"అమ్మ ఏమంటుంది, నాన్నా, కులసాయేనా?"
"ఆ, నువ్వు లేకపోతె ఇల్లంతా చిన్నబోయింది ఇందూ. నాకూ, మీ అమ్మకూ కూడా మతిపోయినట్టయిందనుకో. నిన్ను వచ్చెయ్యమని రాయమని అమ్మ ఒకటే పోరు."
"రాయలేక పోయారా?' సగం తీవ్రంగా, సగం వేళాకోళం గా అడిగింది ఇందిర.
"సరేగానీ, మామయ్యా, అత్తయ్య కులాసాయేనా?"
"ఆ, మంజుల పాపం, తోచక కొట్టుకుంటూ ఉంటుందీ పాటికి. నాతొ ససేమిరా పంపనన్నారు మామయ్యా వాళ్ళు. దానికైతే రావాలనే ఉందనుకో."
"నేనూ రాశాను దాన్ని కూడా పంపమని. అయినా పండగ పూట వాళ్ళకీ కష్టమే దాని వదిలి ఉండటం."
"అక్కలిద్దరూ కూడా రావటం లేదుట కదూ ఈసారి?"
"పెద్ద బావగారికి ఆఫీసు పనేదో తగిలిందిట. చిన్నాయన సరేసరి. కాంపు మీద పోవాలిట."
"ఇంటికి వచ్చేశాం ...అబ్బ ఎన్ని మందారాలో! సున్నాలు కొట్టడం అదీ అయిపోయిందన్న మాట అప్పుడే!" ఇంటి దగ్గిర టాక్సీ ఆగగానే గేటు తీసుకుని ఇంట్లోకి పరుగెత్తింది ఇందిర. ఎక్కణ్ణించి వచ్చిందో, మెరుపులా వచ్చి ఇందిర నడుం మీద ముందు కాళ్ళాంచి తల నిమురుతున్న చేతుల్ని నాకడం మొదలు పెట్టింది పెంపుడు కుక్క మోతీ. వరండా లో నుంచున్న సీతమ్మ గారు మోతీ ని గదమాయించి ఇందిరను కుశల ప్రశ్న లడిగారు.
సామాను లోపల పెట్టించి, టాక్సీ వాణ్ణి పంపించి లోపలికి వస్తున్న కృష్ణమూర్తి గారితో "అమ్మాయి బొత్తిగా చిక్కిపోయింది కదండీ?' అంది ఆవిడ.
"ఏమీ చిక్కలేదు. ఆరువందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళెవరూ ఆరోగ్యంగా, పుష్టిగా కనబడరు. ఇందూ, స్నానం చేసి రా. భోం చేద్దాం" ఇందిర ను తొందర చేశారాయన.
"మీది మరీ చోద్యం . పిల్ల చిక్కి సగమయింది . రంగూ తీసింది." సీతమ్మ గారు సమాధాన పడదల్చు కోలేదు.
ఇందిర నవ్వుకుంటూ తన బీరువా లోంచి పాత తువ్వాలోకటి తీసుకుని స్నానానికి పోయింది.
భోజనాలయి, కాసేపు కబుర్లు చెప్పుకొన్నాక ఇందిర తన గదిలోకి పోయి పడుకుంది నిద్ర వచ్చినట్టుంటే. ఇంటికి వచ్చిన తృప్తి మనసంతా నిండగా, మగతగా చాలాసేపు పడుకుంది ఇందిర. చీకటి పడుతుండగా ఇందిరను లేపి కాఫీ ఇచ్చారు సీతమ్మ గారు. బద్దకంగా వరండా లోకి వచ్చి కూర్చుంది ఇందిర, తలిదండ్రులతో కలిసి. పనిపిల్ల పొలమ్మ గిన్నెడు చమేలీ మొగ్గల్ని ఇందిర చేతికిచ్చి "కట్టి పెట్టుకోండమ్మ గోరూ" అంది. పూలు కోయమంటే కూడా ఉత్సాహం చూపించేది కాదు. కానీ, ఆమె కోసిన పూలను అందమైన మాలలుగా కూర్చడం ఇందిరకు చాలా ఇష్టమైన పని. మనసు బాగుండక పోయినా, ఉత్సాహం ఉరకలు వేస్తున్నా కూడా తన సుఖ దుఃఖాలను నిగ్రహించాలంటే ఇన్ని పూలు ముందు పోసుకుని సరులు కూర్చేది ఇందిర. సగం విచ్చుకున్న చమేలీ లను వాలు కుర్చీ లో జేర్లబడి కూర్చుని కట్టడం మొదలు పెట్టింది. అనిర్వచనీయమైన తృప్తి ఇంటి పరిసరాలు, తన వాళ్ళు కల్పించే రక్షణ ఆమెకు పరిపూర్ణమైన మనశ్శాంతి నిచ్చాయి.
* * * *
వెలగంటు మొదలయింది. ప్రయాణపు బడలిక పూర్తిగా తీరేసరికి ఇందిర కు గొబ్బెమ్మల హడావుడి మొదలయింది. జ్ఞానం వచ్చినప్పటి నుంచీ ప్రతి ఏడాదీ తప్పకుండా గుబ్బెమ్మలు పెట్టడం ఇందిర కు అలవాటు. తెలవారుతుండగా లేచి నరాలను జివ్వుమనిపించే చలిలో గట్టిగా ఉండే ఆవు పెడ పిసికి గొబ్బెమ్మ లను తయారుచేస్తుంది. రాత్రంతా ఆరుబయట మంచులో ఉన్నదేమో ఆవుపేడ మంచు గడ్డల్లే ఉండి, వెళ్ళని కొంకర్లు పెడుతుంది. అయినా కుంకుమ, పసుపూ, బియ్యప్పిండి పెట్టి అ పెడ ముద్దల్ని కలకలలాడే లక్ష్మీ ప్రతిమలుగా చేయడం లో ఇందిరకు ఇందిరే సాటి. గుబ్బెమ్మ లకు రంగు రంగుల పువ్వులతో అలంకరణ చేసి, తల్లి పెట్టిన రంగ వల్లుల మీద ఉంచి వచ్చేది. ముగ్గులు పెట్టడం ఎంత వయసు వచ్చినా కూడా ఇందిరకు చేత కాలేదు. అందుకే ఇప్పుడు కూడా తల్లిని తెల్లారే లేపి ముగ్గులు పెట్టమని వేధించటం మొదలు పెట్టింది.
"ఏదో ఒక ముగ్గు పెట్టకూడదుటే నన్ను విసిగించక పొతే?' నవ్వుతూనే మందలించారు సీతమ్మ గారు.
"నాకు పెద్ద ముగ్గులు రావు. వస్తే నిన్నింత బతిమాల వలసిన అవసరముండేది కాదు" అని మూతి బిగించు కుంది ఇందిర.
"ఏవో రెండు శాస్త్రానికి పెడితే చాల్లే...." అంటూ ముగ్గు డొక్కు తీసుకుని బయలుదేరింది ఆవిడ వీధి గుమ్మం లోకి.
"నేను శాస్త్రానికి పెట్టడం లేదు. సరదా కి చేస్తున్నాను. నువ్వు మాత్రం పెద్ద ముగ్గు పెట్టుదూ పుణ్యముంటుంది."
పది నిమిషాల్లో తల్లి పెట్టిన ముగ్గును అందమైన గొబ్బెమ్మ లతో నింపి చేతులు కడుక్కు వచ్చి వరండా లో నుంచుంది. పచ్చటి గుమ్మడి పూలూ, చుట్టూ యెర్రని మందారాలూ, పెట్టుకుని కన్నుల పండువగా రంగవల్లి కి మధ్యలో నుంచుంది తల్లి గొబ్బెమ్మ. పక్కనే చిన్న సీమ బంతి పూవూ, కనకాంబరాలూ అలంకరించుకుని తల్లి పక్కన ముద్దుగా నుంచుంది పిల్ల గొబ్బెమ్మ. ఆ రెండింటి చుట్టూ ఒక పద్దతిలో అమర్చబడిన గొబ్బెమ్మ లు బంతి పూలూ, చేమంతులూ తల నిండా తురుముకున్న ముత్తయిదువుల్లా భాసిస్తున్నాయి. కంటికి నిండుగా , దర్శనీయంగా ఉన్న ఆ ముగ్గునీ, గొబ్బెమ్మ లనూ చూస్తూ, ముఖం నిండా తృప్తినీ, సంతోషాన్నీ పులుముకుని స్తంభానికి జేర్లబడి కూర్చుంది ఇందిర. మోకాళ్ళ చుట్టూ, చేతులు చుట్టుకుని , ముద్ద బంతి పువ్వులా, సగం విచ్చుకున్న మందారం లా కూర్చుంది.

"ఇంక కాఫీ ఏం అక్కర్లేదా ఏమిటే?' అంటూ తల్లి వేసిన కేక వినబడ్డా అక్కణ్ణించి లేవలేదామే.
తెల్లగా తెల్లారి, తెలుగులో వార్తలు పూర్తీ అయితే గాని, పక్క మీంచి సాధారణంగా లేవని ఇందిర సంక్రాంతి నెలదినాలు తెల్లవారు ఝామున లేచి కూర్చుంటుంది. అందులోనూ ఈ మధ్య డిల్లీ లో చలికి భయపడి, సూర్యుడు బాగా పైకి వచ్చేదాకా పక్క గదిని దిగని ఇందిర కు ఈ ఉదయం లో కొత్త అందాలు కనిపిస్తున్నాయి.
చీకటి పోయినా, పూర్తిగా వెలుగు ఇంకా రాలేదు. సన్నగా కురుస్తున్న మంచు, చక్కని మస్లిన్ తెరలాగ చుట్టూ ప్రకృతి ని కప్పి వేసింది. ఆ సుప్రభాతనైకి స్వాగతమిస్తూ ఎక్కడి నించో కూసిన కోయిల సువనం ఇందిరను ఉత్తేజ పరిచింది. ఆ వెనువెంటనే పక్షుల కలకల ధ్వని ఆమెను చుట్టూ ముట్టింది . ఆ ప్రశాంత వాతావరణం పక్షుల కలకల రావాలాతో మలినం కాలేదు. పైగా ఆకరుడు కట్టి నిశ్చల వాతావరణానికి జీవచైతన్యం కలిగినట్టుంది. ఎక్కడో కుక్కపిల్ల ఒకటి ఏడుస్తున్నట్టుగా అరిచి ఊరుకుంది. ఆకాశమంతా ఉతికి ఆరవేసిన నీలపు చీరలా తాజాగా శుభ్రంగా కనబడింది. తన చుట్టూ ఉన్న మసక చీకటిని చీల్చుకుని వెలుపలికి వచ్చాడు సూర్యుడు. అరుణోదయాన్ని చూడాలను కున్న ఇందిర సూర్యోదయాన్ని మాత్రం చూడగలిగింది. తెల్లగా అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తున్న ఆ ఆ ప్రయత్నంగా చేతులేత్తి నమస్కరించింది. సమస్త చరాచర సృష్టి కి కారణ భూతుడని విశ్వసింప బడే జగన్నాధుడు లీలగా మేదిలోడామే మనస్సులో, ఏదో మంత్రవశం చేత నిద్రాణ మై ఉన్నట్టున్న ప్రకృతి ఒక్క మాటుగా చైతన్య వంతమైంది. అంతదాకా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మీద జనసంచారం ప్రారంభమయింది. పాలవాళ్ళు సైకిళ్ళ మీద బయలుదేరారు. ఎక్కడో దూరాన్నించీ సైరను వినబడుతుంది కార్మికులను పనిలోకి ప్రవేశించ మని పిలుస్తూ.
