9
రాయుడు గారి ఊరు వెంకట పాలెం. శ్యామసుందరి అయన ఏకైక పుత్రిక. హైస్కూల్లో చదువుతున్నది. లావుగా, పొట్టిగా , గుమ్మటం లా ఉంటుంది. పొట్టి వాళ్ళకు పుట్టెడు బుద్దులన్నట్లుగా శ్యామ సుందరి కి ఆలోచనలు జాస్తి. సురేంద్ర బావ తనను ఎప్పుడూ 'దిబ్బిసకుక్క' అంటాడు. తానెప్పుడూ సురేంద్ర ను 'మతిలేని బావ' అంటుంది. అట్లా అన్నప్పుడు సురేంద్ర తన జడ పట్టుకు లాగి వీపు మీద నాలుగు గుద్దులు గుడ్డివాడు. 'ఇంకెప్పుడూ అనను. నిన్నెప్పుడూ మతి లేని బావ అని అనను. నువ్వు మతి ఉన్న బావవే" అనేది. అవన్నీ తను ఎనిమిది, పదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడు జరిగిన చిన్ననాటి ముచ్చట్లు. ఇప్పుడు తనకు పదమూడో ఏడు. అవన్నీ తలుచుకుంటూ కూర్చుంది శ్యామ సుందరి.
సురేంద్ర బావ గుంటూరు లో ఇంటరు చదువుతున్నాడు. తానింకా పొట్టి బుడంకాయలా ఉన్నా బావ కొంచెం పొడుగు ఎదిగి ఉండవచ్చు. బావ పక్కన తను నిల్చుంటే బావ నడుము వరకూ వస్తుంది. నిజంగా తను అంత పొట్టిగా ఉంటె అసహ్యంగా నే ఉంది. కాని భగవంతుడు చేసిన వంక కు తనేం చేస్తుంది! ఇంకా నాలుగేళ్ళు పొతే తానూ కాస్త ఎదగ వచ్చునేమో? ఇట్లా ఆలోచించుకుంటూ తన గదిలో కూర్చుంది శ్యామ సుందరి.
రాయుడు గారు మేడ మీద ఎవరితోనో ఎలక్షన్ల విషయాలూ అభ్యర్ధుల విషయాలూ మాట్లాడుతున్నాడు.
సంక్రాంతి పండుగ ఇంకా రెండు రోజులుంది.
"అమ్మాయ్, సుందరీ ....."అని పిలిచింది వంటింట్లోంచి తల్లి సుభద్రమ్మ.
శ్యామ సుందరి కూర్చున్న చోటు నుంచి లేవబోయింది. అప్పటికప్పుడే తన పరిస్థితి కి తానే సిగ్గుపడ్డది. ఎందుకో భయపడ్డది. అభిమానంతో తనలో తను నవ్వుకుంది. ఏమిటో అనిపించింది.
"అమ్మా, ఒక్కసారి నువ్వే ఇట్లా ఈ గది లోకి రావే. తొందరగా రావే, ఓ అమ్మా!' అంటూ కేకపెట్టింది.
ఏం కొంప మునిగిందో నని తల్లి గదిలోకి వచ్చింది. శ్యామసుందరి సిగ్గుతో నవ్వుతూ, నిల్చుంది. తల్లి ఆ పరిస్థితి చూసి, "అయిందీ! అనుకుంటూనే ఉన్నా ఎప్పుడో ఆ కాస్త మాటా దక్కిస్తావని. సరే. అక్కడే కూర్చో. నే వెళ్లి రంగనాయకమ్మ గారిని, వెంకట లక్షమ్మ గార్ని పిల్చుకోస్తా " అంటూనే ఆవిడ పోరుగిళ్ళ కు పనిమనిషి ని పంపింది. పాలేరు చేత మేడ మీద ఉన్న రాయుడు గారికి కబురు చేసింది. అయన వచ్చి సంగతి విని నవ్వుకున్నాడు.
"సరే, కానీ. ఏర్పాట్లన్నీ చేయించు." అన్నాడు.
"అయితే మీ చెల్లెలికి కబురు చెయ్యండి. పెద్దది. ఆవిడా పచ్చి వేడుకలు జరిపిస్తుంది. బంతి పెట్టించి పోతారు" అన్నది సుభద్రమ్మ.
రాయుడు గారు ఉత్తరం వ్రాసి పాలేరు చేతికిచ్చి పంపించారు. అక్కడికి రామన్న పాలెం పదిమైళ్ళు. బస్సు మీద వెళ్ళాలి.
పోరుగమ్మలు రంగనాయకమ్మ, వెంకటలక్షమ్మ వచ్చి దడియం పరిచారు. మేళం పెట్టారు. ఆ రోజు వేడుకలు చక్కగా జరిగి పోయినాయి. మర్నాడే వరలక్షమ్మ రామన్న పాలెం నుంచి వచ్చింది.
శ్యామసుందరి ని చూసి "ఓసి, భడవా! అప్పుడే చిమ్మిలి పెట్టించావ్?' అన్నది నవ్వుతూనే.
మూడు రోజులూ వేడుకలూ , పేరంటా లూ జరిగినాయి. నాలుగో రోజున బంతికి అందరినీ పిలిచి వేడుకగా చేశారు. వరలక్ష్మమ్మ , శ్యామ సుందరి కి వంద రూపాయల ఖరీదు గల సిల్కు చీర పట్టుకు వచ్చింది. ఆ చీరనే కట్టుకోమని శ్యామ సుందరి చేత వరలక్షమ్మ కు దణ్ణం పెట్టించింది తల్లి.
మర్నాడే వెళతా నన్నది వరలక్షమ్మ . రాయుడు గారు చేల్లిలిని యింకా రెండు రోజులు ఉండమన్నారు.
"వస్తూనే ఉంటాగదురా? రాకపోకలు ఎలాగూ తప్పవు. ఏదో పెద్దవాళ్ళం నలుగురం ఉండగానే ఆ మూడు ముళ్ళూ వేయించెయ్యి అన్నది.
"అట్లాగే . ముందు మా పెళ్ళిళ్ళు కానీ. బావగారు యింకా ప్రచారానికి బయల్దేరినట్లు లేదు.'
'పండుగ వెళ్ళగానే ప్రారంభిస్తారు. ఏం ఎలక్షన్లో , ఏం ఒట్లో! అదంతా తలుచుకుంటే మరో ప్రపంచం లో ఉన్నట్లుంటుంది. ఒక్క మాట మాత్రం మారిచి పోకు."
"ఏమిటది?"
"సిద్దాంత రీత్యా , రాజకీయాల రీత్యా మీ బావమరుదులకు చుక్కెదురే. ఆ ప్రమేయాలు మనస్సులో పెట్టుకుని బంధుత్వం కలుపు కోవటం మానవద్దు."
"అదేం లేదే. మీరెప్పుడూ మొగ్గుతానంటే అప్పుడు సిద్దమే. నువ్వన్నట్లుగా నాకా పట్టింపు లేదు. ఇంతకీ సురేంద్ర ఏమన్నాడు?"
"ఏమనటానికేముంది రా? మేనరికం కాదని వాడు మాత్రం ఎట్లా అంటాడు? వాడి మనస్తత్వం నీకూ తెలుసు. ఇన్ని ఊళ్లూ తిరుగుతావు కదా. ఒక్కసారి గుంటూర్లో ఉన్న వాణ్ణి కూడా కలిసి వాడి చేత గూడా సరే ననిపించుకు రారాదూ?"
"చూశావుటే , సుభద్రా, అప్పుడే మా చెల్లెమ్మ వియ్యపు రాలి బెట్టుసరి చేస్తున్నది? అట్లా ఉండాలి. మగపిల్లల్ని కన్నతల్లి అంటే" అన్నాడు ఎగతాళి గా.
అంతా నవ్వుకున్నారు.
"సరే. నువ్వన్నట్లు గానే వారం రోజుల్లో గుంటూరు వెళ్లి వాడి చేతా సరే ననిపించుకుంటా. సరేనా?" అన్నాడు రాయుడు గారు.
వరలక్షమ్మ రామన్న పాలెం వెళ్ళిపోయింది.
* * * *
వారం రోజులు పోయాక రాయుడు గారు గుంటూరు వెళ్ళాడు. తన పనులన్నీ అయ్యాక సురేంద్ర గదికి వెళ్ళాడు. గదిలో సురేంద్ర ఒక్కడే ఉన్నాడు. మేనమామ ను చూడగానే ఎందుకో కొంచెం కంగారు కలిగింది సురేంద్ర కు. కొంచెం తేరుకుని "రండి మావయ్యా. ఎప్పుడొచ్చారు? అంతా కులాసాగా ఉన్నారా? ఓట్ల కోసం ప్రచారం ప్రారంభించారా?' అని కుశల ప్రశ్నలు వేశాడు సురేంద్ర . మేనమామ పెళ్లి విషయం మాట్లాడటానికే వచ్చాడని సందేహం కలిగింది.
"ఆ ఏదో! సరే. ఆ గొడవలు ఎప్పుడూ ఉంటయ్యి. ఒక్క విషయం నీతో మాట్లాడధామని వచ్చానోయ్" అన్నాడు . సురేంద్ర గుండె గతుక్కుమన్నది. ఏమిటన్నట్లు గా చూశాడు.
"ఏముందోయ్! శ్యామ సుందరి పెద్ద పిల్ల యింది. మొన్న నాలుగు రోజులూ మీ అమ్మ కూడా వచ్చి ఉండి వెళ్ళింది. పెద్ద వాళ్ళం సరే ననుకున్నాం. ఏదో పెద్దవాళ్ళం కులాసాగా తిరుగుతూ ఉండగానే ఆ మూడు మూళ్ళూ వేయిద్దామని మా ఆలోచన. మరి నీ ఉద్దేశ్యం చెప్పిందీ నేను చేసేదేం లేదు కదా? నీ ఉద్దేశ్యం తెలుసుకుందా మనే వచ్చాను" అన్నాడు రాయుడు గారు చుట్ట పొగ వదులుతూ.
"అప్పుడే శ్యామసుందరి చిమ్మిలి తొక్కించిందే!" అన్నాడు సురేంద్ర.
"ఏ వయస్సు లో ముచ్చట్లు ఆ వయస్సులో జరపాలిగా? కాలం మారినా , ఆనవాయి తీలూ, వేడుకలూ మారవు. ఇంతకీ నీ అభిప్రాయం?" అన్నాడు మళ్ళీ కన్నార్పకుండా సురేంద్ర వైపు చూస్తూ.
"మీ అందరి ఇష్టమే నా ఇష్టమా, కాకపొతే నా అభిప్రాయం ఒకటుంది. అది సర్వత్రా అందరికీ నచ్చిన విషయమే" అన్నాడు సురేంద్ర.
ఇంతలో రమేష్ కూడా వచ్చాడు. "నమస్కారమండి " అంటూ ఆప్యాయంగా పలకరించాడు రమేష్.
ఇద్దరూ నాలుగయిదు నిమిషాలు మాట్లాడుకున్నారు. తరవాత మళ్ళీ సురేంద్ర వైపు చూశాడు రాయుడు గారు.
"శ్యామ సుందర్నీ చేసుకునేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. కాని ఇప్పుడు నా చదువు పూర్తీ కాలేదు. ఇంత చిన్న వయస్సులో, చదువు కునే రోజుల్లో పెళ్ళెందుకు చెప్పు మామయ్యా. కాలేజీ చదువు పూర్తయి ఏదయినా ఉద్యోగం లో ప్రవేశించిన తరువాత పెళ్లి చేసుకుంటే బావుంటుంద ని నా ఉద్దేశం. అడిగావు కాబట్టి చెప్పాను." అన్నాడు సురేంద్ర.
రాయుడు గారికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయిందిశ్యామసుందరి ని చేసుకోవటానికి ఇష్టమే. కాని చదువు పూర్తీ కావాలి. చదువు పూర్తీ కావాలంటే ఇంకా నాలుగేళ్ళు ఆగాలి. నాలుగేళ్ల అనంతారం మనస్సు ఈతీరునే ఉంటుందా? అప్పటికి ఇంకా పెద్దవాడయి , అనేక అనుభవాలనూ, అనుభూతులనూ ఏర్పరచు కొని అప్పుడు శ్యామ సుందరిని చేసుకోనంటే? అప్పటి పరిస్థితులను బట్టి మనుష్యుల ప్రవర్తన లో, భావాల్లో, ఏ మార్పులు వస్తాయో? రాయుడు గారు పేరు మోసిన రాజకీయ వేత్త. రాజకీయాల్లో అయన ఎలాంటి వారినయినా చెప్పి ఒప్పించగల దిట్ట. ఎన్నికల సమావేశాల్లో గాని, తతిమ్మా రాజకీయాల్లో గాని అయన పేరెన్నిక గలవాడు. ఓటమి అనేది ఎరుగడు. అలాంటి రాయుడు గారు కూతురు పెళ్లి విషయం లో మేనల్లుణ్ణి ఒప్పించ లేకపోయాడంటే అయన మనస్సు కు ఆయనకే చిన్నతనం అనిపించింది.
తన అనుమానాన్ని విప్పి చెప్పాడు రాయుడు గారు. సురేంద్ర ఏమయినా సరే ఇప్పుడు పెళ్లి చేసుకోననీ, నాలుగేళ్ళు పోయాక ఆలోచిస్తా నని గట్టిగా చెప్పేశాడు. ఆయనకు రమేష్ మీద అనుమానం కలిగింది. రమేష్ సహవాసం చేతనే సురేంద్ర ఇట్లా మాట్లాడు తున్నాడా అనిపించింది. ఇది తప్పక స్నేహితుని పన్నాగమే నని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆరునెల్ల కే సురేంద్ర ఇంత మారితే నాలుగేళ్ళు పొతే ఇంకెంత మారుతాడు? అంచనా వేసుకుంటే సురేంద్ర నాలుగేళ్ల తరువాత తమ మాట వింటాడని ఆయనకు తోచలేదు. ఏదో ఒక నిశ్చయానికి వచ్చాడాయన.
"మీదేవూరోయ్?' అన్నాడు రమేష్ వైపు చూసి రాయుడు గారు.
"ప్రసాద పురం."
"మీ నాన్నగారి పేరు?"
"నాగభూషణం గారు."
"నాగభూషణం గారి కొడుకువా? మీ అన్నయ్యలు అంతా తెగతెంపులు చేసుకు పోయినట్లేగా?'
"అవునండీ."
"మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా? చాలా పెద్ద మనిషి. నిజాయితీ పరుడు."
రమేష్ సురేంద్ర వైపు చూచాడు. సురేంద్ర నవ్వు ముఖంతో రమేష్ వైపు చూశాడు.
రాయుడు గారు చుట్ట కాలుస్తూ వారిద్దరినీ గమనించక పోలేదు.
* * * *
