Previous Page Next Page 
బ్రతుకు బొంగరం పేజి 11


    "నిర్మొహమాటంగా నేను అన్ని విషయాల్లోనూ ఉంటాను. తినడం లో కూడా" అంటూ సురేంద్ర ప్రియంవద ఇచ్చిన ప్లేటు అందుకున్నాడు.
    రవి కొంచెం సందేహిస్తూ , "ఇప్పుడే కాఫీ తీసుకున్నాను" అన్నాడు.
    "వారు నిర్మొహమాటంతో బాధపడుతుంటే మీరు మొహమాటం ఎక్కువయి బాధపడుతున్నారు. మా ప్రియ జీడిపప్పు ఉప్మా డానికి మందు. మీరు కొంచెం తిని చూడండి. మళ్ళీ పెట్టించుకోకపోతే మాప్రియ చెవి కోసుకుంటాను."
    "మధ్య నా చెవి ఎందుకు?" అన్నది ప్రియ అందంగా ముక్కు విరుస్తూ.
    "భార్యాభర్తల మధ్య తేడా లేదుగా. నీవు నా అర్ధాంగి వి. ప్రస్తుతానికి నీ చెవి పందెంలో పెడతాను. ఏం?" అన్నాడు కొంటెగా ఆమెను చూస్తూ.
    సురేంద్ర ఈసారి రాజగోపాలం వైపు తిరిగి, "మీరదృష్టవంతులు. మీకు నాలుగు చెవులున్నాయి. అందుకని ఒకటి పోయినా ఫర్వాలేదు. నన్ను మాత్రం ఉప్మా మారు పెట్టించు కుంటే చెవి అడక్కండెం? రెండింటి తోనే నేను సరి పుచ్చుకోవాలి" అన్నాడు.
    ఉప్మా నిజంగానే చాలా రుచిగా ఉంది. మళ్ళీ ఇంకో సారి ప్లేట్లు నింపి ఖాళీ చేసిన తరవాతనే కాఫీ తాగారు.
    కాఫీలు అయిన తరవాత సురేంద్ర లేస్తూ, "నేను కొంచెం మా కంపెనీ దాకా వెళ్లి వస్తాను. నీవు కొంచెం ఆగి డైరెక్టుగా గదికి వచ్చేసేయ్" అన్నాడు.
    రవి గూడా పస్తా యిస్తూ లేచి, "ఎందుకూ , నేను కూడా వస్తాను" అన్నాడు.
    సురేంద్ర "నేను కాసేపు అక్కడ ఉండవలిసివస్తుంది. ఈ సమయానికి అక్కడికి వస్తానని కూడా చెప్పాను. మళ్ళీ ఇంకా ఏదో నాటకం తయారు చేయడాన్ని గురించి ఆలోచించాలి. నిన్ను బోర్ చేయడ మెందుకు? హాయిగా కాసేపు ఇక్కడ కూర్చొని వచ్చేసేయ్" అన్నాడు.
    రవి ఏం మాట్లాడలేక అలాగే నిల్చున్నాడు.
    రాజగోపాలం "నో, నో సురేంద్రా. మీరు కూడా ఉండండి. అందరం కలిసి ఇక్కడనే భోం చేద్దాం. అలా అని ప్రియకు చెప్పాను కూడా" అన్నాడు.
    ప్రియ "అవును. వంట సగం అయింది కూడా. మీరు ఇప్పుడు వెళ్ళటానికి వీలులేదు" అన్నది.
    వెళుతున్న సురేంద్ర ఆగి వెనక్కి తిరిగి "సారీ, ఈపాటికి అక్కడకు వస్తానని వాళ్లకు చెప్పాను. ఎదురు చూస్తుంటారు. నేను చాలాసార్లు భోజనం చేశానుగా మీ ఇంట్లో. నా సాలిది కూడా మా రవి తింటాడు లెండి" అని చకచకా వెళ్ళిపోయాడు.
    రవి నిశ్శబ్దంగా సోఫాలో కూలబడ్డాడు.
    రెండు క్షణాలు అలిసిపోయి కదల్లేదు.
    ప్రియ వంట పనికి కాబోలు లోనికి వెళ్ళింది.
    అలాగే నిశ్శభ్డం కొంచెం సేపు రాజ్యం చేసిన తరువాత రాజగోపాలం అన్నాడు : "మిమ్మల్ని ఎక్కువ విషయాలు అడిగి బాధించ దలుచుకోలేదు. ఆరోజు ట్రెయిను లో మీరు చెప్పిన మాటలు ఇంకా నాకు జ్ఞాపకం ఉన్నాయి. 'సుఖం కోసం -- అది ఎంత దూరంలో ఉన్నా సరే -- వెతుక్కుంటూ వెళుతున్నాను' అన్నారు. కాని ఒక్కటి మాత్రం చెప్పదలుచు కున్నాను. సుఖం వెతుక్కుంటే దొరకదు. మనం విషాదం లో గూడా సుఖం ఉన్నదనుకున్ననాడే సుఖం లభ్యమవుతుంది."
    రవి ఏం మాట్లాడలేకపోయాడు.
    "సురేంద్ర లాగానే నాకు కూడా కొంచెం నిర్మొహమాటం ఎక్కువ. మిమ్మల్ని గురించి నాకు తెలిసింది చాలా కొద్ది అయినప్పటికీ, ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసుకున్నాను. మీకు భావోద్వేగం, ఆవేశం ఎక్కువ. పరిస్థితులను మీరు అదుపులో ఉంచుకునే బదులు మీరు వాటి అదుపులో కి వెళతారు. చదువుకున్న వారు, అన్నీ తెలిసిన వారు. మిమ్మల్ని బాధపెట్టే విషయం అదెంత పెద్దదయినా సరే, బాధపడకుండా ఉండటం లోనే సుఖం ఉంది."
    రాజగోపాలం సూటి చూపులకు, మాటలకు అతను తట్టుకోలేక పోయాడు.
    "ఆనాడు ట్రెయిను లో మీరు ఘోరంగా మోసపోయానన్నారు. అయి ఉండచ్చు గాక, అంతమాత్రం చేత ఇప్పుడు మిమ్మల్ని మీరు మోసగించు కొడం ఏమీ బాగాలేదు. ఎందుకనో మిమ్మల్ని చూసిన మరుక్షణమె మీపట్ల నాకు ఎనలేని అభిమానం ఏర్పడింది. మనిద్దరి మధ్య అంత ఎక్కువ పరిచయం కూడా లేదు. నిజం మాట్లాడితే మీ విషయాల్లో జోక్యం కలుగ జేసుకొనే హక్కు కూడా లేదు. అయినప్పటికి నన్ను నేను కంట్రోలు చేసుకోలేక పోతున్నాను. మీరు పెనం మీద వేసిన అట్టులా బాధతో ఉడికి పోతుంటే చూడలేక పోతున్నాను. మీకు మనశ్శాంతి దూరమవుతుంటే నేను సహించలేక పోతున్నాను. మీరు ఇలా బాధ పడటానికి వీలులేదు. మీరు మామూలు మనిషిలా కావాలి."
    రవి కళ్ళల్లో నీళ్ళు నిండుకొని చూపు మసకయింది. తన బేలతనం రాజగోపాలం చూడకుండా ఉండేందుకని నెమ్మదిగా లేచి కిటికీ దగ్గిరికి వెళ్లి నిల్చున్నాడు.
    "మనకు కొన్ని సాంఘిక బాధ్యత లున్నాయి. కనీసం వాటిని దృష్టిలో ఉంచుకొని అయినా మీరు మెలగాలి. బాధపడట మనేది వ్యక్తిగతమైన విషయం. సంతోషాన్ని అందరికీ పంచి ఇవ్వటానికి మీకు హక్కు ఉంది గాని, విచారాన్ని దుఃఖాన్ని కాదు. కనీసం మీ బాధను బయటకు ప్రదర్శించకుండా ఉండటాని కయినా ప్రయత్నించండి. ప్రపంచంలో మనం చేయగలిగిన మేలు ఏదైనా ఉంటె, ఇతరులను మన కష్టాలతో కష్టపెట్టకుండా ఉండటం."
    ఆ మాటలు రవికి కోపాన్ని తెప్పించాయి.
    "నా బాధను ఎవరి నెత్తినా రుద్దలేదు, అందరు నా వెంబడి పడి వేధిస్తున్నారు గాని" అని అన్నాడు గాని తరవాత బాధపడ్డాడు. రాజగోపాలం అంటే అతనికి విపరీతమైన గౌరవ భావము, మాటల్లో చెప్పలేనటు వంటి ఆదరణ కలిగాయి. రాజగోపాలం కలుపుగోలు తనము, ప్రతి విషయాన్ని పరీక్షగా చూసి విచారణ చేసే తత్వము అతనిలో ఒక విధమైన ఉత్సుకతను కలిగించటం తో పాటు , రాజగోపాలం అంటే ఎంత నిండు మనిషో అర్ధమయింది. అందుకనే కోపాన్ని వెంటనే తమాయించుకొని, "క్షమించండి, నాకు కొంచెం కోపం ఎక్కువ" అని అన్నాడు.
    రాజగోపాలం వెన్నెల లాంటి మందహాసం తో "కోపం ఎక్కువ ఉన్న మాట నిజమే. దానితో బాటు ఎక్కువ  ఉన్నదన్న సంగతి కూడా మీకు తెలుసు. అందుకనే మీలాంటి వ్యక్తులంటే నాకు గౌరవం, తమ బలహీనతలను తమంతట తాము తెలుసుకోవడం చాలా కొద్ది మందికే సాధ్యపడుతుంది" అన్నాడు.
    రవి ఈమాతలతో కొంచెం సిగ్గుపడి తల వంచుకున్నాడు.
    "మీరు మంచి పని చేశారు. నాగపూర్ లోనే దిగిపోవటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలగ జేసింది. ఏదో ఒక సంఘటన కల్పించిన పరిస్థితికి తల ఒగ్గి మీరు ఇంటి నుంచి బయటకు రావడమనే బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ పరిస్థితుల్లో నేను ఉన్నా అలాగే చేసేవాడినేమో కాని, అంతటితో నన్ను నేను సరిచేసుకొని ఉండేవాణ్ణి. కనీసం బాధను దూరం చేసుకోవటానికి కావలసిన పరిస్థితులనన్నా కల్పించుకొనే వాణ్ణి. నిజమైన స్నేహితుడుగా, మీ మేలు కోరే మనిషిగా నా కోరిక ఒక్కటే. మీరు వెనకటి సంఘటనలు, మనుషులు, వాతావరణము-- అన్ని మరిచిపోవాలి. ఒకవేళ మీరు తొందర పాటులో ఇల్లు వదిలి వచ్చారను కుంటే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపొండి."
    "నేను వెళ్ళలేను. వెళ్ళను'! అది నరకం ........నా కక్కడ ఏమీ మిగలలేదు."
    "కొత్తగా పెళ్ళిచేసుకున్నారు. మీ భార్య...."
    ఆవేశంతో లేచాడు రవిచంద్ర. "ప్లీజ్, దయుంచి ఆ సంగతి జ్ఞాపకం తేకండి. ఏ విషయాన్నయితే నేను మరిచి పోదామనుకుంటున్నానో, ఆ విషయాన్నే మళ్ళీ మీరు కెలకకండి....నేను భరించలేను....నేను దెబ్బ తిన్నాను...."
    సానుభూతి తో రాజగోపాలం అతన్ని చూస్తూ, "క్షమించండి. అయితే నేను కోరేదల్లా ఒక్కటే. మిమ్మల్ని బాధపెట్టిన అన్నిటిని -- మనుష్యుల తో సహా -- మరిచిపొండి. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించు కోడానికి ప్రయత్నించు కొండి. చదువుకున్నవారు. మీకేం లోటు. అల్ ది బెస్ట్" అన్నాడు.
    "థాంక్స్.......ప్రయత్నిస్తాను" అన్నాడు రవిచంద్ర , రాజగోపాలం గొంతులో ధ్వనించిన సానుభూతి కి, తనపట్ల ఆదరణకు చలించి పోయి.

                                   7
    భోజనాలు చాలా హుషారుగా జరిగాయి. రాజగోపాలం మాటలు, ప్రియంవద ముగ్ధత్వము, ఆ ఇంటి ప్రశాంతత రవిచంద్ర కు చాలా రోజుల తరవాత మొదటి సారిగా మనస్సుకు శాంతి నిచ్చాయి; ముసురు లాంటి దిగులు నుంచి దూరం చేశాయి.
    రవిచంద్ర నిజమైన నవ్వును మొదటిసారిగా చూశారు రాజగోపాలం, ప్రియంవద.'
    భోజనం అయిన తరువాత కాసేపు పెకాడారు. ఆటలో సరదాగా రాజగోపాలం ముక్కలు మార్చి, దొంగ ముక్కలు దూర్చి ప్రియంవద ను కొంచెం సేపు ఏడిపించాడు. అటు తరువాత ఇద్దరూ కలిసి డ్రాయింగ్ రూం వెనకాలే ఉన్న రీడింగ్ రూం లోకి వెళ్ళారు. ఆ రీడింగ్ రూం లో అతను సమకూర్చుకున్న పుస్తకాలను చూసిన తరవాత రవిచంద్ర కు రాజగోపాలం అభిరుచులు అర్ధమయ్యాయి. అంతటి సంస్కారం, జీవితమంటే అంత తెలికదనం ఎలా వచ్చాయో ఆ రూం చెప్పక చెప్పింది.
    బీరువాల్లో వరసగా అమర్చిన పుస్తకాలను చూస్తూ, "మీకు రస్సెల్ అంటే ఎక్కువ అభిమానం లాగుందే?' అన్నాడు రవి.
    'అలాంటి దేమీ లేదు కాని, నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అలవాటు రస్సెల్ కు ఉంది కాబట్టి కొంచెం లైకింగ్. అంతే ....మరి మీరు........"
    "నేను చాలా తక్కువ చదివాను. అయినప్పటికీ అతనంటే అభిమానం. ముఖ్యంగా భగవంతుణ్ణి గురించి అతని కున్న అభిప్రాయాలు నాకు బాగా నచ్చాయి. భగవంతుడు ఉన్నాడా ;లేడా అన్న మీమాంస పై ఎంత తేలిగ్గా, సూటిగా అతనొక నిర్ణయానికి వచ్చాడో తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది."
    కాసేపు అయిన తరవాత ఇంకో బీరువా దగ్గిర నించి వెళుతూ , "నవలలు గూడా చాలా సంపాదించారు" అన్నాడు.
    "ఐ స్త్రాంగ్లీ అబ్జెక్ట్, నేను సంపాదించలేదు. నేను కొన్నాను. సంపాదించటమంటే 'చదివి ఇస్తాను, సార్" అని ఎవరినయినా అడిగి తీసుకొని ఇందులో పెట్టడం అవుతుందిగా" అన్నాడు రాజగోపాలం నవ్వు లాటకు.
    మనసారా నవ్వాడు రవి . "క్విక్ విట్ మీకు భగవంతుడు ప్రసాదించిన వరం" అన్నాడు.
    "మళ్ళీ నేను అభ్యంతరం తెలపక తప్పదు. మీకు భగవంతుడి మీద అంత పెద్దగా నమ్మకం లేనట్లు ఇందాక ఫీలర్ వదిలారు.ఇప్పుడు భగవంతుడు , వరప్రసాదం అంటున్నారు."
    రవి మెల్లగా నవ్వుతూ, "నిజమే ఒక జీవితకాలం గూడా సరిపోదు భగవంతుడి జోలికి పొతే. ఈ సృష్టి అంటూ జరిగిన తరవాత ఎన్ని కోట్ల మంది భగవంతుణ్ణి గురించి ఆలోచించారో! అయినప్పటికీ ఏమీ సాధించలేక పోయారు. ఒకవేళ భగవంతుడు ఉండటం అంటూ జరిగితే మళ్ళీ ఆయనే పుట్టి రావాలి, తనను గురించి తనను పరిశోధించు కొని అందరికీ తెలియజెప్పటానికి " అన్నాడు.
    రాజగోపాలం కుతూహలంగా అతన్ని చూశాడు కాని ఏమీ మాట్లాడలేదు.
    "ఇంగ్లీషు నవలలు బాగా చదువుతారులా ఉంది."
    "మీకు నచ్చిన రచయిత ఎవరు?"
    "బాగా రాసే ప్రతి వాడు నాకు నచ్చినవాడే."
    "అలా కాదు. మీ మనసును ఆకట్టుకున్న నవల ఏదైనా ఉందా?"
    "ఇప్పుడేమో గాని, అయిదారు సంవత్సరాల క్రితం 'ఆఫ్ హ్యూమన్ బాండేజ్ " చదివాను. అది నాకు బాగా నచ్చింది. మామ్ ను నేను బాగా లైక్ చేస్తాను. అయన కధాసంవిధానము, చెప్పటం లోని మెలకువ , నిజాయితీ నన్ను ముగ్ధుణ్ణి చేస్తాయి."
    "మన టెస్ట్స్ చాలావరకు కలుస్తాయన్న మాట. మామ్ నవలలంటే నేను ప్రాణం ఇస్తాను."
    "నేను ప్రాణం ఇవ్వను గాని, లైక్ చేస్తాను. ప్రాణం ఇస్తే చదవటానికి నేను ఉండను."
    రవి కొంచెం పెద్దగానే నవ్వాడు ఈసారి. "సంభాషణ మీ అంత గొప్పగా చేసేవాళ్ళ ను నేను చాలా తక్కువ మందిని చూశాను. ఎక్కడ నేర్చుకున్నారు?' అన్నాడు.
    ఇంతలో ప్రియ టీ తీసుకొని లోనికి వచ్చింది.
    "నిజం చెప్పమంటారా?" అన్నాడు టీ కప్పును భార్య చేతుల్లోంచి తీసుకుంటూ, ఆమెను చిరునవ్వుతో చూస్తూ.
    "ఊ, మిగతాది గూడా పూర్తీ చేయండి" అంది ప్రియ చిలిపిగా.
    రవికి ఏమీ అర్ధం కాలేదు. ఏమిటన్నట్లుగా ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "ఏమీ లేదండీ. నాగపూర్ కు తెలుగు సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. వచ్చినా ఎప్పటివో పాతవి. . ఆ మధ్యన పాతాళ భైరవి వచ్చింది. అది చూసి వచ్చిన దగ్గిరనించి , నిజం చెప్పమంటారా.... అబద్దం చెప్పమంటారా? అని అడగటం ఊట పదంగా మారి పోయింది. రాత్రి వేళ కొంచెం ఆలస్యంగా వస్తే, "ఏమండీ , ఇంత అలష్యమేం?" అని అడిగితె , తోటరాముడి ఫోజులో 'నిజం చెప్పమంటారా......అబద్దం చెప్పమంటారా?" అని అడుగుతారు. ఏం చేయాలి చెప్పండి?"
    ప్రియ మాటలకు రవిచంద్ర పెద్దగా నవ్వి , "బాగుంది . అలా అని అసలు సంగతి దాతెస్తారన్న మాట"అన్నాడు. రాజగోపాలం కూడా నవ్వసాగాడు. ప్రియ ఖాళీ కప్పులను తీసుకొని బయటకు వెళ్ళింది.
    "మరి నా సంగతి అడిగారు. కాని మీరు చెప్పరేం?"
    రవి ప్రశ్నార్ధకంగా తల ఎత్తి, "ఏ విషయం?" అన్నాడు.
    "మీ అభిమాన రచయితను గురించి?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS