Previous Page Next Page 
అపరిష్కృతం పేజి 11

                                     

    స్వర్ణా, సుధేష్ణా చిన్నగా నవ్వారు.
    హటాత్తుగా రాజగోపాల్ ఎడమ చేత్తో మరకతం చెవి పట్టుకొని, "ఏయ్, మర్కటం! జోకుతున్నావు అన్న మాటతో జ్ఞాపకానికి వచ్చింది. నీవు ఇంగ్లీషు, తెలుగు కలిపి గొట్టటం లేదేం? కొంపదీసి మానివేశావేమిటి?' అని అడిగాడు.
    రాజగోపాల్ చేతిని పక్కకు నెట్టి, "అవునయ్యా! పురజనుల కోరిక మీద బలవంతంగా అది మాని, నా పి.హెచ్.డి ని త్యాగం చేశాను. ఇంత త్యాగం చేసి నందుకు మీరంతా నాకు 'త్యాగరాణి' అన్న బిరుదేమన్నా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నా!" అంది మరకతం సీరియస్ గా.
     రాజగోపాల్ నవ్వి, "ఎవరో ఎందుకూ? నేనిస్తా తీసుకో!" అంటూ మళ్ళీ మరకతం నెత్తి మీద మొట్టాడు.
    సుధేష్ణా  చిన్నగా నవ్వింది.
    ఎంత పరిచయమున్నా, రాజగోపాల్ మరకతం చెవి పట్టుకోవడం, తల మీద మొట్టడం , మరకతం అతని చేతిని పక్కకు నెట్టడం స్వర్ణ కు నచ్చలేదు. మనస్సులో ఎక్కడో కలుక్కుమంది. 'మనం ఎంత చదువుకొన్నా , మగవాళ్ళ తో ఇంత చనువుగా ఉండే సంస్కారాన్ని ఎవరూ హర్షించరు'' అనుకొంటూ, అప్రయత్నంగా తల ఎత్తి వాళ్ళిద్దరి వైపూ తదేక ధ్యానంగా రెండు నిమిషాలు చూసింది.
    హటాత్తుగా స్వర్ణ కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది. మరు నిమిషాన చిరునవ్వు దీపం లాగా కళ్ళలో , పెదవి మీదా ప్రకాశించింది. కుతూహలం కూడా తొంగి చూసింది.
    మరకతం నవ్వుతూ, "రాజన్నా! కళ్ళు మాట్లాడటం చూశావూ? స్వర్ణ కళ్ళు మాట్లాడతాయి! ఆఫ్ కోర్స్ , నీ ముందర అనడం సభ్యత కాదనుకో. స్వర్ణా! నీ కళ్ళలో కనిపించిన కధ ఏమిటి?" అని అడిగింది.
    చిరునవ్వే జవాబుగా వచ్చింది మరకతానికి.
    మరీ మాట్లాడించక పొతే బాగుండదని రాజగోపాల్ --స్వర్ణ గారూ! మీకో అన్న ఉన్నాడని విన్నాను. అయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అయన పేరేమిటి? ఒక్కమారుగా ఇన్ని ప్రశ్నలు అడిగానని కోప్పడకండి!" అని అడిగాడు.
    చిరునవ్వుతో స్వర్ణ -- "మా అన్న పేరు బాలేందు శేఖర శాస్త్రి . అనంతపురం లో డాక్టర్ గా ఉంటున్నాడు" అన్నది.
    "మీ తల్లిదండ్రులు?"
    "లేరు. ఎవ్వరూ లేరు. అంతా చనిపోయారు. నేనూ మా అన్నా మిగిలినాము!" స్వర్ణ కళ్ళలో దిగులు క్షణం కాలం ప్రస్పుటమయింది.
    హటాత్తుగా ఏదో జ్ఞప్తి కి వచ్చినట్లుగా , రాజగోపాల్ హడావిడి గా -- "బాలేందు శేఖరా? అంటే శేఖర్ కాడూ'? మాతో పాటే కొంత కాలం చదివి, ఆ తరువాత కాలేజీ ని వదిలి వేరే వెళ్ళిపోయాడు! ఆ శేఖరేనా?" అని అడిగాడు.
    స్వర్ణ కళ్ళలో సంతోషం కనిపించింది. "మీకు మా అన్న తెలుసన్న మాట!"
    "తెలియడమేమిటండి? శేఖర్ మా కాలేజీ లో హీరో అయితే!అన్నింటిలో ఫస్ట్ వచ్చేవాడు. ఎంతో మంచి వాడు. ఆతడు కాలేజీ వదిలి వెళ్ళిపోయిన కారణం మీతో ఎప్పుడేనా చెప్పాడా? ఊహు. చెప్పి ఉండడు లెండి! అతని స్వభావం మాకు బాగా తెలుసుగా? మా కాలేజీ లో సుకన్య అనే అమ్మాయి ఒక డెమాన్ స్ట్రేటర్ తో తిరిగి అప్రదిష్టపాలయింది. మా అందరి కోరిక మీద శేఖర్ కలగాజేసుకిని డెమాన స్ట్రేటర్ ను మందలించాడు. ఆ మర్నాడు సుకన్య బావిలో పడి చనిపోయింది. సుకన్య చావుకు శేఖర్ కారణమని కొంతమంది విద్యార్ధులు ప్రిన్సిపల్ కు రిపోర్టు చేశారు. వాళ్ళ కంతా శాస్త్రి అని బి.ఏ చదివే కుర్రాడు లీడర్. శేఖర్ ను కాలేజీ నుండి పంపించక పొతే ,  తాము సమ్మె చేస్తామని ప్రిన్సిపల్ గారిని బెదరించారు. విధి లేక, ప్రిన్సిపల్  శేఖర్ ని వేరే కాలేజీ కి పంపించారు. అసలు ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఆ అమ్మాయి గర్బవతి కావడం అని, ఆ తరవాత ఎప్పుడో నలుగురూ అనుకొన్నారు. కాలేజీ నుండి వెళ్ళి పోయిన తరువాత శేఖర్ సంగతులేవీ మాకు తెలియవు. ఈ వేళ మిమ్మల్ని చూస్తె , శేఖర్ ని చూసినంత సంతోషంగా ఉందండీ!" అన్నాడు సంతోషంగా.
    స్వర్ణ నిర్లిప్తంగా  వింటున్నట్లు కనబడింది.
    స్వభావానికి విరుద్దంగా మరకతం శూన్యంలోకి చూస్తూ, ఏదో ఆలోచిస్తూ ఉండి పోయింది.
    మరకతాన్ని చూసి రాజగోపాల్ నిట్టూర్చాడు. మరకతం దీన్ని కూడా గమనించ లేదు.
    సుధేష్ణ దిగులుగా -- "వయసు ఆడపిల్లల పాలిటి శాపమయింది! నవ్వుల మధ్య గడపవలసిన జీవితాలు ఎన్నో వయసుకు బలి అవుతున్నాయి. ఈ వయసు తాచులాగా అమ్మాయిల జీవితాలలో విషం కక్కుతున్నది. దీనికి తోడూ నేటి సినిమాలూ,రచనలూ కూడా ఊహ తెలిసీ తెలియని పసి మనసులను రెచ్చ గోట్టుతున్నాయి. మన అమ్మా, అమ్మమ్మా వాళ్ళ కాలం నాడే ఆడపిల్లల జీవితాలు మూడు పూలు, ఆరు కాయలుగా ఉండేవి! వాళ్ళకు భగవంతుడు సృష్టించిన సమస్యలు తప్ప, సాధారణంగా వాళ్ళంతట వాళ్ళే సృష్టించుకొన్న సమస్యలేమీ ఉండేవి కావు. చిన్న పిల్లలప్పుడే హాయిగా పెండ్లిండు చేసుకొని బ్రతుకు భారంగా కాక, హాయిగా బాగున్నాయి. ఈనాడు, సంఘం ప్రగతి మార్గాన పోతున్నదని ఊకదంపుడు ఉపన్యాసాలు చెబుతూ , చిన్నప్పుడే వివాహాలు పనికి రావని శ్రీరంగ నీతులు చెబుతూ అమ్మాయిలను అధోగతి పాలు చేస్తున్నారు. ఆరోగ్యశాస్త్ర ప్రకారంగా బాల్య వివాహాలు మంచివి కావు. నిజమే! అయితే, ఊహ తెలిసిన పిల్లలు తప్పటడుగు వెయ్యకుండా, వాళ్ళకి నైతిక బలాన్ని ఇవ్వటానికి సంఘం కానీ, ప్రభుత్వం కానీ ఏ విధాన కృషి చేస్తున్నది? సమస్యలను సృష్టించుకొనే పరిస్తితులనే కల్పించటానికి సహాయం చేస్తున్నది. దీనికి అంత మెప్పుడో?" అన్నది.
    స్వర్ణ ఎంతో ఆసక్తి తో సుధేష్ణ మాటలను వింటున్నది. ఆ మాటలు తనకు నచ్చినట్లుగా కళ్ళలో మెప్పుకోలు కనిపించింది.
    హటాత్తుగా మరకతం -- "సుధా! నీ ఊహలు అంత నిజం కావేమో? మనిషి చెడి పోవటానికి చుట్టూ ఉన్న పరిస్థితులు మాత్రమె కారణం కాకపోవచ్చు. బాగుపడడం, చెడిపోవడం వాళ్ళ బుద్దిని అనుసరించి ఉంటుంది. హైస్కూళ్ళలో, కాలేజీ లలో వేలకు వేలు అబ్బాయిలూ, అమ్మాయి లూ చదువుతున్నారు. వాళ్ళంతా చెడి పోతున్నారా? ఎంచి చూస్తె వాళ్ళలో ఒకరో ఇద్దరో పెదతోవన పోతుంటారు. మిగతా పిల్లలు బుద్దిగా తమ పని తాము చేసుకొంటూ బాగుపడతారు. ఉదాహరణ కి మా కాలేజీ లోనే ఫస్టియర్ చదివే మంగళ ను చూడు. అలా షోకులు పోతున్నది. కాస్త పెడతోవ కూడా తొక్కిందని అనుకొంటున్నారు. మిగతా అమ్మాయిలంతా బాగానే ఉన్నారే మరి! కనక, మనిషి చేదిపోవటానికి , బాగుపడటానికీ ఇతర కారణాలు ఏమైనా ముఖ్య కారణం స్వబుద్దే!" అన్నది.
    రాజగోపాల్ లేచి, "రా, మరకతం ! నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను" అన్నాడు.
`    సుధేష్ణ -- "నువ్వెందుకులే, అన్నా! మరకతాన్ని, స్వర్ణ నూ నేనే ఇండ్ల దగ్గర దింపి వస్తాను" అన్నది.
    గట్టున పడ్డ చేపలాగా గిలగిల లాడుతున్న స్వర్ణ మనస్సు, సుధేష్ణ మాటలతో కుదుట పడ్డది.
    "వస్తానండీ, నమస్తే!" అని రాజగోపాల్ అని, కారులో కూర్చున్నది.
    కారు మరకతం ఇంటి ముందు ఆగింది.
    ఇంటి ముందు దాదాపు ముప్పయి ఏళ్ళున్న యువకుడూ, పాతికేళ్ళ యువతీ కూర్చుని ఏవో కబుర్లు చెప్పు కొంటున్నారు. వాళ్ళ దగ్గరగా ఉన్న ఆరేళ్ళ పాప వాళ్ళను ఏదో అడగటమూ, ఆ యువతి ఆ పాపను కోపంతో చెంప మీద కొట్టడమూ, పాప ఏడుస్తూ ఇంట్లోకి పోవడమూ కారులో నుండి స్వర్ణ చూసింది.
    కారు ఆగటం చూసి ఆ యువతి కూడా లోపలికి పోయింది.
    కారు చప్పుడు విని, ఏడుస్తూ లోపలకు పోయిన పాప బయటకు వచ్చి ఏడుస్తూనే. "అంటీ! వచ్చావా ?" అని మరకతాన్ని పలకరించింది.
    మరకతం పాప వంక చూసి, "ఏడవకు పాపా! ఇంద!" అంటూ పర్సు లో నుండి బిస్కట్ల పొట్లం తీసి ఇచ్చింది. పాప బుగ్గ పట్టుకొని చూసి నిట్టూర్చింది.
    పాప -- 'అంటీ! నీ అన్నం చల్లారి పోతున్నది" అంది.
    మరకతం ఏం పలకకుండా లోపలకు పోయింది.
    డాక్టర్ సుధేష్ణ ఇదంతా చూసి , చిన్నగా నిట్టూర్చి, కారును స్వర్ణ ఇంటి వైపు మరలించింది.

                           *    *    *    *
    మరునాడు , స్వర్ణ మరకతం లో -- "మరకతం! రాత్రి మీ ఇంటి ముందున్న వాళ్ళు పాప తల్లి తండ్రులా?' అని అడిగింది.
    "ఆ అమ్మాయి తల్లి కాదు. అబ్బాయి మాత్రం పాప తండ్రి" అన్నది మరకతం, నిరుత్సాహంగా .
    "మరి తల్లి?"
    "చనిపియింది." ఎటో చూస్తూ జవాబిచ్చింది మరకతం.
    "అయ్యో! పాపం! అంత చిన్న పిల్లకు తల్లి లేకపోవటమా? పాప పేరేమిటి?" బాధ పడుతూ అడిగింది స్వర్ణ.
    "ఉషా బాల."
    "ఎంత దురదృష్టం! పిల్లలకు తల్లి పోవడం కంటే మరో నరకం లేదు! ఆ పాపను చూస్తె నాకు మా అన్న కూతురు శైలజ జ్ఞాపకం వస్తున్నది. నిన్న ఆ పాపను చూడగానే మా శైలు ను చూడాలని పించుతున్నది." అన్నది స్వర్ణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS