ఏడవాలో నవ్వాలో తెలియలేదు రాజుకు. ఇంకొక సమయంలో అయితే పార్వతి మాటకు ఆమె ఎదురుగా నవ్వేవాడే. ఇప్పటికీ మనసులో నవ్వుకున్నాడు గాని, బయటకు నవ్వదగిన స్థితి కాదది అతని విషయం లో.
"ఏడ్చినట్టుంది,. ఆ మాట అనడానికి సిగ్గు పడాలి" అన్నాడు.
"నేనేం మూలపడి ముక్కే చాందసురాలినా సిగ్గుపడేందుకు?' అంది పార్వతి.
"ఆ సిగ్గు కాదు నేనన్నది. నీకు నామీద, నాకు నీ మీద ప్రేమ ఉందనుకుంటేనే సిగ్గు పడాలి. ప్రేమకు నిర్వచనం తిట్టుకోవడం, కొట్టుకోవడమే అయితే మనది అక్షరాలా ప్రేమే."
"కొట్టుకుని తిట్టుకున్నంత మాత్రానికి ప్రేమలు ఉండవను కుంటున్నావా, బావా?' కాలు పై కాలు వేసి కూర్చుంది.
"ఆహా! ఉండకేం? అగాధపు ప్రేమలు!"
కొంతసేపు మౌన గంబీర్యం వారి మధ్య తాండవించింది. పార్వతి కుర్చీలో వెనక్కు వాలింది.
"నువ్వేవరినో ప్రేమించినట్టు నాకనిపిస్తోంది. నిజమేనా?" నవ్వుతూ ఠీవిగా కూర్చుని అంత రిక్షంలోకి చూస్తూ అడిగింది.
రాజు ఉలిక్కి పడ్డాడు ఆమె ప్రశ్నకు. 'ఈ ప్రశ్ననే తిరిగి తిరిగి అడుగుతున్న దేమిటి? పోనీ ఈ విషయికంగా నైనా ఈమె గారు తన పంతం వదులుతుందేమోచూడాలి!"
"నెరవేరడం గురించి సందేహాలు ఉన్నప్పుడు ప్రేమలు బయట పెట్టి ఏం లాభం?" అన్నాడు నిర్లిప్తంగా.
పార్వతి వినిపించుకోలేదు. "నువ్వు సరోజ ను ప్రేమిస్తున్నావు కదూ, బావా?" అంది.
ఈసారి రాజు ఉలిక్కిపడటమే కాకుండా ఆశ్చర్యంతో కాస్త ఇరుకున కూడా పడ్డాడు. అయినా సమర్ధుడు కాబట్టి, "నీకెలా తెలుసు, పార్వతీ?' అనేశాడు.
"ఎంత నిగూడమైన ప్రేమలైనా బయాల్పడకుండా దాగిపోవు -- కనీసం పరిసరాల్లోని వారి కైనా." అంది పార్వతి.
"నీ ప్రేమ సంగతి నువ్వు చెప్పేవరకు నాకు తెలియలేదు మరి!" రాజు నవ్వి అన్నాడు.
పార్వతి ముఖం క్షణం సేపు వివర్ణమయింది. అయినా కప్పిపుచ్చుతూ , "సరోజ మాత్రం నిన్ను ప్రేమిస్తున్నట్టు కనిపించడం లేదు" అంది.
"నేను నిన్ను ప్రేమించనట్టు" అన్నాడు రాజు మొదటి ధోరణి లో.
పార్వతి కి కోపం వచ్చింది. కుర్చీలో నుంచి చటుక్కున లేచి, "నిద్ర వస్తోంది." అని, నడవ బోయింది.
రాజు కూడా తటాలుమని లేచి పార్వతి వెళ్ళకుండా అడ్డుగా నిలబడ్డాడు.
"కోపం తెచ్చుకోకు, పార్వతీ!"
"నాకెందుకు మధ్య , అనవసరంగా , అర్ధరాత్రి కోపం ?దారి వదులు."
"నా మాట విని నాన్నగారితో చెప్పెసేయ్యి. నీకూ, నాకూ సుఖ కరం ఆ మార్గం."
"ఉహూ. నేను చెప్పలేను."
"ఎందుకని చెప్పవు? ఎలా చెప్పవో చూస్తాను!" అనవసరంగా బెదిరించాడు.
"నేను చెప్పనంటే చెప్పను . ఇక అంతే! ధైర్యవంతుడవైతే నువ్వే మొర పెట్టుకో." మొండిగా అన్నది పార్వతి.
కొన్ని నిముషాల క్రితం ఉన్న తేలిక భావం పోయి ఇద్దరి మధ్యా ప్రళయ కాలపు ఝుం ఝూమారుతం రేగింది. అది రాను రాను ఉదృతం అయిపోసాగింది.
"నన్ను వివాహం చేసుకుంటే నీకూ, నాకూ కూడా సుఖం ఉండదు. ప్రశాంతత ఉండదు. నాకు ఆ సంగతి తెలుసు కనుకనే నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు స్పష్టంగా చెప్పేస్తున్నాను. నీ ఆడంబరాలు, అతి దొరణులు నాకు నచ్చవు."
"ఆ మాట ఇందాకటి నుంచీ చెబుతూనే ఉన్నావు."
"నీకు ఆనంద మనేది కలగనే కలగదు."
"ఫరవాలేదు!" నిశ్చలంగా, పట్టుదలగా అన్న పార్వతి ని విచిత్రంగా చూశాడు రాజు.
"ఎందుకని? ఎందుకని సౌఖ్యా సౌఖ్యా లైనా కష్ట నిష్టూరాలైనా ఆలోచించకుండా , వినిపించు కోకుండా నన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నావు , పార్వతి? నాలో ఏం చేశావు?"
"నీలో ఏం చూశావా?' పార్వతి రాజును ఒకసారి నిలువునా పరికించి భావ గర్భితంగా నవ్వింది. "నీమీద నాకు అధికారం ఉంది. స్వతంత్యం ఉంది" అన్నది కళ్ళు విప్పార్చి అతని వైపు చూస్తూ.
రాజుకు అర్ధమైంది. "ఓహో! అలా అనుకుంటూన్నావా? ఈ అధికారాలను, స్వతంత్రాలను నిలుపుకోవాలను కోవటం శుద్ధ అవివేకం."
"నీ దృష్టి లో అవివేకం కావచ్చు. కానీ , నాకు అనుసరణీయమే. నా వాంచితాలను నేను వదులు కోలేను."
"అధికృత విషయంగా ఏవో కలలు కంటున్నావు. కానీ, నువ్వు నాకు భార్యనవుతావప్పుడు ఆ మాట మరచిపోకు."
"అయితే?"
"నాచరణ దాసీ వన్నమాట. అంతకంటే ఉన్నత స్థానం పొందలేవు ప్రేమ లేని చోట."
"నా దగ్గర ఆ తుక్కు పురాణాలు చదవద్దు. నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను నీ పాదదాసి నై పడి ఉంటాననుకోకు." ఆగ్రహంతో పార్వతి నాసికా పుటాలు అదిరాయి.
"నా భార్య నా పాద దాసిగా పడి ఉండటమే నా కోరిక." రాజు తన ధోరణి ని మలుపు తిప్పాడు.
రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నది పార్వతి హృదయం. "నీ కోరిక మరొక జన్మలో తీరవలసిందే. ఈ జన్మలో కాదు" అంది ఆ పిల్ల.
"ఎలా కాదో చూస్తావు గా? నా భార్య నా పాద ధూళి తీసుకునే, ఏ పురోగతి నన్నా ఆశించాలి. పరిపూర్ణ విధేయత కలిగి ఉండాలి. కర్తవ్య బద్దంగా ప్రవర్తించాలి! నువ్వే నా పెళ్ళాని వైనా సరే."
"అయితే సరోజ నిన్ను పెళ్లి చేసుకున్నా అంతేనా? నవీన భావాలు గలది -- అదేంత మాత్రం ఒప్పుకోదు ఇల్లాంటి పనులకి."
"నాచేత చెప్పించుకోకుండానే ఆమె చెయ్యగలదు." అన్నాడు రాజు.
"ఏమైనా సరే, నేనలాటి నీచమైన సేవలు ఎవ్వరికీ చెయ్యలేదు. చేయ్యబోను. ఇప్పుడే చెబుతున్నాను" అని పార్వతి కిందికి రెండు మెట్ల వరకు పోయింది. రాజు అడ్డం వచ్చి పార్వతి రెండు చేతులూ పుచ్చుకున్నాడు బతిమాలే ధోరణి లో.
పార్వతిని వివాహం చేసుకోవడానికి అతని మనస్సెంత మాత్రం అంగీకరించడం లేదు. ద్వేషాగ్ని రగిలే చోట శాంతి ఉండదు, ఎప్పటికీ లభించదు -- అని అతని విశ్వాసం . అందుచేతనే ఆమె దగ్గర తను అల్పుడులాగా ప్రవర్తించి అయినా ఉద్దేశం మార్చాలని ప్రయత్నం.
పార్వతి రాజు చేతులు విడిపించు కోవాలని ప్రయత్నించి విఫలు రాలయింది. కాని దీనాతి దీనంగా ఉన్న రాజు ముఖాన్ని ఆమె చూడనైనా లేదు."
"పార్వతీ! నిన్ను ప్రార్ధిస్తున్నాను. ఈ వివాహానికి ఒప్పుకోకు. నిష్కారణంగా మన జీవితాలు నిష్ఫలమవుతాయి. నీకేమైనా నా నమ్మకం ఉందా? ఏ మాత్రమైనా ఫలవంత మవుతుందా?"
పార్వతి ముఖ కవళికల్లో మార్పు అనేది కనిపించలేదు.
"లాభం లేదు, బావా! ముఖ్యంగా మామయ్యతో అనంగీకారమని అబద్దమాడటం నావల్ల కాదు."
"నాన్సెన్స్!" రాజు ఆమె చేతులు వదిలి పెట్టి ఉప్పొంగుతున్న అగ్రహ సముద్ర ప్రవాహానికి ఆనకట్ట వేయలేక దీర్ఘంగా విశ్వసించాడు. "నిజంగా నీకు సాధ్యం కానిదే ముంది? ఎంతకైనా తెగించ గలవు. అయినా నీరాత అలా ఉంది!"
"అంటే?" అన్నది పార్వతి ముఖం పక్కకు తిప్పుకుంటూ.
"నామాట వినకపోతే నిన్ను సర్వనాశనం చేస్తాను, పార్వతీ! చూస్తుండు! నీ ఆశయాలు ఆశలు, డాబులు, దర్పాలూ, వేష కావేషాలు మంట గలుపుతాను. ఈ అహంకారం , అతిశయం అన్నీ వదల గొట్టి, అణగదొక్కి నా పాదాలు పట్టుకునే టట్టు చేస్తాను. నా అంగీకారం లేకుండా ఏ పనీ చెయ్యలేవు. నానుంచి నువ్వేమిటి ఆశించావో డానికి విరుద్దమైనది దొరుకుతుంది. నా భార్య కావాలని ఉబలాటం మాట అటుంచి, బానిసవై ఊరుకుంటావు. ఇప్పుడైనా మించి పోయినదెం లేదు. స్థిరంగా అలోచించి జీవిత మార్గం కంట కావృతం కాకుండా కాపాడుకో. అందుకు తగ్గవ్యవధానం నీకు ఉంది!" అన్నాడు రాజు. ఉద్రేక పరిస్థితి ఉనికిని మరిపించిందేమో ఆవేశం లో మాటలు జోరుగా వచ్చాయి.
అతని కోపానికి చలించనట్లు పార్వతి మెట్ల మీద నుంచి కిందకు దిగి, తన గదిలోకి వెళ్లి పోతూ, "ఎందుకు బావా, బెదిరించాలనీ, భయపెట్టాలని ప్రయత్నిస్తావు? నువ్వనుకున్నంత పిరికిదాన్ని కాను. మావయ్య అభిలాష కి అనుగుణంగా నీ భార్య నైతే అవుతాను గానీ, బానిస నెన్నటికీ కాను. జరిగేది జరగబోతుండగా ఎందుకు మనకీ కంఠశోష?' అనేసి లోపలి కెళ్ళి తలుపు వేసుకుంది.
"మైగాడ్!" రాజు స్థాణువులా నిలబడి పోయాడు.
నుదుటిమీది చిరు చెమటను తుడుచు కుంటూ బాల్కనీ లోకి వచ్చి, కుర్చీలో కూర్చుని పరిపూర్ణ చంద్ర బింబాన్ని అర్ధ విహీనంగా , భావ శూన్యంగా చూస్తున్నాడు రాజు. సరోజ సుందర రూపం హటాత్తుగా తళుక్కున మెరిసింది కళ్ళ వెనక చీకటిలో. అతని కనురెప్పలు నిస్సహాయ స్థితిలో, అయోమయ కర్తవ్య సమస్యలో తాడిశాయి స్వేదం తో ఆ వెలుగు లో మెరుస్తూ. వెంటనే సాహసానికి పూసుకోవాలని మనసు హెచ్చరించేదేమో చేత్తో ముఖం తుడుచుకొని అక్కడే నిద్రపోయాడు.
* * * *
పొద్దుట నిద్రలేవటం తరువాయి -----రాజు మెదడు కూ , శరీరానికీ విపరీతమైన బాధ మొదలయింది. ఒకే విషయాన్ని తీవ్రంగా ఆలోచించడం వల్ల మనస్సు మొద్దుబారి ఏర్పడిన అలసట అది. కొడుకు అవస్థను గమనించిన కొద్దీ జానకమ్మ కు చాల కష్టమని పించింది. రాజుకు పార్వతి ని పెళ్లి చేసుకోవాలె అన్న చింత తప్ప మరొక విచారమేమీ లేదని బాగా తెలుసుకుంది స్వల్ప కాలంలోనే. వాళ్ళిద్దరి వాగ్వివాదాలను చూచాయగా విన్నది. కొడుకు వివర్ధ వదనాన్ని చూస్తూ సహించలేక పోయింది. మాతృహృదయంలో నిండిన అనుకంపవల్ల పార్వతి పైన కోపం కూడా వచ్చింది. స్త్రీ తన హృదయాన్ని రెండు భాగాలు చేసుకోవడ మనేది తన బిడ్డల విషయం లోనే సులువుగా జరుగుతుందని చెప్పవచ్చు.
ఏదో మిషతో రామనాధం గారితో సంభాషణ కల్పించుకుంది జానకమ్మ. రాజు వైమనస్యాన్ని వివరంగా చెప్పింది. అయినా రామనాధం గారి నిశ్చయం మారలేదు.
"నీకెందుకు? ఈ సంగతంతా నేను చూస్తాను. అనవసరంగా జ్యోక్యం కలగాజేసుకోకు" అన్నారు పూర్వపు ఫక్కీలో.
తరతరాలుగా వస్తున్న స్త్రీ పౌరుషం దెబ్బతింది. జానకమ్మ అవమానం కలిగినట్లుగా అయన వైపు చూడకుండానే అంది: "నీకేందుకని అంటున్నారా? నన్ను పెళ్లి చేసుకున్న తోలి రోజుల్లో ఇలా అనడానికి సాహసించారా? పోనీ, మాతృమూర్తి నైన తర్వాతైనా? అబ్బే! అప్పుడైతే నేను కోపంతో ఎటైనా పొతే మీరు చిక్కున పడవలసి వస్తుంది. అదంతా ఆలోచించారు, విజ్జులు కాబట్టి. ఈనాడు నా కొడుకు విషయం లోనే నేను జ్యోక్యం కలుగ జేసుకోకూడదు! ఎంత...."
"ఆగాగు!" రామనాధం గారు అడ్డు వచ్చారు.
కింద జరుగుతున్న తలిదండ్రుల వాదం మిద్దె మీద గదిలోకి వినిపించింది. రాజు కుర్చీ ని గోడ దగ్గరికీ జరుపుకొని కుతూహలంగా వింటున్నాడు.
పార్వతి కూడా తన గదిలో నుంచి వారి సంభాషణ పైనే మనసు కేంద్రీ కరించింది. గుండె గుబగుబ లాడుతుంది పార్వతికి.
"నీకొడుకు కాదని ఎవరన్నారు? నాకన్నా నీకే ఎక్కువ హక్కుందే మో ఆ మాట కొస్తే. కానీ నువ్వు భార్యగా నా విషయం కూడా కాస్త వితర్కించాలి. నా మానావమానాలు నీవి కావూ?"
మాట్లాడలేదు జానకమ్మ. వివేచన లో పడింది . నిస్పృహ తో నిట్టూర్చాడు రాజు.
మళ్ళీ మాటలు వినిపించాయి. "ఆరోజు మీ అన్నకు నేను వాగ్దానం చెయ్యడం కళ్ళారా చూశావు. పోనీ, అది ఏనాటి మాటో? అలా ఉంచి మొన్న మొన్న పార్వతి అంగీకారం తీసుకోవడమూ నీకు తెలియకుండా కాదు. నిజంగా తొందర పడ్డాను. ముందు రాజునే అడిగి ఉండవలసింది. వాడైనా తన మనసు విప్పి నాతొ ముందుగా చెప్పి ఉంటె -- పార్వతి కి , వాళ్ళ నాన్నకీ నచ్చ జెప్పి ఏదో ప్రయత్నించి ఉందును. ఇంత వరకు పోయిన తరువాత ఇప్పుడు ఆటంకపరచడమా? ముఖ్యంగా మీ అన్న దగ్గర మాట నిలుపుకో లేనివాడిగా నాకెంత నామోషి! ఇక ఆమ్మాయి పార్వతి సంగతి! మన కళ్ళ ముందు పెరిగిన ఆ లేత హృదయాన్ని చులకన చేస్తే ఎంత బాధపడుతుంది! పాపం తల్లి లేని పిల్ల!" అన్నారు రామనాధం గారు.
కొంతసేపు మౌనంగా నేల చూపులు చూసి, "పోనీ, మరొకసారి పార్వతి అభిప్రాయాన్ని గట్టిగా అడిగి చూడండి! డానికి కూడా ఇష్టమో, అయిష్టమో సరిగ్గా తేలలేదు. ఆకుకు అందకుండా , పోకకు పొందకుండా అవుతుందేమో చివరికి?' అంది జానకమ్మ.
"సరే!"
రామనాధం గారి సమాధానానికి జానకమ్మ తృప్తి పండింది. అంతకంటే వెయ్యి రెట్లు ఉత్సాహం పుట్టుకొచ్చింది రాజులో.
