Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 11


                                    15
    అదీ సేతుపతి గారి ఇంటి లోని పరిస్థితి! అప్పుడే కాదు; దాదాపు పది,పదిహేను సంవత్సరాలుగా కూడా ఇలాగే జరుగుతున్నాయి రోజులు.
    డిల్లీ వెళ్ళిన సేతుపతి, అటునించి కలకత్తా అక్కణ్ణించి అత్యవసరమైన పని మీద జంషెడ్ పూర్ వెళ్ళవలసి వచ్చిన కారణంగా, మళ్ళీ అయన మద్రాసు చేరుకోవడానికి వారం పది రోజులు పట్టింది. ఈలోగా అరుణ కూడా పడరాని పాట్లు పడవలసి వచ్చింది.
    అరుణ ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచీ కూడా చాముండేశ్వరికి  అనుమానంగానే ఉంది -- అరుణకూ, సేతుపతి గారికీ ఏ సంబంధమూ లేదనీ, స్వాభావికంగా దయగలవాడు కాబట్టి , అయన ఏ దిక్కు లేనిదాన్నో తెచ్చి అందలం ఎక్కించాలను కుంటున్నారనీ.
    సేతుపతి గారు అలా వెళ్ళారో లేదో చాముండేశ్వరి అరుణకు కబురంపింది.
    సేతుపతి ఇంట ఉన్నప్పుడు చాముండేశ్వరి కుక్కిన పేనులా పడి ఉండడం అలవాటు! అయన లేనప్పుడు మాత్రం, ఇంక ఆమె ధాటికి అగగలిగిన వారు ఆ ఇంట లేరు! ఆ విషయం అందరికీ తెలుసు!
    అరుణ, పాపం, అమాయకురాలు. అదీ కాకుండా వచ్చినప్పటి నుంచీ కూడా ఆ అమ్మాయి కి శంకర నారాయణ గారిని గురించిన విచారమే పట్టుకుంది. అమ్మగారు పిలుస్తున్నారని కబురు రాగానే, వచ్చి నమస్కరించి నిలుచుంది.
    "నీ పేరేమిటి?" మళ్ళీ మొదలు!
    "అరుణ అండీ!"
    "పెరుకేం లే! వడ్రంగి బిడ్డకు కూడా వనజాయతాక్షి అని పేరు పెట్టుకునే రోజులివి! అసలు మీదే ఊరు?"
    చాముండేశ్వరి సేతుపతి గారి అర్ధాంగి అయినా, ఆ అర్దానికీ, ఈ అర్దానికీ అమావాస్య కూ, పౌర్ణమి కీ ఉన్నంత తేడా ఉంది. ఆ అనుమానమే అరుణ కూ, కలిగింది ఇప్పుడు. అరుణ ను ఎందుకో అవ్యక్తమయిన ఒక భయం ఆవహించింది!
    "గుడ్లు మీటకరిస్తూ అలా చూస్తావేం?! మీదే ఊరు? అమ్మా, నాన్నా ఎవరు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మావారికి నువ్వెక్కడ దాపురించావు? చెప్పు! ఊ!"
    అరుణ ఏడ్చింది. ఏడుస్తూనే , "నాకెవ్వరూ లేరండి" అంది.
    "నేనూ అదే అనుకున్నాలే! మరి నువ్వు మా ఇంట తిష్ట వేసిందెందుకూ?"
    "అయ్యగారే తీసుకు వచ్చారండీ."
    "ఎందుకు తీసుకు వచ్చారూ అని నేనడిగేది!"
    "నాకేం తెలీదండీ. రైలు పెట్టెలో వారు నన్ను చూశారు. 'నాకెవరూ దిక్కు లేరు. నేను అన్ని పనులూ చెయ్యగలను. వంట కూడా చెయ్యగలను' అన్నానండీ!"
    "దాసీ ముండకు మా రఘు బాబు గది పక్కన గది కావలసి వచ్చిందెం? అయన గారికి అసలు మతి పోయింది! దయాదాక్షిణ్యాలకయినా ఓ అర్ధమూ పర్ధమూ ఉండాలి! ఇదుగో, నాయర్!"
    వంట మనిషి ప్రత్యక్ష మయ్యాడు.
    "ఇదుగో ఈ అరవ దేశంలో దాసీ లెవరూ దొరకనట్టు, అయన గారు మా దేశం నించీ దీన్ని తెచ్చారు. వెళ్ళు." చూడు, ఏదో ఒక పని అప్పజెప్పు. తీసుకు వెళ్ళు! ఏమే, నవనీతం!"
    "అమ్మా?"
    "పైకెళ్ళి దాని సామానంతా తెచ్చి, మీ గదుల్లో ఎక్కడో ఒక చోట పడెయ్యి!" అంటూ అన్ని ఉత్తరువులూ జారీ చేసింది.
    కాన్వెంటు నించి వచ్చిన రఘుపతీ, ఆంధ్ర మహిళా సభలో అన్ని ఏర్పాట్లు చేసి వచ్చిన సంబంధమూ అరుణ "ఎక్కడ అన్నారు."
    "ఎక్కడుండా లో అక్కడే ఉంది! దాని గొడవ నీకెందుకు బాబూ! వెళ్లి ఆడుకో! లేకుంటే కారులో అలా బీచికి షికారు వెళ్లిరా! ఏమయ్యా సంబంధం!"
    "అమ్మా?"
    "దానితో నీకేమి అవసరం వచ్చింది?"
    "అమ్మాయి గారు ప్రైవేటు గా మెట్రిక్ కు కట్టుకోడానికి ఆంధ్ర మహిళా సభలో అన్ని ఏర్పాట్లూ చేశానండీ!"
    "అబ్బో! అమ్మాయి గారు! ఆంధ్ర మహిళా సభ!'  అంది చాముండేశ్వరి ఈసడింపుగా. అంతటితో ఆగే స్వభావం కాదుగా మరి అమెది? అందుకుంది.
    "అది కాదయ్యా! మీరందరూ సెక్రటరీ లూ, మానేజర్లూ ఉండేదెందుకూ? ఆయనగారి నోటంట మాట రాగానే, డూ డూ బసవన్న ల్లాగా "ఎస్ సార్! అమా, సార్! అల్ రైట్, సార్" అంటూ దాన్ని సమర్ధించడానికేనా? మీరైనా కాస్త అలోచించి మంచీ, చెడ్డా అయన గారికి నచ్చ చెప్పద్దూ? ఆ దిక్కు లేనిది ఏదో పని చేసుకుని బ్రతుకుదామని వస్తే మీరంతా కలిసి దానికి పట్టం గట్టి, ఒక మహారాణి ని చేద్దామను కుంటారా? అయ్యగారు వచ్చిన తరవాత ఆ గొడవలన్నీ నేను చూసుకుంటాలే! నువ్విక దయ చెయ్యచ్చు!"
    "మీ ఇష్ట మమ్మా. కానీ అయ్యగారు వచ్చిన తరవాత, ఈ విషయంలో చాలా కోప్పడతారు."
    "ఏం ఫరవాలేదు. ఆయనగారు కోప్పడితే పడే అలవాటు నాకుంది. నువ్వేం బాధ పడక్కరలేదు! వెళ్ళు."
    సంబంధం వెళ్ళిపోయాడు.

                                                                   16
    సేతుపతి గారు వచ్చేదాకా అరుణ గతి అలాగే ఉండిపోయింది. కాయగూరలు తరిగింది. నౌకర్ల కు వడ్డన చేసింది. అమ్మగారి పాదాలు వత్తింది. అయినా అరుణ ఏమీ బాధ పడలేదు. రాత్రిళ్ళు తన పక్క మీద తానున్నప్పుడు మాత్రం శంకర నారాయణ గారూ , దుర్గా, సీతామహాలక్ష్మీ, సరస్వతీ అందరూ జ్ఞాపకం వచ్చేవారు. అలమటించి పోయేది.
    "నాన్నగారూ , నన్ను క్షమించండి. మీకు చాలా అన్యాయం చేశాను.' అనుకునేది తనలో తాను. నెమ్మదిగా తనకు తానె జోల పాడుకున్నట్లు , 'భజ గోవిందం' గీతాన్ని పాడుకుని నిద్ర పోయేది.
    ఆ రాత్రే వచ్చారు సేతుపతి. చాముండేశ్వరి, నాయరూ , ఇంటిలోని ఇద్దరు ముగ్గురు నౌకర్లూ మాత్రం అయన కంట పడ్డారు. పిల్లలిద్దరూ పడుకుని ఉంటారన్న ఉద్దేశంతో సేతుపతి వారిని గురించి అట్టే పట్టించు కోలేదు. భోజనం చేసి, వెళ్లి పడుకున్నారు. ఆ పిల్ల గొడవలేమీ ఆయనగారు ఎత్తనందుకు చాముండేశ్వరీ తనలో తాను కొంత తృప్తినే పొందింది. కానీ, తెల్లవారక మానదుగా! ఎంత దాచుకోవాలనుకున్నా వెలుతురూ లో ఏదయినా అందరి దృష్టి కి రాక మానదుగా!
    అదే జరిగింది! సేతుపతి బ్రేక్ ఫాస్ట్ చేసేసరికల్లా సెక్రెటరీలూ, మానేజర్లూ , రఘుపతీ-- అందరూ అయన దగ్గిరికి చేరారు.
"గుడ్ మార్నింగ్ , ఫాదర్."
    "గుడ్ మార్నింగ్ , సర్."
    "గుడ్ మార్నింగ్, సన్. గుడ్ మార్నింగ్ టూ యూ అల్. సుబ్బారావు గారూ, మిస్టర్ అయ్యంగారూ , ఒక పది నిమిషా లాగండి. ముందు హోం ఫ్రంటు చక్కదిద్ది తరవాత ఇండస్ట్రియల్ ఫ్రంటు కి వస్తా" అని అయన అనడమే తడవుగా అయ్యంగారూ, సుబ్బారావు గారూ వెళ్ళిపోయారు.
    "ఊ! ఏం , రఘూ? ఈ వారం పది రోజులుగా అరుణ మన దేవతల్ని, గురించీ, దేవుళ్ళ ను గురించీ నీకేమేం చెప్పింది?"
    రఘుపతి బిక్క మొగం వేశాడు.
    "అల్ రైట్, అల్ రైట్ . మన హిందూ మతం అంత తేలిగ్గా అర్ధమయ్యేది కాదులే. హిందూ మహాసముద్రం కంటే లోతయింది అది! దాని లోతు పాతులు తెలుసుకోలేక మన వాళ్ళందరూ పరమాతాల్ని భూషిస్తూ, మన మతాల్నీ దూషిస్తూ పురోగమనం సాగిస్తున్నారు. అరె! అరుణ ఏదీ? నేను వచ్చానని అమ్మాయికి ఇంకా తెలియదా, సంబంధం?"
    "సర్!"
    "అరుణ మహిళా సభకు వెళుతుందా?"
    సంబంధం ఎమనగలడు? మూగ జీవంలా ఉండిపోయాడు.
    "అరె! ఏమిటి సంగతి? అందరూ తమ తమ గుండెల మీద ఏదో భరించరాని బరువు నెత్తు కున్నట్టు సతమత మావుతున్నారెం? నాన్నా, రఘూ! ఏం జరిగింది, బాబూ?"
    "అమ్మ చాలా చెడ్డదండీ!" అని సమాధాన మిచ్చాడు రఘు. దానితో కొంత కొంత అర్ధమయింది ఆయనకు.
    "మీరు వెళ్ళగానే అరుణ నూ, అరుణ సామాన్నీ సర్వెంట్స్ క్వార్టర్స్ కు మర్పించిందండీ , నాన్నగారూ."
    "ఐ....సి! నాన్నా రఘూ, నువ్వెళ్ళు. బాబూ. అమ్మను నేను మండలిస్తా లే."
    రఘు వెళ్ళిపోయాడు.
    "మిస్టర్ సంబంధం , మీరు వెళ్లి అమ్మగారిని తీసుకు రండి. ఆ....అలాగే అయ్యం గారు గారినీ, సుబ్బారావు గారినీ, మరో ముప్పయి నిమిషాలాగమనండి."
    'అలాగే సర్."
    సేతుపతి పైపు వెలిగించి, దీర్ఘాలోచనలో పడి పోయి, అటూ ఇటూ పచార్లుచేయ్యడం మొదలు పెట్టారు. ఈలోగానే "సార్, అమ్మగారు......." అన్న సంబంధం గొంతుక వినబడింది.
    "థాంక్ యూ! మీరు పక్క గదిలోనే ఉండండి."
    "రైట్ , సర్."
    "రా, చండీ. నిలుచుండి పోయావెం? రా, కూర్చో!" అంటూ సేతుపతి చాముండేశ్వరిని సౌమ్యంగానే ఆదేశించారు.
    "మీరు నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నారో నాకు బాగా తెలుసు. కానీ.......' సేతుపతి ఆమెను అక్కడే ఆపాడు. "అరుణ పనిపాటలు బాగానే చేస్తుందా?"
    పిడుగు మీద పడుతుందనుకున్న చాముండేశ్వరికి అదేదో పిల్ల వాయువు లా సోకింది. ఆమె కసలు ఏమీ పాలుపోలేదు. సేతుపతి కి గుడ్లప్పగించి , అలానే నోరు తెరుచుకుని ఉండిపోయింది.
    'ఆహా! అది కాదు నేననేది. ఈవేళ కాకపోయినా మరో రెండు మూడేళ్ళ కయినా అరుణ వంటా గింటా చేయడం నేర్చుకో గలదా అని! ఏమంటే ఈ మలయాళీ నాయర్ల తో , అరవ వాళ్లతో మనం మాత్రం ఎంతకాలం వేగగలం? తెలుగు బిడ్డ , అందులోనూ ఆడపిల్ల! రానురాను  నీకు కూడా ఎంతో చేదోడు వాదోడు గా ఉంటుంది. ఏమంటావు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS