హల్లో కూర్చునే వున్నారు కుటుంబ సభ్యులంతా . రాజేశ్వరి నవ్వుతూ ఎదురు వచ్చింది. బహు కాల దర్శనం. వూరకరారు మహాత్ములు.'
'యేవిటి రాజేశ్వరి అది, అతను గడపలో అడుగైనా పెట్టలేదు.' పద్మావతి అంది.
రామదాసు తలెత్తి క్షణం ' భార్య వైపు చూశాడు. 'ఛ! మీలో మీరో వాదించు కుంటారు. అబ్బాయికి మంచి నీళ్ళూ గట్రా చూస్తారా? యిదీ వరుస. తల్లీ కూతుళ్ళు యేకం అయ్యారంటే యివతలి వాళ్ళు వరదల్లో కొట్టుకు పోవాల్సిందే నోయ్.' శ్రీనివాస్ వైపు దృష్టి ని మళ్ళించి భార్య మీద విసుక్కున్నాడు.
'వాళ్ళ మాటకేం గానీ రా. అన్నట్లు అతని చూపులు పెద్ద కొడుకు మీదికి వెళ్ళాయి. 'వీడే , ప్రభాకరం . మెకానిక్ గా పనిచేస్తున్నాడు భిలాయి లో. యీ వూరు వచ్చేశాడు.'
శ్రీనివాస్ చేతులు జోడించాడు. పద్మావతి ని ముమ్మూర్తులా పోలిన ప్రభాకరం లో అందం అంచనా వేయడానికి కూడా అందటం లేదు. అతని ముందు నిల్చిందుకే సిగ్గుగా వుంది శ్రీనివాస్ కి. సూర్య కిరణం లా వెలిగి పోతున్న అతనిలో ఆ ఠీవి దర్పం యే రక్తం నుంచి అబ్బాయో అర్ధం కాక అయోమయంగా తలవాల్చాడు.
'అన్నయ్య కి మీ గురించే చెప్పాను. వాడు యింక యిక్కడే వుంటాడు.'
'అవును,చెల్లాయి రాత్రంతా మిమ్మల్ని గురించే అంది. అప్పుడే అనుకున్నాను చెల్లాయి తో మీ రూమ్ వైపు రావాలి యివాళ అని. దైవికంగా మీరే వచ్చారు.'ప్రభాకరం బుగ్గలు మాట్లాడుతుంటే కదులుతున్నాయి. కొంచెం తేనే రంగు పులుముకున్న కళ్ళల్లో యెంతో ఆకర్షణ. యింగ్లీషు దొరలా కనిపించాడు శ్రీనివాస్ కి. అతని మనసు రాధ మీదికి మళ్ళింది. ఆ రాధ కళ్ళు కూడా యిలాగే మత్తును కలిగిస్తూ వుండేవి. యివన్నిటినీ వో కోలుక్కి తీసుకు వచ్చే లోగానే దాటిపోయింది చేయి. అంతా జరిగిపోయింది క్షణాల్లాగా.
రామదాసు మిగిలిన పిల్లలని వొళ్ళో నూ పక్క పక్క కూర్చో బెట్టుకుని మాటల్లో పడిపోయాడు. పద్మావతి టిఫిన్, కాఫీ లు యిచ్చి సాగనంపింది ముగ్గురినీ.
* * * *
రాజేశ్వరి అంది మెల్లగా! 'చూడండి శ్రీనివాస్ మీరు మరోలా అనుకోకపోతే మా అన్నయ్య మీ రూమ్ లో వుంటాడుట.'
రాజేశ్వరి అలా పిలుస్తుంటే తలెత్తాడు ఆశ్చర్యంగా. 'మీ ఇల్లు అంత పెద్దది. పైగా మీ తల్లితండ్రులు వున్న ఆ పెద్ద యింటి ముందు నా యిల్లు ఎంతండి?'
గోదావరి వరద లా పొంగుకు వచ్చేసింది రాజేశ్వరి కళ్ళల్లో కి దుఃఖం. 'అమ్మా, నాన్నా యెవరికి ఎవరు? నిజంగా మీరు పై పై మెరుగులు చూసి యెంత అంచనా వేసుకుంటున్నారు.'
'అంటే?'
'మేము యెవరమో తెలుస్తే అడిగేవారు కారు.'
'నాకేమీ అర్ధం కావడం లేదు. సరిగా చెప్పండి రాజేశ్వరి .'
'మా నాన్న పోయాక అమ్మ రామదాసు గారిని చేసుకుంది.'
'వ్వాట్' శ్రీనివాస్ నిర్ఘాంత పోయాడు 'యిదెలా సాధ్యం?'
'పిచ్చి శ్రీనివాస్! చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. అమ్మే ప్రేమించి చేసుకుంది నాన్నని. తరువాత ఈయన ఆదర్శం కోసమో మరెందుకో చేసుకున్నారు. అన్నయ్య యీ వూరు వచ్చాడు. వాడికి మీ దగ్గర మనశ్శాంతి వుంటుంది.'
'అంటే రామదాసు మావయ్య సరిగా చూడరన్న మాట.
రాజేశ్వరి తల వూపింది 'అవునన్నట్లు' అయన దయాబిక్ష తో ఎంతో మంది ఆఫీసర్లు అయేరు. మరెంతో మంది గొప్ప పదవులో వున్నారు.'
'అవును నాకూ అదే ఆశ్చర్యంగా వుంది.'
'ఆశ్చర్యం యేవీ లేదు శ్రీనివాస్. అతను సామాన్య మానవుడు. ఈర్ష్య యెవరికైనా వుంటుంది. తన భార్య కన్న పిల్లల మీద ప్రేమ యెంతమంది మగవాళ్ళ కుంటుందంటారు!
'స్త్రీ ఒక్కతే అందుకు కేటాయించబడింది. మాకు ఆ అదృష్టం లేదు అంతే!-
'రామదాసు అలాంటి వారా?'
రాజేశ్వరి నవ్వింది జీవం లేనట్లు 'రామదాసు గారికి పిల్లలు లేకుండా వుంటే బాగుండేదేమో.'
'అంటే.'
'అమ్మను చేసుకున్నాక ఆయనకి పిల్లలు పిట్టారు. మీరు చూడలేదు. వరలక్ష్మీ యం.బి.చదువుతోంది మద్రాసు లో.'
'యింత వలపక్షం ఉంటుందంటారా?'
'మీరు గ్రహించలేక పోతున్నారు . యింత చెప్పాక కూడా.'
'ఆహా అదేమీ లేదు.' శ్రీనివాస్ దిక్కులు చూస్తుండగానే చీకట్లు దట్టంగా పులుముకున్నాయి. రంగురంగుల ఆకాశం క్షణం లో కాటుక కొండలా అయిపోయి అక్కడ కుప్పలుగా పోసిన వెండి రూపాయల్లా తళుక్కు మంటున్నాయి అమావాస్య నాటి నక్షత్రాలు.
'మరి నేను వస్తాను. అన్నయ్య సంగతి డిసైడ్ చేయండి.' రాజేశ్వరి కదలి వెడుతోంది శ్రీనివాస్ హృదయం మీదుగా. స్త్రీని చూస్తేనే అతని మనసు సుభద్ర వైపు మొగ్గి పోతుంది. 'పిన్ని, పిన్ని ' అంటుంది. ఏదో దారి చూపించాలి తప్పదు.
పిన్ని జీవితంలో దీపం వెలిగించే మనిషిని కంచు కాగడాలు వేసి తీసుకు రావాలి. ఆ పురుషుడి కోసం తను శాయశక్తులా ప్రయత్నం చేయాలి. ఆవిడ జీవితం అలా అర్ధంతంగా ఆగిపోకూడదు. సరస్వతి కి ఏదో ఈడూ-- జోడూ కలిసిన మనిషిని వెతికిందుకు ప్రయత్నం చేయాలి. యెలాగ యీ రోజులు గడిపేయడం?
శ్రీనివాస్ ప్రశ్న పూర్తీ కాకముందే పరీక్షలు వురకలు వేసుకుంటూ వచ్చి తొసుకు పోయాయి. కాలండరు లో పేజీలు గిరగిరా తిప్పేస్తూ. సైకాలజీ రాసి యింటి ముందుకు వచ్చాక చక్కటి ఆలోచన మెరిసింది.
* * * *
చాలా కొద్ది వ్యవధి లోనే ప్రభాకరం పూర్తిగా ఆక్రమించుకున్నాడు శ్రీనివాస్ ని. అతను గడప లో అడుగు పెట్టేసరికి ప్రభాకరం వాసాల వైపు చూస్తున్నాడు.
'వాసాలు లెక్క పెడతారా ప్రభాకరం' శ్రీనివాస్ వేళాకోళం ఆడాడు గదిలోకి వచ్చేస్తూ.
'వచ్చావా నీ గురించే ఆలోచిస్తున్నాను' ప్రభాకరం నవ్వాడు.
'దేనికో? నేను పారిపోయానను కున్నావా? పిల్లి యెత్తుకు పోయిందను కున్నావా?'
'పరిహసానికేం గానీ కొంచెం జరిగి చోటివ్వు. నీ పక్కగా నన్నూ పడుకోనియ్యి' చెప్పులు వదిలేసి గోడను కాళ్ళతో నిగడ దన్ని ప్రభాకరం పక్కనే పడుకున్నాడు శ్రీనివాస్. అతని మనసు ఊర్ధ్వ లోకాల్లో ప్రయాణం చేస్తోంది. వున్నట్లుండి -- 'ప్రభాకరం నిన్ను వొక విషయం అడగనా' అన్నాడు.
'ముందు నా మాటకు జవాబు చెప్పవోయ్.' ప్రభాకరం అవకాశం యివ్వకుండా అన్నాడు.
'అయితే అడుగు.'
'వ్యభిచారం మీద నీ అభిప్రాయం యేవిటి?'
శ్రీనివాస్ కనుబొమ్మలు ముడుచుకు పోయాయి! ఆసలు యీ విషయం ఎందుకు వచ్చింది యిప్పుడు?
'చెప్పుదూ. నీ అభిప్రాయం కనుక్కోవాలని వుంది.'
శ్రీనివాస్ నవ్వేశాడు! నాకు ఆసలు ఎక్స్ పీరియన్స్ లేదు. పైగా ఆ విషయాల గురించే తెలియదు . నేనేం చెప్పగలను యింక?'
'వూహూ , దాటేయకు నేను కొంత చెబుతాను. డాన్ని బట్టి నీ అభిప్రాయం చెప్పాలి.'
'వూ అయితే సరే'
ప్రభాకరం గట్టిగా వూపిరి పీల్చి అన్నాడు . పరిస్థితుల్ని బట్టి ప్రపంచంలో స్త్రీలు అనాధలుగా, అన్యాయాలకి బలి అయిపోతుంటారు. వాళ్ళ సంగతిచాలా దయనీయంగా వుంటుంది.'
'సపోజ్ ' మా అమ్మే వుంది. నాన్న పోయారు. ఎవరూ లేరు. రామదాసు గారు ఆదరించి చేసుకున్నారు. మా చిన్నతనం పూల పల్లకీ లాగే గడిచి పోయింది. ఆయనకీ పిల్లలు పుట్టారు. మాదారి మాది అయిపొయింది.'
'ఒక సంగతి చెబుతే నువ్వు నమ్ముతావా శ్రీనివాస్.'
'నువ్వు చెప్పుకు పోతుండు. నమ్మక పోవడం అనే ప్రశ్నే లేదు. ఆసలు యీ విషయాలు నాకు అడగాలనే వుండేది. కానీ ఏవిటో నువ్వు యేమైనా అనుకుంటా వేమో అని అడగలేదు.'
'చెల్లాయి పెద్ద దైనది. వరలక్ష్మీ కి దానికీ ఖచ్చితంగా రెండేళ్ళు భేదం. మళ్ళీ యేడాది వరం పెద్ద దైనది. వాడు ఏం చేశాడో తెలుసా?' అతని కళ్ళు అగ్ని కణికల్లా వున్నాయి.
'యెవరూ , 'శ్రీనివాస్ అడిగాడు.
అసలు ప్రభాకరం పరాకుగా కూడా యిటువంటి పదాలు వుపయోగించడు. కానీ యిప్పుడు, యిప్పుడే యెందుకో యిలా అన్నాడు.
'రామదాసు గాదు.'
'యేవిటి నువ్వు అనేది ఆయన్నా!'
'అవును అతనే. తండ్రుల రక్తం వొకటి కావడం కాదు గొప్ప. ఒక తల్లి గర్బం లోంచి రావడం చాలా పవిత్రమైన సంగతి నా దృష్టి లో . ఏమంటావు?'
'చెప్పు ప్రభాకర్. నీకు కష్టంగా తోచిన విషయం ఏదో లేకపోతె వూరికే ఆనవు యిన్ని మాటలు.'
'వాడు బ్రూట్. ఏం చేశాడో తెలుసా'
శ్రీనివాస్ వింటున్నాడు ఆసక్తిగా!
'నేను లేను యీ వూళ్ళో యిన్నాళ్ళూ. ఒక రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి తిరిగి వచినందుకు... అందుకు వెళ్లి పోవలసి వచ్చింది. అమ్మకీ....చెల్లికీ దూరంగా.......
'ఫస్టు యు గెటౌట్ ప్రమ్ హియర్. నిక్కి నీలిగి అర్ధరాత్రి వస్తే 'నీ అబ్బ యెవరో పెడతాడను కున్నావు తిండి.' రామదాసు కంఠం ఖంగు మంది కంచులా మ్రోగుతూ.
మెట్ల మీదే అడుగులు ఆగిపోయాయి ప్రభాకరం తేల మొహం వేశాడు.
'నీకే చెప్పేది. వెళ్ళిపో. నువ్వు యిక్కడ వొక క్షణం ఉండేందుకు వీలు లేదు.'
'బాబాయ్'
'అవి తరువాత. ముందు పద బయటికి. నీ సంగతి నాకు తెలీదనుకోకు. ఆ రోడ్లన్నీ తిరిగేసి ఈ టైము కి యింట్లో అడుగు పెడితే -- గ్రహించననుకోకు.'
ప్రభాకరం పిడికిళ్ళు బిగుసుకు పోయాయి. 'నేను...నేను అటువంటి పనులు చేస్తానా నమ్మద్దు బాబాయ్. అలాంటి వాడిని కాదు నేను నమ్మండి నన్ను. గిట్టని వాళ్ళు యెవరో చెప్పి వుంటారు. దేవుడి సాక్షిగా నేను యిప్పటి వరకూ మెకానిక్ భీమారావు గారి దగ్గర వున్నాను.'
'నన్నుట్రా నువ్వు నమ్మించేది. అట్టే పిచ్చి వేషాలు వెయ్యక వెళ్ళు. ఆ బజారు లోనే దొరుకుతుంది నీకు కావలసిన తిండి.'
'అమ్మా' ప్రభాకరం కెవ్వుమన్నాడు. రామదాసు చెయ్యి అతని మెడ మీద బలంగా నిలుచుండి పోయింది.
పద్మావతి పరుగుపరుగున వచ్చేసింది. ప్రభాకరాన్ని తన వైపు లాక్కుని గుండెల్లో కి తీసుకుని నిశ్చలంగా వుండిపోయింది.
రామదాసు అన్నాడు: 'నీకు కావలసింది అదే అయితే నాకు అభ్యంతరం యేవీ లేదు పద్మా వెళ్ళు నీ పిల్లలతో నువ్వు సుఖంగా వుంటానంటే నేను కాదంటానా . వరం! మీ అమ్మ వెళ్ళిపోతోంది. అది యెక్కడికో వెళ్లి పోతోంది నన్ను వదిలేసి. యిప్పుడు నాకెవరున్నారు యిక్కడ ; రామదాసు కళ్ళు చెమర్చాయి.
స్త్రీ మాతృప్రేమతో భర్తని సులువుగా మరిచి పోతుందట. రామదాసు హేతు వాదనకి ప్రభాకరం నలిగిపోయాడు.
పద్మావతి కొడుకుని అడుగు దూరంలో నిలబెట్టి అంది. 'నేను పొరబాటు చేశానని యిప్పుడు తెలుసుకున్నాను ప్రభాకరం. నువ్వు వెళ్లి పో యింట్లోంచి. నీకు యెవరూ లేరు!
