Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 13


    'విగ్రహారాధన మనకు వారసత్వమైన మరో జబ్బు' అన్నాడు రవీంద్ర.    
    ముద్ద మింగుడు పడలేదు వాసవి కి. పద్మావతమ్మ ముఖంలో ఏదో కష్టం కలిగించినట్లు మార్పు కనిపించింది. పద్మనాభయ్య చిరునవ్వు నవ్వాడు.
    'ఈ జబ్బు దేశామంతటా వ్యాపించడానికి మూల కారకుడు. మొదటి నేరస్తుడు ఏడు కొండలవాడె....'
    కొందరుంటారు-- ఏమాటా మాట్లాడినా అది ఏదో ఒక సాహసంగా కనిపించాలనీ, అందుకు తన నేదుటివాళ్ళు ప్రశంసించాలని స్వాతీశయంతో కోరుకుంటారు. వాళ్లకు వాతావరణాన్ని ఆహ్లాదంగా, సామరస్యంగా ఉంచడం చేతకాదు. పైగా అది వాళ్ల ప్రత్యేకత అని పొంగి చేశారు. రవీంద్ర అలాంటి వాడేమో? నిజానికి విగ్రహారాధన మీద వాసవి కి అంత నమ్మకం లేదు. అది వ్యక్తిగత విషయం! అంతమాత్రాన తానొక మహాజ్ఞాని నన్నట్లు ఇతరుల్ని విమర్శించడమా?
    'విగ్రహారాధన చెయ్యని దెవరు?' అన్నాడు వాసవి .
    "అంటే?'
    "ప్రతి ఒక్కరమూ ఒక విగ్రహాన్ని పూజిస్తూనే ఉన్నాము-- ఎవరి విగ్రహాన్ని వాళ్లు! దానికి దుస్తులు వేస్తున్నాం. జుట్టు అందంగా దువ్వుతున్నాం, వాసన నూనె లు వాడుతున్నాం. ఆ విగ్రహం కోరిన తిండి అమర్చటానికి బ్రతుకంతా వెచ్చిస్తున్నాం.....'
    'బాగా చెప్పావునాయనా!' అంది పద్మావతమ్మ.
    'నిజంగా ఈ విషయం అద్భుతంగా ఉంది....' అన్నాడు పద్మనాభయ్య.
    'ఈ విషయం ఎక్కడో విన్నట్లుంది....' అన్నాడు రవీంద్ర.
    'అవును, ఇదన్నది రమణ మహర్షి! అందుకే అంత అద్భుతంగా ఉంది. మీరూ, నేనూ అనే మాటలు ఎవరో అన్నవే! అవి మన అనుభవం లో , సాధనలో నిగ్గు దేలిన విషయాలు కావు. కేవలం తర్కానికి పని కొచ్చేవి! వాటిలో హృదయాన్ని ఆకర్షించే ప్రాణ శక్తి లాంటి సత్యం ఉండదు. మీరూ, నేనూ అహో రాత్రులు పోరాడినా ఏ విషయము తెల్చలేము. ఎందుకు? లాగవలసిన శక్తి ఉన్న కోడెలు రెండు కలిసికట్టుగా బండిని లాగుతాయి. శక్తి లేని వయితే ఆవెన్నడూ ఒకదాన్నొకటి నమ్మవు. ఒకటి అటూ, ఒకటి ఇటూ లాగుతుంది! బండి మాత్రం ఉన్న చోటనే ఉంటుంది....'
    'ఈ కోడెలూ, బండి విషయం మాత్రం మీ అనుభవంలో నిగ్గు దేలిందే!' అంది గంబీరంగా గోదాదేవి.
    అంతా పక్కున నవ్వారు.
    బయట వెన్నెల పాలవెల్లి లా ప్రకృతి ని ముంచెత్తుతుంది. ఎంత చిక్కని వెన్నేలో, అక్కడక్కడా అంత చిక్కని నీడలు!
    'ఇప్పుడు రవీంద్ర గారు ఏదైనా పాట పాడాలి!' అన్నది అలివేణి.
    'అలివేణి గారికి నేనెందుకో నచ్చలేదు. అందుకే ఇక్కడి కప్పుడప్పుడూ రాకుండా పీడ విరగడ చేసుకోవాలనుకుంటుంది...'
    'నా అభిప్రాయ మేమంటే వాసవి పాడగలడని...' పద్మనాభయ్య.
    'అదీ సంగతి! అలివేణి భోజనాలకు ముందే అంది -- వాసవి గారితో పాడించాలని. మీరంతా ఊరక కూర్చున్నారు....' గోదాదేవి.
    'తెలిసింది , అందుకు నన్నడ్డం చేసుకున్నారు.' రవీంద్ర.
    'పాడుతానను కొండి! కానీ, మీరు ముందుగా నన్ను గురించి పాడగలడు అనే భావ ముంచుకోకుండా ఉన్నట్లయితే నాకు కొంచెం బాగుండేది....'
    లైట్ ఆఫ్ చేశాడు!
    'అదేమిటి, ఏదో డిటెక్టివ్ నవల్లో లాగా.......'
    'వెలుగులో నా కెందుకో పాడాలని పించదు.'
    'వాటం చూస్తె , నాయుడు బావలా ఉందే....'
    వాసవి గొంతెత్తాడు. ఆ గానం విన్న వెన్నెల ఉండబట్టలేక కిటికీ గుండా గదిలో దూకి , అతని కాళ్ళ దగ్గరగా పడుకుని నిశ్శబ్దంగా అలకిస్తుంది.
    'తేనే తరగల పిండుతోన జలజల సాగు
    దాన...కిన్నెరసాని, జాలైన మేలైన
    వాకలో, అందాల    
    రాక లో , బంగారు]
    జిలుగు గంటలు మ్రోగే నో
    చిన్నారి, బిగువు నవ్వుల సాగేనో!'
    ఆ కంఠమూ, పాడే తీరూ, ఆ అద్భుత కవిత్వమూ కలిసి హృదయాలు కరిగి, కిన్నెరసానిగా మారి, జలజలా పారి, బైటి వెన్నెలలో కలిసి పోతున్నాయేమో ననిపించింది.
    ఇంకొక్కటి...' అన్నాడు పద్మనాభయ్య.
    'ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా!
    యెన్నెలల సొగసంతా యేటి పాలేనటర?'
    కంఠ మాధుర్యమే కాదు, ఏదో గాడమైన హృదయ స్పర్షి అయిన గుణం వాళ్ల నపూర్వమైన వాతావరణం లో ముంచింది. వాసవి లైటు వెలిగించాడు. అప్పుడే మేలుకున్నారు.
    'అద్భుతంగా పాడారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ! నాకు సెలవివ్వండి!' రవీంద్ర వెళ్ళిపోయాడు.
    పడక లేర్పాటయినాయి.
    'మీ విగ్రహాని కింక ఏ మవసరం లేదా?'
    వాసవికి నవ్వొచ్చింది. 'ఆహా....విగ్రహానికి ప్రస్తుతం నిద్రొస్తోంది. అవసరమైతే పక్కన దేవీ విగ్రహ ముందిగా...' మాటల్లో సరస్వతి పెళ్లి విషయం చెప్పలేదు. సావిత్రి విషయం చెప్పాడు. గోదాదేవి సానుభూతి ప్రకటించింది.
    ఆ పల్లెలో అన్ని రోజులు ఉన్నా , వాసవి ఈ మాత్రం మాట్లాడలేదు. అనుకోకుండా వాసవి ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మళ్ళీ రేపు వెళ్ళిపోతాడు. అయినా, ఏదో దగ్గరయినట్లనిపిస్తుంది. ఇంకా ఎన్నో మాట్లాడుతూ , చంద్రుడు క్రుంకేవరకూ వెన్నెల్లో కూర్చో గలిగితే బావుండు ననిపిస్తుంది.
    'దేవీ విగ్రహం పక్కన ఉంటుందిగా....' నవ్వుకుంది! అతని పాట గుండెకు దగ్గరగా తీయగా వినిపిస్తుంది --'వెన్నెలల సాగనంత , యేటి పాలె నటర!'

                           *    *    *    *
    'సరస్వతీ!' చలిమలో నీళ్లు పోసుకుని, లేచి కడవ అందుకోబోతున్న సరస్వతి తిరిగి చూసింది. పది బారల దూరంలో పడిపోయిన బావి చాటున ఇసుక లో కూర్చున్న సూర్యనారాయణ . సరస్వతి ముఖం తిప్పుకుంది.
    'సరస్వతీ! ఒక్క మాట....' కంపిత స్వరం!
    సరస్వతి వెళ్ళగూడదనుకుంది. తరవాత వెళ్లి, ఇంకెప్పుడూ ఇట్లా పిలవకుండా ఉండమని హెచ్చరించాలనుకుంది.
    తూర్పు వైపున గిరి గీసి చెడుగుడు ఆడుకుంటున్న పసులకాపర్లు! నీటి జాలు దగ్గర జోలకతో చేపలు పట్టి బైటి కేస్తూన్న ముసలాడు, ఏరి కుండలో పదేసుకుంటున్న ఒక పిల్ల.

                                    
    "ఏం?'
    "కూర్చో!' కొంచెం నవ్వుతో సూర్యనారాయణ.
    'ఫరవాలేదు, గొప్ప మర్యాదస్తులే...' ముఖంలో మెరుపు లాంటి విరుపు!
    'నామీద చాలా కోపమొచ్చింది కదూ?'
    సరస్వతి మాట్లాడలేదు.
    'ఆరోజు నేను ఊళ్ళో లేను....వచ్చిన తరవాత తెలిసింది.'
    'తెలిసిం తరవాత చేసిందేమిటి?'
    'ఆలోచించాను....'
    'మంచిది. ఆలోచించు! ఆలోగా నేనూ అత్తవారింటి కెళ్లి పోతాను...'
    'అత్తవారింటి కెళ్లాలని అంత తొందరగా ఉందా?'
    'లేక నీలాంటి వాడి కోసంచూస్తూ పడుండమంటావా?'
    'నువ్వు నాకెంత అవసరమో ఇప్పుడర్ధమవుతోంది.'
    'కానీ, నువ్వు నా కనవసరం...."
    'సరస్వతీ ! నిదానంగా ఆలోచించు. పొరపాటే జరిగింది. అందుకు నా బాధ్యత ఎంతో తేల్చుకో! మొదటి నుంచీ మన పెళ్ళి మా నాయన కిష్టం లేదు. కట్నం రాలేదనీ, మీరు కులాన్ని పాటించరనీ అయన అభ్యంతరం! అయితే, పెద్దగా నన్ను కాదనలేక పోయాడు. కాదంటే, నా పేరుతొ ఉన్న ఏభై ఎకరాల పొలం మా తాతగారి ఆస్తి పంచి ఇవ్వవలసి ఉంటుంది. అందుకని విధిలేక ఒప్పుకున్నాడు. ఆరోజు మీ అన్నయ్య ఏమేమో అన్నట్లు చెప్పాడు. నేనంతగా నమ్మలేదు. కానీ, రంగయ్య వీధంట పోతుంటే  మీ నాన్న పిలిచాడనీ, మెడలో హారం తీసి విసిరేసి వాళ్ళకు పారేయమని నువ్వే అన్నావంటే నాకు బాధ కలిగింది....'
    సరస్వతి ఆశ్చర్యపడింది!
    'దానిలో నిజ మెంతో విచారించాలనిపించ లేదా?'
    'అప్పుడు విచారించాలనిపించలేదు; ఇప్పుడు విచారించవలసిన పని లేదు.'
    'మరి, నాతొ మాట్లాడవలసిన పని మాత్రం ఏముంది?'
    'అర్ధం కాలేదూ? అవి నిజాలో,  అబద్ధాలో నా కెందుకు? నాకు కావలసింది నువ్వు....'
    సరస్వతి నవ్వింది. ఆ నవ్వును తదేకంగా చూస్తూన్నాడు సూర్యనారాయణ.
    'మీ తాతగారు నీ పేర వ్రాసి పెట్టిన ఆస్తిని కాదు నేను!'
    సరస్వతి చేయి పట్టి లాగాడు సూర్యనారాయణ. ఒక్క ఊపున అతని పైన వాలింది. ఎడమచేయి అతని కుడి భుజాన్ని ఆసరా చేసుకుంది.
    పైట జారి, మరీ అంత అందం ఒక్కసారి కనిపించటం ఒంటికి మంచిది కాదన్నట్లు అతని ముఖం మీద ముసుగులా కప్పుకుంది. ఆ ముసుగులో వెచ్చని విశ్వాస ఇద్దరి గుండెల మధ్యా దాగుడు మూత లాడింది!
    'నిజం చెప్పు! నువ్వు నా ఆస్తి కాదూ?' అన్న మాట పాటగా మారి, ఆ మాధుర్యం శరీరం లో అణువణువున ఆనందలహరులు సృష్టించినట్లు పులకరింతలు!
    ఒక్క నిమిషంలో సర్దుకుంది సరస్వతి . మాట్లాడకుండా ముందు కడుగేసింది.
    'సరస్వతీ! ఏమీ చెప్పలేదే....'
    'మీ నాన్నను తలుచుకుంటుంటే ఇప్పుడింకా అసహ్యంగా ఉంది.'
    వెలవెలపోయిన ముఖంతో వెళ్లే సరస్వతిని చూస్తూన్నాడు సూర్యనారాయణ. ఆ ఇసుక లో దిగబడుతున్న పాదాలను లాక్కుంటూ, తనమీద కోపంతో ఆ నడకకొక ఉద్వేగా న్నిచ్చి వెళుతున్న ఆ సరస్వతి దూరమై పొతే బ్రతకడమెట్లా? తనలాంటి ఆస్తిపరుడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటూ ననడంగొప్పగా భావించడం పోయి , ఈ సరస్వతి కెంత అహంకారం! ఆ అహంకారం తనకు కోపం కలిగించడానికి బదులింకా అభిమానం పెంచుతుంది.
    సరస్వతి వెళ్లి కడ నందుకుని వెళ్ళబోతూ వెనక్కి చూసింది! సూర్యనారాయణ ముఖంలో చిరునవ్వు విరిసింది. 'దొంగా , దొరికావు!'

                              *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS