తిరుపతి లో జరుగుతున్న తిరుపతి వెంకటకవుల శతవార్షికొత్సవ సభా కార్యక్రమాల ఏర్పాటు కేన్నుకున్న కమిటీ లో వకీలు పద్మనాభయ్య ఒక సభ్యుడు. పద్మనాభయ్య సాహిత్య సమ్మేళనాల్లో పాల్గొనే సరదా కలిగిన వ్యక్తీ! రాఘవరెడ్డి , పద్మనాభయ్య ఇరుగు పొరుగు లుగా అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ మంచి మిత్రులయ్యారు. ఆ మిత్ర త్వానికి పద్మావతీ కళాశాల లో చదువుకుంటున్న వాళ్ళిద్దరి కుమార్తెలు ఒక కారణం. అందులోనూ ప్రత్యెక కారణం వాళ్ళిద్దరికీ తండ్రుల పెంపకం వల్ల వచ్చిన తెలుగు భాషారుచి వాళ్ళను బంధించింది.
రాఘవరెడ్డి చనిపోయిన తరవాత ఒంటరిగా ఉంటె దుఃఖం మరిచిపోదేమోననే ఉద్దేశ్యంతో గోదాదేవి ని కొన్నాళ్ళ పాటు తమ ఇంటి కాహ్వానించారు పద్మనాభయ్య గారు, కుమార్తె అలివేణి. ఆ ఆహ్వానం తిరస్కరించడానికి కారణం లేకనూ, అయన కుటుంబమైనా జనసమ్మర్ధమైంది కాని కారణం మననూ అంగీకరించింది. పద్మనాభయ్య పెద్ద కుమారుడు కుటుంబంతో ఉద్యోగరీత్యా ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాడు. టెన్త్ క్లాస్ చదువుతున్న పదిహేనేళ్ళ కుర్రవాడు కుమారస్వామి , తనతో పాటు బి.ఎ ఆఖరి సంవత్సరం చదువుతున్న అలివేణి , భార్య పద్మావతమ్మ -- వీళ్ళలో ఎవరూ అభ్యతరకరంగా కనిపించలేదు గోదాదేవికి. ముందు సంగతి 'నందోరజా భవిష్యతి!' ఆరోజు ఆదివారం. అలివేణి, గోదాదేవి పద్మనాభయ్య తో పాటు వచ్చేశారు. ఒకవేపున ప్రత్యేకంగా అమర్చిన ఆడవాళ్ళలో కూర్చున్నారు. 'ఆద్యత నాంధ్ర కవి ప్రపంచ నిర్మాతలకు' జొహర్లర్పించడానికి దిగ్ధంతుల వంటి కవులు, పండితులు సాహిత్య పిపాసులతో సభ కళకళలడుతూంది.
అధ్యక్ష పీఠాన్ని విశ్వనాధ అలంకరించాడు. తిరుపతి కవుల శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు ఆ మహా కవితకు , ఆ అవధాన ప్రతిభకు అమృతవాగ్ఘరీ ధారలతో పాదాబిషేచనం చేశారు. పరవశత్వంతో వింటున్న గోదాదేవి తరవాత వక్తగా ప్రకటించిన పేరు విని ఉలికిపడింది. కళ్ళు విచ్చుకుని వేదిక పైకి చూస్తుంది. వేదిక పైన వాసవి తెల్లని పంచె, లాల్చీతో చిరునవ్వుతో నిలుచొని సభికులకు నమస్కరిస్తున్నాడు. ఆ కంఠం మంద్రంగా, శ్రావ్యంగా వినిపిస్తుంది.
'ఆ కవి సింహాలు అనన్య సాధ్యమైన అవధానాలు చేశారు. కేవలం అవధానం లో మాత్రమే వాళ్ళ ప్రతిభ పరిమితమై పోలేదు. ఆంధ్రదేశానికి కానుకగా అత్యుత్తమ సాహితీ మూర్తుల్ని సృష్టించి ఇచ్చారు. వాళ్ళు సాహిత్య సీమను అమూల్యమైన కవితామృతం తో గుండె కేతా మెట్టించగల రసస్వరూపాలు! "అల నన్నయ్య కు లేదు, తిక్కన కు లేదా భాగ్య" మన్నది అక్షర సత్యం!'
అతను నిరర్గళంగా ఉపన్యసిస్తున్నాడు. వాళ్లు రచించిన పద్యాలు అక్కడక్కడా చదివి, అందులో ఉన్న ప్రత్యేకత వివరిస్తున్నాడు. పద్యం చదవడం లో అతను పాటిస్తున్న పద్దతి కవి హృదయాన్ని కరతలామలకం చేసుకున్నట్లనిపిస్తుంది. రాగాచ్చాయలో ఆ స్వరం తనకు సంగీతం పరిచయమున్నట్లు చెప్పుతూనే ఉంది.
గోదాదేవి కన్నుల్లో అతను రకరకాల భంగిమల్లో కనిపిస్తున్నాడు. తన సూట్ కేస్ అందుకుని ముందుకు నడుస్తున్న మూర్తి, బండి తోలుతున్న తను, ములుగర్ర తో సేద్యం చేస్తూన్న రైతు, ప్రసంగిస్తున్న అతనిలో నించీ వెలువడుతున్న విభిన్న రూపాలోకసారి , అన్నీ వచ్చి మళ్లీ నిశ్శబ్దంగా అతనిలో ఐక్యమై పోయేమారు నిమిష మొక్కసారి! 'నా కెప్పుడూ అనిపిస్తుంటుంది-- ఇంత ఉత్తమంగా చేసిన నాటకాల్లో భీమునేందుకు పడుచేశారూ? అని. "భీముండిత్తరి రిత్త మాటలకు కోపింపండు సూపెంపరన్" అన్న ఒక్క వాక్యంతో తిక్కన అత్యున్నత స్థాన మిచ్చాడు. కేవలం ఈ పాత్ర విషయ మాలోచిస్తే తిక్కన భీముని ముందు తిరుపతి కవుల భీముడు చౌకబారు మోటు మనిషిగా కనిపిస్తాడు. దానికి కారణం వారి కప్పుడు కలిగిన నాటక దృష్టి -- అంటే పండిత పామర జనరజకం చెయ్యాలన్న ప్రయత్నమేమో ననిపిస్తుంది. ఏమైనా వాళ్లు కవనార్ధం బుదయించినారు, సుకవితా కార్యంలో జన్మను ధన్యం చేసుకున్నవారు.'
జనం లోంచి 'చెల్లియో! చెల్లకో! పద్యం చదవ' మని కేక! వెంటనే సూచన బలపరుస్తూ మరికొన్ని కంఠలు. సాహితీపరులు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో తోచలేదు.
'క్షమించండి నేను నాటకుణ్ణి కాదు, గాయకుణ్ణి కాదు. కేవలం సాహిత్యాభిమానిని. మీరన్నట్లు ఆ పద్యాన్ని ఆలాపించడానికి నేనర్హుడ్నీ కాను. అవి మీరెన్నో సార్లు వినే ఉంటారు. చివరకు నాలాంటి వాడి నోట గూడా ఆ పద్యాన్ని వినాలను కోవటం లో అర్ధమేమిటి? అదే తిరుపతి వెంకట కవుల రచనా ప్రతిభ....'
విజ్ఞుల ముఖాలు వికసిన్చినాయి! సమయోచితంగా చమత్కారం చూపినందుకు మెచ్చుకున్నారు.
'ఈ రసికుల అభిమానానికి సభ గురి కాకుండా తప్పించాడు. లోకంలో ఆయా రస గ్రహణ పారీణత ఇలా వెల్లి విరుస్తోంది!' అని బాధతో నవ్వుకున్నారు.
'ఆయన్ను కలుసుకోవాలి....' అంది గోదాదేవి పద్మనాభయ్య తో.
'పరిచితులా?'
"ఆ........'
వెతికారు. ఒకచోట అనంత కృష్ణ శర్మ గారితో మాట్లాడుతున్నాడు. 'నమస్కారం!' వెనక్కి తిరిగి -- 'ఓ ....గోదాదేవి!' అన్నాడు.
"నేను మీ ఇంట్లో పది రోజులు గడిపాను. మీరిక్కడి కొచ్చే ముందు నాకు తెలియ పరచనైనా లేదు. ఏం, మరీ అంత గొప్పవాళ్ళ మీరు?'
'లేదు...లేదు . సభ ముగుస్తూనే కలుసుకోవాలనే అనుకున్నాను.... నాన్న మరీ మరీ చెప్పాడు....'
'అంటే అనంతయ్య కో......
'ఆ....అక్షరాలా కో....గారే.....' పద్మనాభయ్య అర్దోక్తి లోనే అంది గోదాదేవి.
'అయితే, నేరమే!'
'ఏ సెక్షన్ తో కేసు బనాయించవచ్చో ఆలోచించండి....'
'వీరు పద్మనాభయ్య గారనుకుంటాను.'
'ఈయన పద్మనాభయ్య గారు, వారి కుమార్తె అలివేణి.'
నమస్కార , ప్రతినమస్కారాలు.
'పదండి, ఇంటికి పోదాం.'
'మిమ్మల్ని ఉదయం తప్పక కలుసుకుంటాను. నేనొక స్నేహితునికి....'
'లేదు....వీల్లేదు..'
'సరే, పదండి. ఏం చేస్తాను?'
నవ్వుకుంటూ శర్మగారితో సెలవు తీసుకున్నారు. బాలాజీ కాలనీ లో ఉన్న ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పుడే ఇంట్లోంచి ఓ యువకుడు బైటి కోస్తూన్నాడు. పరిచయాలు జరిగినాయి. అతను విశ్వభారతి లో ఇంగ్లీష్ ట్యూటర్ పోస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే పరిచయమైంది. అంతా వెళ్లి లోపల కూర్చున్నారు. అలివేణి, గోదాదేవి కాఫీ తెచ్చారు.
'ఈవేళ రావీన్ద్రగారు కూడా ఇక్కడే భోజనం-----అందాకా బాతాఖానీ ఫలహారం!'
రవీంద్ర అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు.
'మీరు ఉంటారనే వచ్చాను. అంతా ఎక్కడికో వెళ్లినట్లున్నారు.....'
'క్రిందటి ఆదివారం చెప్పాలను కున్నాను కానీ, ఇలాంటి వాటికి నువ్వు రావుగా....' అన్నాడు పద్మనాభయ్య.'
"ఇంతకూ కార్యక్రమ మేమిటి?'
'తిరుపతి వెంకట కవుల శతవార్షికొత్సవ......'
'రక్షించారు. ఎందుకా అర్ధం లేని పనులు? ఇంకా కాళిదాసు, తిక్కన ల జయంతులు, పోతన్న వర్ధంతు లు ఎంత సమాకాలిక సమాజ ద్రోహం!'
పద్మనాభయ్య వాసవి కేసి నవ్వుతూ చూశాడు.
'రవీంద్ర విప్లవ సాహిత్యం రావాలనేవాడు....'
వాసవి తల ఊపాడు.
'నిజానికి ప్రపంచం వాళ్ల నెప్పుడో మరిచిపోవలసింది.'
'అయితే, ఎందుకని మరిచిపోలేదు?' అన్నాడు వాసవి.
'ఎందుకంటె మీలాంటి..సారీ, మిమ్మల్ని కాదు..'
'అనండి! ఫర్వాలేదు, నేనలాంటి వాడ్నే!'
అంతా నవ్వారు.
'అది గొప్ప కవిత్వమని చెవులు బద్దలయ్యేట్లు మీలాంటి వాళ్లు చేస్తున్న భజనల వల్ల....'
'ఇందులో వాళ్ల తప్పేం లేదు. పాపం! వాళ్లలో ఒకరూ-- 'మాది గొప్ప కవిత్వమని ప్రచారం చేస్తుండ" మని కోరలేదు. కాళిదాసు నాది భావ కవిత్వమని చెప్పుకోలేదు. తిక్కన తనది అభ్యుదయ కవిత్వమన లేదు. అలాగే పోతన్న కానీ, శ్రీనాధుడు కానీ విప్లవ కవినని చాటుకోలేదు. ఎందుకో వ్రాశారు. ఈ కాలానికి పనికిరా డనుకుందాం! అట్లాంటిది ఎంత భజనలు చేసీ ఎవరూ నిలుపలేరు. కాలమే తుడిచేస్తుంది కదా? తర్క మెందుకు?'
'అది తప్పదను కొండి! "భారత మెందుకు చదవాలంటే మళ్ళీ అలాంటివి వ్రాయకుండా ఉండటాని" కన్నాడు కుటుంబరావు.'
'అంటే చదవాలని ఒప్పుకున్నారన్న మాటే!'
'ఎందుకు చదవాలో చెప్పారుగా?'
'అది సరేలెండి! మళ్లీ అలాంటివి వ్రాయవలసిన అవసరమ మెందుకు? అదీకాక ఇప్పట్లో ఎవరైనా అలాంటివి వ్రాయగలరన్న నమ్మకమూ లేదులెండి. పోనీండి, విప్లవ సాహిత్యమంటే ఎట్లాంటిది? దాని ఉద్దేశ్య మేమిటి? వివరిస్తారా?"
'సమాజం వ్యాధి గ్రస్తమైంది. ఆ రోగపీడిత భాగాన్ని శాస్త్ర చికిత్స చేసి తీసేయ్యక పొతే....'
'అది కొత్తది కాదు. వ్యాసునికి తెలిసింది. దాన్ని పోతన్న కూడా అన్నాడు -- 'దుష్టాంగమ్ము ఖండించి, శేషాంగశ్రేణికి రక్ష సేయు క్రియ." అని.'
'ఆ శస్త్ర చికిత్సను ప్రోత్సహించేదే విప్లవ సాగిత్యం. రాజరికపు మదాంధత రాజ్య మేలుతున్నప్పుడు , పరశురాముడు గండ్రగొడ్డలి తీసుకుని....'
'మీరు పురాణాల్ని నమ్మరు. ఆ బూటకపు గాధ లోని ఉదాహరాణ లెందుకు?'
రవీంద్ర ఒక్క నిమిషం ఇబ్బంది పడిపోయాడు.
"మీరంటున్న విప్లవ రచయిత హటాత్తుగా ఆకాశం నించీ భూమి కవతరించ లేదు. అట్లాగే, ఒకనాటి భావ కవీ, అభ్యుదయ కవీ గూడా. సమాజం వ్యాధి గ్రస్తమైంది. మీరైనా, నేనైనా, మరోకరైనా ఆ రోగాన్ని ఆరోగ్యంగా మార్చడమెట్లా? అన్న ఆలోచన చేయవలసిందే! శరీరమంతా కలుషితం చేసిన ఆ వ్యాధిని భాగు చెయడ మెట్లా? అందుకు తగిన ఔషదాలు వాడి, ఆ ఔషధం పట్టేటట్లు సరి అయిన వాతావరణం కల్పించి బాగు చేసుకునే పద్దతి ఒకటి. అది చాలాకాలం పట్టవచ్చు! అందుకు నిగ్రహం, దీక్ష, ఓర్పు అవసరం. తొందరగా బాగు చేయాలన్న తాపత్రయం తో , ఉద్వేగంతో ఒక కాలో, చెయ్యో తలో తీసివేసినంత మాత్రాన సర్వ శరీరగతమైన జబ్బు నయమౌతుందా? ఆలోచించండి! ఆనాడు అడిదము సూరకవి విప్లవ రచయిత! పురాతన ,చందాస మూర్ఖచారాలు తెంచి వేసే విప్లవ కర్తగా, తన పేరుకు ముందు 'అడిదము" ధరించాడు!'
"వాళ్ళు కేవలం తిట్టు కవులు.'
'విప్లవ రచయిత గా తనను తాను భ్రమ లో పెట్టుకుంటూ, ఇతరులు తన్నొక నవ సమాజ నిర్మాణ కర్తగా గుర్తించాలన్న కోర్కెలు ఉన్నవారి పద్దతి అప్పటికి, ఇప్పటికి ఒకటే! ఇంతా చేసి, ఇతరుల్ని బూతులు తిట్టే విప్లవ కవిత్వాన్నటుంచి , అర్ధమేమిటయ్యా? అంటే, సమ సమాజ స్థాపన! అది, మనుషుల్ని కాల్చి, చంపి , తలగొట్టి, రక్తం తో నినాదాలు వ్రాస్తే వస్తుందా? వేయి మంది సుఖం కోసం పది మందిని చంపినా పాపం లేదేమో! ఉన్నత వర్గంలో జీవిస్తున్న వాళ్ళంతా పాపాత్ములు కారు . కేవలం భయపెట్టి, ఆర్ధికంగా మాత్రమే సమాజ సమత్వం స్థాపించాలనుకోవడం నేల విడిచిన సాము! అందుకు మానసిక పరివర్తన తేవడమే మార్గం. దానికోసం సాహిత్యం సృష్టించవచ్చు! ఆ పద్దతి అసాధ్య మనిపించవచ్చు. కానీ ఇది మాత్రం మార్గమే కాదు....'
'విప్లవం సంగతలా ఉంచుదాం. ప్రస్తుతం ఆకలి విప్లవం రేపుతుంది. లేవండి!' అన్నాడు పద్మనాభయ్య.
అంతా నవ్వుకుంటూ లేచారు.
వంట మనిషి అందుబాటులో ఉంచినవి పద్మావతమ్మ వడ్డిస్తుంది. అంతా వరసగా కూర్చున్నారు. అద్భుతమైన భారతీయ స్త్రీ లోని మాతృ స్వరూపం సాక్షాత్కరించిన పద్మావతమ్మ ఆతిధ్యం చూచి ఒళ్లు పులకించింది వాసవికి. ఆమె అక్క డున్న వాళ్ల కందరికీ అప్పుడు అమ్మే! ఎదురుగా గోడకు వెంకటేశ్వరస్వామి పటం. క్రింద తగిల్చిన కొయ్య స్టాండు లో అప్పుడే కొట్టినట్లున్న కొబ్బరి కాయ! తెరలు, తెరలుగా పైకి లేస్తూన్న అగరువత్తుల పరిమళాలు!
