'అమ్మా! ప్రభాకరం గొంతు పూడి పోయింది.
'అమ్మ' పద్మావతి కఠినంగా అంది. 'అమ్మ యెవరూ లేరు నీకు యిక్కడ. నేను చేసింది యెంత పోరబాటో గ్రహించాను యిన్నేళ్ళ కి. చపలత్వానికి పోయి యెంత పని చేశాను? నా ప్రాణానికి, రక్తానికీ ప్రాణాధికంగా మిమ్మల్ని యిలా నట్టేట్లో ముంచేస్తూ నేను యింకా బ్రతికి వున్నాను. యందు కొచ్చిన బ్రతుకు యిది. వెళ్ళు ప్రభాకరం నా యెదుట లే!
'అయన నా భర్త. అయన అజ్ఞ మేరకు నేను ఏదీ చేయలేను. నేను నీకు అమ్మనే అయితే యింత కఠినంగా వెళ్ళగొట్టను!"
ప్రభాకరం తల భూమిలోకంటా వొంగి పోయింది. ప్రహరీ దాటి వెడుతూ వెనక్కి చూశాడు. తల్లి యేడుస్తోంది కుమిలి కుమిలి.
తను చేసిన పనికి తనే అనుభవిస్తోంది. నవమాసాలు మోసి కని పెంచి యింత చేసిన ఆ కొడుక్కి దారి చూపించక పోగా నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది యింట్లోంచి. రాజేశ్వరి బయటికి వచ్చింది. ఆ పిల్లని గుండెల కి అదుముకుని పద్మావతి ఏడుస్తుంటే శిలా ప్రతిమ అయిపోయాడు.
'వాడు యెక్కడికి వెళ్ళడు పద్మా. వచ్చేస్తాడు. నా మాట విను. యేడవకు.' రామదాసు భార్య ను వోదారుస్తున్నాడు.
అంటే బాబాయి బహుశా అమ్మ మీద ప్రేమ వల్ల అలా అంటున్నాడేమో అడుగు ముందుకు వెయ్యాలని పించినా మనసు నిగ్రహంగా శక్తినంతా కూడదీసుకుని ముందుకే లాక్కుపోయింది. తల్లి యేడుపు గాలి కెరటాల్లో అలలు అలలుగా తెలితెలి ముందుకు వస్తూ వెనక్కి పోతూ చివరికి తన చెవులు వినిపించు కోలేనంత వెనక్కి వెళ్ళిపోయింది.'
'అయితే నువ్వు యింటికి తిరిగి రాలేదా అప్పుడు,' మధ్యలో అడిగాడు శ్రీనివాస్ వుండబట్ట లేక.
'హు, ఈ మొహానికి అంత అదృష్టం కూడానా?'
'మరి యెక్కడికి వెళ్లావు?'
ప్రభాకరం సిగరెట్ పొగలు పోగులు గా వదులుతుంటే గతం కరిగి పోతోంది అతని మనసు లోంచి మూగగా మధన పడుతోంది అతని హృదయం పశ్చాత్తాపంతో చిట్లి చివికి పోతూ --
'మిస్టర్ వెరీ జ్ యువర్ టికెట్'
తెల్లబోయాడు ప్రభాకరం అతని జేబులో , వస్తుంటే ఆరోజే యిచ్చిన భీమారావు దగ్గరి సర్టిఫికెట్లు తప్ప మరొకటి లేవు.
'చెప్పు ఏది టికెట్.'
ప్రభాకరం నిబ్బరంగా అన్నాడు. 'క్షమించండి. నేను కోనలేదు!'
ప్రభాకరం మాటకి అతనే తెల్లబోయాడు. యింత సూటిగా మాట్లాడుతున్న ఆ మొహం లో కల్మషం యే మాత్రం కనిపించలేదు . అమాయకంగా వున్న అ పిల్లడిని తనతో తీసుకు వెడితే.....అతని పండిన వెంట్రుకలలో అనుభవం జీర్ణించుకు పోయింది. కడుపు నిండా కనుకున్న అతని యిల్లాలు కళ్ళ ముందు పిల్లలతో కళకళ లాడుతూ కనిపిస్తుంటే యింక యేవీ అనలేక పోయాడు.
'క్రిందికి దిగు.'
ప్రభాకరం భయపడలేదు. యివన్నీ ముందే వూహించు కున్నాడు. తను తిన్నగా పోలీస్ స్టేషన్ కే వెడతాడు. ఆ సంగతి చిటికెలో తెలుసుకో గలడు.
భుజం మీద చేయి వేస్తూ అన్నాడు అతను : 'యిలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ వుంటాయి. చూడు బాబూ చదువుకున్న వాళ్ళే యిలా రూల్స్ కి అగైనేస్ట్ గా ప్రవర్తించడం ప్చ్! చాలా విచారించ దగిన విషయం. వొక్కోసారి కష్టాలు తన్నుకు వస్తుంటే నీతి వాక్యాలు మనల్ని రక్షించవనుకో.'
'వూ యింతకీ యెందాకా ప్రయాణం.'
'హైదరాబాదు వెళ్ళాలను కుంటున్నాను.'
'అక్కడ మీ బంధువులు యెవరైనా....'
'వుహూ యెవరూ లేరు నేను వోక్కడినీ'
'అంటే బ్రతుకు తెరువు కోసం అన్న మాట' తల వూపాడు ప్రభాకరం.
'ఈ రాత్రికి మా యింట్లో వుండి ప్రొద్దున్నే వేడుదురు గాని.'
ప్రభాకరం ఆశ్చర్యంగా చూశాడు : యితను గానీ తమాషా చేయడం లేదు కదా!
'నేను తమాషా చేయడం లేదు నిజం'
'అతను భగవంతుడేనెమో.' ప్రభాకరం ఈ మాట ఒకటికి లక్ష సార్లు అనుకున్నాడు. ఆవిడ అంతకు మించిన ఆప్యాయంగా మాట్లాడుతుంటే ప్రభాకరానికి దుఃఖం ఆగింది కాదు. పంటితో క్రింద పెదవిని అడిమేసి గొంతులో గురగుర లాడే నీళ్ళని పంపించేశాడు లోలోపలికి.
మర్నాడు అతను అన్నాడు: 'నువ్వింక క్షేమంగా వెళ్ళ గలవు. యెప్పుడైనా నీకు రావాలనిపిస్తే తప్పకుండా రా. నీకు తండ్రి లాంటి వాడిని-- ఈ రూపాయి వుంచుకో.'
ప్రభాకరం అతన్ని హృదయం లో ఫ్రేము కట్టించి బిగించు కున్నాడు. ఆ ఫోటో పగిలి పోకుండా , చెరిగి పోకుండా జాగ్రత్త గా చూసుకుంటూ .
6
ప్రభాకరం కాళ్ళు తిన్నగా తుల్జా భవనం ముందు భాజా భజంత్రీల మధ్య ఆగిపోయాయి... గోప్పవారింట్లో పెళ్లి ఘనంగా జరిపిస్తున్నారు. అతను అక్కడే వో విస్తరి ముందు విచక్షణా జ్ఞానాన్ని మరిచిపోయి కూలబడి పోయాడు.
నవ్వుతూ వచ్చి అన్నాడు. 'చూడూ బాబూ నిన్ను బెజవాడ దగ్గర చూశాను. యిక్కడ నీకెవరూ లేరని నాకు తెలుసు ముందు నాతోరా.'
ప్రభాకరం సిగ్గుతో తల వాల్చేశాడు. కడుపు కక్కుర్తి కి తను పట్టుబడి పోయాడు.
'పద'
నడిచాడు ప్రభాకరం అతని వెనుకగా.
'వూ, పద'
ప్రభాకరం కీలుబొమ్మ అయిపోయాడు. రంగు రంగుల మేడలు, అందాన్ని వొలక బోస్ అప్సరసలు , రసికత్వాన్ని చిందించే ఆ ప్రదేశం దాటి బయట పడేందుకు ప్రయత్నం చేయలేదు.
'ఆడపిల్లలు యిలా అన్యాయం అవడానికి మీలాంటి మగవాళ్ళే కారణం అంటే యేమంటారు.'
ప్రభాకరం తికమక పడ్డాడు.
'చెప్పండి. సుఖంగా బ్రతికిందుకు మనకి వొక వ్యవస్థ వుంది. లక్షణంగా పెళ్లి చేసుకుని బ్రతికితే ఆ ఆనందం యిక్కడ దొరకదు ,మీకు. ఏమంటారు.'
'మరి మీరెందుకు యిలా అయిపోవడం .'
నవ్వింది చిత్రంగా గాజు గ్లాసు పగిలిన చప్పుడు ఆ నవ్వులో; 'ప్రేమించానన్న మనిషితో కట్టుబట్టులతో బయలుదేరి వచ్చేసే ఆడపిల్లలు యింతకు మించి యెలా అవుతారు?'
'అదేవిటి! ప్రేమించిన మనిషిని మోసం చేస్తున్నావు దేనికి?'
'అడగవలసిన మనిషి మటుమాయం అయిపోయాడు. నేను యిలాగ ఈ రకం జీవితంలో చావలేక బ్రతుకుతూ ఏడవలేక నవ్వుతూ వున్నాను.' ప్రభాకరాన్ని చూస్తూ ఆ పిల్లే అంది మళ్ళీ! 'ఈ వ్యాపారం మగపిల్లల చేత కూడా చేయించి భాగస్వామ్యం తీసుకోవడం చిత్రంగా లేదూ'
'నీ పేరు ?'
ప్రభాకరం వీపు మీద కమ్చీ దెబ్బలు తాకుతున్నాయి. 'రాజేశ్వరీ' అతని మనసు మరిగిపోతూ, రగిలిపోతూ కదం తొక్కుతూ యింటి ముందుకి వాలింది. ఆరేళ్ళ తరువాత. చెల్లెలు రాజేశ్వరి అతని కళ్ళ ముందు కదిలింది దైన్య వదనంతో.
చెల్లెలికి నరకం చూపించిన పినతండ్రి యింట్లో చేరి ఆర్ధికంగా సహాయం చేస్తూ మనిషిగా నిలబడ్డాడు ప్రభాకరం.
'అంటే నువ్వు రాత్రిళ్ళు....?'
'అవును నేను తాగనిదే వుండలేను. అదీ మోతాదు కు మించకుండా . నాకు కొన్ని అలవాట్లు పట్టు బడ్డాయి. జీడి లా అవి నన్ను వదిలి పోవడం లేదు.'
శ్రీనివాస్ యిటు తిరిగి వొత్తి గిల్లాడు. నెమ్మది మీద 'చెప్పనా?' 'యిప్పుడు కాదు ' ఈ రెండు మాటల్లో మొదటిదే బాగుందని పించింది. సమయం కలిసి వచ్చింది యెలాగూ.....
'నీకు పిల్లనిస్తే చేసుకుంటావా పోనీ' అన్నాడు జాగ్రత్తగా.
'వైనాట్.'
'పరిహాసం కాదు ప్రభాకరం .'
'చెప్పవోయ్ పిల్లయేలా ఉంటుంది? చదువు కుందా? అంద చందాలు . ఆస్తి పాస్తులు వగైరా, వగైరా.'
'యివన్నీ లేకపోతె చేసుకోవా?'
'యెందుకు చేసుకోనూ' ఆవిడ గురించి తెలుసుకుని, నచ్చితే ' శ్రీనివాస్ లేచి కూర్చున్నాడు. 'నీతో సస్పెన్సు లో ముంచి మాట్లాడడం నాకు యిష్టం లేదు. అందాన్ని గురించి చెప్పమంటే నేను చెప్పలేను. అందరూ అనగా విన్నాను. ఆవిడ లో మొగలి పువ్వు సౌరభం వుందని.'
'కొంప ముంచి చుట్టూ....ప్రభాకరం చిలిపిగా నవ్వాడు.
నవ్వుతాళీ కాదు ప్రభాకరం. పిన్ని మా నాన్నని పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలు!
'వ్వాట్', శ్రీనివాస్ వైపు ప్రశ్నార్ధకంగా చూశాడు.

'పిన్ని బహుశా నాకన్నా చిన్నదేమో నాన్న ఆవిడకు తీరని అన్యాయం చేశారు.
'యూ యిడియట్ నీకెంత బుద్ది లేదు ప్రభాకరం చాలా దురుసుగా అన్నాడు.
శ్రీనివాస్ మొహం పాలిపోయింది యెత్తిన నోరు టక్కున మూత వేసుకున్నాడు . అవును విధవను చేసుకోమనేందుకు తనకి ఎంత ధైర్యం వచ్చింది? తను నిజంగా పొరబాటు చేశాడు. ప్రభాకరం మగవాడు అతనికి ఏ లక్షణాలు వుంటే తనకేం. యెంత చక్కగా అన్నాడు. 'యూ ఇడియట్ ' అని.
'మీ నాన్న చేసుకునేప్పుడు నువ్వు చూస్తూ వూరుకున్నావా. ఆయనతో పేచీ పెట్టి నువ్వు......నేను అనకూడదు కూడా తల్లి లాంటి ఆవిడని....నేను రెడీ శ్రీనివాస్! నాకు యెలాంటి అవకాశం కావాలనే కోరుకుంటున్నాను.'
నమ్మలేని నిజాన్ని శ్రీనివాస్ గ్రహించి అతని వైపు చూసేందుకే సిగ్గుపడ్డాడు. కొంచెం ఆగి అన్నాడు. 'నువ్వు యెంతటి వాడివి? నిజంగా నేను యిడియాట్ నే. అర్ధం చేసుకోలేక పోయాను. నీకున్న సంస్కారం లో వందో వంతు వున్నా మా కుటుంబం అలా చిద్రం అయిపోయేది కాదు' శ్రీనివాస్ కి కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది.
'నువ్వు ఫూల్ వి. ఆడదానిలా కంట తడి పెట్టుకునే మగవాళ్ళంటే నాకు మహా చిరాకు. చెప్పేది సూటిగా వుంది. అంతవరకూ బాగానే వుంది . కానీ యిదేవిటి మధ్య?'
