"అమ్మా, నన్ను లేపోద్డా?" ముఖము తుడుచుకుంటూ అడిగాడు.
"రేపు లేపుతానులే." నవ్వుతూ కాఫీ ఇచ్చింది.
అలాంటి రేపులు గడుస్తున్నాయి. అతని చదువు సాగటము లేదు. తల్లి లేపినా మరో దిక్కు తిరిగి పడుకుని, అరగంటయ్యాక లేపమ్మా అంటాడు. ఆరగంటకు లేపితే, మరో పది నిమిషాలు పోడిగిస్తాడు. ఆమె అతని గది లోకి తిరగలేక ఊర్కుంటుంది. లేచుడు వ్యాపారము బాగాలేదని , లేచాకే, ఏడు నుండి పది గంటల వరకు దీక్షగా చదవాలని నిర్ణయించుకున్నాడు. లేచి కాఫీ త్రాగి ఈ మధ్యలో మరోసారి కాఫీయో, టీయో పంపమని తల్లికి చెప్పి గదిలోకి వెళ్ళాడు. పుస్తకము కాఫీ, పెన్ రడీగా పెట్టుకుని కూర్చున్నాడు. హల్లో టప్పు మన్న శబ్దము అయింది. అది చిరపరిచితమైనదే . పేపరు వాడు. న్యూస్ పేపరు వేసిపోయాడు. అతని మనసు ఆయస్కాంతము లాగినట్టు అటు వైపు లాగాసాగింది. కళ్ళు పుస్తకము మీదున్నా మనస్సు స్పోర్ట్స్ కాలం వైపు లాగుతున్నది. ఇక పని కాదని పుస్తకము మూసి పేపరు పట్టుకునేవాడు. పేపరుతో పాటు రోజు ఓ మాగుజైను వస్తుంది. తండ్రి తన కోసమని భారతి, బ్లిడ్జ్ ప్రజామత చెప్పించు కుంటాడు. ఆనంద్ కోసమని రీడర్స్ డైజెస్ట్ . ఇలస్ట్రేటెడ్ వీక్ లీ వస్తాయి. సరస్వతమ్మ కోసమని ఆంధ్ర వారపత్రిక. వారప్రభ, యువ మరో రెండు తెలుగు మాగజేన్సు వస్తాయి. పేరు ఆమెదే అయినా రోజూ నియమము తప్పక చదివేది ఆనందే.
"ఈరోజు సీరియల్స్ మాత్రము చదువుతానమ్మా. ఏమవుతుందోనని ఉత్కంట. తల్లికి సంజాయిషీ ఇచ్చేవాడు. అతని వారపత్రిక. వార్తా పత్రిక పఠనం అయిపోయే సరికి భోజనానికి పిలుపు వచ్చేది. భోజనము చెయ్యగానే మత్తులా అనిపించేది. అయిదంటే అయిదే నిమిషాలు విశ్రాంతి అనుకుని పడక చేరితే వార్తలు చదువుకున్నది....అని పది నిముషాలు తక్కువ రెండింటి కి మెలకువ వచ్చేది. కాఫీ సేవించి వివిధ భారతి రికార్డులు విని చదువు సాగిద్దామనేలోగా యెవరో రావటము హస్కు వేసుకోవడము , ఆ తరువాత సిలోన్ రేడియో లో పాటలు వింటుండగానే స్నేహితులు రావటము, సాయంత్రము పూట ఇంట్లో కూర్చోవడమేమిటని ఫలహారము సేవించి నీటుగా ముస్తాబై, షికారు వెళ్ళేవాడు. కృష్ణ ఒడ్డున కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే కాలము తెలిసేది కాదు. ఒకటేమిటి, సినిమాలను గూర్చి, సాహిత్యము గూర్చి అలా వెళ్ళే అమ్మాయిలను గూర్చి చర్చించుకునే వారు కొత్త సినిమా విడుదలయిందా సరే . రాత్రికి ఇంటికి వచ్చి భోజనము చేసి చదువుదామని గదిలోకి వెడుతుంటే బీరువాలో నున్న నవలలు , అలకలు పోయేవి తండ్రి తల్లితో కబుర్లలో మునిగి ఉండగా ఓ నవల పట్టుకుని వచ్చి, ఇంగ్లీషు పుస్తకమో తెలుగు పుస్తకమో పైన పెట్టి, చాలా శ్రద్దగా నవలా పఠనం లో మునిగిపోయేవాడు. పదకొండు గంటలకు పడుకోబోతూ , కొడుకు వంక ఒకసారి చూచి తృప్తిగా నిట్టుర్చేవారు రంగారావు.
"మనసు చదవాలని శ్రద్ధ పెడితే చదువుతారా> వాడి తిక్క కుదిరితే వాడే చదువుతున్నాడు. చూడండి." తల్లి మాటలు వినిపించాయి. నవ్వుతూ తన పఠనములో లీనంయ్యేవాడు. నవల పూర్తీ అయ్యేసరికి యే రెండో అయ్యేది. దాన్ని మెత్త క్రింద దాచి హాయిగా నిదుర పోయేవాడు. సెలవులన్నీ ఇలాగే గడిచిపోయాయి.
కాలేజీలు తీయగానే మాములుగా ఉండే కాంపిటేషన్ అని, ఇదని అదని ప్రతిరోజూ కనీసము రెండు పీరియడ్స్ మిస్సయ్యేవాడు. ప్రతిరోజూ రేపు వెస్ట్ కాకూడదని నిర్ణయించుకోవటమే గాని చదివిందేప్పుడూ లేదు. అతని నిర్ణయాలతో పాటు కాలము సాగుతూనే ఉన్నది. క్రిస్టమస్ సెలవులు రాకపూర్వమే వాటిని గడిపే విధానము ఆలోచించారు. మహాబలిపురము ఎక్స్ కర్షన్ అంటూ బయలు దేరతీశారు. ఎక్స్ కర్షన్ నుండి తిరిగి వచ్చాక వారము రోజలు విశ్రాంతి కావాల్సి వచ్చింది.
ఆ రోజు నుండి చాలా దీక్షగా , యెంత పని ఉన్నా పోస్టు పోను చేసి చదవాలని నిర్ణయించు కున్నాడు. ఉదయమే లేచి ఇంగ్లీషు తీశాడు. మాక్ బెత్ చూడగానే భయము పట్టుకుంది. తన దీక్షను గుర్తుకు తెచ్చుకుని బలవంతంగా రెండు పేజీలు చదివాడు. విసుగని పించింది. రోమియో జూలియట్ తీశాడు.
'ఆనంద్, ఇలారా....!' రంగారావు పిలిచాడు. తన నిర్ణయాన్ని తాను సదలించుకోలేదు పెద్దవారు పిలుస్తున్నారు , అని తృప్తి చెంది లేచి హాల్లోకి వచ్చాడు.
"ప్లీడర్ వేంకటరత్నము గారు వచ్చారేమో చూడు. పంచదార ఫ్యాక్టరీ లో వాటాలున్నాయట, విషయము కనుక్కుందాము."
"వస్తే మనింటికి రమ్మన్నారా?"
"యెందుకులే , నేనే వెళ్ళి కనుక్కుంటాను." ఆనంద్ కు కోపము వచ్చింది. ఈ పెద్దవారి పనులన్నీ ఇలాగే వుంటాయి. తను వెళ్ళే కాడికి నా సమయము వెస్ట్ చేయడము దేనికి? త్వరగా ప్లీడరు గారిల్లు చేరాడు. నమస్కరించాడు.
"ఏమిటోయ్? ఇలా వచ్చావు?' నవ్వుతూ పలుకరించాడు.
"నాన్నగారు మీరున్నారో లేదో చూచి రమ్మన్నారండి."
"ఏడవలేక పోయాడు. తనే రాకూడదు? చదరంగము ఆడేవారు లేక పిచ్చి యెత్తినట్టున్నది. అతన్ని కూర్చోబెట్టి కాఫీ ఇప్పించి, అరగంట ప్లీడరీ చేయటము యెంత కష్టమో చెప్పి పంపించాడు. తండ్రికి అతని గూర్చి చెప్పి త్వరగా భోజనాదికాలు ముగించి కాలేజీ కి వెళ్ళాడు. స్నేహితులు పిలుస్తున్నా బుద్ది మంతుడిలా క్లాసులో కూర్చున్నాడు పోయిట్రీ చెప్పడానికి యెవరో మేడమ్ వస్తుంది. ఆవిడ వస్తూనే క్లాసును వింతగా చూచింది.
"ఆనంద్ క్లాసులో ఉన్నాడంటే తప్పక ఏదో వింత జరుగుతుంది." అన్నదామె.
"వింతలు జరుగుతూనే ఉన్నాయి మేడమ్. ఈరోజు ఉదయము కృష్ణానది లో రెండు శవాలు తేలితే బయటకు తీశారు." ఒకబ్బాయి అరిచాడు.
"ఇందులో వింతేముందిరా . రోజు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మేడమ్. విఫల ప్రేమికులూ, పరీక్ష తప్పిపోగా, ఇంట్లో వారి పోరు భరించలేక కృష్ణ చల్లని ఒడిలో విశ్రమిస్తారు." మరో అబ్బాయి చెప్పాడు.
"పూర్తిగా చెప్పనీయరా. ఆ శవాలు ఆస్పత్రికి తీసుకెళ్ళే లోగా లేచి కూర్చుని, వేడి వేడి ఇడ్లీ కావాలని అరిచాయట. కారులో ఉన్న వారంతా భయపడి పారిపోయారు. కారాగిన చోట జనము కూడా తప్పుకున్నారు." మొదటి అబ్బాయి చెప్పాడు.
"నువ్వు చూచి వచ్చావా?' మేడమ్ ప్రశ్న. నవ్వును బిగపట్టింది.
"లేదండి పనిమనిషి భర్త ఆమెతో చెప్పాడు. ఆమె అమ్మతో చెప్పింది. అమ్మ పక్కింటి ఆమెతో చెప్తుంటే విన్నాను."
"గొప్పపని చేశావు కూర్చో." ఆమె పాఠము మొదలు పెట్టింది. షెల్లీని గూర్చి చెబుతుండగానే ఫ్యూన్ వచ్చాడు.
'ఆనందయ్యను ప్రిస్నిపాలయ్య పిలుస్తున్నారు."
"వెళ్ళవయ్యా ." నవ్వువాపుకుంటూ ఆమె ఆనంద్ వంక చూచింది. ఆనంద్ లేచి ప్రిన్సిపాల్ గదిలోకి వెళ్ళాడు. విద్యార్ధి సంఘపు ప్రెసిడెంట్ , సలహాదారుడైన లెక్చరర్ కూర్చుని ఉన్నారు. నమస్కరించి ఏమిటన్నట్టు చూచాడు.
"కూర్చో. "కాలేజ్ డే" సేలిబ్రేట్ చేయాలని అనుకుంటున్నామోయ్. ఫిబ్రవరి లో ముగించి వేస్తేనే మంచిది." తరువాత యూనియన్ మెంబర్లంతా వచ్చారు. గంటన్నర చర్చలు జరిపాక ఓ నిర్ణయానికి వచ్చారు. యధావిధిగా డ్రామా ప్రాక్టీసు లు , ఆటల పోటీలు, పోటీలలో గెలిచిన వారికి ఇచ్చే బహుమతులు కొనడము. ఒకటేమిటి , జనవరి నెలంతా , తీరిక లేకుండానే గడిచి పోయింది.
"ఒరేయ్ ఆనంద్! ఓ చిన్న రిక్వెస్టు రా." శాస్త్రి వచ్చాడు. అతను ఆనంద్ స్నేహితుడే.
"చెప్పరా అంత మొహమాటము దేనికి?'
"మా అమ్మగారికి సంగీతము నేర్పిన గురువటరా , పాపమూ చాలా బీదవాడు. వచ్చినాడు అతను మద్రాసు వెళ్ళి తన అదృష్టము పరీక్షించుకుంటారుట. ఖర్చులు కావద్దూ? మన ఫంక్షన్ లో అతని పాట కూడా ఒక ఐటమ్ గా పెట్తి, కొంత ధన సహాయము చేస్తే నీ మేలు మర్చిపోడు."
"అది నిజమేరా. కార్యక్రమమంతా నిర్ణయమై పోయింది . ఏమంటారో?"
"నువ్వు తలుచుకుంటే చేయగలవురా." శాస్త్రి మాటలకు నవ్వు వచ్చింది. కార్యదర్శి అనగానే యెన్నో అధికారాలు. హక్కులున్నట్టు ప్రవర్తిస్తారు స్నేహితులు. అతనక్కడుండగానే అధ్యక్షులు వచ్చాడు.
"చూడరా ఆనంద్ కుమార్ గాడి బిగువు. తనకే పాట వస్తుందని బడాయి. ఆరోజు బంధువులమ్మాయి వివాహామట. అసలు ఫంక్షన్ కే రానంటున్నాడు."
"ఆహ్వాన పత్రికల వెనుక కార్యక్రమము లో లిస్టులో తన పేరుంది. చూచుకోలేదా?'
"యేమో! అంతా అయోమయంగా ఉంది. ఇప్పుడేవర్ని పట్టాలో?"
"చూడరా? నువ్వూ పాతిక రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్దంగా వుంటే పాటపాడే అతన్ని నేను పిలుస్తాను."
'ఆనంద్. నువ్వు కూడా అలా మాట్లాడుతావెంరా. స్టూడెంట్ యూనియన్ ఫండు నుండి ఖర్చు పెడదాము. " ఆనంద్ వెంటనే శాస్త్రి ని పిలిచి గాయకుడి ని పిలుచుకురమ్మని చెప్పాడు.
కళాశాల దినోత్సవమున తన గాన కౌశలము చూపించాలని ఏంతో ప్రయత్నము చేశాడు సీతారామయ్య. అతని శాస్త్రీయ సంగీతము ప్రేక్షకులకు, విద్యార్ధులకు అంతగా నచ్చలేదు. వెనుక వైపు కొచ్చిన ఆనంద్, శాస్త్రి మాట్లడుకోసాగేరు.
"ఏరా సీతారామయ్యగారి గానము అంతగా నచ్చలేదల్లె వున్నది. పాతిక రూపాయలు ఇచ్చాము. అతనికి సినిమా పాటలు వస్తాయేమో కనుక్కో."
"శాస్త్రీయ సంగీత వేత్త . డబ్బు కోసము చౌక బారు సంగీతము పాడుతాడంటావా?" శాస్త్రి ఇరుకులో పడ్డాడు. డబ్బు లేనంత మాత్రాన మనిషికి అభిమానము ఉండదా?
"చవకబారో, ఏబారో అందరికీ నచ్చేది పాడాలిరా. విసుక్కున్నాడు ఆనంద్.
"మీకు అభ్యంతరం లేకపోతె నేను పాడుతాను .' యెటునుంచో ఓ కోకిల స్వరము వినిపించింది. ఇరువురూ అటు చూచారు. పదమూడేళ్ళు పద్నాలుగేళ్లుంటాయేమో . గుండ్రని చందమామ లాంటి ముఖముతో ఓ అమ్మాయి కనిపించింది. ఆనంద్ ఎవరన్నట్టు చూశాడు.
"సీతారామయ్యగారి అమ్మాయి సురేఖ." నెమ్మదిగా గొణిగాడు శాస్త్రి.
"మాట్లాడరేమండి. మా నాన్నగారి గానకౌశలాన్ని మెచ్చుకునే కళాహృదయులు లేరని తెలుసు. నాకు సినిమా పాటలన్నీ వచ్చునండి." అభిమానంగా చూచింది. శాస్త్రి త్వరగానే వెళ్ళి అనౌన్స్ చేసే విద్యార్ధితో మాట్లాడి వచ్చాడు. అతను సురేఖ అనే బాలిక పాడుతుందని అనౌన్స్ చేశాడు. సీతారామయ్యగారు కాస్త గాలి పీల్చు కుందామని కాబోలు ఇవతలకు వచ్చాడు. సురేఖ పేరు వింటూనే అతని కనుబొమ్మలు ముడి పడ్డాయి. ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళింది.
"నాన్నా మీరు అలసిపోతారు. విశ్రాంతి తీసుకోండి. నాకొచ్చిన పాటలు నేను పాడుతాను." అన్నది. ఆమె వెళ్ళి స్టేజీ పైన పాడటము మొదలుపెట్టింది.
"వెర్రి తల్లికి మైక్ లో పాడాలని కోర్కె కల్గిందేమో నవ్వుకున్నారు. కాదు మీ గౌరవము కాపాడాలని పాడుతుందని చెప్పాలను కున్నాడు. మాటలు పెగలలేదు. సురేఖ అంత చక్కగా పాడుతుందని అనుకోలేదతను. ప్రేక్షకులు హర్శధ్వనులు చేస్తూ కరతాళాలు మ్రోగాయి. తరువాత కార్యక్రమము చూచి వెళ్ళమంటే సీతారామయ్య గారు ఆగిపోయారు. కూతురు బలవంతం చేసింది.
"నాన్నా మనమిక్కడికి ప్రేక్షకులుగా రాలేదు. పాతిక రూపాయల కై కూలికై వచ్చాము పని అయిపొయింది పదండి" రెండు అడుగులు వేసింది.
"పాపా!" అతను దెబ్బతిన్నట్టు చూచాడు.
"నిజము ఒప్పుకోవడానికి అంత అభిమానము దేనికి నాన్నా, రండి." ఆనంద్ కు అర్ధం అయింది. తనన్న పాతిక రూపాయల మాట ఆమెను గాయపరిచిందని . అతను నచ్చచెప్పాలని ప్రయత్నించబోయాడు. ఇంతలో ఎవరో పిలిచారు. కార్యక్రమము ముగిసినాక వందన సమర్పణ గావించి, స్నేహితులతో హోటలు కెళ్ళి భోజనము చేసి ఇల్లు చేరాడు.
