Previous Page Next Page 
పధ విహీన పేజి 11


    "లేదు తమ్ముడూ, కులటగా జీవించే కన్న శీలవతి గా చనిపోవటం మంచిది" అని నిట్టూర్చింది విజయ. కాని ఆ మాటలు తను మనః పూర్వకంగా అన్నవి కావని తెలుసుకుని తనలో తనే ఆశ్చర్య పోయింది. ఒకప్పుడు వీటిని త్రికరణ శుద్దిగా నమ్మి అనేది తను. తనలో కాలం ఏదో లోమోగ్గును యేర్పరచ లేదు గద?
    "నేరానికి, క్షమా, పొరపాటుకు సానుభూతీ ఇవ్వని వాడు మానవత్వానికి అర్ధమే లేదు అక్కగారూ. ఈ విషయంలో మీరు పొరపాటు పడుతున్నారు."
    "పొరపాటు కాదు తమ్ముడూ. ఒకవేళ మరో పధం ఏదయినా ఉన్నా అది దుర్గమమే అవుతుంది. అశో సహత అయిన ఆడదానికి అది వాంఛనీయమూ కాదు. అన్నిటి కన్న సుఖమైనది మృత్యువే" అని తేల్చి పారేసింది విజయ.
    జగన్నాధానికి ఎందుకో అపరిమితమైన భయం ప్రారంభమయింది. చిట్టి కూడా ఇదే ఉద్దేశ్యంతో ఉంటె...పకోడీల ముసిలిది కునికింకిదంటే ఆత్మహత్య చేసుకోదు కద?
    గబగబా పరుగెత్తుతున్న జగన్నాధాన్ని చూసి అర్ధం కాక తెల్లపోయింది విజయ. ఆ అమ్మాయికి జగన్నాధం ఏమవుతాడు? ఈ జీవన వ్యవసాయం లో ఇతని పరోపకార శీలత ఎంతదూరం ఏవిధంగా ప్రయాణిస్తున్నది?
    తన ఆలోచనల్లో పడి పరిసరాలను గమనించని విజయ కు నాగేశ్వరరావు వచ్చిన విషయం బొత్తిగా తెలియలేదు. తీరా తలెత్తి చూసేసరికి ఎదురుగుండా ఇతను. ఉలిక్కిపడి లేచి నిల్చుంది ఆమె. నాగేశ్వర్రావు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అని మేష దృష్టి లో తన వంక చూస్తున్న విజయను ఉద్దేశించి--
    "నేను, వదిన గారూ! ఆరోజు చెరువు దగ్గర కూడా ఇలాగే ఉలిక్కిపడ్డారు. బహుశా నన్ను గుర్తు పట్టలేదేమో అనుకున్నాను" అన్నాడు.
    విజయ భయం కొంచెం తగ్గింది. నులక మంచం వాల్చి --
    "కూర్చోండి" అన్నది.
    "మీరు చాలా చిక్కి పోయారు" అన్నాడు -- ఆ మంచం తన బరువుకు ఆగుతుందో అగదో అనే సందేహంతో కూర్చుంటూ. విజయ సమాధానం చెప్పలేదు.
    "మీరు నన్నెందుకో నమ్మటం లేదు. నేను శ్రేయోభిలాషి ని. ప్రస్తుతం మీ యీ దుర్దశ కు నేను కారకుడి నే అయినా, జరిగిన పొరపాటు కు అనుక్షణం విచారిస్తూనే ఉన్నాను."
    జవాబు కోసం ఆగాడు అతను.
    "అవన్నీ అనవసరం--- పోనీండి" అన్నది విజయ.
    "చాలా నల్లబడి చిక్కిపోయినారు. అన్నయ్యా అలాగే ఉన్నాడు."
    "మీ అభిమానం కొద్దీ అలా అంటున్నారు. ఇదివరకు ఇంతకంటే బాగున్నామని ఎలా అనుకోటం? ఇప్పుడయినా ఏ లోటూ లేదు" అని సమాధానం ఇచ్చింది విజయ.
    మాసి చిరిగిన సాదా ఆకుపచ్చ చీరతో, రేగిపోయి రింగులు రింగులుగా నుదుటి మీద పడుతున్న జుట్టుతో , కళా విహీనమైన విషాద నేత్రాలతో, బలహీనంగా , అగ్ని శిఖలా మెరిసిపోతున్న విజయను చూసి మనసులోనే ఆశ్చర్య పోయినాడు అతను.
    "మీకు జబ్బు చేయలేదు గద?' అన్నాడు మరోసారి.
    విజయ పెదవుల మీద సంధ్యా సూర్యుని చివరి కిరణం లాటి చిరునవ్వు తళుక్కు మంది.
    "నిస్సహాయులైన బంధువులను అందరూ ఇలాగే పరామర్శిస్తారు" అన్నది.
    నాగేశ్వర్రావు పకపకా నవ్వాడు. విజయ కూడా బిగ్గరగా నవ్వేసింది. చాలా దినాల అనంతరం ఆ జీర్ణ దరిద్ర గృహ ప్రాంగణం నవ్వులతో  జీవం పోసుకుంది.
    "కాదు వదిన గారూ."
    "ఏమీ లేదు. ఇక వెళ్ళండి. "విజయ కంఠం ఎందుకో వణికింది. ఈ మధ్య జయప్రదరావు తరహయే మారిపోయింది. ఈ అర్ధరాత్రి వేళ ఎవరో పరాయి వాడితో మాట్లాడటం అతను అపార్ధం చేసుకో వచ్చును.
    నాగేశ్వర్రావు తేరిపార చూశాడు. జీవితంలో తనను తానె మోసగించుకోటానికి అలవాటు పడిన అతని మనస్థితి ఉజ్జ్వల దీప శిఖ లాటి పవిత్రతా మూర్తి పాదాల వద్ద వినమ్రమైపోయింది.
    "ఎందుకు భయపడుతున్నారు మీరు?"    
    "భయమా? అదేం లేదు."
    విజయ కంఠం లో ధ్వనించిన మాధుర్యానికీ, దుఃఖ పూరితమైన సౌకుమార్యానికి విచలితుడైనాడు అతను. విజయ ప్రతి అవయవం లోనూ, అంతర్యం లోని ప్రత్యణువు లోనూ అసహాయత, ఒక విధమైన సన్నజాజితనం వ్యక్త మావుతున్నవి. ఆమె సుందర వదనం అరవిదిచిన విరిగుచ్చం లా వెలవెలా పోతున్నది. పెదవుల పై ప్రీతి తో కూడిన మధుర మనోహరత్వం తారడుతున్నది. ఈ సువిశాల జగత్తు లో ఎంత అన్వేషించినా ఇలాటి స్త్రీ మూర్తి ని పొందలేదు తను. ఇలాటి స్త్రీని చూడటం కూడా ఇదే మొదటి సారి.
    తెల్లపోయి తనవంక చూస్తున్న నాగేశ్వర్రావు ను అపార్ధం చేసుకోలేదు విజయ-- అతని చూపులో తను అనుమానించిన లాలన లేదు. సౌందర్య మూర్తి అయిన రాజరాజేశ్వరీ విగ్రహాన్ని చూస్తున్న భక్తుడి చూపులా ఉంది ఆ చూపు.
    "ఏమిటి, అలా చూస్తున్నారు?"
    "మిమ్మల్నే......"
    "నన్ను మీరు చాలాసార్లు చూశారు."
    "ఇలా ఎప్పుడూ చూడలేదు." ఇదివరకు చూసింది మిమ్మల్ని కాదు."
    విజయ తిరిగీ మరొకసారి చిరునవ్వు నవ్వింది.
    ఆ నవ్వులో అరుణారుణ సాంధ్యశ్రీలో వంశీ మోహమని మురళీ గానం ధ్వనించి నట్లయింది అతనికి.
    "వెడుతున్నాను వదిన గారూ. అజ్ఞ అయితే మరోసారి దర్శనం చేసుకుంటాను" అని లేచి నిలబడ్డాడు అతను.
    విజయ తలూపింది. దూరాన్నుంచే నమస్కరించి వెళ్ళిపొయినాడు అతను. అతని మనసులో ఇన్నాళ్ళూ లేని శాంతి శతధా విస్తరించినట్లయింది. నారీ పవిత్రత తాలుకూ మహా కాంతి లో తన అంధకార మార్గం జ్యోతిర్మయ మయినట్లనిపించింది. తను పడుతున్న అభిప్రాయాలన్నీ అర్ధరహితమయినవి గా తోచినాయ్. వెంటనే కారు వేసుకుని విజయవాడ వెళ్ళిపోయి నాడు నానా దగ్గరికి; తనను తిరస్కరించిన మరో స్త్రీ దగ్గరికి.
    తెల్లవారకుండానే ప్రత్యక్షమైన నాగేశ్వరర్రావు ను చూసి నైట్ డ్రస్ లో ఉన్న నానా చిరునవ్వు నవ్వింది. ఇటీవల నానా చాలా వేదాంతిని అయిన సంగతి అందరూ అంటుంటే వింటూనే ఉన్నాడు. కాని రాత్రి విజయ లో ఏ జ్యోతి చూసి వినమ్రుడై నాడో అదే జ్యోతి ఈ ఫ్రెంచి యువతి నానాలో కూడా అతనికి కనిపించింది.
    "ఏమిటి ఇలా వచ్చావు?"
    "ఏమీ లేదు. నీతో కొంతకాలం ఉందా మనిపించింది. అభ్యంతరం లేదు గద?"
    "ఏ మాత్రం లేదు. లోపలికి రా" అని ఆహ్వానించింది ఆమె. విజయవాడ ఎండలకు ఆమె శ్వేత వర్ణం గులాబీ రంగుగా మారి మరింత మనో మోహనంగా ఉంది. లోపలికి వెళ్లి కుర్చీలో కూర్చున్నారు ఇద్దరూ. బట్లరు గుడ్లూ, రొట్టేలూ వెన్నా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపొయినాడు.
    నానా అతని వంక చూడటం లేదు. ఏదో ఆలోచిస్తున్నది. నాగేశ్వర్రావు మనసంతా ఆమెతో నిండిపోయింది. ఆమె ఆత్మ అతన్ని అవరిస్తున్నట్లుగా ఉంది.
    ఆ సాయంత్రం ఇద్దరూ కృష్ణ ఒడ్డుకు షికారు వెళ్ళారు. కృష్ణ ఇసుక అలలు అలలుగా అందాలు చిందుతున్నది. దూరంగా దిగంతం లో ఏదో వెలుగు.
    నాగేశ్వర్రావు కు ఒక సందేహం వచ్చింది.
    "రామచంద్రా రెడ్డి నిన్ను వదిలిన కారణం ఇంతవరకూ నాకు అర్ధం కాలేదు."
    నానా చిరునవ్వు నవ్వి - "మా ఇద్దరికీ పెద్ద ప్రేమా లేదు; విరోధమూ లేదు. కాని అయన స్వభావం వాంచా పూరితమైనది. ఉద్రుతమైన పురుష వాంఛ కు నేను సరిపోను, అందుకే అయన వాంచల ను ఇతరత్రా తీర్చుకునేవాడు. అదే కారణం. అంతకన్న మరేం లేదు" అన్నది.
    "ఫ్రెంచి స్త్రీవి.....నీకు ఈ భారతీయ స్త్రీ స్వభావం దేనికి వచ్చింది?' అని తన చెయ్యి ఆమె చేతి మీద వేశాడు నాగేశ్వరరావు. కొంచెం సేపు అలాగే ఉండి చెయ్యి లాగేసుకుంది నానా. అంతకన్న అవమానం లేదు మగవాడికి. విదిలించి తిట్టినా అంత బాధపడడు.
    మెల్లిగా చంద్రోదయమవుతున్నది . ఆ చంద్ర కాంతిలో అనాచ్చాదితమయిన ఆమె భుజాలు తళతళ మెరిసిపోతున్నాయి. ఆమె రూపమే మారినట్ల యింది.
    'అటు చూడు. చంద్రుడు నీళ్ళలో వెండి ముక్కల్ని వెదజల్లు తున్నాడు. ఇండియా అందం ఏ దేశానికీ రాదు" అన్నది నానా.
    "నిజమే. ఆ చంద్ర కాంతి ఎంత జీవనాన్ని మరెంత ప్రాణాన్ని ఈ లోకానికి ఇస్తున్నదో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది."
    "నాకు నీళ్ళల్లో కి వెళ్లాలని ఉంది."నవ్వింది నానా.
    నాగేశ్వర్రావు ఆమె ఒడిలోకి వాలిపోయినాడు. ఆమె కాదనలేదు. అతని జుట్టులోకి వెళ్ళు పోనిచ్చి దువ్వుతూ కూర్చున్నది. అంతకన్న కోర్కె ఆమెలో గాని, అంతకన్న ధైర్యం అతనిలో గాని లేవు.
    అమెలోంచి ఏదో అనంతమైన శక్తి అతని లోకి ప్రవహిస్తున్నట్లనిపించింది. సర్వేంద్రియాలు ఏదో ఉన్నతానందాలకు మేలు కొంటున్నాయి. ఆమెను అతడేమీ అధికంగా ప్రేమించటం లేదు. కాని ఏదో తీవ్రత అతనిలో ప్రవేశించి అతన్ని మేలు కొలిపింది. ఆ వెన్నెలంతా క్రమేణా నీలంగా చల్లగా మారిపోయినట్లనిపించింది.
    "నానా......"
    "ఏమిటి?"
    'నువ్వు కావాలి నాకు."
    "వద్దు."
    "కావాలి....తప్పదు."
    "సరే అయితే .!"
    కొన్ని ఘడియలు నిలిచి పోయినయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS