Previous Page Next Page 
రంగులవల పేజి 11

                            
    "చదువుతావా, ఇంద" అన్నాడు సీతాపతి ఉత్తరం అందిస్తూ.
    "వద్దులెండి. విశేషాలు మీరే చెప్పండి. ఆవిడ నన్ను తృప్తితీరా తిట్టారా?" అంది తులసి.
    "అదేం లేదు. కన్ను నయమైందిట. కళ్ళద్దాలు అడ్జస్టయినాయిట. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటోందిట. తనకు ఒళ్ళు ఏమంత బాగుండడం లేదని నాన్నగారు అక్కడికి రాశాడుట. అందువల్ల అమ్మ ఊరికెడతానని గోలపెడుతున్నదట" అన్నాడు సీతాపతి.
    "ఊఁ" అంది తులసి దీర్ఘం తీస్తూ.
    "తులసీం, మా యిద్దరికీ కొంచెం కాఫీ పెట్టి ఇవ్వు. నే నక్కడుంటాను. ఐంతర్వాత పిలు" అన్నాడు సీతాపతి లేచి వెళుతూ.
    మొదటిసారి వాళ్ళిద్దరికీ కాఫీ చేసిచ్చినప్పుడు తులసి చాలా సంతోషించింది. అతడు మెచ్చుకున్నాడని చెప్పాడు సీతాపతి, మరోసారి "అర్జెంటుగా కావాలి. లేకపోతే ఈ రాత్రి హోటలుదాకా వెళ్ళాల్సొస్తుంది" అన్నప్పుడు, 'అయ్యో, పాపం, సమయం అలాంటిది కదా' అని ఒప్పుకుంది. కాని, ఇదేమిటి? రోజూ అలవాటైపోయింది. అలుసివ్వటమంటే ఇదే. తెలిసిన వాళ్ళకు అద్దె కివ్వకూడదన్నది ఇందుకే!
    విసుగ్గా స్టౌ వెలిగించింది.
    కాఫీ కాగానే భర్తను పిలిచింది.
    "ఇలా అలవాటు చెయ్యకండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది" అంది.
    "నాకోసం ఎట్లాగూ చేస్తావు గద. అందులోనే మరి కొంచెం నీళ్ళు ఎక్కువ పొయ్యి. అంత ఇబ్బందేమిటి?" అన్నాడు సీతాపతి.
    
                            *    *    *

    ఆ ఆదివారం సీతాపతి సినిమా ప్రోగ్రాం వేశాడు. తులసి రానన్నది. పరీక్షలు మరీ సమీపించాయి, తరవాత చూడొచ్చునన్నది. చదువుతో తన బుర్ర వేడెక్కిపోయిందనీ, కొద్దిగా 'ఎంటర్ టెయిన్ మెంట్' అవసరమనీ సీతాపతి బలవంతం చేశాడు. పాపకూడా రెండు మూడుసార్లు అడిగింది. వీళ్ళను కాదనలేక తనూ ఒప్పుకుంది. హాల్లో మొదట తన పక్కన పాపా, పాపపక్కన సీతాపతీ కూర్చున్నారు. కాని సినిమా మొదలయిన కొద్ది సేపట్లోనే పాప తనను సీతాపతి వైపు కూర్చోమన్నది. తనకు అనుమానం వేసింది. ఇక్కడేదో గొడవ జరుగుతున్నది. సీతాపతికి కోపం వచ్చినట్టు స్పష్టంగా తెలిసింది. అంత ఆశగా సినిమాకి వెళితే ఎవరూ ఆనందించలేకపోయారు. ఆ తర్వాత పాప నెంత అడిగినా ఏమీ కారణం చెప్పలేదు. చివరికి ఆ సీట్లో తన ముందెవరో కూర్చున్నారనీ, వాళ్ళ తల అడ్డు రావటంవల్ల కనిపించలేదు కనక సీటు మారాననీ చెప్పింది. అది పచ్చి అబద్ధం. పాప దాస్తూంది. ఇధివరలో కూడా ఇలాంటిదే జరిగింది.    
    చాలా రోజులదాకా సీతాపతి సరిగ్గా మాట్లాడలేదు. అతడి గంభీరతనూ, నిర్లక్ష్యాన్నీ సమీపిస్తున్న పరీక్షల కన్వయిచుకుని తృప్తి పడింది. ఒకటి రెండుసార్లు పాప మధ్యాహ్నాలు తనకేమీ తోచటంలేదని, వాళ్ళ ఫ్రెండ్సు ఇంటికి వెడతానంటే వద్దందికాని నిజమే, మధ్యాహ్నమంతా ఇంట్లో పాపా, తన భర్తా.
    ఏదైనా ఘోరం జరిగితే ఎలా? ఒక్క క్షణంసేపు అత్తగానీ, మామగానీ ఉంటే బావుండేది అనిపించింది. కనీసం కమలవాళ్ళున్నా ఫరవాలేకపొయ్యేది. ఇప్పుడెలా? రోజులెలా గడపటం? తను ఏ ఉద్దేశంతో పాపను రప్పించుకుందోకూడా అర్ధం కావటంలేదు. అది ఇక్కడికి వచ్చిమాత్రం సాధిస్తున్న దేమిటి? పక్కింట్లో మనిషున్నాడు. మరో మగాడు! పైగా, భర్త స్నేహితుడు. ఇంతటి నిప్పు బండను తనెలా భరించేది?
    "పాపా, నిజం చెప్పు బావగారు నిన్నేమన్నా అన్నారా? చూడు. ఇలాంటి విషయాలు దాచకూడదు. తర్వాత నువ్వే పశ్చాత్తాపపడతావు. నువ్విక్కడ ఒంటరిగా నా దగ్గిరుంటున్నావు. అమ్మా, నాన్నా కూడా లేరు. చెప్పమ్మా" అంది తులసి ఎంతో నచ్చచెప్పుతూ, భయపెడుతూ.
    కాని పాప మొదటినించీ తల ఊపింది అడ్డంగా.
    తులసికి తనను తాను ఫూల్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది.
    భర్త నెలా అడిగేది ఈ విషయం? ఒకవేళ నిజంగా ఏమీ లేకపోతే తనైతాను అతడికి దారి చూపించినట్టవదూ! వీళ్ళిద్దరి ప్రవర్తననూ నిశితంగా పరిశీలించింది. ఇద్దరూ అసలు మాట్లాడుకోవటమే లేదు. ఎదురుపడటం లేదు. గదిలో ఒకరుంటే మరొకరు రారు. ఎప్పుడైనా మాట్లాడుకోవటం తప్పనిసరైనా శత్రువుల్లాగా ఉంటున్నారు. వీళ్ళను మామూలుగా చెయ్యటానికి తను రాయబారం నడపాలా? అసలు ఈ పోట్లాటలు ఎంత బూటకమో! ఈ ముభావాల వెనక ఏ భావముందో?
    ఓ సాయంత్రం...
    పాప ముందరి గదిలో కూర్చుంది. భర్త భోజనం చేస్తున్నాడు.
    "ఏమండీ, పాపకు ఇంకా వయసు రాలేదనుకోండి. కాని ఇప్పటినించే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే బాగుండదూ. లేకపోతే అదీ మనలాగానే అవుతుంది" అంది తులసి.
    "ఉద్యోగం ముందా, పెళ్ళి ముందా అని మహిళల శీర్షికల్లో వాదిస్తుంటారు చూడు. నీ ఉద్దేశంలొ ఏది ముందు?" అన్నాడు సీతాపతి.
    "పెళ్ళికేం, పెళ్ళి చెయ్యాలంటే కట్నం కావాలి. ఉద్యోగం చేస్తే ఆ కట్నం బరువు కొంత తగ్గుతుంది. అంతగా వద్దనిపిస్తే, తర్వాత మొగుడే మాన్పించు కుంటాడు. ఐనా ఈ రోజుల్లో పెళ్ళాం ఉద్యోగం చేస్తానంటే వద్దనే మొగుడెవరు లెండి" అంది తులసి కొంత భర్తనుకూడా కలుపుతూ.
    "అది నిజమేననుకో. కాని పెళ్ళి కాకముందే ఉద్యోగం చేస్తే అమ్మాయిచుట్టూ ఆఫీసులోకి మగక్లర్కులు బెల్లంచుట్టూ ఈగల్లా ముసురుతారు. అలాంటి బెల్లం ఏమంత ఆరోగ్యకరం కాదు" అన్నాడు సీతాపతి.
    "మూగేవాళ్ళెప్పుడూ మూగుతూనే ఉంటారు. పాడయ్యే దెట్లాగూ పాడవుతుంది. అదంతా ఎందుకు గాని పాప సంగతి చెప్పండి" అంది తులసి.
    "పాపకు అర్జెంటుగా పెళ్ళి అవసరం" అన్నాడు సీతాపతి.
    "ఏం?" అంది తులసి, అతని గొంతులో నొక్కబడిన ఉద్రేకాన్ని గ్రహించి.
    "అలా అడుగుతావేం? అంత తెలివితక్కువగా మాట్లాడకు" అన్నాడు సీతాపతి.
    తులసికి గొంతులో వెలక్కాయ పడింది.

                                  10    

    సాయంత్రం ఆలస్యంగా ఆఫీసు దాటింది తులసి. హెడ్ ఆఫీసువాళ్ళు ఏదో అర్జెంట్ ఇన్ఫర్మేషన్ అడిగారని, ఆ రోజు తను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కొన్ని స్టేట్ మెంట్స్ టైప్ చేయించాడు ఆఫీసరు. ఆఫీసు నించి బయటపడేటప్పటికే చీకటి పడింది. అందుకు తోడు బస్సులు దొరకలేదు. ఎన్నో బస్సులొచ్చాయి. కాని జనం క్రిక్కిరిసి ఉన్నారు. రిక్షా మాట్లాడింది కాని అంత ధర ఇవ్వబుద్ధి కాలేదు. నడిచే ఓపిక లేదు. అయిష్టంగా మరికాసేపు నిలబడి తొక్కిడిగానే ఉన్న ఓ బస్సు ఎక్కింది. ఇంటికి వచ్చేటప్పటికి పాప ఇంకా రాలేదు. సీతాపతి స్టౌ వెలిగించే ప్రయత్నంలో ఉన్నాడు.
    "ఏం తులసీ, ఆలస్యమైంది?" అన్నాడు.
    తులసి జవాబు చెప్పింది.
    "బాగా అలిసిపోయినట్టుంది. కూర్చో కాఫే చేస్తాను" అన్నాడు సీతాపతి.
    "ఈ అధిక ప్రేమలే వద్దు. మీరు వెళ్ళి చదువుకోండి. నేను కాఫీ చేసి పిలుస్తాను" అంది తులసి.
    "ఐతే నీకు కాఫీ చేసే ఓపిక ఉన్నదన్నమాట."
    తులసి మాట్లాడకుండా పనికి ఉపక్రమించింది.
    "అంత ఓపిక ఉన్నదానివి ఈ వార్త కూడా విను."
    తులసి భర్తవైపు చూసింది. అతడు నవ్వుతున్నాడు.
    "నాన్నగారికి ఉబ్బసం మళ్ళీ ఎక్కువైందిట. మొన్నటిసారి చూపించిన డాక్టరు కే చూపిస్తే ఏమన్నా లాభం ఉంటుందేమో అని రాశాడు. అమ్మ అన్నయ్య దగ్గిరుంటున్న విషయం తెలుసట. తనకు మొన్ననే ఆ పెన్షన్ డబ్బులు వచ్చాయిట. అని ఖర్చయిపోక ముందే వస్తే బావుంటుందనికూడా రాశాడు" అన్నాడు సీతాపతి.
    "రమ్మనండి, మంచిదేగా" అంది తులసి.
    "మంచిదేనంటావా?" అన్నాడు సీతాపతి చాలా అర్ధాలు స్ఫురించేలా.    
    అతనలా ఎందుకన్నాడో తులసికి తెలుసు.    
    "నన్నెందుకలా అనుమానంగా చూస్తారు" అంది.
    "అనుమానం కాదు, తులసీ. వచ్చింతర్వాత ఎలాగుంటుందో ఎవరి కెరుక?" అన్నాడు సీతాపతి.
    "ఏమీ జరగదని నేను హామీ ఇస్తాను. ఆయన గారు నామీద విసుక్కున్నా, తిట్టినాకూడా నేను నోరెత్తను. జరగవలసిన అవసరాల్లో లోటు రానివ్వను. నన్ను నమ్మండి" అంది తులసి.
    "శభాష్" అన్నాడు సీతాపతి.
    "ఇన్నాళ్ళు మాత్రం ఆయనలా ఒంటరిగా ఊళ్ళో ఉండకపోతే, అత్తగారైనా ఆయనతో ఉండచ్చుగా. ఈవిడేదో కొడుకుల ఇళ్ళకూ, కూతురి ఇంటికీ తిరుగుతుంటుంది. పాపం, ఆయనేమో..."
    "మా అమ్మకు అలాంటి పట్టింపులు లేవుకాని, తులసీ, మా నాన్న అత్యవసరమై తేతప్ప ఊరు కదలడు. గత ఇరవై ఆరేళ్ళుగా ఆయన ఆ ఊళ్ళో టీచరుగా చేశాడు. అక్కడే రిటైరైనాడు. ఇన్నేళ్ళ ఆయన సంపాదనా ఏమిటంటే ఒక చిన్న ఐదుగదుల ఇల్లు ఇంటినిండా ఏదేదో సామానుమాత్రముంది, నువ్వు చూశావుగా. కాని అది అమ్మ మనకూ ఇయ్యనివ్వదు, అన్నయ్యవాళ్ళకూ వద్దంటుంది. తనున్నన్నాళ్ళూ ఆ సామాను ఇల్లు కదలటానికి వీల్లేదట" అన్నాడు సీతాపతి.
    "అదంతేలెండి, ఆడబుద్ధి" అంది తులసి.
    "ఐతే అదీ కథ. అమ్మ ఇప్పుడెట్లాగూ అన్నయ్య దగ్గిరుంటోంది గనక, నాన్నకు ఇక్కడే ఉంచుకుని, ఆయన పెన్షన్ డబ్బులోకి మనది కొంతవేసి ఆయన ఆరోగ్యం మెరుగుపరిచి పంపిస్తే, మన బాధ్యత కొంచెమైనా తీర్చుకున్నట్టవుతుంది గదూ" అన్నాడు సీతాపతి.
    "ఆయనే ఉండకపోయె. వద్దంటే అప్పుడు వెళ్ళాడు ఏవో కొంపలు ములిగిపోతున్నట్టు. ఈ రాకపోకల్తో రైల్వేవాళ్ళు బ్ర్రతికిపోతున్నారు" అంది తులసి.

                              *    *    *

    మామగారు వచ్చాడు. డాక్టరు దగ్గిరకి వెళ్ళాడు. ఆయనకు పథ్యం చెప్పాడు డాక్టరు. చల్లగాలి తాకగూడ దన్నాడట. ఎప్పుడూ గదిలో తలుపులన్నీ మూసేసుకుని పడుకుంటాడు. తులసికి పని మళ్ళీ ఎక్కువే ఐంది. వంట రెండుసార్లు చెయ్యవలసి వస్తున్నది, మామూలు వంటా, ఆయనకు ప్రత్యేకంగా పథ్యంవంటా. పాప పనిలో సాయం చెయ్యకపోతే తనకింకా ఊపిరి సలపక పొయ్యేది. కొద్ది రోజుల క్రితమే ఇంటినించి ఉత్తరం వచ్చింది, క్షేమ సమాచారాలు తెలపమంటూ. ఈ మధ్యనే ఒకటి రెండు సంబంధాలు  వచ్చేయనీ, కాని పాప ఇక్కడ ఉండటంవల్లా, పైగా పాపచేత ఉద్యోగం చేయించాలని అనుకోవటంవల్లా వాళ్ళకు లేదని చెప్పి పంపించామనీ రాశారు. పాప అక్కడుంటేనే ఎక్కువ క్షేమంగా ఉండేదేమో అనుకుంది తులసి.
    ఇన్ని అనుమానాలతో తులసి కొట్టుమిట్టాడు తుండగా, ఆ రోజు తను ఇన్నాళ్ళూ భయపడిన ఘోరంకూడా జరిగింది, తనను గుండెకోతకు బలిచేయటానికి.
    కొద్ది రోజుల క్రితమే మామగార్ని హాస్పిటల్లో చేర్పించారు. అకస్మాత్తుగా ఆయనకు ఉబ్బసం పెరిగి పోయింది. వీళ్ళ డాక్టరే రికమెండ్ చేసి హాస్పిటల్లో చేర్పించాడు. అది శనివారం హులసి ఆఫీసుకి వెళ్ళింది. ఆ రోజే భర్తకు చివరి పరీక్ష. ఆఫీసులో తనకు తలనొప్పి వచ్చింది. కాదు, మరేదో ఇంట్యూషన్ అనుకోవాలి. మధ్యాహ్నమే పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేసింది. ఇంటికి తాళం ఓ రకంగా, తన లోలోపల ఇలాంటిదేదో జరుగబోతుందని అనిపిస్తున్నా గుండె గుభేలుమంది. గోవిందరావు ఇంటికికూడా తాళం. తను ఏం చేసేది? ఎటు పోవాలి? అవును, మామగారి కెలా ఉందో? వెంటనే రిక్షా కట్టుకుని హాస్పిటల్ కి వెళ్ళింది, ఇంకా నాలుగన్నా కాలేదు. వాచ్ మన్ వెళ్ళనివ్వలేదు. లంచం ఇచ్చి ఎలాగో వెళ్ళింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS