9
పది రోజులకు గాని సారధి తిరిగి రాలేదు. గుంటూరు నించి రామచంద్ర పురం వెళ్లి లింగరాజు తో మాట్లాడి వచ్చాడు.
సారధి చెప్పిన విశేషాలు రెండు.
ఒకటి : లింగరాజు మామగారైన పంతులు గుండె జబ్బుతో మరణించటం.
రెండు: లింగరాజు -- హెలెన్ ల పెళ్లి ఆగిపోవటం.
ఈ రెండు వార్తలు నాకు సంతోషమే కలిగించాయి. సారధి కూడా బరువు దించుకున్న మనిషి లాగా కనిపించాడు.
రెండు నెలల క్రితం లింగరాజు చివరి సారిగా భార్యతో నూ, మామగారి తోనూ తెగతెంపులు చేసుకుని జగ్గయ్య పేట చేరాడు. వాళ్ళ నాన్న హెడ్ మాస్టార్ గా రిటైరై , జగ్గయ్య పేటలో రెండెకరాల మాగాణి చెరువు కింద కొనుక్కొని అక్కడే ఇంచుమించు గా స్థిర పడిపోయాడు. ఆ ఊళ్ళో కొండల్రావు గారి దివాణం లో రెండు మంచి ట్యూషన్లు దొరకటం గూడా జరిగింది. లింగరాజు అత్తవారితో తెగతెంపులు చేసుకొని మూటా ములై కట్టుకొని జగ్గయ్య పేట వచ్చేసరికి రామదాసు గారు క్షణ కాలం నివ్వెర పోయారు. నెలకు వంద రూపాయలు దాటని ఆదాయంతో బడి పంతులుగా ముప్పై సంవత్సరాలుగా దారిద్ర్యాన్ని కౌగలించుకొని జీవిస్తున్న రామదాసు గారికి డబ్బు విలవ చాలా బాగా తెలుసు. కుమారుడి కి ఏనాటి కైనా లక్షలు సంక్రమిస్తాయని, ఆనాటి నుంచి తన కష్టాలన్నీ గట్టె క్కుతాయని కలలుగంటున్న రామదాసు గారికి లింగరాజు ధోరణి చాలా బాధ కలిగించింది. లింగరాజు కంటే పంతులు గారు ఎక్కువ ఆరోగ్యంగా ఉండటం రామదాసు గారికి చిరాకు కలిగించేది.
"మా వియ్యంకుడు ఎప్పుడు హరీ అనేట్టు? ఎప్పుడు మావాడికి ఆ ఆస్తి వచ్చేట్టు?" అంటూ నిట్టూర్పులు విడిచే వారు రామదాసు గారు. ఒకనాడు పని గట్టుకుని రామదాసు గారు రామచంద్ర పురం వచ్చి, "పదిరోజులు మకాం పెట్టి అయిర్వేదం వైద్యుడు ఆనందాచార్లు గారిని కలుసుకొని, "అయ్యవారూ, ఇప్పట్లో మా వియ్యంకుడి కి ఏమీ భయం లేనట్టేనా?' అని అడిగాడు.
"ఏం భయం?' అన్నాడు ఆచార్లు.
"ప్రాణ భయం."
"అయన పైకి అలా రాయిలా కనిపిస్తున్నాడు గానండీ గుండె జబ్బుంది. ఎప్పుడో, ఏ అర్ధరాత్రో , ఎవరితో నూ చెప్పకుండా వైకుంఠనికి చక్కా పోతాడు జీవుడు."
"ఎప్పుడు జరుగుతుందంటా రిది?"
"ఇప్పుడు జరగవచ్చు , ఇంకో పాతికేళ్ళ కి జరగవచ్చు" అంటూ అచార్లు అసలు విషయం గ్రహించి , "ఓపిక పట్టండి , మాస్టారు గారూ! ఎప్పటి కైనా పంతులు గారి సంపదంతా మీకు దక్కేదే గా" అంటూ విరిచి విరిచి నవ్వాడు.
రామదాసు తన దొంగతన మేదో బైట పడినట్లుగా గుటకలు మింగి . "అదేం , లేదు. అచార్లు గారూ అయన పది కాలాల పాటు బ్రతికి ఉండాలనే గదా మనందరం కోరుకునేది! ఇంటికి పెద్ద దిక్కు !" అంటూ లేచి వచ్చాడు.
ఏమైనా గుండె జబ్బు చాలా ప్రమాద కరమైనదనే సంతృప్తి తో, ఏ క్షణం లోనైనా పంతులు గుటుక్కుమంటాడనే ఆశతో జగ్గయ్యపేట చేరుకున్నాడు రామదాసు గారు. ఆ తరువాత వారానికి రామచంద్ర పురం నుంచీ ఉత్తరం వచ్చింది రామదాసు గారికి. మామగారికి గుండె జబ్బు వచ్చిందని లింగరాజు వ్రాశాడు. ఆ రాత్రల్లా రామదాసు గారికి నిద్ర పట్టలేదు. వియ్యంకుడి జాతకం కాఫీ వ్రాసి ఎలాగో తెచ్చుకున్నాడు. గ్రహాల గమనాన్ని బట్టి పంతులు నిర్యాణం చెందే అవకాశం ఉంది. మరునాడు పేరయ్య గారి పెంకుటిల్లు మూడు వేలకి బేరం చేశాడు. నెలరోజుల్లో బజానా యిచ్చి ఎగ్రిమెంటు వ్రాయించు కుంటానన్నాడు. ఆ నెల రోజులూ రోజు రామచంద్రాపురం ఉత్తరం వ్రాస్తూనే ఉన్నాడు, వియ్యంకుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలియజేయమని, లింగరాజు రెండు బద్దకిస్తే, నానాతిట్లు, తిడుతూ వ్రాసేవాడు. జవాబు కోసం తన అడ్రసు వ్రాసిన రిప్లై కవరు పంపేవాడు. లింగరాజు క్రమక్రమంగా తండ్రికి ఉత్తరాలు వ్రాయటం తగ్గించాడు. ఇక రామదాసు గారు సరాసరి వియ్యంకుడి కే వ్రాయటం మొదలు పెట్టాడు. రెండు రోజుల కో ఉత్తరం వ్రాసేవాడు. "బావగారూ, మీ ఆరోగ్యం బాగుండలేదని ఇక్కడ అందరం కుంగి పోతున్నాం. గుండె జబ్బు చాలా ప్రమాదకరమైంది. ఎలా వైద్యం చేయించు కుంటారో? విశాఖపట్నం పెద్ద హాస్పిటల్ కి వెళ్ళటం మంచిదని మా సలహా, మీ అయురోరాగ్యాల కై ఇక్కడ శివాలయం లో పూజలు చేయిస్తున్నాను."
ఇంచుమించు ఇదే ధోరణి లో ఉండేవి ఉత్తరాలన్నీ. ఉత్తరం చదివి పంతులు గారు పళ్ళు పటపట కోరికేవాడు. నక్కలు కుక్కలు అని శపించేవారు వియ్యలవారిని. ఎన్నడూ పంతులు గారు రామదాసు గారికి జవాబు వ్రాయలేదు. అయినా రామదాసు ఉత్తరాలు వ్రాయటం మానలేదు. చివరికి ప్రాణం విసిగి , పంతులు గారు ఒక్క వాక్యంలో సమాధానం వ్రాశారు.
"మీరు ఎన్ని పూజలు చేయించినా , ఎన్ని ఆశలు మూట కట్టుకు కూర్చున్నా ఆయుర్దాయం మూడనిదే నేను చావటమూ జరగదు , నా ఆస్తి మీకు దక్కటమూ జరగదు."
ఈ ఉత్తరం చదివి రామదాసు గారు కళ్ళు తుడుచుకుని , కరణం గారి దగ్గిరికి వెళ్లి, పేరయ్య పెంకుటిల్లు కొనటం ఇప్పట్లో పడదని, ఆ బేరం రద్దయినట్లే భావించమని చెప్పి, ఇంటికి వచ్చి తలకు పట్టు వేసి పడుకున్నాడు భోజనం చెయ్యకుండా.
భార్య అన్నానికి రండని ఎన్నిసార్లు పిలిచినా లేవకుండా "చావను లేవే భోజనం చేయకపోతే! ఆ పంతులు గాదు చావందే నే నెక్కడ చస్తా" అనేవారట రామదాసు గారు.
అలాటి సమయంలో అత్తవారితో పోట్లాడి లింగరాజు లేచి వచ్చినప్పుడు రామదాసు గారు బాధపడ్డా రంటే అందులో ఆశ్చర్య పడవలసిందేముంది?
లింగరాజు మామ గారింట్లో తాను పొందిన అవమానాలను వివరంగా చెప్పాడు. ఇంక జీవితంలో రామచంద్ర పురం లో అడుగు పెట్టటం జరగదని, ఇంకో పెళ్లి చేసుకొని వాళ్ళకీ బుద్ది చెప్పాలని నిశ్చయించు కున్నానని చెప్పాడు.
ఒక పెళ్లి సంబంధం చూడటాని కై గుంటూరు వచ్చాడు. పిల్ల నచ్చలేదు . నిజానికా ఇంతి పిల్ల కాదు. లింగరాజు కంటే నాలుగైదేళ్ళు పెద్దదే. ఆ అమ్మాయికి కూడా అది రెండో పెళ్లి. మొదటి భర్తతో వారమంటే వారం మాత్రం కాపురం చేశాక, కలరా వచ్చి ఆకస్మికంగా మరణించాడు. ఏడు వేలు కట్నం ఇస్తామన్నారు. రామదాసు గారికి సంబంధం నచ్చింది. లింగరాజు కి పిల్ల నచ్చలేదు.
పెళ్లి చూపులయ్యాక, ముందుగా రామదాసు గారు, భార్య వెళ్ళిపోయారు జగ్గయ్య పేట. ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేయాలని గుంటూరు లోనే ఉండిపోయాడు లింగరాజు.
మూడో నాడు సినిమా హాలు దగ్గిర కనిపించింది హెలెన్.
హెలెన్ ని చూడగానే లింగరాజు మనసు పాదరసం లా పరిగెత్తింది. పరిపరి విధాల ఆలోచనలు పరుగులు తీశాయి. ఇద్దరూ సినిమా చూశారు. చిన్ననాటి సంగతులు చాలా చెప్పుకున్నారు. లింగరాజు తన జీవిత గాధంతా చెప్పి, "మంచి పిల్ల దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఉంది" అన్నాడు.
"నీకు దొరకటానికేం? నిక్షేపం లాంటి పిల్ల దొరుకుతుంది."
"నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటా."
హెలెన్ నవ్వింది. ఇద్దరూ సినిమా అయ్యాక బెజవాడ రోడ్డు వెంటగా నడిచి, నడిచి ఊరు విడిచి, పొగాకు కంపెనీలు దాటి, నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక తూము మీద కూర్చున్నారు. మసక వెన్నెల మబ్బుల చాటు నుంచి కురుస్తుంది. కొద్దిగా చలిగాలి వీస్తుంది. పైరు గాలికి హెలెన్ పైట చెంగు రెపరెప లాడుతుంది.
హెలెన్ నవ్వుతూ, గెంతు తున్నట్లు మాట్లాడుతూ మధ్యలో ఆగి, "రాజూ , నువ్వు నిజంగా ఒక నిశ్చయానికి వచ్చే అడుగుతున్నావా?' అంది.
"ఏమిటది?"
"నన్ను పెళ్లి చేసుకుకొనే సంగతి?"
"నీ కిష్టమేనా?"
"ముందు నీ సంగతి చెప్పు."
"నాకిష్టం కనకనే నిన్ను అడిగాను. ఇప్పుడు చెప్పవలసింది నువ్వు."
"నాకూ అనిపిస్తుంటుంది. రాజూ, ఒకోసారి. ఏ తృణమో, కీటకమో తోడు లేకుండా ఏ మనిషీ ఈ అనంత జీవిత పధంలో ప్రయాణం చేయలేడు. నేను ఒప్పుకుంటున్నాను. నిన్ను వివాహం చేసుకుంటాను. ఇద్దరం కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దాం." అంది హెలెన్.
లింగరాజు శుభలేఖలు ఫొటోలతో సహా వేయించి, ముందు రామచంద్రాపురం రెండు పోస్టు చేశాడు. ఒకటి : భార్య కల్యాణి కి, రెండోది :మామగారైన పంతులు గారికి. మామగారి మీద , భార్య మీద తానేదో కక్ష తీర్చు కొన్నట్టు సంతృప్తి చెందాడు లింగరాజు.
ఆ శుభలేఖ చూసి, గుండె ఆగి మరణించాడు పంతులు గారు. కల్యాణి జగ్గయ్య పేట ఉత్తరం వ్రాసింది.
సారధి గుంటూరు వెళ్లి నర్సుల హాస్టల్లో గెస్టు రూం లో కూర్చొని హెలెన్ తో మాట్లాడుతుండగా రామదాసు గారు వచ్చారు.
"చూడు హెలెన్. నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి" అన్నాడు.
"లింగరాజు ఏదో ఆవేశంలో నిన్ను పెళ్లి చేసుకుంటానని గొడవ చేశాడు వాడికి పెళ్లి అయింది. సలక్షణ మైన భార్య ఉంది. మామగారు మొన్ననే పోయారు. ఇప్పుడు మా వాడు నిన్ను చేసుకుంటే, నా కోడలు గతేం కావాలి? కులం చెడిన మా గతేం కావాలి? బంధువులంతా మమ్మల్ని వెలి వేస్తారు. మేం నీమూలంగా సర్వనాశన మై పోతాం" అంటూ బిగ్గరగా నాటకం ఫక్కీ లో రామదాసు గారు గంబీరంగా మాట్లాడుతుంటే, అవమానంతో, ఆవేశం తో దెబ్బతిన్న రాచులా బుసలు కొడుతూ హెలెన్, "మాస్టారూ ! మీ అబ్బాయిని చేసుకుంటానికి నేను సిద్దంగా లేను. దయుంచి వెళ్ళండి" అని లేచింది.
రామదాసు గారు లేడిలా నడుస్తూ వెళ్ళిపోయారు.
