Previous Page Next Page 
ప్రేమకు పగ్గాలు పేజి 11

 

                                        15

    "ఇంతకీ భాస్కరం పద్మావతిని ప్రేమిస్తున్నాడా లేదా?"
    "ఒక వేళ పద్మావతి భాస్కరం స్నేహాన్ని అపార్ధం చేసుకుని భ్రమపడ్డదేమో...." సురేఖ మనసు పరిపరి విధాలా ఆలోచించసాగింది.
    "బహుశ ఈ భాస్కరం జీవితాలతో చెలగాట మాడుతున్నాడేమో?....."
    "ఛీ ఛీ! మగజాతిని నమ్మమని ఎవరు చెప్పారు? పద్మావతి అంద చెందాల నటుంచి, ఆ పిల్ల ఆస్తి పాస్తులూ ఆర్ధికపు టంతస్తూ సర్వ సాధార్నమైనవి గనుక రాజును చూసిన కళ్ళ మొగుణ్ణి చూస్తే మొత్త బుద్ధీ అనీ, తన సమ్మంధం చూడవచ్చాడేమో? ఇతగాడు?"
    "దొడ్డమ్మ ఆస్తినా? నన్నా ఇతను చూడవస్త?"
    ఆలోచన లామె గుండెలు తోడేశాయి.
    కాని భాస్కరం సంస్కార హీనుడిగాను అవకాశవాదిగాను ఆమెకు అగుపించడంలేదు. చెడ్డగా అతని గురించి ఆలోచించలేక పోతున్నది సురేఖ-"పద్మావతి గురించి తానెందుకు జాలిపడాలి?"-అదో ప్రశ్న.
    రెండు క్షణాలు ఆలోచించడం మానేసింది-కిటికీలోనుంచి ఆకాశంలోకి రెండు క్షణాలు దీర్ఘంగా. చూసి నిట్టూర్చి లేచి సొరుగు దగ్గరకు వెళ్ళింది.
    కాయితం కలం తీసుకుని ఉత్తరం రాద్దామని కూచున్నది.
    ఐతే ఏమని రాయడం?
    "నీ భాస్కరం దగాకోరు పద్మావతీ" అని రాస్తారా? అసలు భాస్కరం దగాకోరా?
    కాలేజీల్లో మాట్లాడుకొనే ఆడామగా అందరూ ఒకర్ని ఒకరు ప్రణయ దృష్టితోనే చూడాలా? ఒకవేళ అతని వాత్సల్యాన్ని తన స్నేహితురాలే తప్పు అర్ధం చేసుకుంటే?
    భాస్కరం గురించి తెలుసుకోకుండా "ఇదుగో నీ ప్రియుడు" అని పద్మావతికి ఇవ్వడం నచ్చలేదు తనకి.
    "భాస్కరంగారు మంచివాడు....." అనిపిస్తున్నది పదేపదే.....పద్మావతిడి భ్రమా? తనది స్వార్ధమా? భాస్కరానిది దగా? ఏది నిజం?
    అంతలో ధనమ్మగారు వచ్చింది.
    "విన్నావుటమ్మాయ్! సుబ్బారావుగారేమన్నాడో" నన్నదామె ఉద్వేగంగా.
    గభిక్కున కాగితమూ కాలమూ సొరుగులో దాచేసి "ఏమిటి దొడ్డమ్మా" అన్నది సురేఖ.
    "మావాడు కట్నం కాసులమీద అంత పట్టించడండీ! పైగా ఇవ్వడానికీ మనస్కరించడూ..... అన్నాడట సుబ్బారావు..... చూశావా? పాపం రాఘవేంద్రం అన్నయ్య గుండెల్లో రాయి పడింది." అన్నదామె కించిత్ స్వాతిశయంతో.
    సురేఖ మాటాడలేదు.
    "ఔను పాపం! కుర్రవాడు కాస్త జీవితం నాటుకొనేదాకా అలాగే అంటాడు గానీ, ఈ రాఘవెండ్రం ఆ ఒక్కగా వొక్క కొడుకే అని ఆశలు పెట్టుక్కూచున్నాడు కదా కాస్త కట్నం కాసూ ఇప్పించవొద్దుటమ్మాయ్ ...." ఆమె ముకుందరావు తండ్రి మీద జాలిపడ్డది.
    సురేఖ దీర్ఘాలోచనలో మునిగి ఉండటాన్ని ధనమ్మగారు ఖాతరు చేయలేదు.
    "నేను మాత్రం రాఘవేంద్రం పక్షమే. పాపం అతగాడు నన్ను నమ్ముకున్నాడు. లేకపోతేనా యీ పాటికి గల ఆ ఒక్క కొంపనూ కోర్టులో వేలం వేయిద్దును" అన్న ధనమ్మగారి మాటలకు మాత్రం "మన కెందుకులే దొడ్డమ్మా" అన్నది సురేఖ.
    "ఔను అనుకో....కాని ఈ రఘవేంద్రం తన కొడుక్కు చక్కని పిల్లను చేసుకొని, నే కోరిన సమ్మంధం నాకు తేనూ అంటే వూరుకుంటావా?" అన్నదామె ఆవేశంగా.....అని అంతలో తమాయించుకుని "చిన్నపిల్లవు. ఇవన్నీ ఈ కెందుకులే..." అన్నది.
    "నేను యింకా చిన్నపిల్లనే అంటావా? దొడ్డమ్మా?" సురేఖ అడిగింది.    
    "ముకుందాన్ని వొప్పించాము. ఐదారువేల లాంఛనానికి.....ఇప్పుడు కాదూ, కూడదూ అంటే ఎలాగ? ఆ కుర్రవాడికి కంత పెడరసం ఎందుకూ అంట? సరిలే జానికమ్మ తన కూతురు పెళ్ళికి తహతహ లాడుతున్నది. అది కావాలీ అంటే-ఈ భాస్కరాన్ని ముక్కుకు తాడు వేసి లాక్కొస్తుంది." అన్నదామె.
    సురేఖ ఆశ్చర్యంగా చూసింది.
    "ఔనమ్మాయ్! జానికమ్మ నయాన తల్లి కాదు భాస్కరానికి-సవిత్తల్లి".
    చివుక్కుమంది సురేఖ మనసు.
    ఆ మాటకొస్తే ధనమ్మ మాత్రం తనకు పెంపుడుతల్లి కాదూ?
    సురేఖ అడుగుదామనుకుంది. భాస్కరం తనను యిష్టపడ్డాడా? అని గాని నోరు విడలేదు.
    ధనమ్మగారే చెప్పింది, సురేఖ దగ్గరిగా కుర్చీలో కూచుని "పిల్లవాడు సలక్షణమైనవాడు.....నీకు దీటు వస్తాడు. కాస్త ఛాయ తప్ప అంతా చెక్కిన విగ్రహం...కాని విపరీతంగా ఉంది.....కట్నం వద్ధన్నాడూ-పెళ్ళి చదువైయ్యేదాకా వొద్ధన్నాడూ? అంటాడు రాఘవేంద్రమ్ అన్నయ్య" ఆమె ఆశ్చర్యపోతూ చెప్పింది.
    "పోనీ ముకుందాన్ని కూడా కట్నం లేకుండా నొప్పించు దొడ్డమ్మా"
    "బాగానే ఉంది....పరువు తక్కువ కాదుటే....ధనమ్మ అల్లున్ని అన్ని లాంఛనాలతో తెచ్చుకుంది. అతగాడి మొహాన వేలకువేలు గ్రుమ్మరించిందీ అని అందరూ అనుకుంటే మేలా? కాదా?"
    ధనమ్మ రెండు క్షణా లాగి తేల్చేసింది. "వీడు లొంగిరావాలి-నాకు అల్లుడు అవ్వాలి. లేదు కదూ- ఆ 'వసంత' పెళ్ళి ఈ జన్మకి కాకుండా చూస్తాను. ముకుందానికి నా యావదాస్తీ రాసేసి మరీ అల్లుణ్ణి చేసుకుంటాను"-
    ఆమె చరచరా వెళ్ళిపోయింది బుసలు కొడుతున్న పాములాగ.
    సురేఖ దిగ్భ్రాంత అయింది.
    "ముకుందరావును తను ఎరుగును-అతన్ని పెళ్ళాడటమా? అంతకంటే చావడం మేలు......స్వయంగా వచ్చి ముకుందం "తనకు వసంత ఎంతో యిష్టమని చెప్పాడు" తనతో. తను కూడా "అదృష్టవంతుడిని. నీకు కోరన అమ్మాయి దొరికింది" అని అభినందించింది.
    "ధనమ్మగారి హయాం తనమీద నెందుకు ఉండాలి?" అని దుఃఖపడ్డదాపిల్ల.
    సురేఖ యీ ప్రశ్న వేసుకున్నప్పుడల్లా దుఃఖం వస్తుంది.
    "భాస్కరం ఒక్కడే యీ తగవు తీర్చగలడు.....తాను పద్మావతిని ప్రేమిస్తున్నానని అతగాడన్న రోజున-ముకుందరావు తాను వసంతను కోరుతున్నానని అన్న రోజున.....
    సురేఖకు గుండె జల్లుమన్నది. అందరూ అందరికీ ఐపోతారు. తనకు ధనమ్మకూడా దూరమై పోతుంది.
    ధనమ్మగా రెవరు?
    "దొడ్డమ్మని వొదిలి నే బ్రతుకలేను" అనుకున్నది. లేచి ధనమ్మగారి గదిలోకి వెళ్ళింది. ఆమె ఇనప్పెట్టె ముందు కూచుని ఏవో దస్తావేజు కాయితాల సొరుగూ పరిశీలిస్తున్నది.
    ఈ "భాస్కరాని దంత దగుల్భాజీతనం....." అని చెబుదామనుకున్నది ఆమెతో కాని.....సురేఖ!
    దొడ్డమ్మ దగ్గిరికి వెళ్ళి ఆమె "ఏమిరా! యిలా వచ్చావు" అని ఆప్యాయంగా పల్కరించ గానే నేలను చతికిలబడి ఆమె వొళ్ళో బుర్ర దూర్చేసుకుంది.
    ధనమ్మగారు సురేఖను అక్కునదుముకుని "నా బంగారు తల్లికేం కావాలే" అన్నది.
    "ముకుందం నాకు వద్దు దొడ్డమ్మా.....ఆ వసంతకే యివ్వు" అన్నది గోముగా సురేఖ.
    "ఒస్! ఇంతేనా ఆ "వసంత" అన్నయ్య యీ విషయం గ్రహించిన్నాడు అలాగే చేస్తా సరేనా? ఇంతకీ భాస్కరం నీకు నచ్చాడా? దొంగకానా?
    సురేఖ ఉలిక్కిపడ్డట్లు లేచి పమిట సవరించుకుని, సిగ్గును త్రోసి "అతనికి నేను నచ్చను దొడ్డమ్మా" అని అక్కన్నించి విసవిసా వెళ్ళిపోయింది సురేఖ.
    తన ప్రవర్తన తనకే అర్ధంకాలేదు ఆ పిల్లకు. కాని ధనమ్మ భాస్కరాన్ని సాధించాలనుకుంది. "సురేఖకు ముకుందం దీటురాడు మరి!" ఆమె ఉద్దేశంలో. భాస్కరం బాగుంటాడు!"

                                     16

    "మా రోజుల్లో వయసుమళ్ళినవారూ, తల నెరిసినవారూ తప్ప - కుందనపు బొమ్మల్లాంటి పిల్లలకు కూడా మంచి సమ్మంధాలు వచ్చేవికావు.....నూనుగు మీసాలవాళ్ళంతా అప్పుడు లేరు....."
    జానకమ్మగారికి కాబోయే అల్లుడు ముకుందం వచ్చాడన్నది ఆ మాటల తాత్పర్యం.
    "అంటే నువ్వు నన్నేగా దెప్పి పొడవడం...." అన్నాడు సుబ్బారావుగారు నవ్వుతూ.
    "అవ్వఁ......! ఎంతమాట మీకేం?? ఈనాడూ తక్కువలేదూ" అని లెంపలు వేసుకున్నదా యిల్లాలు.
    "ఈ ముకుందరావూ మన వసంత యీడూ- జోడూగా ఉంటారు కదండీ?"
    "ఎందుకు ఉండరూ? చిల్కా గోర్వంకల్లాగ ఉంటారుగానీ ...." - భర్త అర్దోక్తిలో ఉండి పోడం జానికమ్మగారికి ఆందోళన కలిగించింది.
    "కానీ.....ఎందుకండీ-మన భాసడికంటే రెండు క్లాసులు తక్కువేగా అతగాడు చదువుకుంటా.... పైగా చేసే ఉద్యోగమేనా? అంత ఘనమైనదీ అంటే అదీ కాదుగా....మరీ అంత ఏనుగు దాహం ఉండకూడదు సుమండీ"......
    "మరి మన కుర్రవాడికి కావల్సినవన్నీ తను ధనమ్మచేత యిప్పిస్తానూ. సురేఖను ఖాయపర్చుకొండీ అంటున్నాడే రాఘవేంద్రం....."
    "మరి వాడు వద్ధంటున్నాడే.....అదీగాక దానికీ దీనికీ - బొడి తలకీ బట్టతలకీ అన్నట్లు ముడి ఎక్కడా? అంట?" ఆమె విసుక్కున్నది.
    "పోనీ, ఆపని చేద్దునా? చట్ట ప్రకారం కట్నం చెల్లదూ అని ఆఖరి క్షణంలో అభాసు చేద్దునా?" భార్య చెవిలో రహస్యంగా అన్నాడు సుబ్బరావు గారు- భార్య తల నిమిరాడు.
    "బాబోయ్! మీ పెద్దలకు వెయ్యివేల దండాలు...." ఆమె దూరంగా జరిగి చేతులెత్తి జోడించింది. "కావాలంటేనే జోలి పుచ్చుకు పోతాను గాని ఇలాంటి పనులవల్ల నా బిడ్డ కాపురం నాశనం ఐపోగలదు...." అన్నది.
    "అయితే ధనమ్మగారికి మాట యిద్ధామా?"
    ఆమె భర్తకు జవాబేమని యిస్తుంది. కణతలు నొక్కుకుంది బాధగా.
    "ముకుందరావుకూ మన భాస్కరానికీ ఒకటే లాంఛనలు ఉండాలని కాబోలు ఈ రాఘవేంద్రం గారు ఎత్తు వేస్తున్నాడు"-
    సుబ్బారావుగారి ఆలోచనలో కొంత నమ్మకం కుదిరింది జానికమ్మగారికి.
    "ఏమో భాసన్ని మరోసారి అడుగుతామా..." అని అంతలోనే "వాడా? వాడు....వాడూ ".....ఏమనాలో తెలియనట్లు.
    "వాడు వాడే" నందామె బాధగా.
    "కడుపున కనలేదుగా, వాన్ని నేను?- అందుకని యిలా కాల్చుకుని తింటున్నాడు నన్ను" ఆమె కంట తడి పెట్టుకుంది.
    సుబ్బారావుగారు కాస్త చలించిపోయాడు.
    "మధ్య నన్ను సాధిస్తా వెందుకే.....చివరికీ వాడూ, నువ్వూ ఒక్కటేనూ" అన్నాడాయన.
    "ఏం చేయమంటారు?" అని ఒక నాలుగు క్షణా లాగి ఆమె భర్త నడిగింది.
    "ఎలాగా అమ్మాయి పెళ్ళి ఐన ఏడాదికి కాని అబ్బాయి వివాహం చేయము.....అది మా సంప్రదాయం గనుక-భాస్కరం గురించి తరువాత ఆలోచిస్తామూ అని చెప్పనా?" అడిగాడాయన.
    "ఊఁ.....చెప్పండి" అన్న దామె యిక గత్యంతరం ఏమిటన్నట్లు?
    "కాని రాఘవేంద్రం అసాధ్యుడు సుమా? నీళ్ళు నములుతూనే తను ముకున్ధాన్ని ధనమ్మ గారికి ధారపోసినట్లు - కేవలం తాను నిమిత్తమాత్రుడైనట్లూ మాట్లాడాడు ...."
    సుబ్బారావుగారు చుట్ట భగ్ భగ్గున కాల్చాడు. ఇక ఫలాయనవాదంతో "ఆర్గ్యూమెంటు" ధోరణిలో పడిపోయాడాయన.
    "అసలు విషయం ఇలా ఆలోచించాలయ్యా మనం ..... ఒకటి మన భాస్కరానికి సురేఖ వచ్చిందా లేదా? వసంతకు ముకుందరావు సరిపోయాడా? లేదా? ధనమ్మగారి ఉద్దేశం ముకుందరావుకు తనే గార్డియన్ అనా? పోతే ఈ సురేఖను మనం చేసుకొనకపోతే ఆ ముకుందానికి మన పిల్లని యివ్వడం జరగదా? ఇక సురేఖలోని లోపాలేమిటి? ...... యివన్నీ...."
    "సరిసరి-ఆ అమ్మాయికి లోపాలేం లేవు. బంగారుబొమ్మలాగే ఉంది. ఎటొచ్చీ కాస్త చదువు కున్న అమ్మాయికదూ, బిరుసుగా ఉందంతే.....యిక ఆ పిల్లకి మా భాపడు నచ్చడమ్మా? అది ప్రశ్న కానేకాదు. మా భాసడు భాసడే.....వాణ్ణి చూడటానికి నాలుగు కళ్ళు చాలవు.... అంటే దిష్టి కొడుతుంది" ఆమె మెటికలు విర్చుకుంది.
    ఈవిధంగా మరో గంటసేపు ఆ దంపతుల సంబాషణ సాగిందే తప్ప ఫలితం శూన్యం.
    'భాస్కరం యిష్టం' దగ్గరే నిర్ణయానికి గండి పడుతూ వచ్చింది.
    గడియారం ఒంటిగంట అని ఆవలించింది. సుబ్బారావుగారు ఆవలింతలకు తావివ్వకుండానే గుర్రు పెట్టడం మొదలెట్టడంతో
    "అన్నీ ఆడాళ్ళ నెత్తిన రుద్దుతా రీయన గారు" అనుకుంటూ జానికమ్మగారు కూడా కనులు మూసుకుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS