అనుభవంలేని పిరికితనం లో ఊగుతున్నాడనే గ్రహించింది. శాస్త్రాలు చదవకపోయినా అలవాటులోని క్రోడీకరింపు ఉంది. తెల్లవారక ముందే తన వ్యాపారం చీకటితో కలిసిపోవాలి. తలుపు వద్దకే వెళ్ళింది.
రువ్వుమంది. కుతూహలం అన్నపేరున తను లొంగినా, అది అడకత్తెర అయ్యేటట్లు ఉంటే, కంగారు పడుతూనే ఐదు రూపాయల కాగితం తీసి ఇచ్చి "వెళ్ళు" అన్నాడు.
నోరు తెరిచింది. వ్రేళ్ళమధ్యను ఉన్న నోటు చేతుల్ని కాల్చింది. అనుభవంలో ఇది క్రొత్త. ఏదో ఎదలో ఊచింది. విచిత్రంగా ఉన్న మనిషి. నఖశిఖ పర్యంతం పర్యవేక్షించి, "నేను బిచ్చం పుచ్చుకోను" అంటూనే గబగబా నడిచివెళ్ళింది.
ఉస్సురన్నాడు. ఎందుకో శరీరం గుప్పుమన్నట్లు ఎగదిగేసిన వైనంలోనే తచ్చాడింది. తను మరిచి పోవడానికి, ఆమె శరీరంలో తను ఇమిడేవాడే. కాని, కాని-
ఠక్కున సత్య జ్ఞాపకం వచ్చింది. చేతులారా చెయ్యిచాపి తన్ను గుండెలకు హతుకున్నా, తను వెర్రితలలు వెయ్యలేని పాలరాయి అయ్యేడు. అందులో సంక్షోభం ఉంది. ఆక్రోదన పాలు పంచుకుంది. అయినా తను జీవచ్చవం అయ్యేడు. తను కాదు; తనలో దాక్కున్న మనిషి. ఆ మనిషే ఇప్పుడు తన్ను ఆటబొమ్మ చేస్తూంది.
తను వెళ్ళాలి. ఈ పరిసరాల్లోంచే పారిపోవాలి. తనమీద తనకు ఏహ్యత. గబగబా మెట్లు దిగి, బయటకు వచ్చేడు. రోడ్డు ఎక్కేడు. వెనకాల ఎవరో నవ్వినట్లే అయితే జోరుగా, విసురుగానే నడిచి స్టేషనుకు చేరేడు. అంత మందిలో తను ఒకడు.
గేటు లోపలికి వచ్చేసరికి 'పట్నం బండి' అన్న కూలీల హడావుడి, త్రోపులాటలు. ప్రక్కగా నిలబడి చూస్తున్నప్పుడే, ప్రత్యేకంగా ఓ వృద్ధ దంపతులు కనపడ్డారు. వాళ్ళను చూస్తూనే కళ్ళప్పగించేడు. వెళ్ళి వాళ్ళను కలు, మాట్లాడు, పలకరించు అన్న ముందు త్రోపే. అంత పొడగరి కాదు. అంగవస్త్రం పైన శాలువా క్రొత్త మడతలు. ఉప్పాడ జరీ అంచు నీలంరంగు చీరతో ఆవిడా. పార్వతీ పరమేశ్వరుల్లా తట్టేరు. ఆరాధన కలుగుతూంది. చెయ్యెత్తి నమస్కరించాలన్న ఆయత్తతే.
వాళ్ళు ఎవరైనా తనకు పరిచితులు. ఎరిగున్నవారు. వారు తనకు అండ అన్న భావనే పల్లెవాటయ్యింది. ఎవరో! ఎవరో అనుకుంటూనే ఫ్లాట్ ఫారం మీదికి వచ్చినా, వెనక్కు తిరిగి, వాళ్ళు కన్పడేవరకూ చూస్తూ ఉండనే ఉన్నాడు.
భళ్ళున తెల్లవారేసరికి తన ఊరువచ్చేడు. దూరంగా తనింటి ముందర పందెర, తోరణాలు నలిగిన ఛాయల్లోనే కన్పడ్డాయి. తెల్లబోయేడు. తనింట్లో ఏం జరిగింది? పెండ్లా? ఎవరిది? రుక్మిణిదా! తనమీద ఆశపెట్టుకున్న మేనరికం రుక్మిణిదా? తను ఇల్లు ఎల్లాగూ వదిలి వెళ్ళిపోయేనని, నాన్న పెండ్లి చేసేసేడా?
ఏదీ నిర్ణయం కావటంలేదు. ఎందుకో అవ్యక్తంగానే, తను వెళ్ళడం మంచిది కానట్లయ్యింది. మలుపు తిరిగి, వెనకనున్న తోటలోకే వచ్చేడు. తనకు అలవాటైన స్థలంలోనే కూర్చున్నాడు. మూగపోయిన సన్నజాజుల పందిరి చాటుగా, కాగితం పువ్వుల పొందానులోనే.
కళ్ళు బరువెక్కినట్లే అయ్యేయి; రాత్రంతటి జాగారంలోనూ ఆలోచనే ఎవరిది, పెండ్లయ్యింది?
'మీ నాన్నే చేసుకోవచ్చు.' రువ్వున రాయి విసిరినట్లు గజిబిజిగా మనస్సు కెక్కరించింది. తన తల్లిపోయి ఇంకా నెలైనా నిండకుండానే......గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
"బావా! నువ్వా?" రుక్మిణి కుప్పున కూలు తూనే, వెక్కివెక్కి ఏడ్చింది. ఆ దుఃఖం ప్రసంచాన్నే కదిలించేటట్లు ఉంది.
పాదాలకు పారాణి, నుదుట వివాహపు బొట్టు, నలిగిన క్రొత్తచీర, మెళ్ళో అమ్మ నగలు......
తను తెప్పరిల్లేడు. కాళ్ళముందు పువ్వుల దానులో మందారాలు.
"అమ్మా!" అనే గుండెలు అవసిపోయేయి, పైకి అనలేని ఆ మాటతో, రుధిరంతో రుక్మిణిని నాన్న ప్రక్క సవతి తల్లిగా రూపం క్రమ్ముకుంది.
* * *
9

బండి ఇంటిముందు ఆగడంతోటే, వెంకటమ్మ గబగబా వస్తూనే, "బాబాయీ, పిన్నమ్మా వచ్చేరుగా వీరయ్యా! దబ్బున రా సామాన్లు దింపుదుగాని" అన్న కేకతో చేరింది. ముఖం మీద నీళ్ళు కొట్టవలసినంత పనయ్యింది ఉన్న వాళ్ళను చూచేసరికి.
పదహారేళ్ళు పైబడిన అమ్మాయి, మధుదిగడం చకితపరిచేసింది. తన ఊహలో గతంలో పెత్తండ్రికి చేసిన అన్యాయం, కోర్టు తిరగడాలు కల్పించిన ఈ మధు, అనే పెత్తండ్రి ఇంటికి రావడం జరగదనుకుంది. వచ్చినా ముఖం చెల్లదు అనుకుంది. కాని, అది ఎంత ఓటి పునాదుల మీద తను నిర్మించిందో అన్న కుమిలింపు కలిగింది క్షణికం.
"వెంకమ్మత్తా, కులాసానా?" అన్నాడు మధు.
తలూపింది.
"బాబాయీ, పిన్నీ ఉన్నారా?"
"లేరు. పెండ్లికి వెళ్ళి రాలేదు."
ఎవరి పెండ్లికి అన్న ప్రశ్న. తనకు వచ్చిన శుభలేఖ జ్ఞాపకం వచ్చింది. రామచంద్రయ్య రుక్మిణమ్మలది. దానితో మాట్లాడకుండానే "దిగు, సత్యా!" అన్నాడు.
ఆ పిలుపులో ఉన్న చనువుకు వెంకటమ్మ గజిబిజి అయ్యింది. మధు వివాహమైందని తన చెవిని పడలేదు. ఎంత ఇంగిలిపీసు చదివిన చదువు లైనా ఇంత బరితెగింపు పిలుపులు ఉంటాయని తను ఎరగదు.
"అత్తవారి వూరేవూరు?" కవాచీబల్లమీద కూర్చున్న తర్వాతనే అడిగింది.
సత్య మాత్రం కొరకొరా ఓసారి చూస్తూ, "ముసలమ్మగారూ, ఆయన భార్యని అనుకుంటున్నారేమో? అది పొరపాటు. మధు నాకు స్నేహితుడు" అనేసింది.
"అల్లాగా!" అంది వెంకటమ్మ తక్కువ తిన్నట్లు కన్పడకుండా.
అయిన సమయంలో తను అడ్డుపడకపోతే వచ్చినపని బెడిసికొడుతుందేమో అని, నవ్వుతూనే "నాగాయలంక చుట్టలు తెచ్చే" అన్నాడు.
వల్లమాలినంత సిగ్గుపడిపోయి "నేను అనుకుంటూనే వున్నా, మా మధయ్య నన్ను మరిచి పోడని. ఎన్నాళ్ళయ్యిందనుకున్నావు నోరూరగా కాల్చి!" అంది.
హమ్మయ్య అనుకున్నాడు, చేతుల్లో కట్టలు పెడుతూనే ఇప్పుడు సత్యకు అర్ధం అయ్యింది. తనే అసహ్యించుకుంది కొంటూంటే. కాని దాని క్రింద ఓసత్యం ఉంది అన్నదే ఆశ్చర్యం.
వీరయ్య కాళ్ళు కడుక్కుందుకు గంగాళంతో నీళ్ళుపెట్టేడు. తుండుగుడ్డా బల్లమీద పెట్టేడు.
పడమటింటి మీదనే ఉన్నాయి సత్య కళ్ళు. మధు అంతవరకూ శాంతతో ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం ఇప్పుడు ఎవరైనా వచ్చి 'నేనే శాంతని' అని అంటే తను నమ్మవలసిందే. ఇంకో గత్యంతరం లేదు. గత వైరుధ్య చరిత్ర ఆ ఇంటి గడపకు, తనకు ఉంది. ఈనాడు సత్యమాట తీసివెయ్యలేకనే తన రాక తప్పనిసరి. 'నేను ఫలానా' అని లోపలికి వెళ్ళి, పరిచయం చేసుకుని, చుట్టరికం కలుపుకోవాలన్నా మనస్సు దిగతీస్తూంది.
అన్నిటికన్న సత్య ఏ భావంతో ఇక్కడకు వచ్చింది? 'శాంతను చూడాలి' అంది. ఆ చూపుతోనే సరిపెడుతుందన్న సంబాళింపు రావటం లేదు. ఏవో ఏవో విచిత్ర ప్రశ్నలు అడగవచ్చు. చికాకు కలిగించవచ్చు ఇవన్నీ. రాజే ఇక్కడకు వచ్చి కొన్ని ఘంటలుండి పారిపోయేడు అన్న మాట విని, ఊహించిన గతానికి, కట్రాళ్ళువేసి, ఊహతో పండెరవేసి వచ్చింది - రాజు జీవితంలో తనోవైపు, శాంత ఓవైపు వలవేసి, ఉగ్గాలు బిగించాలనుకున్నట్లు; అదేదో తను తేల్చాలన్న భావంతోనూ.
చుట్ట రుచిచూచి వచ్చిన వెంకటమ్మ "అదేమిటి, ఇంకా అల్లాగే కూర్చుండిపోయేరు? భోజనాలకి లేవరా?" అంది.
తలుపుచాటునున్న శాంత, ఇక బావొద్దు అన్నట్లే బయటకు వచ్చి, పట్టుపంచె, చెంబు అక్కడ పెట్టి, "లేవండి" అనేసింది.
నుదుటున దమ్మిడీ అంత బొట్టు, మెళ్ళో పసుపుతాడు, ఉస్తికాయల గొలుసు, ఎర్రరంగు గాజులు, రంగు బొద్ధంచు చీర కళకళలాడింది. సత్య నోరు తెరిచింది. ఏమిటి ఆవిడలో ఉన్న ఔన్నత్య అతిశయం? హుందా? ఆకర్షణ? తను సింహావలోకనం చెయ్యలేదు. మనస్సు, శరీరం మొద్దుపారేయి.
ఆ శ్రోత్రియం వెనుక, తన పెదతండ్రిలో ఇంత విప్లవం, సంస్కరణ దాగి రవులుకుంటున్నాయన్న తలంపు. ఇప్పుడు కళ్ళెదురుగా చూచిన శాంతను, ఇంతగా.... అనుకోలేదు. ఊహించలేదు. ప్రగతి, పురోగమనం, ఈ నవ్య యువకుల్లోనే ఉంది; వయస్సు మళ్ళినవాళ్ళు ప్రతిబంధకాలు అనుకున్న అభిప్రాయాన్ని ఎంత లోతుగా ఆయన కప్పెట్టేడో అన్న భావన. ఆశ్చర్యమే.
"కులాసాయేనా, అమ్మా!"
హుందాగా నవ్వింది. అందులో ఆరిందాతనం ఉట్టిపడింది. "చాలాకాలం అయ్యింది నిన్ను చూచి. అమ్మా, నాన్నా కులాసాగా వున్నారా? ఈమధ్య చిన్నమామయ్య ఒంట్లో నలతగా వుందని విన్నాం. ఇప్పుడు ఎల్లావుంది?" కుశల ప్రశ్నలు.
అన్నిటికీ సమాధానం చెప్పేడు. "బాబాయీ, పిన్నీ ఎప్పుడు వస్తారు?"
"పేరయ్యశాస్త్రి కొడుకు పెండ్లికి వెళ్ళేరు. ఈపాటికి రావలసిందే. ఎల్లాగా ఇల్లు కదిలేంకదా అని, కనకదుర్గమ్మని, పానకాలస్వామిని దర్శనం చేసుకువద్దామనుకుని వుండాలి."
తెలివి తెచ్చుకునే "వీరు సత్యాదేవి. స్నేహితురాలు. పల్లెటూళ్ళు చూద్దామని వుంటే వచ్చేం" అన్నాడు.
"మా జీవితాలు, అలవాట్లు అన్నీ ఓ వెర్రి మొత్తికోళ్ళు" అంటూనే నవ్వేసింది. "లేవండి. ఎప్పుడు తినివచ్చేరో?"
ఇద్దరూ లేచేరు. నోట మాటలేకుండా బిత్తరపోయినది ఒక్క వెంకటమ్మే అయ్యింది. శాంతలో ఇంత ఆరిందాతనం ఎక్కడ దాగి ఉందన్న ఆశ్చర్యమే. ఇంతవరకూ ఈ మారిన రూపానికి హడలుతూనే ఉంది. అది తను చెప్పలేదు. ఆనాటి రాత్రినుండి మారింది. మార్చుకుంది. ఇది బాబయ్యా, పిన్నీ వస్తే కొరకలను అయి, తన్ను వాతపెట్టే పర్యంతం వెళ్ళుతుందని హడలిపోతూంది. తనకుమాత్రం వయస్సులో చితికిన శాంత రేపు ఏమిరానీ, కొన్నాళ్ళైనా, ఓ ఆనందంలో ఉందికదా అన్న ధీమా, ఆపేక్ష ఉట్టే కట్టడంవల్ల మౌనంగానే ఉండి సంతోషించింది.
