అయితే రఘు మనసు మాత్రం రోజులోని సగం కాలాన్ని సుధ భవిష్యత్తు ను గురించి ఆలోచించడం లోనే గడుపుతుంది. సుధ కాలు అందరి కాళ్ళులా బాగవాలి.... సుధ అందరి వంటి మామూలు మనిషిగా అవాలి. లేడి పిల్లలా తుళ్ళుతూ, కాలేజీ లో తన ఎదురుగా తిరుగాడుతుండే విద్యార్ధిను లందరి లాగా సుధ అవాలి. ఈ తన ప్రయత్నం ఎలాగైనా నెరవేరి తీరాలి. అసలు పట్టుదలతో తనీ చదువులో చేరడం లోని తాత్పర్యం సుదకి తను స్వయంగా పరిశోధన్లు జరిపి ఆలోపం తీర్చేందుకనే! ఇందులో తనకి, ఎంత శ్రమయినా ఎన్ని ఇబ్బందు లేదురైనా ఎంత వ్యయమయినా అలక్ష్యం చెయ్యకుండా ఈ లక్ష్యాన్ని సాధించే తీరాలి. అందరూ వైద్య శాస్త్రం చదివి నందుకు పరిశోధనలు జరిపితే రఘు, తన పరిశోధనల కోసరం వైద్య శాస్త్రం చదవ నారంభించాడన్న మాట.
అతనికి అయిదేళ్ళు నిండి నిండనప్పుడు సుధని తొలిసారిగా చూడ్డం! ఆపదలో వున్న తల్లికి పులి మీద పుట్ర న్నట్టున్న సుధ అవిటి తనాన్ని చూసి బాధ పడడం జరిగింది.... అనట్నుంచీ అతనితో పాటు ఆ అభిమానమూ, పెరుగుతూ వచ్చింది . ఆటపాటల్లో ఈ అవిటితనం వల్ల ఇబ్బందులూ, అగచాట్లూ పడుతుండే సుధని చూస్తె, 'ఏమాత్రం తన వల్లనయినా తన కాలు ఆ పిల్లకు పెట్టించి ఆ కుంటి తనాన్ని తను సంతోషంగా అనుభవిద్దునే'....అనుకునే వాడు అప్పుడప్పుడూ. సుధ కాలుని పరీక్ష చేసిన డాక్టర్లు అందుకు తగిన హెచ్చరికను తీసుకోకుండా నీళ్లు కారుస్తూ నిర్లక్ష్యంగా వుండడం చూసి ఈపాటి భూతదయా, ప్రయత్నమూ లేని, వీరి విద్య కాల్చనా' అనుకునేవాడు. ఏం చెయ్యడం? ఎలా ఈ చిన్నారి సుధ లోపాన్ని తీర్చడం ఎవరిందుకు పూనుకుంటారు? ఏ విధంగా తన ప్రయత్నం కొనసాగుతుంది! మనిషిగా జన్మ ఎత్తి నందుకు తోడి మానవులకూ, తల్లి దేశానికీ, ఏ కొంచెం పాటన్నా సాయం పడకపోతే ఇక మనకీ, మట్టిలో పుట్టి మట్టిలోనే నశించి పోయే పురుగులకీ ఏవిటి తేడా, అందుకే స్వార్ధం మాత్రం చూసుకుంటూ, కాలం వృధా కానివ్వకుండా పరులకుపయోగపడే మంచి విషయాలేవన్నా. పరిశోధన్లు చేసి కనిపెట్టాలి. అందుకనుకూలంగా ఉండేందు గ్గాను ఇప్పట్నుంచీ మనోనిబ్బరం , కార్య దీక్షాత్వం అలవర్చు కోవాలి. చూసిన వారంతా తనననుసరించాలనుకునేటంత గొప్ప ఆదర్శ నీయంగా వుండాలి. తన నడవడికలోనూ, ముఖ్యంగా సుధని మామూలు మనిషిగా చెయ్యడం లోనూ, తన ప్రయోజకత్వాన్నంతా ఉపయోగించి జయించగల్గాలి.
ఇలా ఎప్పుడూ ఏవేవో వింత వింత కలలు కంటూ, కొత్త కొత్త పరవళ్ళు తోక్కుతూనే వుంది ఆ నాట్నుంచి ఈనాటి వరకూ అతని హృదయం.
ప[పోర్టికో లో కొచ్చి ఆగిన కారు చప్పుడుతో ఉలిక్కిపడి లేచి వాకిట్లో కెళ్లాడు రఘు.
'ఇతడే నండీ మా పెద్దబ్బాయి . రఘూ వీరు జయా ఫ్యాక్టరీ కి మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఇంకా అనేక కంపెనీలకీ ఏజెంట్లే కాకుండా, విదేశపు వ్యాపారాల్లో కూడా సంబంధం వుంది వీరికి. జోగారావు గారివాళ దార్లో కనిపించి పరిచయం చేశారు' అన్నారు. కారు దిగిన శర్మ గారు తనతో పాటు దిగిన కొత్తాయనను రఘూ కి పరిచయం చేస్తూ.
'గౌరవంగా నమస్కరించి ఏదో ఒకటి రెండు మాటలాడాడు రఘు. ఆ వొచ్చినాయనా చాలా పెద్ద తరహాగానే తోచారు రఘుకి.
'కోటయ్యా వీరని పై నున్న పెద్ద బెడ్రూమ్ కి తీసుకేళ్ళూ.' అని తోటమాలి కి చెప్పేసి, మా భోజనాలూ వగైరా అన్నీ జోగారావు గారి బలవంతం కొద్దీ అనకాపల్లి లో వారి బావమరిది ఇంట్లోనే అయిపోయాయి. అమ్మతో చెప్పూ!' అంటూ తనూ పైకి బయల్దేరారు శర్మ గారు.
'చూడండి నాన్నా. మళ్ళీ ఆయన్ని సందిగ్ధావస్థలో ఇరికించక. ఇంకో నాలుగైదేళ్ళ వరకూ. అటువంటి ప్రయత్నాలేవీ ఒద్దన్నానని స్పష్టంగా చెప్పెయ్యండి.' అన్నాడు మాటల్ని బట్టి ఆ పెద్దమనిసొచ్చిన పనిని గ్రహించుకున్న రఘు.
'అయన కలకత్తా నుంచీ సెలవు లో ఇటు ఒచ్చి పర్యటన చేస్తున్నదీ, ముఖ్యంగా నన్ను కలుసుకున్నదీ కూడా, అందుకే అయినా, ఇప్పుడు మనింటి కొచ్చినది మాత్రం, నా బలవంతం మ్మీద మాత్రమేలే. ఎందుకంటె, నీ పెళ్లి ఇంతట్లో తలపెట్టడం వీలుపడదని స్పష్టంగా నిన్ననే చెప్పేశా. అయన చాలా పెద్ద మనిషి . ఆయన ఇటు తిరుగుతూన్న కారణాన్ని నాకు చెప్పాడే గాన్ని నన్నీ విషయం లో ఒత్తిడి చేసేందుక్కాదు. అంటూ కొన్ని మెట్లెక్కిన వారల్లా మళ్లీ వెనక్కు తిరిగి, 'అన్నట్టు దత్తు గారూ వాళ్ళూ ఒచ్చారా?' అన్నారు అతి మెల్లగా.
'ఆ ఇటువేపు రూములో వున్నారు.' అని మెల్లిగా తను బదులిచ్చాడు రఘు. అ వెంటనే శంకరయ్య చేత కొన్ని పళ్ళూ, ఫ్లాస్కు లో పాలూ పైకి పంపించింది జానకి.
'సంగతుల్ని బట్టి నళిని తరచూ తను వినేలాగ పొగడుతుండే , అమెరికా జపాన్ జర్మనీ వగైరా అన్ని దేశాల్లో తన నాట్య కళని ప్రదర్శించోచ్చిన ఆ సుందరాంగి ఈయన కూతురే అయ్యుండాలి' అనుకున్నాడు రఘు. అందుకే నళిని తండ్రి. ఈయన్ని నాన్నగారికి పరిచయం చేశారు. హు ఇలాగే కూతుర్ల ప్రయోజకత్వాల్నీ ! తమ వంశ సంప్రదాయాల్నీ! హోదానీ!' తెలియపరుచుకుంటూ తన నిమిత్తంగా నాన్న వద్ద కొస్తూన్నావారింకా ఎందరెందరో!
5
అయినా ఆడపిల్లల్ని, మొగ పిల్లల్తో సరిసమానంగా చదివించి మంచి ప్రయోజకుల్ని చెయ్యడం వరకూ, నవ నాగరీకతగా భావిస్తుంటే వీరంతా ఈ పెళ్లి విషయంలో మాత్రం సత్యకాలపు తాపత్రయాల్ని మాత్రం వదలక పోవడం ఎందువల్లనో? వయస్సూ, వ్యక్తీ స్వాతంత్యాలూ వాట్లకు తగిన ఆశయాల్ని, కలిగుండే ఆడపిల్లల్ని, ఈ పెళ్ళి విషయాల్లో కేవలం వీరి ప్రయత్నం మీదే అధారపడుండమనడం ఏం న్యాయమని? తమ భవిష్యత్తు ని జాగ్రత్తగా నిర్ణయించుకునే అవకాశం వారికే ఎందుకు వదిలి పెట్టకూడదు వీరూ! రాధ పెళ్లి ప్రయత్నాన్ని గురింఛి మురళి ఆదుర్దా పడుతున్నప్పుడు డల్లా , తనీ మాటంటే 'నీకు అక్కచెల్లెళ్ళు లేరు గనక అందులోని బెదురూ, బెంగా నీకు తెలిసి రావడం లేదు గాని, ఆడపిల్లల విషయం లో ఆపాటి అదుపూ, ఆదుర్దా చూపడం లో ఎంతో న్యాయం వుంది. అరిటాకు ముళ్ళ మీద పడ్డా, ముళ్ళ కంచే అరిటాకు మీద పడ్డా నష్టపడి నాశనమయ్యేది అరిటాకేగా. అంతెందుకూ అటువంటి ప్రమాదాలగ్గురైనవారు మన కాలేజీ స్టూడెంట్లల్లోనే ఎంతమందున్నారో నువ్వెరుగవు' అంటాడు మురళి. ఉండొచ్చు. మురళి చెప్పినట్టు తనకో అడ తోడు లేనందున ఆ ఇబ్బందుల్ని గురించి తనకే మాత్రం అనుభవం లేదు.
పదకొండు దాటోస్తుంది. ఇంకా పడుక్కోలేదేం రఘు బాబూ....పైనించే దిగొచ్చిన శంకరయ్య హెచ్చరించాడు.... 'ఇదిగో?' ఎందువల్ల నో పై కెళ్ళకుండా టేబుల్ లైట్ ఆఫ్ చేసేసి అక్కడున్న 'సోఫా కం బెడ్ సరిగ్గా అమర్చుకుని దాని మీదే పడుకుని నిద్రపోయాడు రఘు.
శర్మ గారు ఊర్లో లేకపోవడం కారణంగా మర్నాడు కూడా ఆగిపోవలసోచ్చినందున ప్రొద్దున్నే బయల్దేరి అంతా సింహాచలం వెళ్లారు. వారితో రమ్మని పిల్చినప్పుడు తనకేదో పనుందని చెప్పిన రఘు వారు మధ్యాహ్నం తిరిగొచ్చేసరికి వెనక సావిట్లో కూర్చుని సుదకి పాఠాల్చేపుతుండడం చూసి ఆర్ద్రంగా రాజమ్మ గారూ రాధ ఒకరి మొహాలోకరు చూసుకుంటే ....
'అన్నింట్ల కి ఏవిటీ అపార్ధాలూ అన్నట్టుగా చురచురా వారిద్దరి వేపు చూసింది లీల.
'మాతో రాననేసి చేస్తున్న పనిదా....' అన్నట్టుగా రఘు విప్మీద ఒకటి కొట్టి ఆర్ద్రంగా నవ్వాడు మురళి.
'నిజంగా మురళీ. అంతా అర్ధగంట కూడా కాలేదు నేనొచ్చి. నిన్ననే నీతో చెప్పాను గుర్తులేదూ....' సాంకేతికంగా రాస్తూ అన్నాడు రఘు.
'వో ఆయామ్ సారీ' ఆ మాట మర్చి పోయా. అర్ధం చేసుకున్నాడు మురళి. అది వాళ్ళిద్దరి మధ్యా రహస్యంగా వుంచాల్సిన వో స్నేహితుడి విషయం.
సింహాచలం ప్రయాణం లోని ముచ్చట్లని చేప్పుకుంటూ అంతా కలిసి సరదాగా భోజనాలు కానిచ్చి తాంబూలాలు సేవిస్తూ కొంతసేపు ఏవేవో ముచ్చటించుకున్నాక ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్ళిపోయారు. నిన్న రాత్రి తనతో కూడా వచ్చిన పెద్ద మనిషికి ఆ ఊర్లో బ్రాంచి వోపెన్ చెయ్యాల్సుండే నిమిత్తంగా కొన్ని ప్రయత్నాల్లో సాయిం చేసి ఆయన్ని రైలెక్కించి శర్మ గారింటి కొచ్చేసరికి చాలా ఆలశ్య మయి పోయింది.
అయన భోజనం కానిచ్చే దాకా రాజమ్మ గారి సలహా ననుసరించి హాల్లోనే కనిపెట్టి క్కూర్చున్న దత్తుగారు ఆయనొచ్చాక ఆ మాటా, ఈమాటా కాస్సేపు మాట్లాడాక చూచాయిగా తను అభిప్రాయాన్ని బయటపెట్టారు. నిన్న రాత్రి ఆ పెద్ద మనిషి వచ్చిన కారణాన్ని ఎలాగో పసి కట్టేసిన రాజమ్మ గారికి మనసులో ఏదో అర్ధం కాని ఆందోళన ప్రారంభమయింది. అందుకే అంత సుచిరంగా భర్తకి బోధపరిచి అక్కడుండి మాట్లాడేటట్టు చేశారావిడ. అయితే అన్నీ విన్న శర్మ గారు తాపీగా తను అందరికీ చెప్పినట్లే 'ఈ విషయం లో బాధ్యతంతా రఘు మీదే వదిలేశాం. అంతా వాడి ఇష్టం' అన్న బదులే ఇచ్చారు. ఆయనకేమీ చేసేదీ లేక మేడ మీద కెళ్లి నిద్రపోయెందుకు ప్రయత్నిస్తున్న రాజమ్మ గారి చెవిలో చల్లగా ఈ సంగతి ఊదారు....
'ఆ ఇవన్నీ తప్పించుకుందుకు వేసే ఎత్తులు నాకు తెలియదూ.' అని మొదట చులకనగా అనేసి మళ్ళీ కొంచెం సేపవగానే 'సరి అలాగే అతని ద్వారానే మాట్లాడుకుందాం' అప్పుడు తెలిసొస్తుంది అనుకున్నారావిడ.'
