వారం రోజులు గడిచిపోయాయి. రాజు 'మేము రావడం కొంచెం ఆలస్య మౌతుంది.' అని వ్రాశాడు. పనిమనిషి, పార్వతమ్మ బంధువుల యింట్లో పెళ్ళి కని వెళ్ళింది. వంట దగ్గర నుంచీ అన్ని పనులూ అనూరాదే చూసుకోవలసి వస్తోంది. హరికృష్ణ ధోరణి మరింతగా మారిపోతోంది నానాటికీ. ప్రతి దానికీ పెద్దగా అరిచి గొడవ పెడుతున్నాడు. అనుక్షణం, అనూరాధా ఎదుటే వుండాలని పట్టు బడుతున్నాడు.
శారద ప్రతి రోజూ వచ్చి రెండు మూడు గంటలుండి వెళ్లి పోతుంది. ఆనాడు శారద వచ్చేసరికి అనూరాధ క్రింది భాగంలో వున్న రెండు గదుల్ని శుభ్రం చేయించి, సామానేమీ లేకుండా ఖాళీ చేయించు తోంది.
'అదేమిటి? అనూ! ఇప్పుడా గదులతో ఏం పని?' అన్నది శారద.
'అద్దెకు యిద్దామని ' అన్నది. ఎవరి కని ప్రశ్నించింది శారద.
'అమ్మా, రాజు, నేనూ వుంటాం!'
'ఏమిటీ?! అమ్మా, మీరూ వుంటారా?! ఇంకా పరాయి మనిషిగానే వుండిపోదామానుకుంటున్నావా? అనూ రాధా?!'
'ఎలా వున్నా అంతస్తుని విస్మరించ లేక పోతున్నానక్కా! దీని మూలాన భేదభావం మాత్రం రాబోదని హామీ యిస్తున్నాను...'
ఆ పైన నోరెత్త లేకపోయిందా అక్క. విచిత్రంగా చూస్తుండి పోయింది. శారద వెళ్లిన పది నిమిషాలకే గేటులో నుంచి ఓ కారు దూసుకు వచ్చింది.
అనూరాధ వరండా లోకి వచ్చి చూసింది. వో యాభై ఏళ్ళ వ్యక్తీ కళ్ళద్దాల్ని సవరించుకుంటూ కారు దిగాడు. ఆ యింటి యజమాని లా నలువైపులా అధికారం మెరిసేట్టు చూశాడు. వో నౌకరు పరుగున వచ్చి నమస్కరించాడు.
'ఊ! ఎరా! జోగులూ! డాక్టర్ గారికి పిచ్చెక్కిందటగా ! ఇప్పుడు ఎక్కడున్నారు?'
'ఇక్కడే వుండారు బాబుగోరు!'
'మరి...మందూ మాకూ ఎవరిస్తున్నారు?"
'అనూరాధమ్మగారు!'
'ఆహా! నిజమేనన్నమాట! ఆ సంగతి. అల్ రైట్! మకుటం లేని ఆ మహారాణి ని ఎవరు ఆహ్వానించార్రా?' వ్యంగ్యం దూసుకు వచ్చిందాయన గొంతు నుంచి.
'అమ్మగారు దేవతలాంటోరు బాబయ్యా! అందుకే, అయ్యగోరికి....'
'ఆ దేవత ఆరోప్రాణం అంటావు! అంతేగా?' మధ్యలోనే అందుకుంది ఆగ్రహం.
'సిత్తం! అంతేనుండి!'
వివరాల్ని వోపికగా సేకరించుతున్న ఆ వ్యక్తీ హరికృష్ణ మేనమామ, 'రామనాధం' అని నౌకరు మాటల్ని బట్టి తెలుసుకుంది అనూరాధ. శారదకు ఫోను చేద్దామనుకుంది. కానీ అంతలోనే లోనికి ప్రవెశించాడా పెద్ద మనిషి.
ఎదురుగా వున్న అనూరాధ ను చూసీ చూడనట్టే ముందుకి వెళ్లి పోయాడు. హరికృష్ణ 'రాధా! ఎవరో వచ్చారు చూడు! కొంచెం తొందరగా వెళ్లమని చెప్పిపో. యీ పెద్ద మనిషికి!' అంటూ కేకలు వేయసాగాడు.
'నేనురా! హరీ! రామనాధం మామయ్యనిరా!' నెత్తీ నోరూ బాదుకుంటున్నాడా వ్యక్తీ.
'అల్ రైట్! ఒప్పుకుంటున్నానోయ్ మావగారూ! నీ పేరు ఏ నాదం అయినా నా కానవసరం ! ముందు నీకేం కావలసి వచ్చావో చెప్పు!' అది హరికృష్ణ స్వరం.
'అలాగే! నీ దగ్గర పుచ్చుకున్న అయిదువేలూ తెచ్చాను!'
'వేలు నా కనవసరం! తీసికొని వెళ్ళిపో!'
హరికృష్ణ ఆ మాట అనగానే అనూరాధ గది ముందుకు వచ్చి నిలబడింది. ఆ పెద్దమనిషి ఏదో ' ప్లాను,' వేసికొని వచ్చినట్లు బోధ పడిందామెకు.
'అలాగా! అయితే యిదిగో చెక్ బుక్! వో పది వేలకు చెక్కు వ్రాయి! మంచి అవసరంగా వుంది. పెద్ద వాణ్ణి అమెరికా పంపించు తున్నాను.'
హరికృష్ణ చేతికి అలమారు లో వున్న చెక్ బుక్ తీసి అందించాడాయన. పెన్ కూడా అదించ బోతుండగా అన్నది అనూరాధ!
'ఆగండి! బాబాయిగారూ! ఇపుడాయన సంతకం చెల్లదు. అకౌంటంతా శారదక్కయ్య పేరున వుంది. అదీగాక చెక్కు అందుకుని వెళ్ళడానికి అందరికీ అర్హత వుండదు,' సౌమ్యంగా నే వుందామే స్వరం.
అయన కనులలో క్రోధం పరువులు పెట్టిందో క్షణం. అనూరాధ వంక పరీక్ష గా చూశాడు. మీసాల్నీ సవరించుకున్నాడు విలాసంగా.
'అమ్మాయ్! ఈ రామనాధం ఎదుట నిలబడి మాట్లాడ్డానికి కూడా అర్హత వుండాలని తెలుసుకో!' గర్వం వెల్లి విరిసిందతని మాటల్లో.
'అర్హత ల ప్రసక్తి యిపుడు అనవసర మనుకుంటాను. రామనాధం గారూ! పూవులా నిర్మలంగా వున్న మనస్సులకు వేరే అర్హత లెందు కింకా?' వ్యంగ్యం దూసుకు వచ్చింది బాణం లా.
కళ్ళజోడులో నుంచి అనూరాధ వంక చూశాడో క్షణం సేపు. హరికృష్ణ వైపు తిరిగి అన్నాడు --
'నాయనా! హరీ! ఈ యింటి కేదో గ్రహం పట్టుకుందిరా! మీ అత్తయ్య నీ మాట విన్నప్పటి నుంచీ 'యిదేదో శని గ్రహం బాబో!' అని మొత్తుకుంటోంది. కానీ నిజమే నన్పించుతోందిప్పుడు.'
ఆ మాటలు తనవైపే విసరబడ్డాయని గ్రహించింది అనూరాధ-- కావాలనే బొమ్మ గీస్తూ కూర్చున్నాడంతసేపూ . పీచ్చి గీత లెన్నో గీసి వాటి నన్నింటి నీ తలగా, కాళ్ళు గా మార్చి క్రింద 'రామనాధం గారు- పెద్ద మనిషి' అని వ్రాశాడు.
'ఏరా! బాబూ! కాస్త తలెత్టరా?' అనురాగం వంకరలు తిరిగిందా స్వరాన.
'ఇదిగో! ఎలా వుంది ఈ బొమ్మ! పొట్ట చూశావా? ఎంత వుందో! కొండలా వుంది గదూ! రాధా! అచ్చు ' రామనాధం మామయ్య లా లేదూ?' అన్నాడు హరికృష్ణ ఆ బొమ్మను అనూరాధ కు చూపించుతూ.
ఆ పెద్ద మనిషికి తలకోట్టేసినంత పనయ్యింది.
'వీడికి కాదు పిచ్చి. నాకు ఎక్కుతుంది మరి కొంచెం సేపు వుంటే!' అనుకున్నాడు లోలోన. పైకి మాత్రం నవ్వు పులుము కున్నాడు. తన పాచిక పారనందుకు వుడికి పోతున్నాడు. అయిదు వేలు ఎరగా పెట్టి పది వేలు సంగ్రహించవచ్చు ననుకున్నాడు. కానీ అనూరాధ సమయాని కివచ్చి అడ్డు పెట్టింది.
'అత్తయ్య ను పంపించుతాను! జోగుల్ని వెంట తీసుకుని వెళ్లి.' అని హరికృష్ణ ఏదో అంటున్నా విన్పించుకో కుండానే వరండా లోకి వెళ్లి పోయాడాయన.
అనూరాధ వెనుకే వస్తోందని గ్రహించాడు.
'ఇదిగో ! అమ్మాయ్ ! హరికృష్ణ నా మేనల్లుడని గుర్తుంచుకుని మాట్లాడ్డం మంచిది. వాళ్ల అత్తయ్య వస్తుంది. నెల్లూరు వెంట బెట్టుకుని వస్తుంది. తర్వాత మీ యింటికి వెళ్లిపోవచ్చు నువ్వు -- నాకసలు యిలాంటి వ్యవహారాలు చూస్తుంటే అరికాలి మంట నెత్తి కెక్కుతుంది --ఆ!'
'మీరు వినే వుంటారేమో బహుశా! స్నేహం ముందు కృత్రిమ బంధుత్వం రంగులు వెలిసిన బొమ్మలా వుంటుంది. డాక్టర్ గారికి మతి చెడిన మాట నిజమే. కానీ అయన ప్రాణ ప్రదంగా ఎంచుకునే మధురమైన స్నేహ బంధం అయన చుట్టూరా అభేద్యమైన కంచు కోటని నిర్మించింది.' మృదువుగా వుందామే స్వరం. కానీ ఆ మాటల్లోని వ్యంగ్యం నిప్పులా చురుక్కు మంది ఆ పెద్ద మనిషికి.
క్షణ మాత్రం నోరు మెదపలేక పోయాడు. ఎదుట నిలబడి ఏ ఆడంబరమూ ప్రదర్శించకుండా, గర్వం అన్న మాటే లేకుండా వున్న నగ్న సత్యాన్ని అరిటి పండు వొలిచి చేతిలో వుంచి నట్లు మృదువుగా విప్పి చెప్పిన ఆమె సంభాషణ చమత్కృతి కాయనెంతగానొ విభ్రాంతుడయ్యాడు.
అయినా అయన బాణాలు విసరడం మాననే లేదు. అయన తూణిరంలో నుంచి అతివేగంగా దూసుకు వస్తూనే వున్నాయి.
'వినడానికి యింపుగానే వున్నాయి మాటలు. కానీ 'హరి' అత్తయ్య ముందు కంచుకోట కాదు గదా, ఉక్కు కోట అయినా ఉఫ్ అనగానే ఎగిరి చక్కా పోతుంది. 'ఎవరు ఎక్కడ వుండాలో అక్కడే వుంటే మంచిది.' ఆ మాటల్లో దాగి వున్న భావాన్ని గ్రహించింది అనూరాధ.
ఎడుతిమనిషి హృదయాన్ని తూట్లు పొడిచి వినోదం చూస్తుండడం ఆయనకు అలవాటు అని తెలుసుకుంది.
అంతలో హరికృష్ణ లేచి వచ్చాడు అక్కడికి.
'అరె! రాహువు యింకా వెళ్లలేదేమిటి? రాధా! చంద్రుణ్ణి పూర్తిగా మింగివేసేట్టున్నడే?!' అన్నాడు రామనాధం వంక చూస్తూ.
అయన అవమానభారంతో వూగి పోతున్నాడు. హరి వంక చూసి విషపు నవ్వు నవ్వి అన్నాడు --
'నీకు మతి పోయిందా లేక పోగొట్టబడిందో అర్ధం గావడం లేదురా హరీ!' అనూరాధ కనులలో ఆగ్రహం మెరుపులా మెరిసింది. కానీ పెదవులు కదలనే లేదెంతసేపటికీ. తానాశించినట్లు ఆగ్రహం విరుచుకు పడుతుందనుకున్న ఆ వ్యక్తీ కామే మౌనం ఆశా భంగాన్ని కలిగించింది. ఇంకా యింతకన్నా పెద్ద నిష్టూరాలనే వినవలసి వస్తుందని, అందుకిది నాంది అని అనుకున్నదా అనురాగమయి.
'సరే! నేను వెళ్తున్నాను హరీ!' అని సెలవు దీసికొన్నాడాయన. హరికృష్ణ అయన వెళ్లగానే లోనికి వెళ్ళిపోయాడు 'పాపం పారిపోయాడు,' అంటూ. అనూరాధ ఎంతోసేపు అలాగే నిల్చుండి పోయింది.
శారద వచ్చి 'అనూ! అలా వున్నావేమిటి?' అని ప్రశ్నించే వరకూ అలాగే వుందామే.
'ఏమీ లేదక్కా! ఇంతకూ ముందు వో క్షణం క్రింద పవిత్రమైన స్నేహాన్ని ఘోరంగా పరాభవించి నవ్వుకుంటూ వెళ్లిపోయాడో పెద్ద మనిషి.' గంబీరత వెనుక వ్యధ అలలా కదిలింది.
అంతలో జోగులు వచ్చి 'రామనాధం గారు వచ్చారమ్మా ,' అని చెప్పాడు. శారద జరిగిన దేమిటో వూహించ గలిగింది. బరువుగా విశ్వసించింది.
'చూడు ! అనూ! ఈ నీ అక్కయ్య వుండగా నిన్నెవరూ ఏమీ చేయలేరు. మొరిగే కుక్కలు కరవవు' అని గుర్తుంచుకో-- బావ జీవితాన వెలిగిన ఆశా కిరాణానివి -- నువ్వు! ఏవో అర్ధం లేని మాటల్ని విని మనస్సు ను రాయిగా మార్చుకోకు. మంచితనానికి పరీక్ష ఎప్పుడూ వుంటుంది. నిజమైన స్నేహం నిష్టూరాలకు లొంగదు. ' అన్నది శారద.
అనూరాధ 'నిజమే! కానీ తుఫాను ఆరంభమైందక్కా!డాక్టర్ గారి అత్తయ్య వస్తుందట.' అన్నది.
'ఎవరూ? శకుంతల అత్తయ్య వస్తుందా? ఆహా! ఆవిడ నిజంగా శనిగ్రహమే అనూ! సరే! కానివ్వు! ఆ ! నీరజ కబురం పించిందమ్మా! అన్నయ్య రాలేదేందుకని' అంటూ. మరి వోసారి వెళ్లి యీ మాట చెప్పకుండా వూరడించి రావాలి! లేకపోతె మనో వ్యధతో కుమిలి పోతుంది. అన్నయ్య కేమైందో నన్న భయంతో.
అనూరాధా, శారద లా సాయంత్రమే బయల్దేరారు. హరికృష్ణ ను చూస్తుండమని నౌకరు జోగులుకు పదిసార్లు చెప్పింది అనూరాధ. శారద వో నర్సు ను రప్పించింది. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు హరికృష్ణ దగ్గర వుండడాని కని.
నీరజ ముఖాన ఆనంద రేఖలు పరువులేత్తాయి అనూరాధ ను చూడగానే. ఆమెకు అన్నకు జరిగిన ఘోరమైన ప్రమాదం సంగతి తెలియదు. అనూరాధ వచ్చి అప్పటికి పది హీను రోజులైందనీ ఎరుగడు. అన్న హరికృష్ణ , అన్నాళ్ళు రానందుకు కోపం వచ్చింది. 'అన్నయ్య రాలేదా?' అని అడిగింది.
అబద్దం ఆడక తప్పలేదు శారద కు. హరికృష్ణ ఏదో పని మీద బొంబాయి వెళ్ళాడని, తిరిగి రావడానికి వో నెల పడుతుందనీ చెప్పింది. నీరజ నిజమేననుకుంది. ఆమె ఆరోగ్యం నానాటికీ దిగజారి పోతోందని గ్రహించారా అక్కా చెల్లెళ్ళు.
ఆ తరువాత నీరజను నవ్వించుతూ మరో అరగంట గడిపారు. అనూరాధ ను మళ్ళీ రమ్మని కోరిందామె--
'అనూరాధ యిక వెళ్ళలేదమ్మా , మీ అన్నా చెల్లెళ్ళు కలిసి బంధించి వేశారు! అన్నది శారద యదార్ధాన్ని పరిహసంతో జోడించి. నీరజ అది పరిహసమే అనుకుంది. అందుకే 'మద్రాసు లోనే వుండి పోకూడదా! నాకోసమైనా?' అని అడిగింది అనూరాధను.
'ఉంటాను నీరజా! తప్పకుండా వుంటాను!' అంది అనూరాధ నీరజ చేతుల్ని ఆప్యాయంగా సవరించుతూ. ఆ సమాధానం ఆ శాప గ్రస్తు రాలి హృదయానికి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది.
చీకట్లు అలముకుంటూ వుండగా బయలుదేరారా అక్కా చెల్లెళ్ళు . వాళ్ళు యిల్లు చేరేసరికి హరికృష్ణ మేడ పైన పెద్దగా అరిచి గొడవ జేయడం విన్పించింది.
'పూజారికి పూనకం వచ్చిందనుకుంటానే! అనూ! తొందరగా వెళ్ళు తల్లీ! సతీశ్ ఎదురు చూస్తుంటారు నాకోసం. ఇంకా వంట చేయాలి వెళ్లి! ప్రొద్దుబోయింది .' అంటూ శారద సెలవు దీసికోంది.
