Previous Page Next Page 
నీళ్ళు రాని కళ్ళు పేజి 11


    పచ్చడి ముద్ద ఒక్కసారి కూడా నోట్లో పెట్టుకోలేదు శోభ. కన్నీటి బొట్లు కంచం లో పడ్డాయి. "నా మాటలు చరమ గీతాల్లా ఉన్నయ్యే మోననుకున్నాను. నా ఉద్రేకాన్ని చంప దలచుకోలేదు.
    "కన్నీరెందుకు శోభా."
    "ఏం లేదండీ. మీ మాటలు వింటుంటే నా లోని మాలిన్యమంతా కరిగి కన్నీరై పోతున్నది మనస్సుకు అఘాతం తగిలినప్పుడు కన్నీరేప్పుడు వెనక్కి పోదు" అన్నది.
    "అవును, మీ పరిస్థితి ని బట్టి మీ భావాలు, ప్రవర్తన మీకు పైకి వచ్చినా అంతర్యంలో మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మానసిక భావదర్పణమే కన్నీరు. నాకు రావాల్సిన కన్నీరు నీకు వచ్చింది శోభా."    
    కంచం లో చెయ్యి కడిగేసుకుంది. నేనూ, అత్తయ్య మజ్జిగ పోసుకున్నాం.
    "నేను తినమన్నా నువ్వు తినే పరిస్థితి లో లేవని నాకు తెలుసు. కొందరి కోరికలు చిరుతిండి లాంటివి. వాళ్ళకి భోజనం అక్కరలేదు. నువ్వు ఆ చిరుతిండి కోసమే ఇక్కడికి వచ్చావు కదూ" అన్నాను.
    శోభ మాట్లాడలేదు. ఇంతలోకి వారొచ్చారు.
    "ఏమిటి సుభా లేక్చరిస్తున్నావ్. చిరపరిచితురాలిగా మాట్లాడేస్తున్నావెం" అన్నారాయన.
    "నాకు చిరపరిచితురాలు కాకపోయినా ఎవరికి చిర పరిచితురాలో నాకు బాగా తెల్సు. ప్రతి వారూ సిల్లీ. పాలూ అనుకుంటే సరిపోదు."
    వారి వైపు ఒక్కసారి చూసింది శోభ. ఆ చూపులో అనేక రహస్యాలూ, సంకేతాలూ గూడార్ధాలు నేను చూడగలిగాను.
    "ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో" మాటలో కటుత్వం, అంతర్యం లో రహస్యం రచ్చలోకి వచ్చిందే అనే దిగులు.
    "శోభ మీకు తేలీదా" సూటిగా చూస్తూ ప్రశ్నించాను.
    "నాకా నాకేం తెలుసు. వార్ని నువ్వు పరిచయం చేసేవరకూ వారెవరో నాకు తెలీదు. నీ స్నేహితు రాలేమో అనుకున్నాను" బుకాయించారు.
    "పాపం, తెలీదెం , పోనీ ఉద్యోగమైనా చూసి పెట్టండి."

 

                                 
    అక్కడ్నించీ లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనూ రెట్టించదల్చుకోలేదు.
    భోజనాలు అయాయి. అత్తయ్య పక్క వంట్టింట్లో వేశాను. వారు గదిలో పడుకున్నారు. నేనూ. శోభ ముందు గదిలో పడుకున్నాం.
    నేను ఆదమరిచి నిద్రపోతున్నట్టే పడుకున్నాను. కాని నిద్ర పోవటం లేదు, శోభ కు నిద్ర రావటమే లేదల్లె ఉంది.
    ఒకరాత్రి వేళ వారు మెల్లిగా మా గదిలోకి వచ్చి శోభ భుజం తట్టారు. కళ్ళు తెరిచింది శోభ. ఇద్దరూ కాస్త అవతలకి వెళ్ళారు. నేను కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నట్లు శ్వాస విడుస్తూ చెవులు దొర పెట్టుకుని వినసాగాను సగం తేర్చి చూస్తున్నాను.
    "నా ఉత్తరం చేరలేదా అన్నది శోభ.
    "లేదు. కొంప ముంచావ్. మన పేగులు లెక్క పెట్టింది మా ఆవిడ."
    "అదే నేనూ గమనించాను. ఉదయమే వెళ్లి పోతాను. వచ్చే ఆదివారం మీరే కొవ్వూరు రండి."
    "అట్లాగే" వారు మెల్లిగా గదిలోకి వెళ్ళబోతూ శోభ చేతిలో ఎంతో కొంత డబ్బిచ్చారు.
    చివాల్న లేచి నిల్చున్నాను. శోభ వణికి పోయింది. వారు ఖంగారు పడ్డారు.
    "ఎందుకండి అంత కంగారు. పాత స్నేహమేగా. కాకపోతే రహస్యం నాకు తెల్సి పోయింది. శోభా అనుభవానికి నేను అడ్డుగా నిల్చినా, నీకు కావాల్సిన డబ్బు వారిచ్చారు. మా వారి పాత ప్రియురాల్ని కళ్ళారా చూసి మనసారా మాట్లాడాను. నా జన్మ తరించింది. నాకొక సహాయం చేస్తావా శోభా.
    బావురుమని ఏడుస్తూ నా కాళ్ళు చుట్టేసింది శోభ. వారు మెల్లిగా గదిలోకి నిష్క్రమించారు.
    "నన్ను క్షమించండి. క్షమించానంటే గాని మీ పాదాలు వదలను. ఏడుస్తూ అన్నది శోభ.
    "నాకు క్షమించరాని ద్రోహమే చేశావు శోభా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఎప్పుడూ మా వారి జీవితంలో మళ్ళీ ప్రవేశించకు. మళ్ళీ పాత పాటే పాదావో ఇద్దరం ఆలోకం లోనే కలుసుకోవటం. ఎందుకంటె ఈ లోకంలో ఇక నీతో మాట్లాడదల్చు కోలేదు. తెల్లవారం గానే మర్యాదగా వెళ్ళిపో. ఇక వారికి కనపడనని ప్రమాణం చెయ్యి."
    కోపంతో, క్రోధం తో అన్నాను. నా హృదయం ఆక్రోశించింది. రెండు కన్నీటి బొట్లు శోభ నెత్తిన పడ్డయ్యి.
    వంద కొరడా దెబ్బల కన్న , పది తుపాకి గుళ్ళ కన్న ఎక్కువగానే మాటలతో శిక్షించాను. నా నిలువెల్లా తూటుపడిపోయింది. నేనిక ఎవరి జీవితం లోనూ ప్రవేశించను. ఉదయమే వెళ్లి పోతాను. శలవు" అన్నది శోభ.
    ఉదయం ఆరు గంటల కల్లా శోభ వెళ్ళి పోయింది. పక్క ఎత్తుతుంటే దిండు కింద ముప్పై రూపాయలు కనిపించాయి. వారిచ్చిన పది రూపాయల నోట్లు వదిలేసి వెళ్ళిపోయింది.
    వారం రోజుల వరకూ వారు నాతొ మాట్లాడలేదు. ఆ నెల జీతం కూడా తీసుకోలేదు. జీతం రాగానే వారి పెట్టె లోనే ఉంచాను. పై నోటు కనపడినా వారు ముట్టుకోలేదు ఆఫీసు లో కాని, ఇంట్లో కాని నన్ను పలకరించటమే లేదు. నేను అవమాన పరిచానని కోపం.
    ఆ రోజు రాత్రి పడుకున్న వారి మీద చెయ్యి వేసి పక్క మీద కూర్చున్నాను.
    "ఎందుకండీ అంత కోపం. మన కాపురం లోకి ఇంకా పాకివస్తున్న చీడ పురుగుని దులిపి వేయటం తప్పా" అన్నాను.
    కోపంతో నా చేతినినెట్టి పారేశారు. మళ్ళీ చెయ్యి వేసి ఇటు తిప్పుకో బోయాను.
    "ఏమిటా మొండి తనం. నువ్వు పశువువా, రాక్షసి వా" చెయ్యి విదిలించేశారు.
    శోభ మన పాలిటి రాక్షసి, మీలో ఉన్న పశుత్వం పారిపోతూ రంకె పెట్టింది. నా మొండి తనమంటావా మనమధ్య చేరే చీడ పురుగు పోవటానికి ఆ మాత్రం అవసరమే ననుకుంటాను."
    ఇటు తిరిగారు. నా వైపు తీక్షణంగా చూసి, "నాకు వచ్చే ఉత్తరాలు నువ్వు తీసుకోవటం తప్పు కాదా, ఈ జాడ్యం కొత్తగా వచ్చిందా పాత అలవాటేనా" "ఉత్తరం తీసుకుని చదవటం తప్పే. వప్పుకున్నాను. నా రెండు చెంపలు గట్టిగా వాయించండి, సంతోషంతో ఆ దెబ్బలు స్వీకరిస్తాను. కాని కావలసిన ఉత్తరమే నా చేతుల్లో పడింది. నా సంతోషం మీకు వ్యధ, కలిగించింది కదూ" నవ్వు ముఖంతో అన్నాను.
    వారి కోపం వారి మనస్సు ను రగిల్చి వేస్తున్నది. నిజంగా నా చెంపలు వాయించాలనే ఉంది కాని తన తప్పు తాను తెలుసుకున్నారు. తనంతటి వారు నా చేతిలో ఈ రకంగా బైటపడి పోవటం వారికి బాగా చిన్న తనమని పించింది. కాని వారు నా భర్త. నేను భార్యను. తప్పు ఒప్పుకోవటం చిన్నతనం గానే ఉంటుంది. ఈ విషయంలో నేనింక తర్కించదల్చుకోలేదు.
    "ఇంకొకటి అడుగుతాను, కోపంతో కోపం కల్సి పోయేదే" అన్నాను.
    "ఏమిటది."
    "ఆ రోజునే మీకొక శుభలేఖ కూడా వచ్చింది. అ పెళ్ళికి మీరు వెళ్లక పోవటమే గాక శుభలేఖ సంగతి మీ పిన్ని గారికి గాని, నాకు గానీ చెప్పనే లేదు ఎందుకని."
    పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేక , రైలు ఖర్చులూ చదివింపు లూ ఓ యాభై వదిల్తయ్యి"
    "అందుకని పెళ్ళి సంగతి చెప్పటమే మానెయ్యటం ఎందుకూ. అదేం ప్రేమలేఖ కాదుగా. అత్తయ్య కు చెప్పి, ఓ గ్రీటింగ్స్ టెలిగ్రాం పంపిస్తే ఎంత గౌరవంగా వుండేది."    
    "క్షమించు సుభా. నా మనస్సు మరీ గాయం చెయ్యకు" అన్నారు. నేనేం మాట్లాడలేదు. ఆ మాట వారి అంతర్యం లో నుంచీ వచ్చింది కాదని నాకు తెలుసు.
    "జీతం తీసుకోలేదెం."
    "అక్కర్లేదు. ఇక నుంచీ నా జీతమే నీకిస్తాను. ఇంటి ఖర్చులు నువ్వే చూడు."
    "ఏ ఖర్చు కయినా ఇద్దరి జీతాలు కలిపే వాడుకుందాం జీతాలు విడిగా ఉంటాం నాకేం నచ్చలేదు. నా మనస్సు మీకు చేరువైన కొద్దీ మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు."
    వారు మాట్లాడనే లేదు.

                                      6
    కార్తీక మాసం వచ్చింది. ఆఫీసు వాళ్ళంతా తలొక అయిదు రూపాయలు చందాలు వేసుకుని వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారమంతా తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. మా శ్రీవారు. వంట వాళ్ళను కుదుర్చుకోవటం . వంట సామాన్లు. గుండిగలూ, పాత్ర సామాను ఒకటేమిటి సర్వం వారి పర్యవేక్షణ లోనే జరిగింది.
    ఈ ఏర్పాట్లన్నీ ఒక తోటలో జరిపారు. నన్నూ రమ్మన్నారు. సరే నన్నాను. అసలు మనస్సులో వెళ్లాలని లేదు. కారణం నాకు నాలుగో మాసం. కడుపు తో ఉన్నానని. ఆఫీసు వాళ్ళంతా ఏదో భాతాఖానీ వేస్తారు. పెకాడు కుంటారు. అర్ధమైన కబుర్లూ చెప్పుకుంటారు. వాళ్ళ మనస్తత్వాలు నాకు తెల్సు. ఒక్కొక్కప్పుడు వాళ్ళ సంభాషణ నేను హర్షించ లేను. అగ్గి పుల్ల దగ్గర్నుంచీ అణ్వస్త్రం వరకూ పర్సనల్ రిజిస్ట్రర్ల దగ్గర్నుంచీ ఆఫీసర్ల భార్య ల వరకూ పెళ్ళి సంబంధాల నుంచీ వ్యభిచార గృహాల వరకూ అన్నీ వాళ్ళకు చర్చనీయాంశాలే. ఆ సంభాషణ ల్లో పాల్గొనటం గానీ, వినటం గానీ నాకు ఇష్టం లేదు. కాని వారికి కోపం తెప్పించ కూడదని వెళ్లాను.
    నేను వెళ్ళే సరికి చాలామంది వచ్చారు. కాని నా ఊహకు అందనట్లుగా కొంతమంది తమ భార్య పిల్లాలతో వచ్చారు. సాటి ఆడవాళ్ళున్నారు. కదా అని కొంత   సంతోషం కలిగింది.
    వారూ , మరో ఇద్దరూ వంట వాళ్ళని పురమాయించి అన్నీ చేయమన్నారు. వచ్చిన అయిదారుగురు ఆడవాళ్ళూ పిల్లలూ, చెట్ల క్రింద టార్బాలిన్ ,మీద కూర్చున్నారు. కొంతమంది పిల్లలు బూరలు ఊదుకుంటూ చెట్ల కింద తిరుగుతున్నారు. కొంతమంది ఆఫీసు వాళ్లు పెకాడు కుంటుంటే కొంతమంది ట్రాన్సి స్టర్లు  పెట్టుకుని బాతాఖానీ కొడుతున్నారు. ఆ సమయంలో అందరూ అంతేనేమో. అదొక సరదా.
    నేనూ ఆడవాళ్ళ దగ్గర కూర్చున్నాను. రామారావనే ఒక యు.డి.సి వచ్చి, ఆ కూర్చున్న ఆడవాళ్ళ లో అయన భార్య ఉంది కాబోలు. నన్ను వాళ్ళందరి కీ పరిచయం చేశారు. అయన కాస్త చొరవగా ఎగతాళి గా, హాస్యంగా మాట్లాడు తారు. అయన తత్త్వం అది.
    "చూడండి సుభాషిణి గారూ. ఒక్క మీ ఆయనకు తప్ప మా స్టాప్ మెంబర్ల అందరికీ మీరు ఆడబడుచు లాంటి వారు. అంటే వీరంతా మీకు వదినెలు. దోసకాయ ముక్కల పచ్చడి చెయ్యాలిట. మీ వదినెల చేత అ అర్ధమయిగు దోసకాయలూ తరిగిద్దురూ. ప్రతి కాయా మీరు చూసి చేదో, మంచో చెప్పండి" అన్నారు.
    నవ్వుతూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం అయన భార్యే అన్నది.
    "స్వర్గానికి వెళ్ళినా సవతి పోరు తప్పదన్నట్లుగా ఇక్కడ కూడా వంటింటి వేషం వెయ్యాల్సిందే, సంవత్సరానికో సారి ఇంట్లాంటి ఆవకాశం వచ్చినప్పుడయినా మీ మగవాళ్ళ పాకాశాస్త్ర ప్రవీణత చూపించక పొతే ఎలా, ఆ ముక్కలేవో మీరే తరగండి." అన్నదావిడ.
    "రామారావు గారూ, సిగరెట్టూ కాలుస్తూ వంటింట్లో కుంపటి దగ్గిర కూర్చుని ఇంకా వంట కాలేడుటే అని విసుక్కోటం కాదు, ఓ మానెడు కందిపప్పు వేయించి కంది పచ్చడి రుబ్బుకు రండి. మీకు ఈ శుభ సమయంలో మీ శ్రీమతి చేత కంది శ్రీ బిరుదిప్పిస్తాం" అన్నాను, అందరూ పకాపకా నవ్వేశారు.
    ఈ మాటలు విని మరికొంత మంది మా చుట్టూ చేరారు. మా శ్రీవారు గాడి పొయ్యి దగ్గర్నుంచీ రాలేదు. దగ్గిరుండి పులిహోర కలిపిస్తున్నారు. ఆ వంటాయన జీడిపప్పులు కాస్త వేపు రాకుండా తీశాట్ట. ఆ వంటాయనతో తగాదా పడుతున్నారు.
    "మీ అయన చూడండి గాడి పొయ్యి ఇన్ చార్జి డ్యూటీ లో ఉన్నాడు. శ్రావణ కుమార్ కి వంట బాగా వచ్చేల్లె ఉంది. అతనికి పెళ్ళికి ముందే అన్నీ తెలుసు" అన్నాడోకతడు.
    "మీరు చాలా అదృష్ట వంతులు సుభాషిణీ. మనవాడు చూస్తె చాలు అల్లుకు పోతాడు" అన్నాడు కో టైపిస్ట్. పైకి వార్ని పొగుడు తున్నట్టు కనిపించినా వాళ్ళ అంతర్యాల్లో మరో ధ్వని లేకపోలేదు.
    'అసలేదయినా మన ఆడవాళ్ళ ల్లోనే ఉంది లెద్దురూ. మన మెతకతనం చూసే వాళ్ళూ నెత్తి నెక్కుతారు, నూటరెండు డిగ్రీలు జ్వర మొచ్చి మూలుగుతున్నా , వంట చేశాక మంచ మెక్కి మూలగమనే వాళ్ళూ ఉన్నారు కానీ కాపరాని కొచ్చిన కొత్తలోనే వాళ్ళని వంచుకు రావాలి గాని నలుగురు పిల్లలు పుట్టాక వాళ్ళు, అసలే మాట వినరు. ఆ విషయం సుభాషిణి గారికి తెలుసు కాబట్టే వాళ్ళ శ్రీవారికి వంట వ్యవహారం క్షుణ్ణంగా నేర్పారు" అన్నది మా కో టైపిస్ట్ భార్య. ఆమె పేరు ఆదిలక్ష్మీ. ముగ్గురు పిల్లల తల్లి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS