Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 11


    రాజశేఖరం ముఖం చూశాడు. ఆ ముఖం లో ఇందాకటి సంశయం, భయం లేవు. బరువు తీర్చుకున్నట్లు నిర్మలంగా ఉంది. ఎదురొడ్డిన సమస్యను ఎదుర్కొన్న సాహసం కనిపిస్తుంది. మాట్లాడుతున్నాడు.....
    "ఈ పల్లెను విడిచి పోలేకపోవటం మీ స్నేహ బంధం వల్లనే అని మొన్న అన్న మాట అసత్యం! అందుకు సావిత్రీ సరి అయిన కారణం!'
    నిర్భయమైన సత్యవాణి కి మనస్సు పులకించి, ఆ ప్రయత్నంగా అతని వీపు తట్టాడు.
    "ఈ విషయం నేనెన్నడూ ఆలోచించలేదు."
    "ఇంతకు ముందెన్నడూ ఆలోచించలేదంటే, అందుకు నా అనర్హత కారణ మేమో?'
    "అగు! నా ఆలోచనా పరిధి గూడా అందుకు కారణం కావచ్చు!'
    'ఇప్పుడే చెప్పాలని లేదు, ఆలోచించండి!'
    'అలోచించి నా గుడ్డి తనం చాటుకోను. ఇప్పుడే చెపుతాను; ఇదే మంచి చోటు! ఈ పచ్చని పొలం లా మీ జీవితం పచ్చని కళ్యాణ తోరణం గావాలి....'
    బార దూరంలో ఉన్న అతను ఎప్పుడు దగ్గరగా వచ్చాడో, తానెప్పుడు చేతులు సాచాడో? ఒకరి కళ్ళు చూచి మరొకరు నవ్వుకున్నారు.

                            *    *    *    *
    ఆ రాత్రి ఇంట్లో ఆ విషయం ప్రస్తావించాడు. భార్య నిరభ్యంతరం గానే ఒప్పుకుంది. సంతోషంతో ఒప్పుకుంటుందనుకున్న సావిత్రి ఒప్పుకోలేదు. అంతా శుభాకరంగా పరిణమిస్తుందన్న తన ఊహ తారుమారయింది. సావిత్రి రాజశేఖరం లాంటి వాణ్ణి ఎందుకు స్వీకరించలేక పోయింది? 'మీ జీవితం కళ్యాణ తోరనమౌతుంది!' అని ఆశీర్వదించినప్పుడు కనిపించిన కళ్యాణం గాంధర్వ మూర్తి కి ఆ రాజశేఖరానికే తరవాత సంగతి చెప్పక తప్పలేదు.
    విని, చిరునవ్వు తోనే అన్నాడు; 'అందుకు మీరేం బాధపడకండి. అది సావిత్రి జీవితం ...అందులో ఇంతకూ మించీ ప్రవేశించే హక్కు మనకు లేదు.'
    ఒక్క నెల గడిచింది. మరో సంబంధాన్నీ సావిత్రి తిరస్కరించింది. అప్పుడు తెలిసింది విషయం. రాజషేఖరాన్ని పారవేసి, నరసింహాన్ని ఏరుకోవడం లో సావిత్రి కబ్బిన సంస్కారాన్ని తలుచుకుని ఎంతో బాధ కలిగింది. అయినా చేసేదేముంది? స్వయంగా కరణం దగ్గరి కెళ్ళాడు.
    'మరి, నరసింహం ఏమీ మారలేదే....' వ్యంగ్యంగా అన్నాడు కరణం.
    'లేదు! నరసింహం మారలేదు. మారాడు. నువ్వూ మారవు. మారింది నేను. నేను మారక తప్పలేదు. మీరెవరూ మీ స్వభావం నించీ మారవలసిన పరిస్థితి రాలేదు. ఆ స్థితి కన్న కూతురు కోసం నాకు కలిగింది!' బైటి కేమీ అనలేదు.
    'నువ్వు పిచ్చివానివయ్యా! ఈ కాలానికి పనికి రావు. నీ కడుపున బుట్టిన సావిత్రి తెలివైన పిల్ల....' నోరెత్త కుండా దెబ్బలు తిన్నందుకు కరణానికీ అంతటితో తృప్తి కలిగింది. అట్లా వ్యవహారం ముందుకు జరిగింది. పెళ్లి పనుల్లో మునిగిపోయాడు.
    పట్నం లో ఏదో వ్యాపారం చేయదలుచుకున్నానని, ఆఖరి సరిగా ఊరు విడిచి పోతున్నప్పుడు రాజశేఖరం సెలవు తీసుకున్నాడు. సావిత్రి నిర్ణయం అతని హృదయం మీద ఎంత దెబ్బ తీసిందో అర్ధమైంది.    
    'ఈ పల్లె విడిచి పోలేనిది మీ స్నేహ బంధం వల్ల అన్నాను; ఆదసత్యం , అందుకు సరి అయిన కారణం సావిత్రి' అన్న అతని మాటలు జ్ఞప్తి కొచ్చినాయి! అతన్ని ఆపేందుకు తన దగ్గర ఏ బలమూ లేదు. కళ్ళు చెమ్మగిల్లాయి.
    కొన్ని వసంతాలు, శిశిరాలు గిరగిరా తిరిగినాయి! సావిత్రి నించీ శ్యామల అవతరించింది. నరసింహం తల్లీ, తండ్రి గతించారు. తొండ ముదిరి ఊసర వెల్లిగా మారింది. ఆస్తి తిరిగి అప్పుల పాలయింది. అప్పుడప్పుడూ చేతనైనా సాహయం చేయడం తప్ప ఇంకేమీ చేయగలిగింది లేదు. రెండేళ్ళ క్రితం ఇంకో విచిత్రం జరిగింది!
    ఒక సంధ్య వేళ సావిత్రి బండి కట్టించుకుని వచ్చింది. ఏదైనా డబ్బు అవసరమేమో; లేక శ్యామల గూడా పెళ్ళీడు కొచ్చింది, ఏదైనా సంబంధం విషయంగా వచ్చిందేమోననుకున్నాను. భోజనాలయిన తరువాత సావిత్రి చెప్పిన విషయానికి అంతా స్థాబ్డులై పోయారు. సావిత్రి మూర్ఖత్వానికి నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు. ఇంతకూ సావిత్రి వచ్చిన పనేమీటంటే - పుత్రుల్ని పొందలేని తనకు సపత్నిగా సరస్వతి నిమ్మని అడగటానికి!
    తినటాని కింత ఆస్తి లేదు. కష్టపడి వెదికి తెచ్చి, కన్యాదానం చేసి అల్లుడి కాళ్ళు కడగవలసిన సమయం!  దురాచారి అయిన మగని కోర్కెకు తోబుట్టువునైనా బలి ఇవ్వడానికి పూనుకుంది. కన్నబిడ్డ అయినా, సావిత్రి మీద అసహ్యం కలిగింది! సరస్వతి పక్కున నవ్వింది. 'అక్కా, మనం సుమతి కధ విన్నాము. గొప్ప పతివ్రతగా ఆడవాళ్ళు విశ్వసిస్తున్న ఆమెలో నాకు ఘోరమైన నీచత్వం కనిపించేది. ఏం శిక్ష విధించాలా అందురాలికి? ఆమె చరిత్ర తుడిచివెసేదేట్లా! అని అలోచించేదాన్ని. కానీ, అది తుడిచేసేది కాదు. అది ఆడదాని లోని అసహ్యకరమైన అంధ పాతివ్రత్యం! అది ఎందర్నో స్త్రీలను నాశనం చేస్తుందే కానీ, అది చావదేమో! అనిపిస్తోంది నిన్ను చూస్తుంటే! నువ్వు సాక్షాత్తూ , సుమతి అంత దానివి! నీ మగడు నిజంగా కుష్టు రోగి. ఉండు....మానవత్వ మనే ఆరోగ్యానికి నోచుకోని కుష్టురోగి . కానీ , నేనెవర్ని> నేను సరస్వతిని. మామూలు ఆడదాన్ని. ఓపిక ఉంటె నీ మొగుణ్ణి మోసుకుని, ఆనాటి నారకాంత కాంతి స్త్రీ చరిత్ర పునరావృత్తం కావడానికి జన్మించిందేమో వెదుకు! నీలాంటి అద్భుత స్త్రీని అక్కగా తలుచుకోవడానికి కూడా సిగ్గు కలుగుతోంది! కూతురు పెళ్ళి జేసి , మనవల్ని జుడాలని కోరుకునే వయస్సులో, మగాణ్ణి మళ్ళీ పెళ్లి కొడుకుగా చూసి తరించి పోవాలన్న నీ ఆలోచనకు ఆనందంతో ఒళ్లు దహించుకుని పోతోంది! తల్లీ, దండాలు!...'
    ఒక కన్ను చీకటి లో , ఒక కన్ను వెన్నెలలో తెరుచుకున్నట్లయింది. ఒకే మొక్కకు పూసిన రెండు పువ్వులు! ఒకటి దుర్గంధ కుసుమం, మరొకటి మనోహర సౌగంధికం! ఎందుకీ భేదం కలిగింది? భూమి ఒక్కటే, పోషణ ఒక్కటే...ఇంత విపరీతమైన విభిన్న తేమిటో?
    ఎంత బతిమాలినా వినకుండా అలిగిన సావిత్రి ఆ రాత్రే వెళ్ళిపోయింది. ఆ తరవాత రెండు మూడు  సార్లు వెళ్ళినా అల్లుడూ, కూతురూ పలకరించలేదు. మనస్సెంత నోచ్చుకుందో సావిత్రి గమనించలేదు. కస్సున ముళ్ళు దిగడంతో 'అబ్బా! అన్నాడనంతయ్య. ముందు వెడుతున్న మంగలి పరుగున వచ్చాడు. కూర్చున్న అనంతయ్య కాలు తొడమీ దుంచుకుని కుడిచేత పెరికాడు. చివ్వున రక్త మెగజిమ్మింది. తల మీది తుండు చింపి గట్టిగా కట్టు కట్టాడు.
    "తీగె తుమ్మ ముళ్ళు శానా సెడ్డది. కాపడం పెట్టక పొతే కాలు కింద పెట్టలేవు సోమీ!'
    లేచి మెల్లగా నడక సాగించాడు. కాలిలో మేకు దిగగొట్టినట్లు బాధ కలిగిస్తుంది. ఊరు దూరాన కనిపిస్తుంది. పడమట సూర్యుడు-- "పాపం! వాళ్ళు ఊరు చేరుకోనీ తర్వాత పోవచ్చు!" అన్నట్లు ఓపిక తెచ్చుకుని చూస్తూన్నాడు. "తీగె తుమ్మ ముల్లు' అన్న మాటలో 'తీగె!' అన్న మాటకు విశేషార్ధం ఊహిస్తుంది మనస్సు. తననూ, సావిత్రి ని కలుపుతున్న తీగె పూలతీగా? లేక తుమ్మ తీగేనా? దాని ముల్లు వచ్చి గుండెల్లో గుచ్చుకుంటుందా?
    గ్రామసింహం దీనా క్రందన , కోడి కూత, గొడ్ల నిల్లు చేరుస్తున్న పసుల కాపర్ల కేకలు!
    "అమ్మయ్య, ఊరు చేరుకున్నారు. నేను పోవచ్చు!" అనుకున్నాడు సూర్యుడు.
    ఇంటి ముందు అయిదారు మంది మగవాళ్ళ గుంపు! లోపల ఆడవాళ్ళ మధ్య సావిత్రీ, శ్యామలా శోకదేవత, దరిద్రదేవతల్లాగున్నారు! మంచం మీద స్పృహ లేని నరసింహం! అనంతయ్య ను చూస్తూనే సావిత్రీ , శ్యామలా ఘోల్లు మన్నారు. పక్కనున్న వాళ్లు కళ్ళు ఒత్తుకున్నారు. నరసింహం పిలిచినా పలకలేదు. "ఎప్పత్నించీ ఇట్లా ఉన్నాడు? ఏం జరిగింది?'
    సావిత్రి తల ఎత్తింది. నుదుట ఏదో దెబ్బ! సింధూరం కరిగి, చెదిరి పోతున్నట్లు ఎర్రని చార! రాత్రి పొద్దుపోయి ఇంటి కొచ్చాడు. అన్నం తినమంటున్న సావిత్రిని తిట్టి పడదోసి లోపలికి వెళ్ళి తలుపులేసుకుని పడుకున్నాడు. బ్రతిమాలినా తలుపు తీయలేదు. సావిత్రీ, శ్యామలా బయట సోఫాలోనే పడుకున్నారు. ఎప్పుడో , ఎందుకో బయటికొస్తూ గుమ్మంలో పడిపోయాడు. తెల్లావారగట్ల లేచిన సావిత్రి కేక విని నలుగురు పోగయారు! అది జరిగిన విషయం!
    ఇంతలో బ్రహ్మయ్యా, భార్య పార్వతమ్మా వచ్చి పలకరించారు. పార్వతమ్మ, సావిత్రి ని ,శ్యామల నూ లేచి ఎంగిలి పడమనీ, పొద్దుటి నుంచీ పరగడుపు నున్నందుకు మందలించింది. సావిత్రి లేవలేదు. కానీ బ్రహ్మయ్య ఏం ఫర్వాలేదనీ, నరసింహం దగ్గర నాన్నా నేనూ ఉంటామనీ, శ్యామల కోసమైనా వెళ్ళమనీ బలవంతం చేయడంతో సావిత్రికి వెళ్లక తప్పలేదు. అప్పుడు బ్రహ్మయ్య చెప్పిన విషయానికి అనంతయ్య ఒళ్లు జలదరించింది.
    నరసింహానికి సారాయి లో ఏదో విష పదార్ధం కలిపి ఉండవచ్చని అయన అనుమానం! రెండు రోజుల క్రింద సీరా సాయిబు , తన పెళ్ళాన్నీ, నరసింహాన్ని కలిపి తిరుతుండడం అంతా విన్నారు. ఇంకా చెబుతున్న బ్రహ్మయ్య వచ్చిన సావిత్రిని చూసి ఆగిపోయాడు. నరసింహం భళ్ళున వాంతి చేసుకున్నాడు. దుర్వాసన! సావిత్రి తుడిచి బాగు చేస్తుంది. భోజనానికి తననూ లేవమంటున్న బ్రహ్మయ్య తో , ఇది భోజనం చేసే సమయం కాదనీ, ఒక బండినీ, సేద్య గాడ్నీ పంపితే తన ఊరి దగ్గరకు పోతూనే మళ్ళీ వెనక్కి పంపి, అక్కడ్నించీ తన బండ్లో నరసిమ్హాన్ని ఆస్పత్రికి తీసుకెళతానన్నా డనంతయ్య.
    బ్రహ్మయ్య వెంటనే ఎద్దులూ, బండినీ సిద్దం చేయించాడు. ఇద్దరు జీతగాళ్ళ ను ఏర్పరచాడు. మెత్త పరిచి నరసింహాన్ని తెచ్చి బండ్లో పడుకోబెట్టారు. సావిత్రీ, శ్యామలా నరసింహానికి చెరొక పక్కనా కూర్చున్నారు. బ్రహ్మయ్య సహాయానికి కృతజ్ఞతతో ';వస్తా' నని చెప్పి అనంతయ్య బండెక్కాడు.
    బండి కదిలింది. ఒకతను బండి తోలుతున్నాడు. మరొకడు చేత హరికేన్ లంతరు లో దారి చూపుతూ ముందు నడుస్తున్నాడు! ఒక లాంతరు బండిలో నాటుకు తగిలించి ఉంది. ఆస్పత్రి కి పోవాలంటే ఆరు మైళ్ళు పోవాలి. దాదాపు మూడు మైళ్ళ లో మధ్యదారి లో తన ఊరు.
    దేశానికి విదేశీయుల పాలన అంతరించి ఇరవై రెండేళ్ళయింది. ఎందరో యువకులు పల్లెల్లో పుట్టి, తలిదండ్రుల కృషి వల్ల , శ్రద్ద వల్ల, చదివి, డాక్టర్ల యి పట్టణాల్లో స్థిరపడి పోతున్నారు. వేలాది గ్రామాలు తమ బ్రతుకుల్లాగే తమ ఆరోగ్యాల్ని కూడా భగవంతుని అధీనంలో విడిచి బ్రతుకుతున్నాయి.
    కటిక చీకటి! పొలాల నుంచీ వీచే ఈదురు గాలి! దూరాన గుంపులు గా అరిచే గుంట నక్కల ఊలలు! ఆకాశాన నక్షత్రాల తోడు! గాలితో పోరాడుతూ , వెలుగు నీడల్నీ ప్రసరిస్తూ అటూ ఇటూ ఊగుతున్న లాంతరు. ఏడ్చి ఏడ్చి అలిసిపోయిన ముఖాలు. కన్నీళ్ళెండి భయం భయంగా నరసింహం కేసి చూస్తున్న కళ్ళు! ముందు వెడుతున్న మనిషి నీడ లాంతరు వెలుగులో రాక్షసాకారంగా కనిపిస్తుంది. మహావృక్షాల మొదళ్ళ లా కదిలే కాళ్ళు! బండి వాని అడలింపు! చెళ్ళున సెలగోలు మోత!
    గోతులలో దూకి, రాళ్ళేక్కి, ఎత్తి పడవైచి, అటూ ఇటూ ఉయ్యాల లూపి -- వెనక్కి వెళుతుందో , ముందు కేళుతుందో తెలియకుండా -- బండి ముందు కేళుతుంది.
    ఆ భయంకర రాత్రి ఆ మహాయాత్ర మొదటి మజిలీ చేరుకోబోతోంది. ఏ చైతన్యం వల్లనో నరసింహం కళ్ళు తెరిచాడు. అంతా ఒక్కసారి చూశారు. 'గుప్పు మని పెద్ద వెలుగుతో అహంకారం చూసింది లాంతరు.
     నరసింహం కళ్ళు సావిత్రి కేసి , శ్యామల కేసి చూసి, అనంతయ్య మీద ఆగిపొయినాయి! పశ్చాత్తాపమా? దుఃఖమా? కోరికా? ఏదో చెబుతున్నాడు. యెట్లా వినడం? అది ఎవరికి , ఏమీ చెప్పడం కాదు, దేనితోనో పోరాట మనుకోవాలా?
    ఈ జీవన్మరణ సంధ్యా కాలంలో, ఆ మనస్సు కింకా గతాన్ని నెమరుకు తెచ్చుకునే శక్తే ఉంటె, అదే మంటుంది? ఒక్కసారి తన తప్పుల్ని క్షమించి, ఎవరో-- విదో, దేవుడో- మళ్లీ తనకు బ్రతికే హక్కు లిస్తే ...ఇస్తే! ఆ హక్కుల్ని ఎట్లా కాపాడు కుంటాడు? ఆశల అంటే, సంతోషం కంటే , ప్రేమ కంటే బాధ్యత ఎక్కువదనీ, ఈ ఉద్యోగం లో ఉన్నంత కాలం దాన్ని విస్మరించడం శ్రేయం కాదనీ తెలుసుకుంటాడా?
    కాలాన్ని వెన్నక్కి మళ్ళించడం ఎవరి తరం? ఆ మహా ప్రవాహం లో నరసింహం కెరటమా? నురుగా? నీటి తుంపరా?
    ఆడవాళ్ళు ఇద్దరూ నరసింహం మీద వాలి పోయారు!
    ఉలికిపడి లాంతరు వెలుగు ఊపిరాడక నిలిచిపోయింది!
    రాత్రి జడుసుకున్నట్లు , నోట మాట రాక చూస్తుంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS