6
శంకరంతోపాటు మరో ముగ్గురికి ఆ ఆఫీసులో ఉద్యోగం దొరికింది.
వాసుదేవరావు, లక్ష్మీపతి, ప్రసాదరావు ముగ్గ్రురూ బ్రహ్మచారులే. ఒక్క వాసుదేవరావు తప్పించి తక్కినవారెవ్వరూ ఇంతకుమునుపు ఏవిధమైన ఉద్యోగమూ చేయలేదు. అందరికీ ఇది మొదటి ఉద్యోగము. వాసుదేవరావు మాత్రము ఇంతకుమునుపేవో రెండు మూడు తాత్కాలిక మైన ఉద్యోగాలు చేశాట్ట. అంత అనుభవమూ గట్రా సంపాయించినా, భళ్ళున ఏ మాటా అనలేడు. చాలావరకు ముభావంగానే ఉంటాడు.
వాసుదేవరావు నెవరైనా చూస్తే మాత్రం, అతనేదో తాలింఖానాలో కసరత్తులు చేసి కుస్తీలు పట్టిన వస్తాదనుకుంటారు. బాగా ఆరడుగుల ఎత్తు మనిషి ఎత్తుకి తగిన లావూను.
వాసుదేవరావు ముందు తక్కిన ముగ్గురూ పిచ్చిక పిల్లలా ఉన్నారు. లక్ష్మీపతి గోదావరి జిల్లా వాడట. మంచి మాటకారి. చాలా తెలివిగల వాడూను. ఏ పాము నే కర్రతో కొట్టాలో అతనికి బాగా తెలుసులా ఉంది.
ప్రసాదరావు దంతా హడావిడి బేరం. మనిషి గందరగోళంగా మాట్లాడుతాడు. అతని పనులూ అలానే ఉంటాయి. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువాను. ఈ ఊళ్ళో అతనికి ఉద్యోగం ఒచ్చిందంటే ఎగిరి గంతేశాట్ట. ఉద్యోగం ఎల్లా ఉన్నా, వాళ్ళ మామయ్యగారింటో మకాం చెయ్యడమంటే అతనికి సరదానట. అది నేటికి నెరవేరిందని చెప్పుకున్నాడు.
నలుగురికి పరిచయమైన కొద్ది సేపట్లోనే బాగా కలిసిపోయారు. మనసు విప్పుకుని మాటాడుకున్నారు.
వీళ్ళ స్నేహాన్ని చూచి మొదట్లో అవ్వుకున్నారు ఆఫీసు బృందం.
నలుగురూ ఉద్యోగానికి శ్రీకారం చుట్టి తాము చేయవలసిన పనులను గురించి తెలుసుకున్నారు. లంచవర్లో వాళ్ళందరు కలిసి భోజనవసతుల గురించి మాట్లాడుకున్నారు.
ఈ ఊళ్ళో హోటళ్ళకి కొదువలేదు కాబట్టి భోజనం గురించి అట్టే ఆలోచించకూడదు. పోతే వసతి, దీని విషయమేదో అతి త్వరలో తేల్చుకోవాలి. విజయవాడలో ఇల్లు దొరకడం - అందునా అన్ని వసతులూ ఉన్న ఇల్లు దొరకడం దుర్లభమని వినికిడి. కాని ప్రసాదరావు అన్న మాటకి వాళ్ళ మనసులు కుదుటపడ్డాయి.
అతను శంకరాన్నుద్దేశించి,
"మీరేం బెంగపడకండి గురువుగారూ! మీకు చక్కటి కొంప చూచిపెట్టే బాధ్యత నాది. ఈవేళకి మీరెలాగో ఆఫీసులోనే గడిపేయండి. రేపొద్దున గుడ్ న్యూస్ తీసుకొస్తాను. సరేనా?"
"చాలా థాంక్స్."
"అన్నట్లు మీ మావయ్యగారిల్లెక్కడో చెప్పారు కాదూ?" అడిగాడు లక్ష్మీపతి.
"మీకీ ఊరు బాగా తెలుసా?" ప్రసాదరావు అడిగిన దానికి అతను తలని అడ్డంగా ఊపుతూ తెలీదని చెప్పాడు.
"అయితే చెప్పినందువల్ల ప్రయోజనం లేదు. చెప్పినా తెల్సుకోడం గొప్ప కష్టం. వీలుంటే ఈ సాయంత్రం మా యింటికి రండి చూపిస్తాను. పనిలో పని సాయంత్రమే మావయ్యని అడిగేస్తాను ఇల్లేధైనా దొరుకుతుందేమో చెప్పమని."
"అదే చేయండి" అన్నాడు వాసుదేవరావు.
అందరి బిల్లూ ప్రసాదరావు తీసుకుని కౌంటరు దగ్గరికి వెళ్ళాడు.
"ప్రసాదరావుగారూ మీరు ఆగాలి" అన్నాడు శంకరం.
"అది గొప్ప కష్టంలేండి" అన్నాడు ప్రసాదరావు జేబులోంచి డబ్బు తీస్తూ.
శంకరం బిల్లు లాక్కున్నాడు. సర్వర్ని పిలిచాడు. అందరికీ వేర్వేరుగా బిల్లులు రాయమని చెప్పేడు. సర్వరు అలాగే చేశాడు.
"మీ పద్ధతి మార్చుకోవాలి గురువుగారూ!" అన్నాడు ప్రసాదరావు చిన్నబుచ్చుకుంటూ.
"అది గొప్ప కష్టంలేండి" అన్నాడు లక్ష్మీపతి ప్రసాదరావుని అనుకరిస్తో. ప్రసాదరావు మినహా ముగ్గురూ నవ్వుకున్నారు.
అందరూ బిల్లు చెల్లించి బయటపడ్డారు. వీళ్ళ హడావిడిని గమనిస్తోన్న మిగతా గుమాస్తా బృందం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
"ఈ ముచ్చ టెన్నాళ్ళులే. మనం చూస్తాంగా" అన్నాడు విశ్వంభరశాస్త్రి కాఫీ తాగుతూ అతను ఎస్టాబ్లిష్ మెంటు సెక్షన్లో పనిచేస్తాడు. అతనంటే ఆఫీసులో అందరికీ ఒక విధమైన అభిమానం, గౌరవమూను. స్టాఫ్ మేటర్సన్నీ అతనే చూడటం మూలంగా, తతిమ్మా గుమాస్తాలకి అతనిపట్ల కొంత భక్తీ ఉన్నమాట నిజం. పైగా అతనంటే ఆఫీసరుకి మంచి గురీ, నమ్మకమూను. అందుచేత ఇన్ని కారణాలవల్ల, శాస్త్రి మాటని తలదాల్చి ఆహ, ఓహో అనడం కద్దు మిగతా జనాభాకి.
అతనితో ఎప్పుడూ ముగ్గురు, నలుగురు అంతరంగికులు వెంట నుంటారు. అతనేం చెప్ప దలుచుకున్నా వాళ్ళతోనే చెప్తాడు. వాళ్ళు వింటారు. తగిన విధంగా భజన చేస్తూ ఉంటారు. ఆఫీసరనబడే దేవుడికి ప్రియభక్తుడూ, పూజారి ఈ శాస్త్రి కావటంవల్ల, చేసే భజనేదో శాస్త్రి ద్వారా చేయడంవల్ల 'ముక్తి' చాలా తొందరగా లభిస్తుందని ఈ మూఢుల మూర్ఖ విశ్వాసం.
శాస్త్రికి భజన సమాజాలంటే చాలా యిష్టం. స్టాఫ్ తనకి భజన చేస్తూన్నట్టే అతను శ్రీవారికి చేస్తూంటాడు. పై ఆఫీసరెవరైనా సరే శాస్త్రి చెవిని చిన్న మాటైనా వెయ్యందే ఏపనీ చెయ్యటానికి సాహసించరు.
శాస్త్రి నాటకాలు వేస్తూంటాడు. స్థానికంగా జరిగే ప్రతి నాటకానికీ శాస్త్రికి ఆహ్వానాలు వస్తూంటాయి. ప్రత్యేకంగా అతనికి ఒక సమాజమూ కలదు. అతనికి నాటకాలన్నా, దాని తాలూకు సమాజాలన్నా వల్లమాలిన మోజు. అప్పుడప్పుడూ పరిషత్తులూ, పోటీలూ అంటూ హడావిడి చేస్తూంటాడు శాస్త్రి.
శాస్త్రి మాటలు తియ్యగా వినడానికి హాయిగా ఉంటాయి. అతను వస్తుతః నటుడాయే మరి.
హోటల్లో కూర్చున్న శాస్త్రి నిలబడ్డాడు. అతని బిల్లు ఓ కుర్ర గుమాస్తా భక్తుడు గద్దలా తన్నేశాడు- "మీ రాగండీ' అంటూ శాస్త్రి అతని వైపు ముచ్చటగా చూచి నవ్వుతూ, తన చేతి లోని బిల్లు అలా గాల్లోకి ఎగరేసినట్టు చేశాడు. చివరికి శాస్త్రి బిల్లు కుర్ర భక్తుడే చెల్లించాడు. అభిమానానికి కారణం ఆ కుర్ర గుమాస్తాకి ఈ కుర్ర శాస్త్రిగారు ఆఫీసర్తో చెప్పి నాలుగు రోజుల సెలవు మంజూరు చేయించారు.

బయటకొచ్చిన తరువాత మరో శిష్యుడు శాస్త్రికి ఒక సిగరెట్టు పెట్టె అందించాడు. పెట్టినుండి ఒక సిగరెట్టు లాగి ముట్టించి, మల్లా పెట్టిని జేబులోకి తోస్తూ అన్నాడు శాస్త్రి తన పరిజనంతో.
"కొత్త నీరొచ్చింది. కాస్త కనిపెట్టుకు నుండటం మంచిది. బొత్తిగా ఆఫీసు వ్యవహారం తెలీని ఎడ్డీ మద్దీ మనుషుల్లా ఉన్నారు చూస్తుంటే."
పరిజనం తలలూపి శాస్త్రివెంట నడిచింది.
హెడ్ క్లర్కు నలుగురికీ పాఠాలు చెప్పడం ప్రారంభించారు.
ఆ సాయంత్రం ప్రసాదరావు మావయ్యగా రింటికి వెళ్ళారు మిత్రులు. ఆ యిల్లు గవర్నరు పేటలో ఉంది. అందమైన డాబా యిల్లు. ప్రసాదరావు మావయ్య ప్లీడరుగా ఆ ఊళ్ళోనే స్థిరపడ్డారుట. రెండు చేతులా సంపాదనట. ఒక కొడుకూ, ఒక కూతురు. కొడుక్కి పెళ్ళయి అతని సంసారంతో విశాఖపట్నంలో ఉంటున్నాడుట. పోతే వాళ్ళ మావయ్య కూతురి విషయం చెపుతూ కాస్త సిగ్గుపడ్డాడు ప్రసాదరావు.
అతని వాలకం అర్ధం చేసుకున్న లక్ష్మీపతి.
"ఆవిడగారు మీ కాబోయే శ్రీమతి కాబోలు" అన్నాడు.
ఈ మాటకి మరింత సిగ్గుపడిపోతూ అవునన్నట్టు తలూపి, చొక్కా గుండీని రెండు చేతుల్తో నలుపుతూ అన్నాడు ప్రసాదరావు-
"బి.యస్సీ చదువుతూ మానేసింది. ఈ ఊళ్ళోనే చదువుకుంది లెండి."
"అరే ...... చదువెందుకు ఆపేశారండీ" అనడిగాడు లక్ష్మీపతి.
"నాకు తెలీదు గురూగారూ!"
"అడుగుతే ఆ అమ్మాయి చెప్పదుటండీ?"
"గొప్ప కష్టంలేండి" అన్నాడు ప్రసాదరావు.
ఈ మాటతో మిత్రబృందం కళ్ళింతవి చేసుకుని అతనివైపు ఆశ్చర్యంగా చూశారు. ప్రసాదరావు అందర్నీ ఒక తడవ పరీక్షించి, వాళ్ళందరూ ఆశ్చర్యంలో ఉన్నట్టు గ్రహించి,
"నిజమండీ! ఎప్పుడో నూటికీ, కోటికీ ఒక్క టన్నట్టు రోజుకీ ఒక్కసారే మాట్టాడుతుంది, ఇక తర్వాత బంద్. ఉండండి. మీకు పరిచయం చేస్తాను" అనేసి గబగబా హాల్లోకి వెళ్ళాడు. 'మృణా' అని పిలిచేడు.
ఈ పేరేదో గమ్మత్తుగా ఉండటంతో మిత్రులు అదిరి పడ్డారు.
"మృణాళినీ......" మళ్ళా పిలిచాడు ప్రసాదరావు.
కాసేపటికి ఇద్దరూ వొచ్చారు మిత్రుల గది లోకి. మృణాళిని ఇంకా గుమ్మానికి అవతలే నించుని ఉండటం గమనించకుండానే-
"వీళ్ళందరూ నాతోపాటు ఈవేళ ఆఫీసులో చేశారు" అన్నాడు.
మృణాళిని పకపకా నవ్వింది. ప్రసాదరావు తల చేత్తో తడుంకున్నాడు. మిగిలిన ముగ్గురూ ఖంగారు పడ్డారు.
"చాలా బాగుంది బావా నీ పరిచయం. పరిచయం చేసే పద్ధతి ఇదేనా? నన్నిక్కడే గుమ్మాని కవతలే నిలబెట్టి-
"సారీ ....... లోపలికి రా" అన్నాడు ప్రసాదరావు.
"వీరు శంకరం, వీరు వాసుదేవరావు, వీరు లక్ష్మీపతి, మృణాళిని మా మావయ్య కూతురు" అని పరిచయం చేశాడు.
"మావయ్య వచ్చారా?" అడిగాడు ప్రసాదరావు.
"ఇంకా రాలేదు."
"అబ్బే, ఏం లేదు. మా వాళ్ళకి అద్దెకో పోర్షను కావాలని అంటేనూ, మావయ్య కేమైనా తెలుస్తుందేమోననీ......"
"అరగంటలో రావచ్చు."
"వొచ్చేస్తారు. సరేనండి. ఆయనొచ్చేవరకూ మనం యిక్కడే కూర్చుందాం. ఆయనొచ్చిం తర్వాత ఆ విషయమేదో చూద్దాం" అన్నాడు ప్రసాదరావు.
మృణాళిని గుమ్మం దాటుతూ బావా అని పిలిచింది. బావకీ పిలుపు వినిపించలేదు. ఆపిల్ల వెళ్ళిపోయింది. అతను గోడనున్న కేలండర్ల ప్రాముఖ్యత వివరించాలనే ఉద్దేశ్యంతో అన్నీ శ్రద్దగా చూశాడు. ఒక కేలండరు చేతిలోకి తీసుకున్నాడు.
"ఇదిగోనండి, ఇది ఓ టాయిలెట్ సోప్ కేలండరు. దీంట్లో వైజయంతి మాల అందంగా ఉంది గదూ. అన్నట్టు గురూగారూ-నిజంగా వైజయంతిమాల యీ-సబ్బునే వాడుతుందంటారా? లేకపోతే-"
హాల్లో నుంచుని మృణాళిని ఈమాటు కాస్త బిగ్గరగా 'ప్రసాదం' అని పిలిచింది. ఆ పిలుపుతో అతను చెప్పబోయేది ఆగిపోయింది. కేలండరు పుచ్చుకునే మృణాళిని దగ్గరి కెళ్ళాడు. మళ్ళా కాసేపటికి వొచ్చి, కేలండరు టీపాయ్ మీద పెట్టి,
"జస్టెమినిట్. ఇప్పుడే వస్తాను. ఈలోగా మీరు మాటాడుతుండండి" అన్నాడు గది దాటుతూ.
ముగ్గురూ మెల్లిగా నవ్వుకున్నారు.
"సందడి చేస్తున్నాడు" అన్నాడు లక్ష్మీపతి.
"బాధ్యతలు నెత్తిన పడేంతవరకూ సందడి చేస్తూ గడపడం చాలామందికి ఉన్న లక్షణమే" అన్నాడు వాసుదేవరావు.
"అతనివల్లనైనా యిల్లు దొరికితే బాగుండును. అన్నాడు శంకరం.
మరో పది నిముషాల్లో దాదాపు డ్యాన్సు చేస్తోన్నట్టు నడుస్తూ కాఫీలు పట్టుకొచ్చాడు. ప్రసాదరావు. ముగ్గురికీ కాఫీలిచ్చి చేతులు దులుపుకుంటో'-
"నేను మీకు కాఫీ యివ్వలేదని కోప్పడింది మృణాళిని. మీరేమీ అనుకోవద్దు. మరిచిపోయాను. అంతే."
"చాలా శ్రమనిస్తున్నాం" అన్నాడు వాసు.
"మృణాళినికి కాఫీ కాయడమంటే వక్కపొడి నోట్లో వేసుకున్నంత పని. మా అత్త్తయ్య ఉంటే ఇవన్నీ ఆవిడే చూసుకునేదనుకోండి. ఆవిడేమో ప్రస్తుతం మా ఊళ్ళో ఉంటుంది. ఇంటిపనులన్నీ మృణాళిని నెత్తిమీద పడ్డాయి. ఆడపిల్లయి పుట్టిన తరువాత-ఏవంటారు? ఇంటి పనులూ, వంట పనులూ తప్పనిసరిగా నేర్చుకోవాలిగా" ఈ కాసిని మాటలూ ముగిసిన వెంటనే ప్రసాదరావు చూపు మళ్ళా కేలండర్ పైన పడింది. వెంటనే నిన్ను తీసుకుని,
"ఇంతకీ వైజయంతి మాల ఆ సబ్బునే వాడుతుందాని అనుమానం" అన్నాడు ప్రసాదం.
"అయ్యా బాబోయ్ - మీరా విషయం వదలి పెట్టండి బాబూ - ఆవిడే సబ్బు వాడితే మన కేవిటిలేండి" అన్నాడు లక్ష్మీపతి.
"అః. మాటవరసకి ఆడుగుతున్నా. వాళ్ళు వాడేది ఒకటీ చెప్పే దొకటీను."
"నేనూ మాటవరసకి అంటూన్నా-ఎస్ మార్కు బీదెల కేలండర్లెప్పుడైనా చూశారా? దానిపైన మరి మన...." లక్ష్మీపతి మాట ముగియక ముందే ప్రసాదం ఘోల్లున నవ్వేస్తూ.
"చంపారు గురూ ....... ఇదీ ఒక పాయింటే సుమా హ ....... హ ...... హ......" అన్నాడు ప్రసాదం.
అతన్ని చూచి అందరూ నవ్వుకున్నారు. సరిగ్గా అదే సమయానికి ప్రసాదం మావయ్యగారు వచ్చారు. ప్రసాదరావు సక్రమమైన పద్ధతిలో అక్కడున్న వాళ్ళందర్నీ వల్ల మావయ్యకి పరిచయం చేశాడు. తర్వాత వాళ్ళు వచ్చిన పనీ చెప్పాడు. ఆయన రెండు నిముషాలు ఆలోచించి, ప్రసాదరావుకి కొన్ని గుర్తులు చెప్పి, ఆ యింటికి వెళ్ళి కనుక్కో మన్నారు.
గంపెడాశతో బయటపడ్డారు మిత్రులు. ఆయన చెప్పినిల్లు చూడగానే బావుందనిపించింది. చిన్న డాబా ముందు అందమైన కాంపౌండునూ. లక్ష్మీపతి లోపలికెళ్ళి ఇంటివారిని పిలిచి అద్దె విషయం అడిగాడు. ఆ యింటాయన అడిగిన ప్రశ్నలకి జవాబుచెప్పి బయట కొచ్చాడు.
"ముఫ్ఫై రూపాయలు అద్దెట. నయాపైసా గూడా తగ్గేది లేదని ఖరారుగా చెప్పేడు. వప్పుకున్నాను. ఒక పది రూపాయలు అడ్వాన్సుగా యిచ్చి ఈవేళే చేరుతున్నామని చెప్పి వచ్చాను" అన్నాడు లక్ష్మీపతి.
ఆరోజే ఇంట్లో దిగేరు మిత్రులు.
* * *
రోజులు దొర్లుతున్నాయి.
ఆఫీసులో పరిస్థితులు రోజురోజుకీ అధ్వాన్నంగా తయారవుతున్నాయి. అందరూ 'నలుగురి' పైన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. వాళ్ళు చేసిన ప్రతి పనికీ వేలెట్టి చూపిస్తున్నారు. ఏమి జరిగినా 'ఈ కొత్తవాళ్ళతో వచ్చిన చిక్కేయిదండి. మనం చెపితే వినరు. వాళ్ళకి తోచదు. చస్తున్నాం వీళ్ళతో" అని విసుక్కుంటున్నారు.
తెలియంది అడుగుతే సరిగ్గా చెప్పడం అటుంచి మొహం చిట్లించుకోడంలాటి పిచ్చి పనులు చేస్తున్నారు. చాటుగా 'కొత్త పక్షులు పట్టి దద్దమ్మలు సుమా!' అని గూడా అనుకుంటున్నారు.
ఆఫీసరు యివన్నీ పట్టించుకోడు. ఆయనకి కావలసింది పని. అంతేగాని, అవతలవాడు చస్తున్నాడా, బ్రతుకుతున్నాడా, వాడి చుట్టూ ఉన్న పరిస్థితులేమిటసలు అనే ధ్యాస ఆయనకు లేదు. ఆయన విషయం అది.
