Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 11


    క్లబ్బు లో ఒంటరిగా ఒక మూల కుర్చీలో కూర్చున్న ధర్మారావు భుజం పై బలమైన చేయి పడడంతో ఉలికి పాటుతో తలెత్తి చూచాడు.
    "అబ్బ! ఏమిటండీ, అంతలా కూర్చున్నారు?' అర్జున్ నవ్వుతూ ప్రశ్నించాడు.

 

                              


    ":ఏమీ లేదు."    
    "యువకులం. ఇంత మందకొడి గా ఉంటె ఎలాగండీ?' అంటూ తన మాటకు తనే పకపకా నవ్వుకున్నాడు. "రండి మాంచి పిక్చర్ వచ్చింది, వెళ్దాము."
    ఆలోచనా రహితంగానే అనుసరించాడు ధర్మారావు.

                               *    *    *    *
    తాను ఎంతో గాడంగా ప్రేమించిన స్త్రీ ని కుయుక్తి తో మరొక పురుషుడు లోబరుచు కున్నాడు. కక్ష, క్రౌర్యాలతో పిచ్చివాడై పోయిన ఆ మొదటి వ్యక్తీ భార్యనూ, ఆమె ప్రేమికుడి ని హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
    అంతటి గంబీర వ్యక్తీ అర్జున్ తనను తాను మరిచి, చిత్రం లోని రసవత్తర విషాద సన్నివేశాలకు ఒక సాధారణ వ్యక్తీ లాగా విపరీత సంతోష విచారాలు ప్రకటించేశాడు.
    "పిక్చర్ చాలా బాగుంది " అని వ్యాఖ్యానిస్తూ లేచాడు అర్జున్. ధర్మారావు ఏమీ మాట్లాడకుండానే ఉండడం చూచి, "ఏం? మీకు నచ్చలేదా?' అని అడిగాడు.
    చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ధర్మారావు.
    "రండి. కారులో డ్రాప్ చేస్తాను" అన్న అర్జున్ మాటలకు సమాధానంగా "లేదండి . నాకు పనుంది. ఊరు వెళ్ళాలి. ఇలా బస్సు కు వెళ్ళిపోతాను " అన్నాడు ధర్మారావు.
    "ఏది  ఆ ఊరు?" అర్జున్ ప్రశ్న.
    చెప్పాడు.
    "ఓ! నడవండి. నేనూ ఆ ఊరే వెళ్తున్నాను, ఒక కేసు విషయం దర్యాప్తు చేయడానికి."
    "థాంక్స్."
    దారిలో అర్జున్ తిరిగి అన్నాడు. "పిక్చర్ చాలా బాగుంది కదూ, ధర్మారావు గారూ?"
    "నిజం చెప్పమంటారా?' ధర్మారావు అడిగాడు.
    "అయితే నచ్చలేదన్న మాట! ఏం?"
    "చూడండి. ఈ ఉదయం ఉరి తీయబడిన వ్యక్తీ కూడా ఇంతటి బాధా క్షేశాల నూ అనుభవించి వుంటాడు కదూ?"
    పరుగిడుతున్న కారు శబ్దాన్ని కూడా మిగేసే టంత బిగ్గరగా నవ్వాడు అర్జున్. "ఇంకా ఆ విషయమే అలోచిస్తున్నారేమిటి? ఇటువంటివి రోజుకు ఇన్ని చూచాను నేను" అంటూ తల మీది జుట్టును పిడికిటి తో పట్టుకుని తిరిగి గట్టిగా నవ్వేశాడు. "లోకం! లోకంలో అనేకం! అందులో మన ఉద్యోగా లేటువంటివి ? నిత్యం ఇటువంటి వాటినే చూడటం. జీవన్మరణాల మధ్యనే చెలగాటం! మీరు ఉద్యోగానికి వచ్చాక, ఇదే మొదటి సారి చూడడం కదూ, ఉరి  శిక్ష అమలును?"
    ధర్మారావు మాట్లాడలేదు.
    ఆ నిశీధి లో బాటకు ఇరుపక్కలా భూతాలలా నిలబడి ఉన్న వవృక్ష సముదాయాలను మౌనంగా తిలకించ సాగాడు.
    "అంతా కలిపి మీ వయస్సెంత? ఓ ఇరవై రెండో, ఇరవై మూడో వుంటాయి. అంతేనా? ప్చ్! ఇటువంటి పసి కుర్రాళ్ళ ని ఇటువంటి ఉద్యోగాలకు వేయకూడదు. మాంచి గుండె దిట్టం ఉండాలి. అబ్బే ఆడపిల్ల లాగ ఇంత బేలతన మేమిటోయ్?"
    ఆ పెదవి విరుపూ, నిరుత్సహమూ చూచి మండిపోతూ పౌరుష స్వరాన అన్నాడు ధర్మారావు : 'ఆ బెంగ మీకేమీ అక్కర్లేదు లెండి. మీ అందరి కంటే గట్టి గుండె కలవాడిని నేను. ఏం జరిగినా నా గుండె బీటలు తీయదు సరి కదా, వీసమంతైనా చెక్కు చెదరదు, అర్జున్ గారూ.
    "కాని, నేననేదేమంటే మీరింతగా మెచ్చు కుంటున్న ఆ చిత్రం ఏం ప్రయోజనం సాధించి నట్టు? చూచి బాధ పడతాము. రెండు రోజులు మెచ్చు కుంటాము. మర్నాటి కి మరుపు తగులుతుంది. ఎందుకది?"
    వింటున్న అర్జున్ కనుబొమలు ముడి వేశాడు. ధర్మారావు వాక్ప్రవాహం సాగిపోతూనే ఉన్నది. "ఈ మనుష్యులు నేరాలు చేయడం, అందువల్ల బాధపడిన వారు వారిని బాధపెట్టి నేరస్తులు కావడం, ఈ అందరు నేరస్తులనూ పట్టి న్యాయస్థానం దండన విధించడం -- ఇదంతా మామూలేగా? ఏముంది కొత్త?"
    "ఏమిటయ్యా ? పోనీ, శిక్షలు లేకుండా వదిలెయ మంటావా?' హేళనగా అడిగాడు అర్జున్.
    "అంత తెలివి తక్కువవాడిని కాను." గంబీరంగా అన్నాడు ధర్మారావు. "నేరస్థులను శిక్షించడానికే ధర్మం కర్తవ్యం. అంతకన్నా న్యాయ చక్రానికి ప్రస్తుతం మరొక మార్గం లేదు. ప్రస్తుత సమాజమే అలా ఉన్నది. నేరస్థులను శిక్షించక పొతే అదే అలుసుగా తీసుకొని మరింత పెట్రేగి పోయి అమాయక జనులనుఇంకా అనేక బాధలకు గురి కావిస్తారు. అసలే ఆనాటి కానాడు ద్వేషం, అసూయ , స్వార్ధం --- వీటితో విషపూరిత మై పోయిన సమాజాన్ని మరింత దిగాదీసి కుళ్ళ బెడతారు. నేరమూ, శిక్షా! ఈ విష చక్రాన్ని ఎప్పటికప్పుడు తుత్తునియలు చేయడమే న్యాయ చక్రపు ధర్మం.
    "తెలిసి తాకినా, తెలియక తాకినా అగ్ని ఆహుతి చేయక మానదు. అలాగే తెలిసి చేసినా, తెలియక చేసినా నేరం శిక్షను అనుభవించి తీరాలి. నేరాన్ని, నేరంగా కనిపిస్తున్న దానిని, నేర్పు ముసుగుతో తన దగ్గరకు వచ్చిన దానిని నిర్దయ గా నెత్తిన మొత్తడమే న్యాయ చక్రం విధి. ఇందుకు న్యాయమూర్తు లూ, న్యాయ పీఠాలు , న్యాయ స్థానాలూ ఏమీ చేయలేవు. పరిష్కార మార్గం ఒక్కటే. నేరమే తనను తాను దిద్దుకోవాలి."
    కొద్దిసేపు ఇద్దరూ చీకటిని చీల్చుకుంటూ ప్రకాశ వంతంగా పోతున్న కారు హెడ్ లైట్ల కాంతి పై దృష్టి నిలిపి మౌనంగా ఉండిపోయారు.
    ధర్మారావు తిరిగి అన్నాడు : "నేరాన్నీ, నేరస్థులనూ ఈ ధర్మ దేవత శిక్షించడ మే కానీ, నేరపరిధి నుండి విముక్తి లభించే మార్గం చూపడం లేదు. అందువల్ల ఈ తప్పుడు మార్గాన్ని వదిలి ప్రజలు సన్మార్గులు కాగల ప్రబోధాత్మక చిత్రాలూ, నవలలూ , ప్రస్తుతం అవసరం కాని, ప్రపంచం లో జరుగుతున్నదే అక్కడా చూపిస్తే ప్రయోజన మేముంది?"
    ధర్మారావు మాటలు వింటూనే పకపకా నవ్వేశాడు అర్జున్.
    "మిస్టర్ ధర్మరావ్! మీకు లోకానుభవం తక్కువండి. ఏమిటో బంగారు లోకం కోసం కలలు గంటున్నారు మీరు. అది ఈ   ఇలాతలంలో అసాధ్యం. ఈ లోకంలో స్వార్ధం, అసూయ ఎప్పుడూ ఉంటాయి. వాటిని వెన్నంటే నేరాలూ ఉంటాయి. అవి లేనిదే సృష్టి లేదు, మానవులు లేరు, ప్రపంచం లేదు. తమకూ, తమ జీవితాలకూ ప్రతి బింబాలుగా ఉంటేనే కధను గాని, చిత్రాన్ని గాని మానవులు మెచ్చుకుంటారు. నువ్వు చూపించే మేలిమి బంగారాన్ని ఈ పద్నాలుగు కారట్ల కాలంలో ఎవరూ మెచ్చరయ్యా."
    జేవురించిన వదనంతో పట్టుదలగా అన్నాడు ధర్మారావు : "ఎందుకు మెచ్చరు? ఈ పృదివి లో బంగారమనేది ఊహ కాదు; నిజంగానే లభ్యమౌతుంది. దీనిని బంగారు పృద్వీని చేయడం కష్ట సాధ్యమే కావచ్చు కాని, అసాధ్యం మాత్రం కాదు. మీరు చెప్పినట్టు స్వార్ధం, అసూయ , ద్వేషం ఉన్నాయి. అంతేకాదు, అమృత హాలాహలాల మాదిరిగా వాటి సరసనే , దయ, సత్యం, ధర్మం కూడా ఉన్నాయి. న్యాయదేవత కూడా ఉన్నది. ఈ నాలుగూ ఏకమైన నాడు మొదటి మూడు రూపు లేకుండా పోతాయి.
    "మానవుడు తన జీవితానికి ప్రతిబింబాన్నే చూడ వాంచించడు. దానికీ లేని, అందని కొన్ని అందాలూ , రమ్యత లూ కూడా మిళితం కావించి చూడ వాంచిస్తాడు. సత్యాన్ని అతడు పలకలేక పోవచ్చు కాని, ప్రేమిస్తాడు. నీతిని అవలంబించ లేకపోవచ్చు కాని, ఆలోచిస్తాడు. ధర్మాన్ని అనుష్టించ లేకపోవచ్చు కాని, ఆదరిస్తాడు. హింసనే అవలబించ వచ్చు కాని, ఆహింసనే అవలంబించాలనే ఆశ అంతరాంతరాలలో లేకపోదు. మైత్రి దుర్లభమే కావచ్చు కాని , విడనాడలేదు, విస్మరించ లేదు. ఈ అన్నీ కలిసిన నాడు అది స్వర్గం! కలియడానికి అనుకూలతే తక్కువ కాని, అవకాశాలు లేకపోలేదు, అర్జున్ గారూ."
    పసిబిడ్డ ప్రదర్శించే అమాయకతకు జాలి చూపినట్లు నవ్వాడు శ్రోత.
    వక్త చలించలేదు, "ఒకనాడు భాగవత్సరూపుదు శ్రీరామ చంద్రుడు చందమామ కోసం ఏడ్వడం పరిహాస పాత్రమైంది. ఈనాడు సామాన్య మానవుడే ఆ జాబిలిని చేర సఫలీకృతుడు కాబోతున్నాడు! కైలసగిరే హిమవచ్చిఖరాన్నది రోహించి పతాక ప్రతిష్టించాడు! భగవత్స్వరూపుడైన మానవునికి నేడు దీక్షా ప్రయత్నాల వల్ల ఫలించని కార్యమంటూ లేదు. సహకారమే లోపం."
    శ్లేష ను గ్రహించలేని మూర్ఖుడు కాడు అర్హున్. ధర్మారావు వదనం వైపు పరీక్షగా చూచాడు.
    అంతలో ఆశ్రమం రావడంతో సంభాషణ ఆగిపోయింది.

                                        14
    మరునాడు, అవసర కార్యాలై పోయిన తర్వాత, ధర్మారావు అభ్యర్ధన ఆహ్వానాల పై ఆశ్రమ మంతా తిరిగి చూచాడు అర్జున్.
    "యెట్లా ఉంది మా ఆశ్రమం?" తిరుగు ప్రయాణం లో ప్రశ్నించాడు అర్జున్ ను ధర్మారావు.
    "మా ఆశ్రమం అంటే? ఏమిటి, ఆశ్రమానికీ, మీకూ ఆ సంబంధం?"
    శుష్క హాసం చేశాడు ధర్మారావు. "సంబంధమే. నాకు తల్లీ, తండ్రి ----అన్నీ ఆ ఆశ్రమమే. ఆ నీడనే పెరిగి పెద్దవాడినయాను నేను."
    "వ్వాట్!' విశేషాశ్చర్యం ప్రదర్శించాడు అర్జున్. "మీ రూపం, సంస్కారం, చదువు , తెలివి చూచి , నేను మిమ్మల్ని చాలా ఉన్నత వంశజాలుగా ఊహించానే!"
    "అవును , అర్జున్ గారూ. అందుకే నేను మీకు ప్రత్యేకంగా ఈ ఆశ్రమంతో పరిచయం చేసింది. ఇటువంటి శరణాలయా లపై , శరణార్ధులపై ఎవరో ధర్మ హృదయుల కూ జాలి గుండె వారికీ తప్ప, సాధారణంగా అందరకూ చిన్న చూపే, ఏవగింపే . కాని, వారు చేసిన పాపమేమిటి చెప్పండి? వారి కెవరూ లేరు అంతే. నిర్దయగా వదిలి వేయబడ్డారు. లేదా దిక్కుమాలిన వారు. ఏమైనా తప్పిదం వారిది మాత్రం కాదు. కాని లోకులు వారిని అసహ్యించు కుంటారు. చిన్న చూపు చూస్తారు."
    'అవును నిజమే.' తటస్థంగా అన్నాడు అర్జున్.
    "ఎవరో లోకులవరకూ అక్కర్లేదు. ఒక్కోసారి అధికారులే చిన్నచూపు చూస్తారు. కాని, మా నారాయణ స్వామి గారు ఈ శరణార్ధుల నందరినీ కన్న తండ్రి కంటే మిన్నగా చూచారు. చూస్తున్నారు,ఆదరిస్తున్నారు. దిక్కులేని వారికి ఏదో గతిమాలిన జీవితం అన్నట్టు గాక, ఉన్నత భవిష్యత్తు కు పునాదులు వేస్తూ, చక్కటి చదువూ, క్రమశిక్షణా నేర్పించు తున్నారు. సదా అదరమే వర్షించు తుంటారు అందుకే , నేను గొప్పవాడి నై పోయానని చెప్పటం లేదు కాని, ఇంత వాడినయ్యాను. అందుకే నేను అందుకున్న మొదటి జీతం లో కొంత ఈ సంస్థ కు ఇచ్చి , మిగిలిన దానితో ఖైదీ లకు విందు చేయాలను కున్నాను."
    "ఇదంతా నాకు వివరంగా చెప్పడం లో మీ ఉద్దేశ్యం ?' ధర్మారావు ను సాలోచనగా చూస్తూ సౌమ్య స్వరంతో ప్రశ్నించాడు అర్జున్.
    ధర్మారావు నిండుగా నవ్వాడు. 'అర్ధం మీరు గ్రహించే ఉంటారు. ఎవరూ లేని వాళ్ళ మంటే ఇంచుమించు బిచ్చగాళ్ళ వంటి వాళ్ళమే కదా, మేము? ఇంకా తక్కువేనేమో! కాని ఇక్కడ మాకు లభించిన ఆదరణాభిమానాలే మమ్మల్ని ప్రయోజకులుగా చేసి సక్రమ మార్గాన నడిపిస్తున్నాయి. ఇటువంటి సంస్థలు కొన్నింటిలో తర్ఫీదు లైన వారు నిర్వాహక లోపం వలన కేవలం హీనులుగా దిగజారిన బ్రతుకు బ్రతుకు తుండడం  సకలజన విదితమే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS