"పెద్ద కథ లేదు. తెనాలిలో మా ఇళ్ళు ప్రక్క ప్రక్కనే ఆ అమ్మాయి బి. ఎ చదివింది. ఎలా ప్రేమించుకున్నారో నాకు తెలీదు. సినిమా అయినా తీసి చూపించారు కాదు. ఇంకేముంది ప్రేమించుకున్నాం-పెళ్ళాడుకుంటాం అంటున్నాడుట....ఏంటో పాడులోకం-డాక్టరీ పాసయ్యి మూడేళ్ళు కావస్తున్నా నా మాటే తలపెట్టరు...పెళ్ళిమీద పెళ్ళిట భలే-" ఈ మాటలకి అందరికి నవ్వు వచ్చినా గప్ చిప్ గా ఊరుకున్నారు.
"మీ వదిన ఏమంటోంది" మూర్తి జాలిపడ్డాడు.
"ఏమైనా అంటే తనను వదిలేసి కన్నెత్తి చూడని భయం. ఏం చేస్తుంది....పాపం..."
"ఇంత రాద్దాంతం దేనికిట. మీలో ఐదుగురు భార్యలుండవచ్చునుగా? ఇంకా ఎక్కువమంది కూడా..." అర్ధవంతంగా ఆపుజేశాడు భాస్కర్.
ఖాన్ బాధపడినట్లు చూచాడు. నిజమే పెళ్ళాడ వచ్చు. కానీ ఓ చిన్న సవరణ ఉంది....అందర్నీ సమానంగా చూడాలి. పక్షపాతంతో ఒకరిని ప్రేమించి, ఆదరించి, మరొకరిని కన్నెత్తి చూడకపోతే చాలా పానం. అందరికీ సమానమైన విలువ ఇస్తే పెళ్ళాడినా తప్పులేదు. మహమ్మద్ అలాగే చేశారు. పడుచు పెళ్ళాం మోజులోపడి పెద్ద భార్యను, ముందు భార్యలను నిరసించి అగౌరవ పర్చకూడదు. దీన్ని అందరూ మర్చిపోయి చాల సులభంగా ప్రక్కన జెడ్తారు...ఎందరినైన చేసుకో వచ్చునని భుజాలెగుర వేస్తారు...
"ఈ విషయం క్రొత్తగా వింటున్నాము" మూర్తి ఆశ్చర్యాన్ని చూపాడు.
"మరి ఏం చెయ్యాలని?" కుమార్ అడిగాడు.
మనం చేసేదేం లేదు....రెడ్డిగారే ఏదో చేయబోతున్నారు. ఆ పిల్లను ఇంకొకళ్ళకి కట్ట పెడ్తే మాకి భయం పోతుంది. మా వదిన చాలా మంచిది. అమాయకురాలు. ఈ వేదన నెలా భరిస్తోందో - తలంచుకుంటే నాకెంతో ఆవేదనగా వుంటుంది. కాసేపు అంతా నిశ్శబ్దం. కాకులు, పక్షులు అరుస్తూ గూళ్ళు చేరుకుంటున్నాయి. సంధ్యకాంతులు-వింత వింత రంగులతో మిళిత మై ఆకాశాన్ని పంచరంగుల వర్ణచిత్రంలా మార్చేశాయి. "మరి మీ పెళ్ళిమాట..."మంజు సంభాషణను మార్చింది. "మా అమ్మగారి-అక్కగారి కూతురు-రఫీకాను నాకివ్వటానికీ మంతనాలాడుతున్నారు...."
"అరె.... పెద్దమ్మ కూతురు..." కల్యాణి తనకు నోరున్నదని. ఋజువు చేసింది.
"అదిమాకు తప్పుకాదు......వైగా ఒదులుకోని సంబంధం." కళ్యాణి ముఖం అదోలా ఉంది. ఖాన్ గమనించాడు....కొంచెం బాధ పడ్డాడు...మీలో మేనమామల్ని చేసుకుంటారు....మాలో అది చాలా తప్పు....ఉత్తరాది. కేరళలో దగ్గరి బంధువులను చేసికోరు...ఇంకా దూరం ఆలోచిస్తే- టిబెట్ స్త్రీకి ఇద్దరు ముగ్గురు భర్తలుంటారు....ఏది తప్పు......ఎవరి పద్ధతులు, అలవాట్లు సరైనవి? రాసెల్ అన్నట్లు పాపం-అనేది భౌగోళీకం. ఒక ప్రాంతంలోని మంచి అలవాట్లు మరో ప్రాంతంలో దురలవాట్లు. ఒకోరి కొకటి సరైనదైతే - మరొకరికి సరైనదికాదు ....
"పోనీలే-తనకు తెలియదు- రఫీకా విషయం చెప్పండి. భాస్కర్ ఖాన్ ప్రసంగాన్ని మధ్యలో త్రుంచేశాడు.
"రఫీకాను చేసికోవటం నాకూ ఇష్టమే.... మూర్తీ....నివ్వూ చూచావుగా-
"ఆ....ఆ......గుర్తుంది..... చాలా అందంగా ఉంటుంది.....ఇకనేం." "అందంగానే ఉంటుంది. కాస్త పిల్లికళ్ళతో...అంతేరా? కానీ.....మా పెద్ద నాన్న ఓ ఆంక్ష విధించాడు..."
"ఏమిటది? అన్నలా-అందరూ ఉత్సుకతో వింటున్నారు 'ఆయనకూడ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీసు ఒక్కతే కూతురు. పెళ్ళీచేసికోగానే రాజీనామా ఇచ్చేసి ఆయన స్థానం నేను తీసికోవాలట. 'నీకు నచ్చినట్లు లేదు. ఔనా?" మూర్తి ఆదుర్దాగా అడిగాడు.
"ఔను, ప్రైవేట్ ప్రాక్టీసవగానే- ఆయన ఎన్నో నాటకాలాడతాడు....అంతా డబ్బుకోసం. మానవసేవ అనేకంటే "ఏం" సేవ ఎక్కువ అంటే పోతుంది. ఇక్కడ జీతం తీసికొంటాము, సాధ్యమైనంతవరకు నిస్కల్మషంగా, స్వార్ధం లేకుండా పరులకు సేవ చేయొచ్చు. ప్రైవేట్ అనగానే స్వార్ధం-అహం-ఎవడికి జబ్బువచ్చినా ఎవడికి పెద్ద బిల్లు పంపుదునా-అనే ఆలోచనలు ఉమ్డటం సహజం. ఆయన డబ్బు కోసం ఏమైనా చేస్తాడు. అలానాకురాదు....నాకు సంభవం. ఆ పంజరంలో చిక్కుకుంటే బైటికొచ్చేది హుళక్కి అందుకే ఎంతో ఆలోచిస్తున్నాను.
"రఫీకా నీ హృదయాన్ని దోచేసింది కాబోలు. కుమార్ ఉడికించాడు. "అటు రఫీకామ ఒదల్లేను.....ఇటు ఆయన స్థానం స్వీకరించలేను.....ఏం చేయాలో పాలుపోవడం లేదు..........
"పెద్దవాళ్ళ కొదిలేస్తే" భాస్కర్ సలహా.
"చక్కగా రఫీకాను వేరే డాక్టర్ కిచ్చి పెళ్ళి జరిపిస్తారు" ఖాన్ ఠక్కున చెప్పాడు.
మళ్ళీ నిశ్శబ్దం బాగా చీకటి పడింది. నల్లని ముఖ్ మల్ మీద కుట్టిన తళుకులా నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తాయి. మాలతీ పుష్ప సుగంధ మిళితమైన వాతపోతము మేనుల మైమరపించజేస్తోంది.
ఖాన్-ఫ్లాస్క్ తీసికొని లేచి నుంచున్నాడు.
అతడిని చూచి అందరు లేచారు.
మంజును చూస్తూ కుమార్ ను నెమ్మదిగా ప్రశ్నించాడు" టైం - ఎప్పుడు?"
"వచ్చేనెల మొదటివారం"
నాలుగడుగులు వేశాక భాస్కర్ అన్నాడు "ఈ రహస్యం నెలా పరిష్కరించేది - చెప్పలేదు........."
ఖాన్ నవ్వేశాడు, "మిగతా పై వారంలో"
అందరు నవ్వేశారు. తోటవదలి ఇవతలికి వచ్చేవరకు అందరూ మౌనం దాల్చారు.
వార్డ్ బాయ్ ఎదురొచ్చి కుమార్ ను చూచి అన్నాడు "పెద్ద డాక్టరుగారు రాత్రికి ఓ సారి రమ్మనమన్నారు సార్"
"అర్జంటా?"
"కాదు భోంచేసి రమ్మన్నారు"
ఏమి కబురా -అని ఎంతో ఆదుర్దాతో సర్జను మాదప్ప దగ్గర కెళ్ళాడు. వెళ్ళీ వెళ్ళక ముందే ఆయన బైటికొచ్చి ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళారు, ఆయన మాటలు నాన్చకుండా వెంటనే పిలిచిన కారణం చెప్పారు చిన్న చెంపవు అనే గ్రామంలోని డాక్టర్ సెలవుపెట్టి వెళ్ళాడు. ఆ రోజులకి మీలో ఎవరినైన్నా పంపమని అర్ధిస్తూ వ్రాశారు. మీకిష్టమైతే వెళ్ళండి."
"ఎంతదూరం - సర్"
"ఇక్కడికి వందమైళ్ళనుకోండి. కలరాతో చాలా బాధపడ్డారుట. ఇప్పుడు తగ్గి పోయింది గానీ ఎదాక్తారు లేకుండా మూడు వారాలు వుండటం కష్టం అంటారు. ఒంటరిగా మీకు కొంత వ్యక్తిగతమైన బాద్యత ఇనుమడిస్తుందని నా ఊహా....డాక్టర్ మిసెస్ కుమార్ కు కూడా కొంత గాలిమార్పు అవసరం, పల్లెలో కొంత శాంతి లభిస్తుంది..."
ఇంతమందిలో తమను పంపడంలో అతని ఉద్దేశాన్ని గ్రహించ గల్గాడు కుమార్. తనపై పూర్తి విశ్వాసం వుంది. సర్జన్ మాట కాదన లేడు.
తత్ఫలితం- కుమార్ మంజులతో సహా చిన్న చెరువు గ్రామం చేరాడు చిన్న చెరువు ఊరికి చాలా పెద్దచేరువుంది. చెరువుచుట్టూ మామిడి తోపులు, పళ్ళతోటలు. లక్ష్మీ ప్రసన్నత ఆ ఊరిపై ఎప్పుడూ వుంది. అందుకనే డాక్టర్లు లేని పల్లెలు చాలా వున్నా ఈ పల్లెకుమాత్రం డాక్టరు యిచ్చా పూర్వకంగా వస్తారు. రెండుచేతులా ఆర్జించ వచ్చు. పట్నాలల్లో మేడలు. మిద్దెలు కట్టవచ్చు. అన్నిచోట్ల మాదిరిగానే అక్కడ కూడా పార్టీ లున్నాయి? అదిలేక పోతే పల్లె ఎలా అవుతుంది.
ఆ రోజు రాత్రికి పల్లె చేరారు. డాక్టరుగా రింట్లో ఖాళీగా వున్న మూడు గదుల్లో దిగారు. టాక్సీ వెళ్ళిపోయింది. టిఫిన్ కారియర్ తెరచి కడుపునిండా భోంచేసి ఆరుబయట కూర్చున్నారు. కాంపౌండరు వచ్చి నమస్కరించాడు. అతనే మీ ఏర్పాట్లన్నీ చేయించిది. దాదాపు యాభై సంవత్సరాలుంటాయి, అతని ముఖంలోని ప్రస్నన్నతను చూచి మంజుల నిజంగా నివ్వెరపోయింది.
"డాక్టరుగారూ. ఒక్క మాటు పెద్దల్ని చూచి వద్దామా?
కుమార్ కు వెంటనే బోధపడడం లేదు. ఇది చిన్న వూరు, తను ఇరవై రోజులకని వచ్చాడు. ఒకరికి అణగి మణగి ఉండనవసరంలేదు. ముఖ్యంగా ఈ ప్రయాణానంతరం చాలా బడలికగా వుంది. అదేమాట అంటూ చివరిగా-
ఒక్కర్ని చూస్తే..."
"కుదరదు డాక్టర్ బాబూ...పార్టీలున్నాయి. ...వెళ్తే అందరి దగ్గర కెళ్ళాలి"
"ఐతే వెళ్ళకుండా వుండటమే శ్రేయస్కరం"
అతను మాట్లాడ లేదు, కాసేపు తారట్లాడి ఏదైనా అవసరమొస్తే వార్డ్ బాయ్ చేత కబురు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు.
పనిలో ప్రవేశించి తన పని తను చేసుకు పోతున్నాడు. మంజుల ఏ పుస్తకమో తిరగేస్తో ఆ రెండు రోజులు గడిపింది. మూడవరోజు. ఇద్దరు సంధ్యా సమయంలో చెరువుగట్టు దగ్గర కెళ్ళారు.
చెరువు కేసి అందరు వెళ్తుంటారు. గ్రామ దేవత గుడి అక్కడే ఉంది.
గట్టెక్కి రాళ్ళమీద కూచున్నారు. ప్రకృతి రమణీయంగా, ప్రశాంతంగా వుంది. సంధ్య కాంతిలో నీరు కెంపుల మయమై వుంది. ఇటు వైపు పైర్లు చిరునవ్వులు ప్రసరిస్తున్నాయి ఆ సంధ్యా సమయపు పక్షుల కిలకిలా రావాలలో. అలల సన్నని సవ్వడిలో వారి హృదయాలు మత్తెక్కి పింఛం విప్పి నాట్యం చేశాయి. చీకటిపడింది. ఆ కురిసే సన్నటి మంచు జల్లులో నవ చైతన్యం జాలువారింది.
ఔను - ఇక్కడ శాంతి వుంది. ఉప్పు అంటని ముత్యంలా, బురద అంటని పద్మంలా పవిత్రంగా ఆనందంగా వుందా చిన్న ఊరు.
ఇద్దరు ఇంటిమొగం పట్టారు. ఆ త్రోవ విడిచి హాస్పిటల్ త్రోవ ఎక్కారు, ఆ మొగదలలో ఒక పెద్ద మర్రిచ=చెట్టు క్రింద ఆకులన్నీ ప్రోపు చేస్తున్న స్త్రీని చూచారు. ఈ సమయంలో ఈ వూడుపుదేనికి? ఎవరీమె? చెట్టు క్రింద అరుగులేదు. కనీసం పూజార్హమైన ఓ చిన్న రాతిముక్కకూడాలేదు.
ఆమె ప్రక్కకు తొలగి నమస్కరించింది. ఆ చీకట్లో ఆమె సమంగా అగుపించలేదు.
ప్రతి నమస్కారంచేసి ముందుకు సాగిపోతున్నారు.
"అమ్మగారూ - నా పేరు సుబ్బమ్మ, రేపు తమ దర్శనం చేసికొంటాను."
మంజు "అలాగే" అన్నదే గాని "ఎందుకు?" అన్న ప్రశ్న బైటికనలేక పోయింది. వారు కాస్తదూరం వెళ్ళారు. ఎవరో ఆమెను తొలగమని తిడ్తున్నారు!
మరుసటి రోజు మంజు ఒక్కతే ఇంట్లో వుంది. పనిపిల్ల సుబ్బమ్మ రాకను తెలియ జేసింది. "ఇటు రమ్మను' అంది.
ఆ పిల్ల మంజుకేసి గ్రుడ్లప్పగించి చూచింది.
"ఏమిటీ వెళ్ళు"
"అది కాదమ్మా-కుష్టుది, దాన్ని రమ్మంటున్నారని విపులీకరించింది.
"అయ్యో - నాకు తెలియదు. వస్తున్నా పద' తన పొరపాటును కప్పిపుచ్చుకుంది.
ఆమె నమస్కరించింది. "రెండు రోజుల కోమారు వచ్చితోటంతా పూడ్చి వెళ్తానమ్మా. డాక్టరు బాబుగారు భోజనం పెట్టించేవారు.
మంజు వెంటనే ఏమీ మాట్లాడలేదు. "ఈమె ప్రత్యక్షత నందరు నిరసించేవారే అందుకే రాత్రి ఎవరో తిడ్తున్నారు.....పాపం" - అనుకుంది మనసులో.
ఆమె చీపురు తీసికొంది. అంతా శుభ్రంగా పూడ్చి చెత్త ప్రోవుచేసింది. చెంబు తెచ్చుకుని నిలబడింది. పని పిల్ల చెంబులో నీళ్ళు పోసింది. ముఖం కాళ్ళు, చేతులు కడుక్కొని దూరంగా చెట్టుక్రింద కూచుంది.
విస్తట్లో అన్నము, కూరలు తెచ్చి ముందుంచింది. పనిపిల్ల నీళ్ళుబోసి దూరంగా వెళ్ళికూచుంది. మంజు వరండా చివరిదాకా వచ్చి ఏమైనా కావలిస్తే ఆ పిల్లతో చెప్పు సుబ్బమ్మా" - అలాగే నమ్మా"
