్పుఒచ్చిందా?'
    'ఏమో అన్నయ్యా....! బాగానే ఉంటున్నాడు.'
    'అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు విశ్రాంతి తీసుకోండి' అన్నారు శ్రీపతిగారు.
    ఆ తర్వాత శ్రీపతిగారు పనిమీద తమ కారులో వెళ్ళిపోయారు. అన్నపూర్ణమ్మ గారు వంట ఏర్పాటు చేయడానికి వెళ్ళారు.

                           *    *    *

                                  5

    శాంత, శారదలు యిద్దరూ లక్ష్మయ్యగారి తోటలో పచార్లు చేస్తున్నారు. మామిళ్ళు కాయలతో నిండుగా ఉన్నాయి. ఇద్దరూ తోటకు వచ్చి తినగలిగినన్ని తీపి మామిడికాయలు తిని హాయిగా చల్లగాలికి తిరుగుతున్నారు.
    శాంత శారదలిద్దరూ ఊరు చేసేసరికి పదకొండైంది. రాగానే భోజనాలు చేసి విశ్రాంతిగా పడుకున్నారు. నిద్ర లేచేసరికి సాయంత్రం నాలుగైంది. పార్వతమ్మ వీరిద్దరినీ ఫలహారానికి పిలిచింది. ముఖాలు కడుక్కొని ఫలహారాలు చేసేసరికి ఐధైంది. రామం ఏదో అర్జంటుపని ఉండి పొరుగూరు వెళ్ళాడు. శాంతకు రాగానే రామం కనపడక పోవడంతో ఆశాభంగం కలిగింది. అయినా తను వస్తున్నట్లు ముందుగా తెలియజేయక పోవడం తన తప్పే కాబట్టి ఊరుకుంది. ఇంట్లో పొద్దుపోవడం లేదని తోటకు బయలు దేరారు. ఎండాకాలం కావడంవల్ల సాయంత్రం ఐదైనా ఎండ చురుకు తగ్గలేదు.
    తోటంతా శారదకు చూపిన తర్వాత యిద్దరూ పంప్ సెట్ వద్దకు వచ్చారు. లక్ష్మయ్యగారి పెద్దపాలేరు పుల్లయ్య ఆ తోటలోనే కాపురం ఉంటాడు. అతను ఉండడానికి అక్కడ ఒకపాక ఉంది. వీరిద్దరూ అటురావడం గమనించి పాకలోనుండి మంచం తీసుకువచ్చి వేశాడు. రామం పాలేరు పుల్లయ్యను 'మామా' అంటాడు కాబట్టి శాంత అతనిని బాబాయి అని పిలుస్తుంది. ఫైవ్ హార్సు పవరు మోటారునుండి మూడించిల పైపు ద్వారా నీరు వేగంగా చిమ్ముతూ ఎదురుగా ఉన్న నీటితొట్టెలో పడి అక్కడినుండి కాలవద్వారా ప్రవహిస్తూ ఉంది. ఆ నీటికి తన చేతిని అడ్డంపెడుతూ ఆ నీటి వేగాన్ని పరీక్షచేస్తూ ఉంది శారద. శాంత పాలేరు వేసిన మంచంమీద కూర్చొని ఏదో ఆలోచనలో పడింది. మెల్లిగా శారద నీరు పారుతూన్న ఆ కాలవ వెంబడే నడుస్తూ ఆ నీరు ఏ, ఏ, మొక్కలను తడుపుతూ ఉందో చూడాలని ఆ కాలవ చివరివరకూ దూరంగా వెళ్ళిపోయింది. తోటకు ఆనుకొని ఉన్న రెండెకరాల స్థలంలో అన్నిరకాల కూరగాయమొక్కలు ఉన్నాయి. కొన్ని పూతమీద, మారికొన్ని కాయలతో, వేరే కొన్ని చిన్నచిన్న మొక్కలుగా ఉన్నాయి. ఆ విధంగా సాగు చేయిస్తున్న రామం తెలివితేటలకు ఆశ్చర్య పోయింది శారద. తయారుగా ఉన్న కాయలు కోసి అమ్మేసరికి పూతమీద ఉన్న చెట్లు కాపునిస్తాయి. పూతమీద ఉన్న చెట్టు కాపు ఉడిగిపోయే సరికి చిన్న చిన్న మొక్కలు కాపు నందుకుంటాయి. ఆ విధంగా పంట క్రమం తప్పకుండా చేతికి వస్తుంది. ఈ తోటను చూసిన శారదకు ప్రభాకరం గుర్తుకు వచ్చాడు. ఇక్కడ ఒక వ్యక్తి ఉత్పత్తి చేయడంలో తన శక్తిని యుక్తిని ప్రదర్శిస్తూ ఉంటే అక్కడ అతనుచేసే అరచకపు పనులు స్ఫురణకు వచ్చాయి. విద్యార్ధులు స్ట్రైక్ చేసి నప్పుడు ప్రభాకరం ముఠా నాయకుడై గురితప్పకుండా వరుసగా ఎన్ని వీధిలైట్లను పగులగొట్టేవాడో, తనను గురించి తమ ఛాతి విరుచుకొని చెప్పుకోవడం గుర్తుకువచ్చి చిరునవ్వు నవ్వుకుంది శారద, సృష్టిలో ఒకప్రక్క చెడును ప్రోత్సహించేవారు, మరొకప్రక్క మంచికి దోహదం చేసేవాళ్ళు. ఆ రెండు తెగలవారు ఉండడంవల్లనే మంచి-చెడు అనే పదాలకు అర్ధం తెలుస్తుంది. ఈవిధంగా ఆలోచిస్తూ శారద మళ్ళీ శాంత కూర్చున్న వైపు నడక ప్రారంభించింది. మునిమాపువేళ ఎండ మామిడికొమ్మల సందులలో నుండి చీలికలై తోటలోపలికి చొచ్చుకొని వస్తూ ఉంది. చల్లనిగాలి ప్రారంభమైంది. ఆ తోటలో ఆ సాయం సమయంలో శారద ఊహలు ఏవేవో లోకాలలో విహరించ సాగాయి. ఆ విధంగా పరధ్యానంతో నడుస్తూన్న శారదను ఎవరిదో క్రొత్త కంఠం వినిపించసాగింది. అక్కడే నిలుచుండి పోయింది శారద. ఆమె నిల్చున్న చోటికి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలాగే అక్కడఉన్న మామిడి చెట్లు మొదట్లో కూర్చొని ఆ మాటలు వినసాగింది...
    'పుల్లయ్య మామా...! పుల్లయ్య మామా ...!' ఎవరూ పలకలేదు. 'ఎక్కడికి వెళ్ళాడబ్బా! మోటారు ఆన్ చేసి ఉంది.' అని అంటూ శాంత కూర్చున్న మంచం ముందుకు వచ్చాడు. ఆ వచ్చినది ఎవరో ఊహించుకుంది శారద. అక్కడికి వెళ్ళడం బాగుండదని గ్రహించి తను కూర్చున్న చోటునుండే గమనించసాగింది. మాటలు వినిపిస్తాయి. జరిగేది కనుపిస్తుంది. కాని వారికిమాత్రం తను కనుపించదు. కాని వారికిమాత్రం తను కనుపించదు.
    శాంతను మంచంమీద చూసిన రామం ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో క్రొత్త వెలుగు వచ్చింది.
    'వోహ్! నీవా శాంతా ....? ఎప్పుడొచ్చావ్ .... సిగ్నల్ లేని ప్యాసింజరులాగా! ఇంటికి వెళ్ళావా? రావడం రావడం ఈ తోటలోకే వచ్చావా? నీవు వచ్చి నట్లు నా కెవ్వరూ చెప్పనేలేదే ...? ఇంతకూ ఉత్తరం వ్రాయకుండానే వచ్చావేం? ఉత్తర హిందూస్తాన్ ప్రాంతాలకు ఎక్స్ కర్సన్ కు వెడుతూన్నట్లు వ్రాశావు. అన్నీ సక్రమంగా చూశావా? జీవితంలో మళ్ళీ యిటువంటి అవకాశం లభించదు. ఆ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చావు కద! నా కోసం ఏం తెచ్చావ్? శాంతా ...! అయామ్ సారీ....! నాకేమీ అక్కరలేదు, నీవు తిరిగొచ్చావ్....! అంతే చాలు. అదిసరే....! ఒక్కదానివీ ఈ తోటలో యిలా ఒంటరిగా కూర్చున్నావేం....?' గబగబ ప్రశ్నల వర్షం కురిపించాడు రామం.

                        
    'నీవు వస్తావని నిరీక్షిస్తూ....!' అని రామాన్ని ప్రేమగా చూస్తూ 'బావా....! అన్ని ప్రశ్నలూ అయినట్లేనా? ఇంకే మైనా ఉన్నాయా? ఒక్కసారే అడుగు. వాటన్నింటికి సమాధానాలు ఆలోచించి నే వెళ్ళేలోగా చెబుతాను. ఏం....?' అని కొంటెగా రామాన్ని చూస్తూ అంది శాంత.
    'బస్తీనుండి దిగిన చిలుక పలుకులు బాగా పలుకుతో ఉండే....!' అని చిరునవ్వుతో శాంత ముఖంలోకి చూస్తూ 'అది సరేగాని పరీక్షలు బాగా వ్రాశారా?' ముఖంలో గంభీరతను నింపుకుంటూ అన్నాడు.
    'బాగానే వ్రాశాను బావా.....తప్పకుండా ప్యాసౌతాను. ఎంతైనా నీ సలహాలు ఊరికే పోతాయా....?'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS