Previous Page Next Page 
బ్రతుకు బాట పేజి 11

   
                              7
    ఎంత ఎండవున్నా సాయంత్రాని కల్లా చల్లని గాలి తిరుగుతుంది హైదరాబాద్ లో. వాకిట్లో పూల మొక్కల మధ్య కుర్చీలు వేసింది పనిమనిషి.
    "హాట్ డ్రింక్ కావాలా! కూల్ డ్రింకా!' అని పరిహాసం చేసింది కుముదిని గాజు గ్లాసులు టీపాయ్ మీద పెట్టి --
    'అంతదాకా రాలేదులే నేను-- ఆసలే వేడి ప్రాంతం నుంచీ వచ్చాను-- ఎండాకాలం -- కూల్ డ్రింకే కావాలి-- హైదరాబాద్ వచ్చాక హాట్ డ్రింక్స్ అలవాట్లైనట్లున్నాయి నీకు! అన్నది సుమిత్ర.
    'ఇంకా లేదులే ....' అంటూ గ్లాసులో షర్బత్ పోసింది కుమిదిని-
    'అవును బావగారోచ్చాక -- అయన ఫారిన్ నుంచీ వస్తారు  కదా! అలవాటయ్యే వుంటుంది--' అన్నది సుమిత్ర హాస్యంగా.
    'నాకెందుకో ఆయన్ని చేసుకోవాలని లేదు సుమిత్రా! ఆటనిక్కడే ఉద్యోగం వచ్చే సూచనలున్నాయని నిరుడు వ్రాశాడు. ఉద్యోగం వచ్చిందని మొన్నీ మధ్య వ్రాశాడు. -- ఏం వ్రాసినా నేనతనితో సరిపెట్టుకు పోలేనేమో అనిపిస్తోంది--' అన్నది కుముదిని వెంటనే.
    'ఎప్పుడు వ్రాసినా గర్ల్ ఫ్రెండ్స్ గురించీ కాక టైల్ పార్టీల గురించే! నాకు అసూయ లేదు సుమిత్రా! కానీ అలాంటి వాళ్ళంటే నాకు గిట్టదు. అమ్మాయి లతో స్నేహం వుండొచ్చు-- పార్టీలకు వెళ్ళొచ్చు-- కానీ ఇంతను కేవలం స్నేహం తో సరిపెట్టుకో గల మనిషి కాదు-- నేను ఎస్సెల్సీ చదివేటప్పుడే నన్ను రెండు మూడు సార్లు భుజం మీద చెయ్యి వేయబోయాడు-- ఇంకా అతని మీద చాలా రిపోర్ట్స్ వినేదాన్ని-- అందుకే నాకు అసహ్యం --' అన్నది కుముదిని మళ్లీ --
    'మీనాన్న గారికీ ఈ విషయం చెప్పావా?' అనడిగింది సుమిత్ర.
    'చెప్పడానికి భయం అనిపిస్తుంది సుమిత్రా! అయన బాధపడతారని -- పదిహేను వేల దాకా యిచ్చారు బావ చదువుకు గానీ, ఫారిన్ వెళ్ళడానికి గానీ! కానియ్! ఇప్పుడవన్నీ ఎందుకు! నువ్వేం చెయ్యాలను కుంటున్నావ్?"
    'చదువుకునే అవకాశం యింక లేదు కుముదినీ-- ఉద్యోగం కోసం ప్రయత్నం చెయ్యాలి-- మీ నాన్నగారు నాకేమైనా ఉద్యోగం యిప్పించగలరేమో అడగాలని వుంది -- ' అన్నది సుమిత్ర వెంటనే.
    'నాన్నగారు చెయ్య గలిగితే నీకన్న ఎవరికి సాయం చేస్తారు! తప్పకుండా అడుగుదాం -- ఇక్కడే దొరికితే మరీ నయం! మా ఇంట్లో వుండవచ్చును--' అని ఆశగా చూసింది కుముదిని.
    దక్షిణం నుంచీ వచ్చే చల్లని గాలి లాగే స్నేహితుల మధ్య చక్కని మాటలు దొర్లిపోయాయి. మూడేళ్ళ ఎడబాటు లో తామిద్దరికీ కలిగిన అనుభవాలు, ఎదుర్కొన్న సంఘటనలు, రూపొందించుకున్న భావాలు కలబోసుకున్నారు.
    సుమిత్రకి అక్కడ వుంటే హాయిగా వుంటుంది. చల్లగా వుంటుంది. కుముదిని సుమిత్రతో మాట్లాడుతూ వుంటే సుఖంగా వుంటుంది.
    పదిరోజుల్లో తిరిగి వెళ్ళాలని వచ్చిన సుమిత్ర రిజల్త్స్ పడే వరకూ అక్కడే వుండి పోయింది.
    'అమ్మో! నువ్వెళ్ళద్దు' అని గోల చేసేవాళ్ళు కుముదిని చెల్లెళ్ళు.
    సందేహత్మకంగా పేపర్లు వ్రాసిన వాళ్ళకి రిజల్ట్ ని గురించిన సందేహం వుంటుంది. బాగా వ్రాసిన వాళ్ళకి ప్యాస్ అయి తీరుతామన్న నమ్మకం వుంటుంది . సుమిత్రకి క్లాస్ వచ్చింది.
    కుముదిని సెకండ్ క్లాసులో ప్యాసయింది. ఆరోజున సుమిత్రని తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్లి ఉద్యోగం సంగతి ప్రస్తావించింది కుముదిని.
    'మా స్నేహితులది ఆఫీసు ఒకటివుంది. 'టీ' డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు. అందులో రెండు మూడు వేకన్సీ లున్నాయని మొన్న తెలిసింది. ప్రస్తుతం దాన్లో చేరు. తరవాత ఏదైనా మంచి ఫరం లో నెమ్మదిగా సంపాదిద్దాం-- అన్నారాయన, ఫ్రెండ్ కి టెలిఫోన్ చేసి.
    'అవును చేరిపో ! సుమిత్రా ! ప్రస్తుతం అని సలహా యిచ్చింది కుముదిని.
    ఉద్యోగంలో చేరే ముందు ఒకసారి అన్నయ్యనీ వదినేనూ పిల్లలనూ చూసి రావాలని వున్నది సుమిత్ర కి. కానీ ఎలాగ వెళ్ళడం! తెచ్చిన డబ్బు ఖర్చాయి పోయింది. వెళ్ళడానికి వుంది గానీ, తిరిగి రావడానికి లేదు. పిల్లలకి ఏమీ తీసుకెళ్ల కుండా రిక్త హస్తాలతో అసలు వెళ్ళలేదు తను.
    అందుకే నెలజీతం తీసుకుని వెళ్ళాలను కుంది.
    తనకి కిక్కడ ఉద్యోగం దొరికినట్లు వ్రాసిన ఉత్తరానికి పెద్దన్న దగ్గర నుంచీ వచ్చిన జవాబు యిది.
    'నీకు హైదరాబాద్ లో ఉద్యోగం దొరికినందుకు సంతోషం. తెలివి కలవాళ్ళ కి ఎందుకు దొరకవు ఉద్యోగాలు! విశ్వానికి విశాఖపట్నం లో బి.ఇ లో సీటువచ్చింది . హాస్టలు ఖర్చు దండగ అని బాబాయి గారి ఇంట్లోనే వుంటున్నాడు. ఏది ఏమైనా చాలా ఖర్చు కదా! సావిత్రి పి.యు.సి లో చేరింది. నా పని చాలా అవస్టగా వుంది. సావిత్రిని కాలేజీ లో చేరవద్దంటే వినలేదు. ఈ ఇద్దర్నీ ఒక్కసారేలా చదివించాలో తెలియడం లేదు. సుబ్బలక్ష్మీ కొడుక్కి టైపిస్ట్ వుద్యోగం దొరికింది. రాత్రి కాలేజీ లో చదువుకున్నాడు. మీ వదిన యిప్పుడు అందరికీ బట్టలు కుట్టి డబ్బు వసూలు చేస్తున్నది. అయినా ఈ చదువులెలా వేదతాయో తెలీక అయోమయ అవస్తలో పడిపోయాను-'
    ఇక చదవలేక పోయింది సుమిత్ర. కష్టాలను భూతద్దం లో నుంచి చూసి జడుసుకోడం కొందరికి అలవాటు. వున్న కష్టాలను మర్చిపోయి కులాసాగా తిరగడం మరికొందరికి అలవాటు. అన్నయ్య వెళ్ళబోసుకున్న బాధ ఎందుకనో సుమిత్ర సానుభూతిని సంపాదించ లేకపోయింది.
    ఆఫీసు వాతావరణం అంతా కొత్తగా వుంది. ఆఫీసు చాలా దూరం. రెండు బస్సులు మారి వెళ్ళాలి.
    అందుకని తొమ్మిదింటి కే భోజనం చెయ్యాలి. హాస్టల్ కి కొంచెం దగ్గర ఆఫీసు.
    'ఈ నేల ఇక్కడే వుండు సుమిత్రా! తరువాత హాస్టల్లో చేరవచ్చునులే. మేం పరాయి వాళ్ళమా ఏమిటి?' అని కోప్పడ్డారు కుముదిని తల్లి.
    'బస్ చార్జి కి ఈ డబ్బు నీ దగ్గర వుంచుకో సుమిత్రా! తరవాత ఇద్దువు గానిలే- నువ్వేమో ఉద్యోగస్తు రాలివి-- నేనే ముంది అప్త్రారాల్ స్టూడెంట్ -- ఇవ్వలేక పోతావా!' అని పది రూపాయల కాగితాలు కొన్ని సుమిత్ర హ్యాండ్ బ్యాగ్ లో వేసింది కుముదిని.

                          
    ప్రేమించడం , ప్రేమించ బడడం తప్ప మరో లౌక్యం ఎరగని ఆ కుటుంబ సంస్కారాన్ని ఎన్నోసార్లు అభినందించు కుంది సుమిత్ర.
    వాళ్ళకీ తనకీ మధ్య వున్న ఈ ఋణానుబంధం ఎన్ని జన్మలదో!
    ఆఫీసు మేనేజరు మధ్య వయస్కుడు. మంచివాడే. ఇద్దరు గుమాస్తాలు, ప్యాకర్ , ఫ్యూన్ వున్నారు. సుమిత్ర మేనేజర్ గారికి ఉత్తరాలు టైప్ చేసి పెట్టేది. కరస్పాండెన్స్ అంతా ఆవిడే చూసేది. పని తక్కువ గానే వుండేది. జీతం రెండొందలు.
    జీతం తీసుకోడం, అందులోనూ జీవితంలో మొదటిసారిగా తన కష్టార్జితాన్ని అందుకోవడం ఒక విచిత్రమైన అనుభవం. ఆఫీసులో నుంచి బయట పడి హుషారుగా ఇంటికి రాబోతు వుంటే చటుక్కున కుముదిని తన కిచ్చిన డబ్బు జ్ఞాపకం వచ్చింది. తిరిగి తీసుకోదని జ్ఞాపకం వచ్చింది. లేత నీలం రంగు జరీ చీర ఒకటి ఆమె కోసం తీసుకుంటూ వుంటే కాలేజీ లో చేరిన సావిత్రి జ్ఞాపకం వచ్చింది. సావిత్రి కోక పరికిణీ, ఓణీ, వదిన కోక పట్టు జాకేట్టూ తీసుకుంటే జీతం లో సగం అయిపొయింది. ఇక అక్కడికి వెళ్ళే ఆలోచన కట్టి పెట్టేసి బట్టలు పోస్ట్ లో పంపేసింది.
    'ఇంకో రెండు నెలలు మా ఇంట్లో వుండు సుమిత్రా! ఇంత సడన్ గా నువ్వు వెళ్ళిపోతే మేం వుండలేం!'; అని చెయ్యి పట్టుకుంది కుముదిని.
    తన ఆర్ధిక పరిస్థితి అందుకు తగ్గట్టు గానే వుండడం వలన వొప్పుకోక తప్పలేదు సుమిత్ర కి.
    తను పంపిన బట్టలు అందుకుని మాధవరావు చెల్లెలికి వ్రాసిన ఉత్తరంలో --
    'సుమిత్రా, మాకు నువ్వేమీ కానుకలు పంపవద్దు. పాపం విశ్వం చాలా అవస్త పడుతున్నాడు అక్కడ. నీకెప్పుడైనా వుత్తరం వ్రాస్తే వాడికో పాతికో, యాభయ్యో పంపుతూ వుండు. వాడికి నువ్వంటే చాలా అపేక్ష. నీకూ అంతే నని నాకు తెలుసు. అందుకని వ్రాశాను--' అని వున్నది. అది చదివి అలాగే నిలబడి పోయింది సుమిత్ర.'
    'మీకేం మీరు బాదర బందీ లెం లేనివాళ్ళు. వచ్చిన డబ్బు అంతా చీరెలకీ తల పిన్నులకీ ఖర్చు పెట్టుకుంటారు! మాకు ఇంట్లో ఎన్ని బాధ్యతలు?' అని తన కొలీగ్ కృష్ణమూర్తి జీతం తీసుకుంటూ కామెంట్ చెయ్యడం జ్ఞాపకం వచ్చింది సుమిత్రకి.
    నిజానికి తనకిప్పుడు బాధ్యతలేమీ లేవు . రెండేళ్లో మూదేళ్ళు ఉద్యోగం చేసి డబ్బు కూడ బెట్టుకుని ఎం.ఏ చదవాలనే కోరిక ఈ మధ్యనే కలిగింది. ఎలా డబ్బు కూడబెట్టగలదు? అలా అనుకునేసరికి ఆమెలో కొంత సంచలనం కలిగింది. చిన్నన్నయ్య కూడా ఇలాగే అనుకుంటే తనకీ చదువూ, ఉద్యోగం వచ్చేవేనా? వెంటనే విశ్వానికి వుత్తరం వ్రాసింది. 'నీకెప్పుడైనా డబ్బు కావాలంటే నాకు వ్రాయి విశ్వం -- ఏమి సిగ్గుపడకు!' అని.
    తరువాత నుంచీ నెలకి యాభై రూపాయలు పంపడానికి నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం లో ఆమె బడ్జెట్ లో కొట్టవచ్చినట్టు లోటు కనపడింది. ఎన్నాళ్ళ ని తను కుముదిని ఇంట్లో ఉచితంగా ఉండడం! పేయింగ్ గెస్ట్ గావుంటే తనకీ, వాళ్ళకీ కూడా బాగుంటుంది. హాస్టల్ ఫీజు కన్న వాళ్ళెం ఎక్కువ తీసుకోరుగా!
    'వుంటే గెస్ట్ గా వుండు! లేకపోతె వెళ్లి పో! మాకు పేయింగ్ గెస్ట్ లు వద్దు' అని కోపంతో అరిచింది కుముదిని.
    'అమ్మాయ్! మా అమ్మాయిల్లో నువ్వోకదానివి -- నువ్వు వెళ్ళవద్దు-- ఇక్కడే వుండు' అన్నారు వాళ్ళ నాన్నగారు.
    చెప్పడాని కేమీ మిగలని సుమిత్ర, వాళ్ళ కోసం నెలకి యాభై అరవై రూపాయలు ఖర్చు పెట్టాలని నిశ్చయించుకుంది మనస్సులో.
    ఎప్పుడూ ఏదో ఒకటి కొనిపడేస్తూ వుండే సుమిత్రని వారించడం మానుకున్నారు చివరికి వాళ్ళు.
    ఆఫీసు నుంచీ వచ్చే దారిలో ఇద్దరు కాన్వెంటు స్టూడెంట్స్ కి ట్యూషన్ కుదుర్చుకుంది సుమిత్ర. యాభై రూపాయలకి. నెలకి ఏభై బ్యాంకులో వేసుకునేది. అప్పటి నుంచీ మనస్సు తేలిక పడింది. విశ్వానికి చేసే సాయానికి అన్నయ్య కృతజ్ఞత చెబుతూ వ్రాశాడు.
    
                           *    *    *    *
    ఆఫీసులన్నీ మూసేసే వేళ సిటీ బస్సుల్లో రద్దీ త్రోసుకోడాలూ, పరుగెత్తడాలూ నగరంలో మనుష్యులకి బాగా అలవాటయిన పద్దతులే.
    ఆరోజు సుమిత్ర బస్ స్టాప్ దగ్గర అరగంట నిలబాడ్డా, ఆరు బస్సులు పోయాయే గానీ ఒకటీ ఆమెకి చోటివ్వ లేదు --


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS