ఇలాంటి వ్యక్తీ కి యీ జ్వరం కడుపు నొప్పి వుదయానికి తగ్గకపోతే డాక్టర్ని యింటికి పిలిపించే స్థోమత కూడా తనకు లేదు. సరియైన మందివ్వ కుండా అతని ఆరోగ్యం పాడవటానికితను దోహదమైతే తన జీవిత కాలం బాధపడ్తాడు. డబ్బు అప్పు సిగ్గు విడఛి యెవర్ని అడగాలి? డబ్బున్న అభిమాన మిత్రులు తనకెవరూ లేరు. తనను గౌరవించిన వాళ్ళు తనలాంటి వాళ్ళే. అతను భయపడినట్లే వుదయానికల్లా గోవిందరావు జ్వర తీవ్రత హెచ్చింది. కొద్దిగా పలవరిస్తున్నాడు. మనిషి ముఖం అప్పుడే వాడిపోయింది. ఏమీ తోచలేదు సూర్యనికి. గబగబా బయటకు ఆతృతగా వెళ్లి రోడ్డు మీద పడ్డాడు. అర్ధం పర్ధం లేకుండా యిటూ అటూ పది సార్లు రోడ్డు మీదే తిరిగాడు. ఏం దారి? ఇంతలో ఒకాయన "ప్రొద్దున్నే రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏమిటి విశేషం?'
"ఏమీ లేదండి, మా బావగారికి జ్వరం ముంచుకొచ్చింది."
"పదండి , చూద్దాం."
"హా....పదండి ..పదండి !" అంటూ ఆతృతగా ముందుకు నడిచాడు. ఈయన తన మిత్రుని బావమరిది. ఏదో ముఖ పరిచయమే కాని యిదివరకు అతని గురించి యేమీ తెలియదు.
అతను పెద్దాసుపత్రి లో కంపౌండరు గా పనిచేస్తున్నాడు. కంపౌండరు గోవిందరావును చూసి,
"పెద్దాసుపత్రికి వెంటనే తీసుకు పొండి. ఇదేదో విష జ్వరంలా వుంది.' అన్నాడు.
సూర్యం నోట మాట రాలేదు. 'సరే, మంచిది.' అన్నాడు. 'బయటకు వెళ్ళి రిక్షా తీసుకు వచ్చాడు. తన దగ్గర మిగిలి వున్న డబ్బులకు యిది వరకు యెన్నడూ బెరమాడని వాడు బెరమాడాడు. బావని రిక్షా యెక్కించి ప్రక్కన కూర్చున్నాడు. గోవిందరావు ని తొలిసారి ముట్టుకోవటం యిదే. అందులో తను తలను సూర్యం భుజం మీద వాల్చాడు. ఎందుకో సూర్యం కళ్ళల్లో నీరు పేరుకున్నాయ్. ఎన్నో చెడ్డ ఆలోచనలు మనసులో అడ్డూ అపూ లేకుండా కదిలాయ్. ఇతను లంచాలు తినే తన పై ఆఫీసరు కు బుద్ది చెప్పబోయాడు. ఊర్లో పెద్ద రైతు అన్యాయాన్ని ఎదుర్కున్నాడు. ఇంటావిడ దోపిడిని అరికట్టడానికి ప్రయత్నించాడు. ఈ శెట్టి కొలువు లో ఏం చేశాడో? తనకు తెలియని యుద్ధం యెంతగా సాగించాడో? ఇన్నీ యీ సామాన్యుడు చేశాడు. ఇతనికే అధికారం వుంటే ఏన్నెన్ని మంచి పనులు జరిగేవి? ఎంత కుళ్ళు కడిగేవాడు? ఎందరిని సంమార్గుల ను చేసేవాడు? ఇతనెందుకు అధికారు కాలేదు? ఇతను చేసిన తప్పేమిటి? తెలివితేటలూ, నిజాయితీ లు వున్నంత మాత్రాన యీ లోకంలో వున్నతిగా బ్రతకలేం! ఏదో ఒక అజ్ఞాతంగా నున్న వెలుగు మనుషుల వున్నతికి కారణ మౌతుంది. అదే అదృష్టం అనుకుంటాను. అది లేనిది యెన్ని సుగుణాలున్నా వ్యర్ధమే?' సూర్యం యిలా ఆలోచించుకుంటూనే పెద్ద ఆసుపత్రి చేరుకున్నాడు. అంత వుదయం, కేజుయాలిటీ వార్డు కు తీసుకు వెళ్ళాడు. వెళ్ళే ముందు బాత్ రూమ్ కు వెళ్ళిన గోవిందరావు తోడూ వుంటే గానీ తిరిగి రాలేక పోయాడు. అతనిని ఆసుపత్రి లో అన్ని అడ్డంకులు దాటి చేర్చే సరికి పది గంటలైంది. ఈలోగా నోట్లో బుక్కెడు మందైనా పోయ్యలేదు. మనిషి మరింతగా నీరసం అయిపోయాడు. జనరల్ వార్డు లోపల యెక్కడా ఖాళీ లేదు. వరండా లో ఒక మూల మంచం దొరికింది. పై నుంచి గాలి వీస్తోంది. బాత్ రూముకు ఆ చివరకు వెళ్ళాలి. వరండా లో క్రిందను కూడా రోగులు పడి వున్నారు. ఆశ నిరాశల మధ్య పెనుగులాడుతున్నారు. మంచం మీద పడ్డాక 'మీరు వెళ్ళండి' అన్నాడు నీరసంగా. సూర్యం డాక్టరు వస్తారేమో నని పదకొండు వరకు యెదురు చూసాడు నర్సు తో చెప్పాడు ఏదో మందివ్వండని. పెద్ద డాక్టరు గారు చూడంది యివ్వనందామె. 'మీరు వెళ్ళండి. ఇక్కడ వుండకూడదు. రోగిని చూడాలంటే సాయంత్రం రావచ్చు." ముక్తసరిగా యీ మాటలు విసుక్కుంటూనే చెప్పింది.
"వెళ్ళండి. నాకేం కాదు -- అన్నాడు గోవిందరావు.
సూర్యం కదిలాడే గాని మనస్సెంటో మహా సముద్రమై పోతోంది. మెల్లగా నడచుకుని యింటికి వెళ్లేసరికి పన్నెండు దాటింది. గౌరీ ఆతృతగా యెదురు చూస్తోంది. ఆమెకు బాధ కలిగించకుండా వుండాలని "ఏమీ లేదు జ్వరమే. రెండు రోజుల్లో నయం అయిపోతుంది.'
ఆమె జవాబు చెప్పలేదు. మౌనంగా వడ్డించింది. సూర్యం కు అన్నం వేపు చూస్తె డోకు వచ్చేసింది. ఆ ఆసుపత్రి వాతావరణం నుంచి బయటపడ లేదు. అక్కడ చూసినవే యింకా కళ్ళకు కట్తున్నాయ్. ఎదురుగా వున్న అన్నం ఈగలు, దోమలు వలె అగుపించింది. ఏవో కదులుతున్న పురుగుల్లా వున్నాయ్. మజ్జిగ, వాసన వేస్తున్న మందు నీరులా అగుపించింది. మనసు మార్చడానికి ఒక పుస్తకం తీసాడు. అక్షరాలూ సరీగ్గా కనుపించలేదు. ఎక్కడా ఆసుపత్రి రాగులూ వాళ్ళ బాధలే అగుపిస్తున్నాయ్. ఓ క్షణం పోయాక తను యెందుకో బలహీనుడయి పోయినట్లు సంశయించాడు. సర్వఅవయవాలు అదుపు లేకుండా సంచరిస్తూన్నట్లున్నాయ్. నిస్త్రాణగా చాలాసేపు పరుపు మీద యిటూ అటూ కదిలాడు. నాలుగు గంటలకు నిద్ర నుంచి లేచాడు. అప్పటికి గౌరీ ఆసుపత్రి కి వెళ్లాలని కామోసు తయారై వుంది. ఆమెను చూడగానే సూర్యం మనసు చివుక్కు మంది. అంతదూరం ఆమె నడచి వెళ్ళలేదు. రానూ పోనూ రూపాయైనా వుండాలి. ఎక్కడ నుంచి వస్తుంది. ఒక స్నేహితుడు మరుసటి రోజు వుదయాని కల్లా పది రూపాయలు అప్పు యిస్తానని హామీ యిచ్చాడు. ఆమెను నడిపించ లేడు. ఎలాగో రేపటికి వాయిదా వేస్తె గాని వీలు పడదు.
'నేను చూసి వస్తానమ్మా. రేపు వేల్దుడు గాని' ఆ మాటలు నిస్సహాయతో యెలా అన్నాడో గాని అక్కడ వుండలేక పోయాడు. గౌరీ అమాయకంగా ఒకసారి చూసి వూరుకుంది. అతను కాళ్ళీడ్చుకుంటూ ఆసుపత్రికి చేరేసరికి అయిదు దాటింది. గోవిందరావు మరీ పాలిపోయి వున్నాడు. సూర్యం దగ్గరకు రాగానే మెల్లని గొంతు కతో 'గౌరీ రాలేదేం?'
ఈ ప్రశ్నకు జవాబివ్వకుండా ముఖం త్రిప్పేసాడు. సర్వెంద్రియాలు ఒక్కసారి వణికాయ్ అంతటితో వూరుకోక గోవిందరావు లోతుకు పోయిన కళ్ళు నిలబెట్టి "ఎందుకొస్తుంది? నేనంటే విసిగిపోయింది.'
'లేదు బావా ..లేదు' చప్పున అని సూర్యం కళ్ళల్లో నింపుకున్న నీరు అతను చూడకుండా వుండాలని ముఖం దాచుకున్నాడు. నాలుగు ప్రాణాలు యెగిరి పోయినట్లయింది. కాస్సేపటి వరకు యిద్దరూ మౌనంగా వున్నారు. ఇంకా గోవిందరావు కు జ్వరం తగ్గలేదు. తను అక్కడ వుండగానే వాంతులు చేస్తున్నాడు. గుండె పీకుతోంది అన్నాడు. అలా మంచం మీద పడుకోబెట్టి సూర్యం గుండె దగ్గర చేతితో పాముతున్నాడు. కళ్ళు మూసి నిస్త్రాణగా గోవిందరావు చాలాసేపటి వరకు వున్నాడు.
ఇంతలో చీకటి పడింది. రోగులను చూడటానికి వచ్చిన వాళ్ళు కదిలి పోతున్నారు. కదలని వాళ్ళను వెళ్ళమని నర్సు శాసిస్తోంది. వెళ్ళలేని వాళ్ళ పై విసుక్కుంటుంది. ఆ కేకలు విని కామోసు గోవిందరావు కళ్ళు తెరిచాడు. అలా సూర్యం వేపు చూస్తూ ఒక్కసారి అతని చెయ్యి పట్టుకున్నాడు. చేతి మండను నిమురుతూ 'బావా! మీరు చెప్పింది అక్షరాలా నిజం' అన్నాడు.
'ఏమిటి చెప్పాను?'
'హోదా లేనిది శక్తి లేదు. శక్తి లేనిది పాపాలు కడగలెం?'
'ఏం జరిగింది బావా?'
"అబ్బే ....ఏ...మీ...లేదు.....నా యింట్లో తిని నా యింటి వాసాలే లెక్క పెట్తావురా అని....'
'అని...ఏం చేసారు?'
'దేవునితో మొర పెట్టె దేముడే చీముడు రాసాడు.'
'ఎవరా దేముళ్ళు.'
'అధికారులు! వాళ్ళ దగ్గర డబ్బు తిని నన్నే నేరస్థుని చేసారు. నేనే అబద్దం -- వాళ్ళే నిజం.'
'ఇంతకీ మీకేం చేసారు బావా? చెప్పండి పై అధికారులను కలుసు కుంటాను."
గోవిందరావు చిరునవ్వు పెదాల మీద కదిలింది.
"ఏమీ లేదు....ఏమీ లేదు' అని గొణిగి మళ్లీ నిస్త్రాణ గా కళ్ళు మూసాడు. అలా అతని వేపు చూస్తున్న కొద్ది సూర్యం లో నిస్సహాయత వలన ఉద్రేకం పొంగి పోయింది. కాస్సేపయ్యాక కళ్ళు తెరిచి 'వెళ్ళండి టైమయ్యింది' అన్నాడు.
'కాదు, ఏం జరిగిందో చెప్పండి.'
'ఏమీ లేదు, చెప్పినా మీరేమీ చెయ్యలేరు.'
'లేదు చెప్పండి.'
'మనుష్యులు న్యాయం పొందడానికి సాక్ష్యం కావాలండి బావగారూ! మీరన్న దైవ శక్తికి మనుషుల సాక్ష్యం అక్కర్లేదు. ఆ శక్తి మీద నమ్మకం కలిగించారు. మీకు కృతజ్ఞుడ్ని.'
ఆ తరువాత సూర్యం యెంత ప్రయత్నించినా అతనేమీ మాట్లాడలేదు. చివరకు --
'వెళ్ళండి.'
'ఈ రాత్రి యిక్కడే వుంటాను.'
'నాకేం ఫరవాలేదు. నీరసం తప్పించి యింకేం లేదు. వెళ్ళండి. గౌరీ ఒక్కర్తే రాత్రి వుండలేదు.'
సూర్యం కదల్లేక కదిలాడు. సరాసరి యింటికి వెళ్ళలేక పోయాడు. నిస్సహాయత అతని శరీరమంతా ప్రాకిపోయింది, ఎక్కడ లేని నిస్ప్రుహాతో మనస్సంతా నిండిపోయింది. ఏకాంతంగా సముద్ర తీరాన కూర్చున్నాడు. సముద్రం హోరంతా అతనిలో యిమిడి పాటు పోటులను సృష్టించాయి. ఎందుకో సముద్రం లో దూకాలన్న విసుగు కలిగింది. నీరసంతో ఆవులింతలు రాసాగినాయ్. గుండె దడ పట్టుకున్నట్లు కొట్టుకోసాగింది. తన దగ్గరే డబ్బు వుంటే స్పెషల్ వార్డు లో గోవిందరావు ను వేసి పది మంది డాక్టర్లు ఎల్లవేళల్లో వుండేటట్లు చూసేవాడు. అతనికి సరియైన ఆహారమైనా యియగల పరిస్థితిలో తను లేడు గోవిందరావు అన్న మాటలు పదేపదే చెవిలో రింగు మంటున్నాయ్. గౌరీ ని వెళ్ళకుండా చేసిన తనను దేముడైనా క్షమించ లేడను కున్నాడు. ఆమెను నడిపించైనా తీసుకు వెళ్ళవలసింది. ఎంతపని చేసానని విసుక్కున్నాడు. అతని తరువాత మాటలు వింటుంటే చేత తుపాకి లేకుండా రణరంగం లో దూకిన వీరునిలా గోవిందరావు అయిపోయాడు. అటు నుంచి వచ్చే తుపాకి దెబ్బలను పౌరుషం వున్నా తట్టుకోలేని మనిషై పోయాడు. అతని నిస్పృహ అతనిని విరాగిని చేసింది. దైవశక్తి మీద అధారపడనిచ్చింది.
ఇంటికి చేరుకునే సరికి గౌరీ యెదురు చూస్తూ ఉంది. రాగానే "ఎలా వుందన్నయ్య' అంది. వెంటనే జవాబు చెప్పక పొతే అనుమానాలకు తావు తీస్తుందని
'కాస్త నయంగా వుందని' అబద్దం ఆడాడు.
