Previous Page Next Page 
ఇందుమతి పేజి 11

 

    "పిల్ల నచ్చిందా బాబూ" అని అడిగాడు పిల్ల తండ్రి. రాజు మాట్లాడలేదు. 'అయిదు వేలు కట్నం ఇస్తామన్నాడు పిల్ల తండ్రి. "ఇంటికి పోయి నాన్నగారితో సంప్రతించి  ఏ విషయమూ తెలియ చేస్తానన్నాడు రాజశేఖర మూర్తి . ఇక నిలవలేదు. అతని వెంటనే తరవాతి రైల్లో పిల్ల తండ్రి కూడా గుంటూరు వచ్చి, నిలవదీసి అడిగాడు. చెప్పక తప్పలేదు నచ్చలేదని.
    "నా పిల్లకేం తక్కువ? అయిదు వేలు కట్నం ఇస్తానన్నానే. ఒంటేడు జవహరి. ఆస్తిలో భాగం ఎలాగూ చెందుతుంది. ఇటువంటి సంబంధం మీఅస్తి పాస్తులకు చూసి మీ కేవడిస్తాడు? ఆలోచించుకోండి. కాదంటే ఇక మీకూ మాకూ తెగ తెంపులే . వస్తా" అని పరవళ్ళు తొక్కుతూ వెళ్ళిపోయాడు పెద్ద మనిషి.
    సీతమ్మ గారి మనస్సు చివుక్కు మన్నది. రాజశేఖరాన్ని బతిమాలింది. అతనికి కోపం వచ్చి , "నాకిప్పుడు పెళ్లి వద్దు మొర్రో అంటే నా మెడలు విరిచి పంపిస్తారు. నాకు నచ్చలేదంటే వాళ్లకు కోపాలు, మీకు తాపాలు. ఇక ఏమైనా సరే నేనెవరినీ చూడటానికి వెళ్ళను. నా కర్మాన నన్ను చదువుకోనివ్వండి." అని చొక్కా వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
    ఆ తరవాత చాలాకాలం వరకూ సంబంధాల సద్దు మణిగింది. కాని సీతమ్మ గారికి దిగులు పట్టుకున్నది. ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా అమెకు జబ్బు చేసింది. చిక్కి సగమై పోయింది. ఇక బతకననుకున్నది. ఆమెకూ దగ్గిర దగ్గిర దుర్గాప్రసాద రావు గారి వయస్సు. మనమడ్ని పిలిచి, "నాయనా, నే కన్ను మూసేలోగా మనమరాలిని తీసుకు వచ్చి చూపించవుట్రా?' అని కంట నీరు పెట్టుకున్నది. ఆమె కంఠస్వరం నూతి లోంచి వచ్చినట్లు ఉన్నది. రాజశేఖర మూర్తి గుండె ద్రవించి పోయింది.
    "అలాగేలే, మామ్మా. నీ జబ్బు తగ్గనియ్యి. ఈ పరీక్షలయిన తరవాత చూసుకుందాం" అన్నాడు. ఆమె ముఖం ప్రసన్న మైంది. సగం బాధ తీరినట్లయింది.
    రోగం గడిచి సీతమ్మ గారు తెరుకున్నది. రాజశేఖర మూర్తి పరీక్ష లైపోయాయి. ఎప్పటి లాగే చక్కగా వ్రాశాడు.
    "మన కాంతమ్మ గారి అన్నగారి పిల్లలు ఉండాలి. వాళ్ళ కుటుంబం అంతా చక్కని వాళ్ళు. సంప్రదాయకమైన కుటుంబం. రాజుకు వయసైన పిల్ల వారి కుటుంబం లో ఉండక పోదు. కనుక్కుని వస్తా" నని వీరన్న పేట బయలుదేరింది సీతమ్మ గారు.
    లక్ష్మీ కాంతమ్మ గారు వెంకటా చలపతి గారి పెద్ద తాతగారి మనవడి భార్య . ఆమె భర్త ఆమె పాతికేళ్ళ వయస్సు లో ఉన్నప్పుడే మరణించాడు. అప్పటికి ఆమెకు ఇద్దరాడ పిల్లలు. అప్పటి నుండి ఆమె పిల్లలను కనిపెట్టుకుని వీరన్న పేటలోనే ఉన్నది. కాంతమ్మ గారి పుట్టిల్లు అనంతవరం. ఆమె అన్నగారు అనంత కృష్ణ శర్మ గారు. అయన పేరు వినని వారా ప్రాంతాలలో అరుదు. అయన ధన సంపన్నుడు కాడు, వేదాధ్యాయన సంపన్నుడు. అయన కీర్తి దశరధుని కీర్తి వంటిది కాదు, వసుష్టుని కీర్తి వంటిది.
    సీతమ్మ గారు ప్రతిపాదన కు లక్ష్మీ కాంతమ్మ గారు యెగిరి గంతువేసింది. "లేకేమీ అత్తయ్యా, మా ఇందుమతిది రాజుకు తగిన వయస్సే. పద్నాలుగేళ్ళు. చంద్ర కిరణం లాంటి పిల్ల. మా అన్నగారి పిల్లలందరూ రాజు లాగే చదువు కున్నవారు. అన్ని విధాలా తగిన సంబంధం. కాని వారిది పెద్ద కుటుంబం. పెద్ద పిల్లల చదువుల తో, పెద్ద పిల్ల పెళ్ళితో ఆర్ధికంగా చితికి పోయాడు మా అన్నయ్య. చెప్పుకో దగ్గ ఆస్తి పాస్తులు లేవని మీకు తెలిసిందే. పెద్ద కట్నాలిచ్చు కోలేడు. ఉన్నంత లో ముద్దు ముచ్చటలకు మాత్రం లోటు రానివ్వడని నా నమ్మకం."
    "కట్నాలేందుకే పిచ్చిదానా. సంప్రాదాయిక మైన కుటుంబం అయితే అంతే చాలు. వాడికి పిల్ల నచ్చితే ఇంకే అడ్డంకు లూ ఉండవు.' అన్నది సీతమ్మ గారు.
    కాంతమ్మ గారు ఆనంత కృష్ణ శర్మ గారికి వ్రాసింది. "శుభం భవతు" అన్నారు శర్మ గారు. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు మాత్రమూ, "వీరన్న పేట వారి సంబంధం చేసుకుని కాంతం ఏం బాగుపడింది? ఆలోచించుకుని మరీ వ్రాయండి. మీఇష్టం" అన్నది.
    'ఇదిగో , నువ్వు అపశకునాలు పలకబోకు. విధి ఎవరికి ఎలా వ్రాశాడో అలా జరుగుతుంది. వీరన్న పేట వారి సంబంధాలు చేసుకుని బాగుపడ్డ వారు లేరా? కుర్రవాడు బుద్ది మంతుడుట. ఇంటరు పరీక్ష ఇచ్చాడుట. లక్షణమైన సంబంధం. శుభస్య శీఘ్రం."
    వెంటనే వచ్చి పిల్లను చూసుకుని పొమ్మని వెంకటాచలపతిగారికి స్వయంగా వ్రాశారు అనంత కృష్ణ శర్మగారు.

                                      

                                 12
    వైశాఖ మాసం లో ఇందుమతి రాజశేఖరుల వివాహం నిరాడంబరంగా జరిగింది. అనంతవరం లో పెళ్లి. అనంత కృష్ణ శర్మ గారి బంధు వర్గం అంతా పెళ్ళికి వచ్చారు. వారిని అంతకు ముందు రాజశేఖర మూర్తి చూడలేదు. అనంత కృష్ణ శర్మ గారికి ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. జ్యేష్ట పుత్రుడు కేశవరావు గారు. బి.ఎ., బి.ఎల్. పాసయి బందరు లో న్యాయవాది గా పని చేస్తున్నాడు. అయన భార్య రమాదేవి. వారికి ఇద్దరు పిల్లలు. రమాదేవి జన్మతః గొప్ప ఇంటి బిడ్డ. కేశవరావు బి.ఎల్. చదువుతున్నాడు కదా అని అయన కిచ్చి వివాహం చేశారు . బి.ఎల్ పాసయి బోర్డు కట్టి నాలుగేళ్ల యింది కాని, ఇంతవరకు ప్రాక్టీసు పుంజు కోలేదు. ఇంటి ఖర్చులకు మామగారు ఏడాది కొకమారు కొంత డబ్బు పంపుతూంటారు. రమాదేవి కి తన డాబు దర్పాలకు తగినట్టు సంసారం నడపటం లేదని బాధ.
    రెండవ కుమారుడు నారాయణ రావు గారు బి.ఎ. పాసయి విజయవాడ లో ఒక ట్యూటోరియల్ ఇన్ స్టిట్యూట్ నడుపుతున్నాడు. ప్రైవేటు గా చదివి ఎమ్.ఎ. పరీక్ష కు కట్టాలని అయన కోరిక. అయన భార్య పద్మావతి. వారి కోక కుమారుడు. పద్మావతీ దేవి తలిదండ్రులకు ఎక్కువ ఆస్తి పాస్తులు లేవు. స్వగ్రామం లో ఎలాగో జీవితం గడుపుతున్నారు.
    ఆ తరవాత పెద్ద కుమార్తె భానుమతి. ఆమె భర్త దివాకర రావు గారు. ఏమ్.బి,బి ఎస్. పాసయి ఏలూరు గవర్నమెంటు హాస్పిటల్ లో డాక్టరు గా పని చేస్తున్నాడు. అనంత కృష్ణ శర్మగారు ఆయనకు డాక్టరీ చదువుతున్నాడు కదా అని అరువేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. వారికి పిల్లలు లేరు. దివాకర రావు గారి తల్లితండ్రులు గతించారు. ఇతర బంధువులేవరు దగ్గర వారు లేరు. అందుచేత ఆయనకు అత్తవారే ముఖ్య బంధువులు.
    అనంత కృష్ణ శర్మ గారి మూడవ కుమారుడు మాధవరావు. రాజశేఖర మూర్తి తోటివాడు. అతను కూడా ఆ సంవత్సరమే బందరు లో ఇంటరు పరీక్ష వ్రాశాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. ఆ తరవాతి వాడు మధుసూదన రావు. గుడివాడ లో పినతండ్రి గారి ఇంట్లో ఉండి చదువు కుంటున్నాడు. స్కూలు ఫైనల్ పూర్తి చేశాడు.
    ఆ తరవాతది ఇందుమతి. ఆమెకు అక్క, బావల దగ్గిర చనువెక్కువ. ఏలూరు లో అక్కగారి దగ్గరే ఉండి చదువు కుంటున్నది. నాలుగో ఫారం పరీక్ష ఇచ్చింది.
    తరవాత త్రివిక్రముడు, వామనుడు, రేవతి. ఒక్కొక్కరికి రెండేసి సంవత్సరాలు తేడా. అనంతవరం లో ఉన్న ప్రాధమిక పాఠశాలలో వరసగా రెండో ఫారము, ఐదో క్లాసు, మూడో క్లాసు పరీక్ష లిచ్చారు.
    అనంత కృష్ణ శర్మ గారి తమ్ముడు శివరామ శర్మ గారు గుడివాడ లో మాజిస్ట్రేటు గా పని చేస్తున్నారు. ఆయనకు పిల్లలు లేరు. అన్నగారి కుమారుడైన మధుసూదనరావును అయన దత్తత చేసుకున్నారు.
    రాజశేఖర మూర్తి తరపున పెండ్లి కి పోయిన వాళ్ళు కొద్ది మంది. స్వజనమైన వెంకటా చలపతి గారు, సీతమ్మ గారు, మాణిక్యమ్మ గారు కాక మిగిలిన వారిలో సుబ్బారావు గారు, వారి కుటుంబం వారు, రుక్మిణమ్మ గారు, వారి కుమారుడు రవి ముఖ్యులు. ఉద్యోగానికి సంబంధించిన పనుల ఒత్తిడి వల్ల వెంకటరత్నం గారు వెళ్ళలేదు.
    అనంతవరం చేరినది మొదలు తన వధువు నెప్పుడు చూస్తానా అని కుతూహలం తో ఉన్నాడు రాజశేఖర మూర్తి. మరునాడు ఉదయం వివాహం అనగా ఆ నాటి సంధ్య వేళ అనంతవరం చేరారు పెళ్ళివారు. విడిదిలో స్నానాపానాలయిన తరవాత రాత్రి భోజనాలకు వరుడు తప్ప తక్కిన వారందరూ పెండ్లి వారి ఇంటికి బయలుదేరారు. వరుడికి మాత్రం విడిది లోనే భోజనం. భానుమతీ దేవి, మాధవరావు భోజన సామగ్రులు పట్టించుకు వచ్చారు. బావను చూడాలన్న కుతూహలం తో రేవతి కూడా వచ్చింది. రాజశేఖరమూర్తి భానుమతీ దేవికి నమస్కారం చేశాడు. ఆమె ప్రతి నమస్కారం చేసింది. మాధవరావు తో కరచాలనం చేశాడు రాజశేఖర మూర్తి. మాధవరావు కు ఇదే మొదటిసారి బావగారిని చూడటం. ఇద్దరూ ఒకే వయస్సు వారవటం చేత వారి మనస్సు లిట్టె కలిసిపోయాయి. రేవతిని యేమని పలకరించాలో తెలియలేదు రాజశేఖర మూర్తికి. ఆమె బుగ్గలు నిమిరాడు మృదువుగా. ఆమె హృదయం ఆనంద పూర్ణ మయింది. రాజశేఖర మూర్తి భోజనం చేస్తున్నంత సేపూ మాధవరావు పక్కనే కూర్చుని ఉన్నాడు. కాలేజీ ల చదువుల మీదికి పోయింది సంభాషణ. మాధవరావు ఇంటర్ మీడియట్ లో పదార్ధ విజ్ఞానము, రసాయన శాస్త్రము, వృక్ష శాస్త్రము చదివాడు. ఈ పరీక్ష పాసయితే కోయంబత్తూరు పోయి వ్యవసాయ శాస్త్రం అభ్యసించాలని అతని ఉద్దేశ్యము. బి.ఎస్. సి అయితే కాని వివాహం చేసుకోనని కూర్చున్నాడు. భోజనం చేసి తిరిగి వచ్చిన రవిని కూడా పరిచయం చేశాడు రాజశేఖర మూర్తి.
    ఆడవాళ్ళు కూడా భోజనాలు చేసి తిరిగి వచ్చారు. రాజశేఖర మూర్తి శారదను పిలిచి, "ఏమే, శారదా, వదినను చూశావుటే?' అన్నాడు.
    "లేదు, చిన్నాన్నాయ్. నాకు కనిపించలేదు" అని ముసి ముసి నవ్వులు నవ్వింది శారద.
    "అబద్దాలాడకు , ఆడపిల్లలు పుడతారు."
    "ఏం పుడితే? ఆడపిల్లలు బాగుండరా?"
    'అందరూ బాగుంటా రేమిటి?"
    "అబ్బే, ఒక్క వదినె తప్ప, అంతేనా?"    
    "అయితే వదినె ను చూశావన్న మాట . ఎలా ఉందే?"
    "బంగారు బొమ్మలా ఉంది, నువ్వు చూడలేదా?"
    "చూశాననుకో. అయినా జ్ఞాపకం లేదు. ఏదీ, ఒక్కసారిగా చూశాను? అదీ ఒక్క అయిదు నిమిషాలు."
    "అయిదు నిమిషాలు చాలవా, చిన్నాన్నాయ్, వదినె అందాలు గమనించటానికి?"
    "నువ్వు చెపుదూ, నీకెలా ఉందొ?"
    "ఒక్క మాటలో చెప్పాలంటే , వదినె జాబిల్లి లా ఉంది. నవ్వితే వెన్నెల కురిసినట్టుంది. అ పలచని పెదవులు మామిడి చిగుళ్ళ లా ఉన్నాయి. ఆ సన్నని ముక్కు ఎంత బాగుందని , సన్నజాజి మొగ్గ లాగు! అబ్బ! చిన్నన్నాయ్ , వదినె ను వదిలి పెట్టా లని పించ లే దంటే నమ్ము. ఈ గంటసేపూ నేను వదినె దగ్గిరేగా కూర్చున్నది."
    "నిజమా, శారదా? వదినెమైనా అడిగిందా?"
    "నిన్ను గురించా? మంచి వాడివే!" అని పారిపోయింది శారద. ఇంతలో జానకీ దేవి వచ్చి, "చక్కని చుక్క నేన్ను కున్నావయ్యా మరిదీ! ఇంక మేము నీకు కనిపించం లే" అని చెవిలో చెప్పి వెళ్ళిపోయింది.
    తరవాత మాణిక్యమ్మ గారు మనుమడి దగ్గిరికి వచ్చి, "నాయనా! నీ భార్యను చూశాను. మళ్ళీ అమ్మని చూసి నట్టుందిరా. శ్రీదేవి మన ఇంటికి తిరిగి వస్తున్నదిరా" అన్నది.
    రాజశేఖర మూర్తి మనస్సు పరిపరివిధాల పోయింది. అ రాత్రి అంతా అతనికి కలలు.ఆ స్వప్నాలలో తన ఊహ సుందరి ఒకమారు శ్రీదేవి గా, ఒకమారు రాజేశ్వరీ దేవిగా ఒకమారు శశి బాలగా. ఒకమారు శంపా లతగా, ఒకమారు క్షీర సాగర సముద్భూత శ్రీ మహాలక్ష్మీ గా, ఒకమారు మోహినీ రూపదారి శ్రీ మహా విష్ణువు గా కనిపించింది.
    తెల్లవారు జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని , అభ్యంగన స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకుని కూర్చున్నాడు రాజశేఖర మూర్తి. పెండ్లి వారిని ముహూర్తానికి పిలవడానికి కన్యాదాత తరపున దివాకరరావు గారు, కేశవవారు గారు, నారాయణ రావు గారు, భానుమతీ దేవి, రమాదేవీ, పద్మావతీ దేవి వచ్చారు. వారందరూ పెళ్లి కుమారుణ్ణి చూసి సంతుష్టాంతరంగు లయ్యారు. దివాకరరావు గారు తనను తాను పరిచయం చేసుకుని, రాజశెఖర మూర్తి కి తన శుభాకాంక్ష లందజేసి, "తమ్ముడూ , మన మామగారు దక్ష ప్రజాపతి వంటి వారు. దక్షాయణి లాగ నీ కోసమే పుట్టింది ఇందుమతి. నీ కన్నివిదాలా అర్ధాంగి కాదగినది." అన్నారు. కేశవరావు గారు, నారాయణ రావు గారు తమ బావమరిదిని కౌగలించుకుని అతడు తమ ఇంటి అల్లుడు కావటం తమ అదృష్టం అన్నారు. రమాదేవి, పద్మావతి చిరునవ్వులు చిందించారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS