"ఇంతకీ మీరు హీరో వేషం వెయ్యలేదన్న మాట!' అంటూ విస్తుబోయింది గీత.
మోహన్ క్రాఫింగ్ లోకి వ్రేళ్ళు దూర్చి అన్నాడు.
"ఇస్తే వేసే వాడినే కాని వాళ్ళు ఇవ్వలేదు... ఒవేశం మంటూ దొరికితే చరచరా పైకి ఎక్కిపోవచ్చు. చిన్న వేషాలతో ప్రవేశించి ఇప్పుడు పేరు మోసిన తారలై కూర్చున వాళ్ళు అటు ఉత్తరాది తారల్లోనూ, ఇటు దక్షిణాది తారల్లోనూ కన్పిస్తున్నారు. అందుకే ఏదో వేషమని వప్పుకున్నాను. ఇంతకీ ఆసీను సినిమాలో ఉంచనే లేదు... కాళ్ళరిగేలా తిరిగినా ఆ సినిమా వాళ్ళు నా డబ్బు నాకు విదల్చనూ లేదు.... నాకో పంగనామం పెట్టి పంపించేశారు."
గీత సానుభూతి చూపిస్తూ అంది.
"నాటకానుభవం అన్నారు-- నాటకాల్లో వేసేవారా?"
"కొండంత అనుభవముంది. ఒకసారి మా స్కూలు వార్షి కొత్సవానికి డ్రామా వేశాం. అందులో నేను యువరాజు కు నమ్మిన బంటును. అంటే మరేం లేదు -- యువరాజు పిలిచినప్పుడల్లా 'హుజూర్!' అంటూ హాజరు కావాలి. స్టేజి ఎక్కేటప్పటికి నాకు ముచ్చెమటలు పోశాయి సుమండీ., ప్రేక్షకులను చూసేసరికి నా ప్రాణాలే యెగిరి పోయాయి. ... ఆ తర్వాత మళ్ళా ప్రాణాలు వచ్చేసరికి నేను గ్రీన్ రూమ్ లో పడుకుని ఉన్నాను. ఏమయ్యిందట, నేను స్టేజి మీద మూర్చ పోయానట. యువరాజు వేషం వేసిన వాడు తెలివైన వాడు... వాడు వెంటనే "ఎవరక్కడ?' అని పిలిచే సరికి తేర పక్క నుంచి ప్రామ్ద్ చేస్తున్న ఇద్దరు పరిగెత్తుకుని వెళ్ళారట. 'ఈ మూర్చరోగి సేవలు నాకింకా వలదు. వేరొకరిని పిలువనంపుదు." అన్నాడట యువరాజు. దానితో వచ్చిన ఇద్దరూ నన్ను మోసుకెళ్ళి గ్రీన్ రూమ్ లో పడుకోబెట్టి ముఖం మీదనీళ్ళు చల్లి నానా సేవలు చేశారట. ఇంకొకడు వెళ్ళి నా వేషం వేశాదట.... మొత్తానికి నాటకం ఎంతో బాగున్నదట. నేను మూర్చ పోవటం కూడా నాటకం లో సీనే అనుకున్నారట అంతా.... ఆ తర్వాత నేను వేయాలనుకున్నా ఎవరూ నాకు వేషం ఇచ్చేవారు కాదు...."
గీత నవ్వలేక ఉక్కిరిబిక్కిరైంది.
"ఈ మధ్య ఒక పేపర్లో చదివాను. ఎక్కడో ఒక మీటింగు జరిగిందిట. అందులో అంతా ఎంతో బాగా ఉపన్యాసాలిచ్చారట. అంతవరకు మీటింగు చాలా చక్కగా జరిగిందిట. సభికులంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. చివరకు వందన సమర్పణ వంతు వచ్చిందట. కార్యదర్శి స్టేజి ఎక్కి దడదడ లాడుతూ, చెమటలు కక్కుతూ నోట మాటరాక నిలబడేసరికి సభికుల మనస్సు అదోలా అయిపోయిందిట. అలా కూడా నిలబడకుండా అతడు అమాంతం తెలివి తప్పి పడిపోయాడట. ఆ తర్వాత నలుగురూ వచ్చి అతన్ని ఇంటికి మోసుకు వెళ్ళారట... పాపం! సభకు వచ్చిన వాళ్ళంతా సరదా లేకుండా, దిగులుగా ఇంటికి కెళ్ళారట...."
"మా నాటకానికి మీ మీటింగ్ కి పోలికేమిటండి? మా నాటకం చూసి అంతా ఒకటే చప్పట్లట. చిన్నతనం కాబట్టి అప్పుడలా భయపడ్డాను కాని ఇప్పుడు భయానికి మనమంటే భయం!"
'చివరకు నాటకంలో కూడా మీరు హీరో వేషానికి పనికి రాకపోయేరు! మరి సినిమాల్లో ఎవరిస్తారు?"
"అందంగా లేనంటారా? పోనియండి! కామేడియన్ అవుతాను. అందంగా ఉన్నానంటారా ట్రాజీడియన్ అనగా హీరో అవుతాను.... ఏమైనా లక్షలకు లక్షలు కళ్ళ చూడొచ్చు....."
సినిమా ప్రారంభమయింది. అరగంట అయ్యే టప్పటికి గీత తలనొప్పి అనుకున్నది కణతలు నొక్కుకుంటూ.
'అమృతాంజనం కావాలా?"
జవాబు రాక ముందే జేబులో చెయ్యి పెట్టాడు మోహన్.
గీత నవ్వింది.
"ఎప్పుడూ మందు వెంట తెచ్చుకుంటారా?"
'సినిమాలు కెళ్ళేటప్పుడు తప్పకుండా తెచ్చుకుంటాను. లేకపోతె డబ్బిచ్చుకుని సగంలో ఇంటి కెళ్ళి పోవటానికి నాకు మనస్కరించదు సుమండీ! మందు రాసుకుంటూ నైనా చివరి కంటా సినిమా చూడాల్సిందే!"
ఇంటర్వెల్ లో మోహన్ పాటల పుస్తకం కొంటానన్నాడు.
"ఎందుకు దండగ?మా నాన్నగారు సినిమా పాటలు పాడుకోనివ్వరు...." అని వరించింది గీత.
'చూడండి! మీ నాన్నగారు ఏవి కృతులో ఏవి సినిమా పాటలో అడిగి మరీ దెబ్బలాడతారా?"
"పోదురూ మీరు మరీను..... సంగీతానికి సినిమా పాటకు తేడా తెలియదేమిటి?"
సడన్ గా మోహన్ కు జ్ఞాపకం వచ్చింది. ఇందాక సినిమా లో హీరియిన్ దేవుడి ముందు కూర్చుని అరగంట సేపు పాటతో తన పాట్లు మొరపెట్టుకున్నది. ఆ పాట సంగీతమే అనుకున్నాడు తను....
'ఇందాక హీరియిన్ దేవుడి ముందు పాడిన పాట సంగీతం కాదా?"
"దాన్ని రాగమాలిక అంటారు లెండి. సంగీత రాగాలలో సినిమా పాటకు వరస పెట్టారు.... అంతే కాని అది సంగీతం ఎందుకవుతుంది?"
మోహన్ కేం బోధపడక బుర్ర గోక్కున్నాడు.
"సంగీతం కాకపోతే కాకపోయింది మీ నాన్నగారి కేం తెలుస్తుంది? ఇలాంటి పాట పాడేసుకుందురూ?" అంటూ సలహా ఇచ్చాడు.
గీత పెదవి విరిచింది.
"నాకు ఎక్కువగా రాక్....ఎన్ -- రోల్ పాట లంటే ఇష్టం..."
మోహన్ ఆలోచిస్తున్నట్టుగా ముఖం పెట్టి "మోడరన్ ఆర్ట్ లా మోడరన్ సంగీతమని చెప్తే మీ నాన్నగారు వప్పుకోరా?"
"ఎంత మాత్రం వప్పుకోరండి.....!సినిమా పాటల నిండా బూతులుంటాయిట....!" అంది గీత నిస్పృహగా.
"అందరూ అలాగే అంటారు...."
"మంచి సాక్ష్యమే లెండి! ఆ మాట కొస్తే వర్ణాలు, కృతుల్లో ఉండవా? వాటి అర్ధాలు చూశారంటే అవి మరీని....." అంది గీత కోపగించుకుంటూ.
'అయితే అయ్యిండోచ్చు... కాని ఈ ముక్కకి, ఆ ముక్కకి మధ్య గంటసేపు రాగాలు తీయటం ఉంటుంది కాబట్టి ఆ అర్ధం ఎవరికీ అంతు పట్టదు. ఆ ముక్కా, ఈ ముక్కా అతుకేసుకుని అర్ధం చేసుకునే వోపిక ఎవరికి?"
"సినిమా పాటల్లో మాత్రం మంచివి లేవా ఏమిటండి?"
"నేనూ మీ పక్షమే.... అయితే మన మిద్దరం ఏకమై చెప్పినా మీ నాన్నగారు వింటారనే నమ్మకం నాకు లేదు....."
గీత నిట్టూర్చింది.,...
ఆట మళ్ళా ప్రారంభమైంది.....
అట పూర్తయ్యాక గీత, మోహన్ కలిసి బైటి కోస్తున్నప్పుడు " మీ సినీ రధం" ఇవ్వండి. చదివి ఇచ్చేస్తాను... నెలనెలా నాకు తెచ్చి పెడతారుగా?' అంది గీత.
మోహన్ పొట్లం జేబులో నుంచి 'సినీ రధం' బైటకు లాగి గీత చేతిలో పెట్టాడు. గుంపు తగ్గేంత వరకు కాస్సేపు వరండా లో నిలబడదామంది గీత. సరేనన్నాడు మోహన్....
గీత ఉన్నట్టుండి "కళ?" అంటూ కంగారు పడింది.
"కళా?" అంటూ అయోమయంగా చూశాడు మోహన్.
"అక్కయ్యండి! అది మరో సినిమాకి వెళ్తానని ఈ సినిమా కొచ్చింది."
"బహుశా టిక్కెట్లు దొరికి ఉండవు...." అంటూ కారణం వివరించాడు మోహన్.
"కళా , నేను ఉత్తర దృవం, దక్షిణ దృవం.... అందుకే మేమిద్దరం ఎక్కడికీ కలిసి వెళ్ళం. అది మరో సినిమాకు వెళ్తానంటే నేనీ సినిమా కొచ్చాను.... తీరా చూస్తె అదీ ఇక్కడికే వచ్చింది....!"
"వస్తే మీ సొమ్మేం పోయింది? మీపాటికి మీరు చూశారు. ఆవిడ పాటికి ఆవిడా చూసి వెళ్తున్నది...."
"మనల్ని చూసిందేమో?" అంటూ గీత దిగులు పడింది.
మోహన్ హుషారుగా ఈల వేశాడు.
'చూస్తె మరీ మంచిది....!"
"మంచిదా?' అంటూ చురచురా చూసింది గీత.
"మంచిది కాకపొతే చెడ్డది..... మీ ఇష్టం.... ఏది అనమంటే అదే అంటాను.... నాదెం పోయింది? మీ వీధి వరకూ వచ్చి దిగబెట్ట మంటారా?"
"మీకు పుణ్యం ఉంటుంది. నా వెనకాతల రాకండి.... ట్రాన్సి స్టర్ కోసం ఎప్పుడొస్తారు? నాన్నగారు పగలు పదింటికి వెళ్తే రాత్రి ఎనిమిదింటికి వరకు ఇల్లు చేరుకోరు ఒక్క ఆదివారం మినహాయించి. ఆలోగా మీరు నిరపాయంగా రావచ్చు...." అని వేల్లిపోయింది గీత 'సినీ రధం ' చేత పుచ్చుకుని.
* * * *
