Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 12

 

                                     17

    'పద్మావతి తనకు సీటు దొరికిందనీ తను వాల్తేరులో చదువు కుందిఐ జయమ్మగా రంగీకరించిందనీ' ఉత్తరం రాసింది.
    భాస్కరం ఉత్తరం చదవడం ముగించి మడత పెట్టి జేబులో పెట్టుకుంటూ ఉండగా, జానకమ్మగారు కాఫీ కప్పుతో వచ్చిందక్కడికి.
    "ఉత్తరం ఎక్కణ్ణించిరా?" అన్న ప్రశ్న కామెకు ఆస్కారం యివ్వకూడదనే ప్రయత్నంలో, భాస్కరం సంరంభంగా దాన్ని జేబులో కుక్కుకుని "కాఫీ యిప్పుడే గదు? పిన్నీ తాగాను" అన్నాడు.
    "ఐతే భాసా - నీ శలవులైపోవచ్చేయిట గదూ, -వసంత చెప్పిందిలే" నన్నది.
    "ఔనమ్మా! వసంత పెళ్ళి పనులు అవీ చూడ్డానికి వీలుగా మళ్ళీ ఓ వారం రోజులుండి మా మాష్టారికి చెప్పి వస్తా" నన్నాడు.
    కొడుకు మాటల కామె మొహం ఇంత పిసరు వికసించలేదు.
    "నేనూ, మీ నాన్నగారూ మేమేం చేస్తాం? అన్నీ మేం చూసుకుంటాము గాని..... నీ కళ్యాణం సంగతి తేల్చుకో నీవు....."
    ఆమె మరింత దగ్గరా వచ్చి భాస్కరాన్ని సూటిగా చూస్తూ నించున్నది.
    కాఫీ ఒక్కో గుక్క ఒక్కో విషపు గుళిక లాగ మింగుతూ వూరుకున్నాడు భాస్కరం.
    "చూశావురా! ఆ రాఘవేంద్రం ఎత్తూ" అని నిట్టూర్చిందామె. తిరిగీ అన్నది.
    "అతగాడి దేముందిలే?..... ఆ ముకుందరావు నీలాంటి మంకుపట్టువాడు కాదన్నమాట ..... మొదట నీ పెళ్ళి విషయం తేల్చుకుని మాట యిచ్చి పుచ్చుకోవడం అవితే ..... అటునించి తను కూడా ఈ లాంచనాలన్నీ అడగాలనీ అతగాడి ఉద్దేశం....."
    "పిన్నీ! వసంత పెళ్ళికి నేను బోలెడు ప్లాను వేసుకున్నాను. బోలెడు అట్టహాసంగా చేయాలని చిన్ననాటి ఫ్రెండ్సు నీకు తెలుసుగా, సోముడు ధీరుడూ అందరూ నీతో చెప్పమన్నారే!"
    "సరిపోయింది. అసలు అది స్థిరమవ్వాలి గదా నాయనా?" - ఆమె కాఫీ కప్పు నందుకుని వెళ్ళిపోయింది.
    భాస్కరం మొహం నల్లగా కాంతి విహీన మయ్యింది. జీవితంలో ఎన్నడూ పిన్ని తన నింత నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోలేదు.
    తనేదో క్షమించరాని నేరమే చేస్తున్నట్లు జానికమ్మగారి ఆంతర్యంలో ముద్ర పడ్డదని గ్రహించడం భాస్కరానికి కష్టంకాదు.
    బల్లమీదకి బుర్ర కొట్టుకుని "హే! భగవాన్! తల్లిదండ్రులను సుఖపెట్టలేని యీ బ్రతుకెందుకు ప్రసాదించావ్?" అని మధనపడ్డాడు.
    అంతలో అతను ఉలిక్కిపడ్డాడు.
    అవతలి గదిలో పిన్ని ఎవరినో ఆహ్వానించడం చాపవేసి కూచోబెట్టడం స్ఫురించేయి. చెవులు రిక్కించి ఉన్నాడు.
    "పెళ్ళివారు చాలా సందడిగా, తీరిక లేకుండా ఉన్నారల్లే ఉంది." గాజుల సవ్వడితో మేళవింపుగా ఒక స్త్రీ కంఠం వినిపించింది.
    "మరి సందడే అనుకో తల్లీ! కాని ఏదీ మా భాసడు మంకుపట్టు పట్టేడూ....."
    ఆమె మాట పూర్తిచేసే లోగానే అవతలి కంఠం "ఏం? చెల్లెలి మొగుడు కాబోయే పిల్లాడు బాగోలేడంటాడా? తనకు రాబోయే చిన్నది బాగులేదంటాడా?" అన్నది.
    "రెండూ కాదు.....వాడి చదువు పెద్దది కదా? అమ్మ......అది కాస్త ఎక్కడ పాడవుతుందోనని వాడిబెంగ......అందుకని చెల్లి పెళ్ళి అవనీ, నా చదువు అవనీ అంటాడు....... ఐనా కాపోయినా.....నాకు యీ వసంత వెళ్ళిపోయాకా యిల్లు బోసి పోదు టమ్మాయ్ ?..... మరో పిల్ల కోడలో, కూతురో యింట్లో మసులుతూ ఉండాలి.... నా కొడుకు, నా కూతురు..... అమ్మయ్య యిద్దరినీ సుఖ పెట్టాము అని మా కనిపించాలి .... ఔనా?"- అంటోంది పిన్ని.
    భాస్కరం కణతలు నొక్కుకున్నాడు. తప్పకుండా ముకుందరావు కట్నం తనెంత అడిగితే నత అడుగుదామనే ఉద్దేశంలో ఉండి ఉంటాడు. లేదూ....సురేఖ తనమీద పగ సాధించే ఉద్దేశంలో ధనమ్మ గారిని ప్రోత్సహించి, తననే వివాహమాడతానని ఉంటుంది. "ఛా! అలాక్కాదు సురేఖకి ఎందుకూ నామీద పగ" అనుకున్నాడు మళ్ళీ.
    అసలీపాటికి సురేఖ పద్మకి ఉత్తరం రాసి ఉంటుంది?
    ఇవతల చెల్లి పెళ్ళి!
    అవతల తన ప్రేమ!!
    ధనమ్మగారి చేత కీలుబొమ్మ రాఘవేంద్రరావు. బహుశా ఆమె యీ ప్రధానం జరిగితే గాని ముకుందం పెళ్ళికి సహాయపడనని గట్టిగా చెప్పి ఉంటుంది.
    డ్రాయరు లాగి పద్మావతికి ఉత్తరం రాయడానికని కలం తీశాడు.
    ఏమిటి రాయడం?    
    తప్పకుండా విశాఖపట్టణంలో చదువు కుందికి రమ్మన్నాడు.
    "తన చెల్లెలి పెళ్ళి స్థిరమై పోబోతున్నదనీ, అందుకు తనని అభినందించమనీ" రాశాడు.
    సురేఖకి కూడా సీటు వచ్చే ఉంటందనీ ....."ఆ అమ్మాయిని చదువయ్యే దాకా పెళ్ళి గొడవ ఎత్తవద్దనీ నువ్వు చెప్పకూడదూ?" అంటూ ఓప్రశ్న రాశాడు.
    తిరిగి ఉత్తరం మొదటినించీ చదువుకుందామని అందుకు ధైర్యంలేక మడిచి అంటించేశాడు.
    నిట్టూర్చాడు గాని నిశ్చింతగా మాత్రం కాదు.
    ఆ ఉత్తరం దిండు క్రింద పెట్టుకుని-పక్కమీద సీలింగుకేసి చూస్తూ ఆలోచనల సుడిగుండాల్లో పడిపోయాడు.
    "అన్నయ్యా! ఆలోచన దేని గురించి బాబూ!" వసంత వచ్చి కర్పూరం బొమ్మలా నించున్నది.
    "అరె! వసంతాలూ! నీ గురించేనమ్మా! పెళ్ళికి ప్రయత్నాలు చేస్తున్నాను"-పొడిగా నవ్వాడు.
    చెయ్యి జాచి ఆమెని ఆప్యాయంగా మంచం మీద కూచోబెట్టుకున్నాడు.
    ఆపిల్ల సిగ్గుపడ్డది కాని ఆ కమల లావణ్యం రంగు తరిగింది.
    "నీవు అమ్మని చాలా బాధ......"
    భాస్కరం ఉలిక్కిపడ్డాడు.
    "లేదు చెల్లాయ్! లేదు....." అని అటు తిరిగి పడుక్కున్నాడు.
    "నీకు యిష్టంలేని పని నేనూ చెయ్యను......నాకీ పెళ్ళి వద్ధన్నాయ్!" వసంత వెళ్ళిపోయింది.
    భాస్కరం అట్నుంచి యిటు తిరిగేటందుకు కొన్ని క్షణాలు పట్టింది. కాని వసంత మాయమయ్యిందికి ఒక్క క్షణమే పట్టింది. లేకపోతే ఆమె కనుకొలుకుల నిండా నిండిన నీళ్ళు అతన్ని రంపపు కోత కోసేవే.....
    లేచి పచార్లు చేసేడు.
    ఎదుట నిలువుటద్దంలో తన నిండు బొమ్మ అగపడుతూనే ఉంది.
    "సరే! కార్యవాదినే అవుతాను....సురేఖ నన్ను సాధించాలనుకుందా? పోనీగాని ...... ఇటు పద్మ ..... ఇటు వసంతా ..... యిద్దరి ఆడ పిల్లల భవిష్యత్తును దుఃఖమయం చేయలేను" అనుకున్నాడు.
    ఒక నిర్ణయని కొచ్చినట్లు .... పద్మావతి ఉత్తరం తీసుకుని బయట పడ్డాడు. గబ గబ బదిచాడు ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు.

                                 18

    "ఐతే ఈమాట ధనమ్మకి చెప్పమన్నారు?" అని ప్రశ్న వేశాడు. రాఘవేంద్రరావు.
    సుబ్బారావుగారు, జానికమ్మగారు ఇద్దరూ తలవూపారు.
    "వారున్నూ పిల్లను చదివించుదా మనుకున్నారు .....మావాడు కూడా ఈ ఏడాది ఆఖరికి గాని ఎం.ఎస్సీ డిగ్రీ తీసికొనడు. అంచేత ఆ పిల్లదీ యీ పిల్లడూ ఇష్టపడటమనే షరతు మీద తతిమ్మా లాంఛనాలన్నీ ధనమ్మగారి యిష్టం.....ఆ పైన మా ఆవిడ యిష్టం......ఇక మీరూ మేమూ అంటారా పెద్దలుగా వచ్చి అక్షింతలు వేద్దాం...." అన్నాడు సుబ్బారావుగారు.
    "బావగారు ఎంత లౌక్యులు...." ముసి ముసి నవ్వులు నవ్వేడు రాఘవేంద్రగారు "ఒకసారి అబ్బాయిచేతకూడా ఆ మాట అనిపించాలి."
    "అంతా ఆడాళ్ళ నెత్తిన రుద్దీ తప్పుకు పోతూవుంటారు. మరి అబ్బాయి మాటే నా మాట లెండి" అని జానికమ్మగారు భర్తకేసి "అంతేనా" అన్నట్లు చూసింది.
    చటుక్కున జ్ఞాపకం వచ్చినట్లు జానకమ్మగారు ఏదో సందేహం వెలిబుచ్చబోయింది. ఆమె తిరిగి ఉగ్గ బట్టుకుని వెనక్కి తగ్గడం రాఘవేంద్రం గమనించి "అదేమిటమ్మా! మీరేదో సందేహం వెలిబుచ్చనున్నారు ...." అన్నాడు కించిత్ ఆందోళన వ్యక్తపరుస్తూ.
    "ఉహూఁ.....మరేమీ లేదు.....ఎంతైనా చిన్నదాన్ని మీరేవీఁ అనుకోనూ అంటే ఒక్కమాట.....మీరు ధనమ్మగారికి అన్నదమ్ముడి వరుస కాబోలు.....ఆ పక్షంలో మా బిడ్డలకి వావి వరుసలు...." అంటూ ఆమె నసిగింది.
    నిజమే ఏడు తరాల వెనుకకి వెళ్ళి చూసుకురావల్సిన విషయం సుబ్బారావుగారీ విషయం యింత ఆలస్యంగా గుర్తించి నందుకు విచారించారు. ముఖ భంగిమలోనే దాన్ని వ్యక్తపరిచేరు కూడాను.
    "అమ్మమ్మ! ఎంత మాట పురోహితుల సాయముతో, శాస్త్రాల ఆధారంతో వివరించాల్సిన విషయంకాదూ? యిదీ!.....మీరు నమ్మండి.....మా గోత్రమే ఒకటి కాదే మరి.....ధనమ్మ గారిదీ నాదీ బాదరాయణమే .....మా ఆవిడ వేలు విడిచిన అప్పచెల్లెలుండేది శారదాంబ అని. ఆమె బావగారున్నూ ధనమ్మగారున్నూ ఇద్దరూ ఒకే గోత్రం గలవాళ్ళు......ఇదా? తల్లీ మీ అనుమానం? చూశారా! నా తల నెరిసింది .... ఈ చిన్నమాట తట్టలే దంటారా?" అన్నాడు రాఘవేంద్రంగారు.
    "ఇక మనం ప్రధానం జరుపుకోవచ్చును.....ఈ మాట ధనమ్మగారికి చెబుతా, అబ్బాయి ఈ సంవత్సరం ఆఖరున వివాహమాడతా నన్నాడని "ఒప్పందం" ఖాయమేననీ....మళ్ళీ రేపు పురోహితుడితో సహా వస్తాను"ని వికసిత వదనంతో లేచేడు రాఘవేంద్రంగారు.

                                    
    అంతకంటే ఆనందంగా దంపతులిద్దరూ అతగాన్ని సాగనంపారు.......
    "ఏమో భగవంతుడా .....ఏడుకొండలవాడా అదో యింటిదై పుట్టినింటికీ మెట్టినింటికీ ఖ్యాతి తెచ్చి, వీడో ఇంటివాడై గంపెడు పిల్లల్ని కంటే నా కదే చాలు. వేరే స్వర్గం కోరను" అని నిబ్బరంగా కనులు మూసుకుంది ధ్యాస ముద్రలో జానకమ్మగారు.
    అన్నయ్య ఒక్కసారి వ్యధనంతా మర్చిపోయి మీరు చెప్పినట్లే పై సంవత్సరమే పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకునేసరికి వసంత ఆశ్చర్యపోయింది. లేత హృదయమే ఐనా ఆ పిల్ల భాస్కరం వ్యధను పసిగట్టింది.
    "అన్నయ్యా! నిజంగా నీకు సురేఖ అన్న అమ్మాయి వచ్చిందిరా! లేకపోతే నాకు పెళ్ళి అవదేమో నని యిందుకు ఒప్పుకుంటున్నావా?" అని ఎట్టకేలకు భాస్కరాన్ని నిలదీసింది.
    భాస్కరం నవ్వేడు. నవ్వాలనే ప్రయత్నం చేశాడు. "ఆ అమ్మాయికేం తక్కువ?.....ఇంతకీ నీ పెళ్ళి అవడం ముందు ముఖ్యం. అది అవుతేగాని నా పెళ్ళి ప్రయత్నాలు వద్దు అన్నానుగా.....ముందు నువ్వు కొడుకును కనాలి తెలుసా?" అంటూ వేళాకోళమాడేడు.
    "ఏమో బాబూ! నాకంతా నీ గురించి బెంగగా ఉంది....... బయటికి ఏమైనా అన్నామో అమ్మ పీక పిసికేస్తుంది....." అన్నది దిగాలుగా.
    వసంతకు తనమీద గల ఆప్యాయతకీ కరిగిపోయి భాస్కరం వాత్సల్యంతో ఆమె తల నిమిరాడు "నే పెళ్ళాడతానన్నా" అంతేగా నన్నాడు. మళ్ళీ "అమ్మ మనసు నొప్పించకూడదనే కదూ ఇదంతా ......నువ్వు మాత్రం మీ అన్నయ్యని అపార్ధం చేసుకోవని మాట యిస్తావు కదూ.... తన చెయ్యి జాపేడు.
    వెంటనే "మా అన్నయ్య దేవుడు .... అని చేతిలో చెయ్యివేసి "అయినా యిదంతా ఏమిటన్నయ్యా!" అన్నది అంతలో బేల పడిపోయిన వసంత.
    "నీ కంటే ఆప్తులేవరు చెల్లీ! చెబుతాగా....తర్వాత ఇప్పుడు మాత్రం నీ పెళ్ళి మహావైభవంగా ఐపోనీ....అదే నేను దైవాన్ని కోరేది.....తర్వాతనా?...." వూరుకున్నాడు.
    వసంతకి ఎన్నో అనుమానాలు వచ్చాయి. నీ వొక్కటి నోరు పెగిలి బయటికి రాలేదు.
    అంతలో జానికమ్మగారు అక్కడికి వచ్చి,
    "ఏమర్రోయ్! అప్పుడే వియ్యపురాలూ, వియ్యంకుడూ ఐపోతున్నారల్లే ఉందే......రండి, రండి ..... మీ కోసరం అన్నం చల్లారిపోతానని బెదిరిస్తూ ఉంది." అంటూ జానికమ్మగారు రావడంతో ఆ యిద్దరూ, ఆమెను అనుసరించారు.

                              *    *    *

    జానికమ్మగారికి సంప్రదాయాలు అంటే ఎంత పట్టింపు ఉందో అంతకు రెట్టింపు చూచిస్తారు మగ పెళ్ళివారు. ఆ భయంతోనే "సురేఖను వద్దు కావాలీ," అనడం మాట అటుంచి, తన పెళ్ళి ప్రేమ యిత్యాదుల గురించి నోరు మెదపలేకపోయాడు భాస్కరం.
    చెల్లెలి పెళ్ళి ఐన తర్వాత తను తలఎత్తి సమాజంలో నిలబడి ఎదురీదగల సమర్దుడయ్యేంత వరకు తతిమ్మా పిల్లల బెంగ లేనే లేదు. అందుకనే ముభావంగా "వచ్చే ఏడాది కదమ్మా?.....పెళ్ళే కదా? చేసుకుంటాలే" అన్నాడు.
    ఏది ఎమేనా భాస్కరం పరిస్థితులను ఇంకో విధంగా ఎదుర్కొన దల్చుకున్నాడు. వసంత పెళ్ళి నిశ్చయమయింది.
    ముకుందరావుని స్వయంగా వెళ్ళి కలుసుకున్నాడు భాస్కరం.
    చాల సాత్వికమైన స్వభావం కలవాడు ముకుంద రావు. "ఏం! బావగారూ? ఇప్పట్నించీ అలా పిలిస్తే మీకేమేనా అభ్యంతరమా?" అంటే "ఎవరికీ మీకానాకా?.....మంచివారేనే...... కొంపదీసి మా చెల్లెలికి నవ్వు పనికిరావనే లాగుంది ఆ తర్వాత" నన్నాడు నవ్వుతూను.
    తను పెళ్ళాడబోయే కుటుంబం యొక్క సత్సంప్రదాయం వంకమీద తన చెల్లెల్ని ఇతగాడు రాసి రంపాన పెట్టడు. ఇక మంచితనం ఏమిటి? మనుషుల సుఖాన్ని మించి ఆలోచించగలగడం ఎటువంటిది? అని తృప్తి పడ్డాడు భాస్కరం-"సురేఖకు మాత్రం క్షమాపణ చెప్పాలి" అనుకున్నాడు.

                                   19

    పద్మావతికి చాలా సంతోషంగా ఉంది. సీటు రావడం, తల్లి వొప్పుకోవడం ..... యిక తాను భాస్కరానికి దగ్గరగా వెడుతున్నాను గదాని ఆనందం కలిగింది. సురేఖకి ఉత్తరం రాసింది. మొదట తను విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఇల్లు చూసుకుని తల్లిని తీసుకువెళ్ళాలని పద్మావతి ఉద్దేశం. సురేఖ హాస్టలులో ఉండగలదు గాని తనకి అలాగ వీలుపడదు కదా.
    పద్మావతి ఉత్తరం అందుకుని సురేఖ ఒక రోజంతా మధనపడ్డది. భాస్కరం వంటి వాణ్ణి నమ్ముకున్నదే ఈ పిల్ల?....ఏం చేయడం.....ఈ సంగతి గనక ఉత్తరంలో రాస్తే ఏమో పద్మావతి చదువే మానేయొచ్చును. ఇది ఇప్పుడప్పుడే చెప్పవల్సిన అవసరం లేదు అనుకున్నది.
    "తాను ముందుగానే పోయి హాస్టలులో జాయినవుతున్నది గనుక పద్మావతిని బయల్దేరమ్మని రాసిపడేసింది. సురేఖకి ఏమీ పాలుపోలేదు. ధనమ్మ గారు భాస్కరం విషయంలో చాలా అభిమానాన్ని ఉత్సుకతనూ ప్రకటిస్తున్నది. తనకి భాస్కరం గురించి ఇదివరకు తెలిసిన ఉదంతం ఆమెకు ఎలా చెప్పడమో తెలిసిందేకాదు.
    "చెల్లెలు పెళ్ళికావల్సిన వాడవుతే వాడే లొంగివస్తాడ"న్నది ధనమ్మగారు తన చెవుల బడేటట్లు పదే పదే అంటే భాస్కరానికి తనను బలవంతంగా ముడిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదా? యిందులో భాస్కరం పాలెంత ఉంది? అవకాశమవుతే భాస్కరాన్ని నిలదీసి నాలుగు అడుగుదామనుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS