"నిన్ననలేదురా, సాంబూ! నా ఆశలన్నీ నీమీదే పెట్టుకున్నాను కదరా, బాబూ! ఈ బి.ఏ కాస్తా గడిచి గట్టెక్కితే నీకు పెళ్ళి , పేరంటం చేసి ఆ డబ్బుతో శాంత కి పెళ్ళి చేసేస్తే మీ ఇద్దరి జీవితాలు ఒడారిన పడతాయని సంతోషిస్తున్నాను. మీరు సుఖంగా ఉండడం కన్న నాకేం కావాలి చెప్పు? మీకోసం నేను పడుతున్న కష్టాల్ని, నేననుభావిస్తున్న జీవితాన్ని చూసే కాస్త జాలి పడమంటూన్నాను. మా అందరి కోసం మా అన్నయ్య ఇంత చేస్తున్నాడనే విశ్వాసముంచమంటున్నాను."
"ఏమిటిరా , సూర్యం , ఆ మాటలు? నీ పట్ల విశ్వాసం లేకుండా ఎవరు ఏం చేస్తున్నారురా? ఏదో కుర్ర నాగన్న తెలిసో తెలియకో ఏ స్నేహితుడికో అప్పు పెట్టి ఉంటాడు. లేక సరదా కి ఏదో ఖర్చు చేసి ఉంటాడు. అంతమాత్రాన .... అంతలేసి మాటలు?"
'అవునమ్మా , నీకలాగే ఉంటుంది. ప్రకాశం కుర్ర నాగన్న. జానకి చిన్న పిల్ల. అందరి కంటికి ముసలి వరదులా కనిపిస్తున్నది నేనేనమ్మా! ప్రకాశం ఈడు నుండి నేను పనిచేసి జీతం తెచ్చి నీ చేతిలో పొయ్యడం జ్ఞాపకం లేదా నీకు? అప్పుడు నన్ను చూసి కుర్ర నాగన్న అనుకున్నావా? మీ నాన్నగారికి వేన్నీళ్ళకి చన్నీళ్ళు తొల్లింపుగా ఏదో ఉద్యోగం చూసుకోమని నువ్వే కదా సలహా ఇచ్చేవు?"
"ఈరోజు ఆ మాట నీ చిన్న కొడుక్కి చెప్పవేం? చదువు లేకుండా, పని లేకుండా అచ్చు విడిచిన అబోతులా తిరుగుతున్నాడు. ఇంట్లో జలగలా రక్తం పీల్చుకు బ్రతికింది కి అన్న ఉన్నాడనేనా ఆ ధీమా?
"ఛీ! మనుష్యులన్న తరువాత కాస్త సిగ్గుండాలి. చదువు, పనిలేక తిరుగుతున్న అభిమానధనుడోకడు. పెళ్ళి చేసుకుని మొగుడింటికి వెళ్ళనన్న ఆడపిల్ల ఒకతి. ఏం పిల్లల్ని కన్నావమ్మా!"
సుందరమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగేయి.
"నిజమే , నాయనా! నా రాతి ఇలా ఉండబట్టే ఆయన కన్నుమూసినా మొండిగా ఇలా బతికున్నాను. నీచేత ఇన్ని మాటలు తింటున్నాను. నిన్ను కన్నకడుపునే వాళ్ళనీ కన్నాను. వాడిని లక్షణంగా చదువుకోవద్దన్నానా? దాన్ని అత్తింటి కెళ్ళవద్దన్నానా? వీళ్ళిద్దరి గురించి రాత్రి పగలు బాధతో నేను కుమిలి పోతుంటే పైగా నీ సాధింపులు కూడా!"
"అన్నయ్య బాధ ప్రకాశానికి చదువు రాలేదనీ, నేను అత్త వారి ఇంటికి వెళ్ళలేదని కాదమ్మా! అందరి కన్నా ఆఖరుగా తనని ఎందుకు కనలేదని, అప్పుడు మాకేవరికి డబ్బు పెట్టవలసిన అవసరం ఉండక పోవునని."
"విన్నావా, అమ్మా, దాని మాటలు? నేను తనుకి డబ్బు పెట్టాలని ఏడుస్తున్నానుట. నాన్నగారు మంచాన పడ్డ దగ్గరినుండి వీళ్ళందరినీ రెండు పూటలా మేపుతున్న దెవరు? వీళ్ళ జీతాలు, బట్టలు చూస్తున్నదేవరు? నా అవసరాలన్నీ మానుకొని వీళ్ళ కోసం.... వీళ్ళ కోసం నా జీవితం , నా ఆనందం నాశనం చేసుకొని...."
"అక్కడే నువ్వు పొరపడుతున్నావు , అన్నయ్యా! నాన్నగారు పోయిన దగ్గరి నుంచే నువ్వు సంసారం చూస్తున్న సంగతి వాస్తవమే. కాని ఆ పని నిరాపెక్షగా మాత్రం చెయ్యడం లేదని నా అభిప్రాయం. నీ చేతుల్లో పెరిగిన తమ్ములు ఆర్ధికంగా నిన్ను ఆడుకొంటారు. తనకోసం చూసుకోకుండా సూర్యారావు తోడబుట్టిన వాళ్ళని బాగు చేసేడని పెద్దలు నిన్ను మెచ్చి మేకతోలు కప్పుతారు.
"ఇందుకోసం నిన్ను తప్పు పట్టటం లేదు.తలిదండ్రులైనా పిల్లల నుండి ఈమాత్రం ఆశిస్తారు. నువ్వు బాధ్యతలు నిర్వహించి హక్కులు కోరడం లో తప్పు లేదు. కాని, మాకోసం నువ్వు నీ జీవితం పాడు చేసుకొంటున్నావని నువ్వు బాధపడడం ఉందే.... అది అంత ఆరోగ్యకరమైన ఆలోచన కాదు.
"ఈ పళంగా ఇంట్లో వాళ్ళమంతా ఎవరి దారిన వాళ్ళం వెళ్ళిపోతామనుకో. అప్పుడు నువ్వు సుఖపడగలవా అన్నయ్యా? మేమంతా లేకపోతె కాస్త ఆర్ధిక మైన ఒత్తిళ్ళు తగ్గుతాయి. నీకోసం మరో రెండు షర్ట్లు కొనుక్కో గలుగుతావు. నీ భార్యకి ఇంకో రెండు చీరలు కొంటావు. అంత మాత్రం చేత నీ జీవితం సౌఖ్య సోపానాలు అధిరోహిస్తున్నట్లు , నువ్వు కోరిన గమ్యం చేరుకోన్నట్లుసంతోషించగలవా? మరి నీకు కోరికలు, కొరతలు ఉండవా? నువ్వు కొనుక్కో గలిగిన ఆ రెండు షర్ట్లు మా వల్ల కొనుక్కో లేకపోతె అందువల్ల నీ జీవితం నాశనం అయిపోయిందనే అనుకోగలవా? నలుగురు తోడబుట్టిన వాళ్ళ అభివృద్ధి కి తోడ్పడి వాళ్ళ జీవితాలు నిర్మించేనన్న సంతృప్తి కన్న నీకు తీరని అత్యల్పమైన కోరికల వల్ల కలిగిన బాధ అధికం అవుతుందా?
"కారణం అది కాదు, అన్నయ్యా! నువ్వు నీ జీవితం చుట్టూ దగ్గరగా ఎత్తైనా గోడలు కట్టుకోన్నావు. బయట ప్రపంచంలోని ఒక్క కాంతి కిరాణం , ఒక్క గాలి రివట లోపల జొరబడే అవకాశం లేకుండా నిన్ను నువ్వు బంధించుకున్నావు. అందులో ఉన్న గాలి కొంత వరకు నీకు ఊపిరి పీల్చుకొందికి పనికొస్తుంది. అటు పై ఊపిరి తిరగక ఉక్కిరిబిక్కిరి అయిపోతావు. ఆ చుట్టూ గోడలు పగలకొట్టు. గాలీ, వెలుతురూ బాహాటంగా లోపలికి రానీ. అప్పుడు జీవితం ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నదాని కన్నా ఎన్నో రెట్లు సుందరంగా కనిపిస్తుంది.
"మా బాధ్యతలు నిన్నెల్ల కాలం కట్టి ఉంచవు. ఈ రోజు కాకుంటే రేపైనా మా బ్రతుకులు మేము చూసుకొంటాము. మావల్లే నీ జీవిత పురోగతికి అవరోధం కలిగిందని నువ్వు బావిస్తుంటే అంతతో ఆ అడ్డంకి తొలగి పోతుంది.
"కాని నా అభిప్రాయంలో అసలు అడ్డంకి ఇది కాదు. నువ్వు నీ జీవితం పట్ల, ఎదుటి వాళ్ళ కిచ్చే విలువల పట్ల సంకుచితమైన భావాల్ని ఎర్పరచుకోన్నావు. అవి ఎటూ నిన్ను కదలనీయకుండా పట్టి ఉంచుతున్నాయి. నీ కళ్ళ ముందు కటిక చీకటిని వ్యాప్తి చేస్తున్నాయి. ఆ చీకటిని చీల్చుకుని బయటికి చూసిందుకు ప్రయత్నించు. మానసికగా నిన్ను పెరగనీక అణిచి ఉంచిన అహంకారాన్ని, అదుపులోకి తెచ్చుకో. నీ జీవిత గతి మారుతుంది. నువ్వు ధనధాన్యాలతో తులతూగక పోవచ్చు. కాని జీవితంలో సంతృప్తి, శాంతి దొరుకుతాయి. ఈ మాటలన్నీ ఎంతకాలం గానో నీతో చెప్పాలని అనుకొంటున్నా నన్నయ్యా! మంచో చెడో ఈరోజు నా నోటి వెంట వచ్చేసేయి" అన్నది జానకి.
అంతవరకు పళ్ళు బిగపట్టి విన్నాడు సూర్యారావు -- "అయిందమ్మా నీ ఉపన్యాసం? ఎంత చక్కటి బోధ చేసేవు తల్లీ! తోడ పుట్టిన వాళ్ళ కోసం అప్పుల పాలై వాళ్ళ చేతనే సంకుచిత స్వభావుడు, పిసినారి అనిపించుకొన్న అన్నగారింకెక్కడా ఉండడనుకొంటాను. అది నా ముఖాన్నే పొద్దు పొడిచింది. నాలా సంకుచిత స్వభావులు కాకుండా, మీరంతా విశాల హృదయులూ, వితరణ పరులూ కండి. చూసి ఆనందించడానికి నేను బ్రతికే ఉంటాను" అంటూ లేచి విసురుగా వీధిలోకి వెళ్లిపోయేడు.
"అయ్యో....అయ్యో.... తిండి తినకుండా ఎక్కడికి రా పోతున్నావు? రారా, వంటయి పోయింది. పొద్దున్న పది గంటలకనగా ఉడికీ ఉడకని మెతుకులు తిని పోయేవు." అంటూ బ్రతిమాలాడింది సుందరమ్మ.
"ఇంకేం తిండి లే, అమ్మా ! అన్నదమ్ములు అప్పచేల్లెళ్ళ అభిమానాలతో, కడుపు నిండిపోయేక" అన్నాడు వెను దిరిగి చూడకుండా సూర్యారావు.
భర్తకు ఏదో చెప్పబోయి, అతని జవాబు విని ఊరుకొన్న కనకం తెరిచిన నోరు మూయకుండా అలాగే నిలబడింది.
"అన్నయ్య ని మేమంతా ఏదో అన్నామని కోపంగా ఉందా, వదినా! అన్నయ్యంటే మా కభిమానం లేక కాదమ్మా. అతని మంచికోరే....."
జానకి మాటను మధ్యలోనే అందుకొంది కనకం.
"ఓ తల్లి బిడ్డలు , అబిమానాలు లేకుండా ఎలా పోతాయి, జానకీ! ఏదో అనుకున్నప్పుడు అనుకున్నా తరువాత మీరే కలుసుకొంటారు. అసలు మీరు వాదించు కొంటున్న విషయాలే నా కర్ధం కావు. అందరి మాటలు సబబుగానే ఉన్నాయని పిస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనకేం లోటు వచ్చిందని మనం బాధ పడాలి? ఎవరి ముందు చెయ్యి జాచి అడుక్కోలేదు. ఎవరింట దొంగతనం చెయ్యలేదు. మనకున్నదేదో మనం తింటున్నాం. నాలుగు రోజులు కళ్ళు మూసుకుంటే సాంబు ఉద్యోగస్తుడవుతాడు. అప్పుడు మనమే పదిమందికి పెట్టగలం.
"ఈపాటి దానికి ఈ వాదా లెందుకు? ఈ కోపా లెందుకు? నేను మీలా చదువుకోలేదు. నాకు శాస్త్రాలు, పురణాలు తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే. నీ చుట్టూ ఉన్న నలుగురు నవ్వుతుంటే నువ్వూ నవ్వుతావు. వాళ్ళు ఏడుస్తుంటే నీకూ ఏడుపు వస్తుంది. అది లేదని, ఇది లేదని నేనేడ్చి ఇతరులను ఎడ్పించేకంటే, నా బాధని నాలో ఇముడ్చుకుని ఇతరులను నవ్వించ గలిగితే, వారితో పాటు నేనూ నవ్వగలుగుతాను, ఆ నవ్వులో ఏడ్పు దానంతట అదే పోతుంది" అన్నది కనకం.
"వదినా, నువ్వు నమ్మిన సూత్రాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకు. అశాంతి అన్న మాటకి అర్ధం తెలియకుండా నీ జీవితం గడిచి పోతుంది." అన్నది జానకి.
గౌరవం నిండిన కళ్ళతో ఆ ఇద్దరు స్త్రీల వైపు చూసేడు ప్రకాశం.
* * * *
