భానుమూర్తి వచ్చాక ప్రకాశం దినచర్య కాస్త మారిపోయింది. ఎన్ని పనులు ఉన్నా సాయంకాలం కాస్త వీలు చూసుకుని అలా షికారు కెళ్ళి పంక లో కూర్చుంటారు. భానుమూర్తి ఏదైనా పుస్తకం చదివి వినిపిస్తాడు. వ్యాఖ్యానించడం లో భానుమూర్తి చాలా నేర్పరి. భావాలు కుదరని చోట్ల స్నేహితులు ఇద్దరూ వాదోపవాదాలు చేసుకుంటారు. చీకటి పడగానే ఏటి కాలవ లో కడుపు నిండా నీళ్ళు త్రాగి ఇంటి ముఖం పడతారు. భానుమూర్తి తో ఉన్నప్పుడు ప్రకాశానికే కాదు, ఎవరికీ చింత ఉండదు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రం ప్రకాశం డీలా పడిపోతున్నాడు. రోజుకు రెండు మూరల చొప్పున జగన్నాధం గారి బావి తెగుతుంది. ఇక పది పదిహేను రోజుల్లో బావిలో జల పడవచ్చు. జగన్నాధం అంతటితో ఆగడు.కసికొద్దీ మరో మట్టు గానీ మట్టున్నర గానీ తవ్విస్తాడు. అంతటితో తన బావి ఎండిపోతుంది. జగన్నాధం తో పాటీ పడటానికి తనకు శక్తి లేదు. ఈ విషయంలో ఏమీ చేయటానికీ తోచటం లేదు. చెరుకుతోట మరుసటి నెలలో నరకాలి.గాను గేత్తడానికి నాలుగైదు వందలు కావాలి ఎవరిస్తారు? నంబర్ల వడ్ల మడి కోతలు జూన్ లో కానీ కావు. అందాకా ఆగటానికి వీల్లేదు. వైశాఖ మాసంలో పెళ్ళి కూడా ఉందాయే. అంటే ఇక ఈడ్చి కొల్చినా మూడు నెలలే. పెళ్ళికి బోలెడు డబ్బు కావాలి. కానీ ఫరవాలేదు. నంబరు వడ్ల మడి నవనవ లాడుతుంది. పెళ్ళి కూతురు శారద కు ఏవైనా చక్కని నగ కొనాలి. రాళ్ళ పతకం ఉన్న నెక్లెస్ శారద కు చాలా బావుంటుంది.అన్నట్టు శారద కు ఇప్పుడు మూడో నెల ఉండాలి. శారద తనకు ఉత్తరం వ్రాస్తుందనుకున్నాను. కానీ ఆవిడకా సాహసం లేదు. ఇక ఎన్నాళ్ళు? మూడు నెలలేగా? తర్వాత శారద ను తన ఆదర్శాలకు అనుకూలంగా తీర్చిదిద్దుకోగలడు. భానుమూర్తి రాకతో ప్రకాశం ఆలోచనలు తెగిపోయాయి.
"వెడదామా?' అన్నాడు భానుమూర్తి.
"కాఫీ తాగి వెడదాం" అన్నాడు ప్రకాశం.
సావిత్రమ్మ రెండు లోటాలతో కాఫీ తెచ్చి యిచ్చింది. ఇద్దరూ కాఫీ త్రాగి బయలుదేరారు.పదిహేను నిముషాలు నడిచి ఇసక వంకకు వెళ్ళి కూర్చున్నారు.
"ఈసారి వానలు బిగించేలా ఉన్నాయి భానూ!' అన్నాడు ప్రకాశం ఆకాశం చూస్తూ.
భానుమూర్తి నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావు?"
"ఏం లేదు. నీలో ఎంత మార్పు వచ్చిందా అని. కాలేజీ లోని ప్రకాశానికి, నీకూ పోలికే లేదు."
'అంతేనోయ్ , జీవితమంటే .జీవితం ఒక సర్దుబాటు, పరిసరాలతో, సంఘంతో మనం చేసుకునే సర్దుబాటు."
"ఒక సందేహం....."
"చెబుతాను విను. చుట్టూ ఉన్న నీచత్వం , బానిసత్వం,పేదరికం --వీటితో గూడా రాజీ పడవచ్చుననేగా నీ సందేహం?కాదు. అప్పుడు వీటితో కాదు సమాధానపడవలసింది-- రానున్న కాలంతో."
'అబ్బ! తల పగిలిపోయింది రా ఈ శుష్క చర్చతో! ఇక చాలించు. అలా చూడరా. ఆ మొగలి పొదల్లో ఎక్కడో ఒక మొగలి పూవు పడింది. ఆవాసనకు తల దిమ్మేక్కు తోంది. రెండుగా చీలిన కొండ కొమ్ముల మధ్య సూర్యుడు వాటారుతున్నాడు. ఆ చింత తోపులో కొంప మునిగి నట్లు పక్షులు అరుస్తున్నాయి. బంగారు జిలుగులా వున్న సూర్యకాంతి పడి యీ నీళ్ళు బంగారు నీటిలా ఉన్నాయి. ఇసక వెండిలా మెరుస్తోంది. కొండకు గడ్డి కోసుకు రావటానికి వెళ్ళిన పడుచులు నీటంతవస్తున్నారు. అబ్బ! ఈరోజు మనోహరంగా ఉందిరా ప్రకృతి!' పారవశ్యంతో కళ్ళు మూసుకుని అన్నాడు భానుమూర్తి.
"ఈరోజే కాదు , ప్రతి రోజూ, ప్రతి క్షణం ప్రకృతి మనోహరంగానే ఉంటుంది. దాన్ని చూడగలిగిన హృదయం ఉండాలి" అన్నాడు ప్రకాశం.
"ఏమిటి స్నేహితులిద్దరూ గొప్ప విషయాలు మాట్లాడేస్తూన్నారు!" అంటూ వచ్చింది ఇందిర.
ప్రకాశం, భానుమూర్తి ఆశ్చర్యపోయారు.
'ఇలా ఎక్కడి నుండి వన కన్యలా వస్తున్నావు?" అని అడిగాడు ప్రకాశం.
"అదో! అదే మా బావి. పంపు సెట్టు. దాని ప్రక్కనే మామిడి తోట. అక్కడి నుంచి వస్తున్నాను."
"మామిడి తోటలో కాయలున్నాయా?" అన్నాడు భానుమూర్తి.
"ఏం?" ఉంటె దొంగతనం చేస్తారా?"
"సిగ్గుచేటు! నా తోటలో నేనెందుకు దొంగతనం చేస్తానూ?"
ప్రకాశం నవ్వాడు. ఇందిర సిగ్గుతో తల వంచుకుంది.
"మామిడికాయలు కావాలా?" మళ్ళీ అడిగింది.
"ఉన్నాయా?"
"ఉగాదికి ఊరగాయకు పనికి వచ్చే కాయలుండాలి. కానీ ఉగాది పదిహేను రోజులే ఉన్నా ఇంకా పిడికెడు కూడా లేవు. ఇదో తీసుకోండి. మిరప్పొడి కావాలా? కావాలంటే ఇదో." రెండు మామిడికాయలు, మిరప్పొడి పొట్లం యిచ్చి ఇందిర వెళ్ళిపోయింది.
"అదృష్టవంతుడివిరా నువ్వు" అన్నాడు ప్రకాశం.
"కాదూ, మరి! నేను చాలా అదృష్ట వంతుణ్ణి!" తృప్తితో అన్నాడు భానుమూర్తి.
ప్రకాశం ఆకాశం కేసి చూస్తూ వెల్లకిలా పడుకున్నాడు. పైన మబ్బులు గుంపులు గుంపులు గా సాగుతున్నాయి.
"ప్రకాశం , నీకో ముఖ్యమైన విషయం చెప్పడం మరిచిపోయాన్రా."
"ఏమిటి?" కళ్ళు మూసుకునే అన్నాడు ప్రకాశం.
'ఇందిర ఇంటరు ఫెయిలయింది కదూ? ఈ ఊరికి భానుమూర్తనే ఓ ఆద్భుత మేధావి వచ్చాడని, ఆ మనుభాని వద్ద ఇంగ్లీషు ట్యూషను చెప్పించుకోవాలని ఇందిర జగన్నాదాన్ని అడిగిందిట. అప్పుడే రాగాన ఉన్నాడో సరేనన్నాట్ట. రెండో రోజు నేను మీ యింట్లో ఉన్నానని తెలుసుకున్నాడు కాబోలు , వీల్లెదన్నట్ట."
"మొత్తం మీద నా నుంచీ నీకు ఇందిర ను రోజూ కలుసుకునే వీలు తప్పిందంటావు!"నవ్వాడు ప్రకాశం.
బాగా చీకటి పడ్డాక ఇద్దరూ యిల్లు చేరారు. విశ్వంధయ్య గారూ, సావిత్రమ్మ మాట్లాడుతూ నడవాలో కూర్చుని ఉన్నారు.
"షికారు కెళ్ళారా?" విశ్వనాధయ్య గారు పలకరించారు.
'అవునండి" అన్నాడు ప్రకాశం.
భానుమూర్తి చదువుకోవాలని గదిలోకి వెళ్ళిపోయాడు. విశ్వనాధయ్య గారు రోజు రోజుకూ క్రుంగి పోతున్నారు. వారు గడ్డం పదిరోజులుగా గీసుకున్నాటు లేదు. కళ్ళలో నిరాశ తాలుకూ నీడలు దట్టంగా ఉన్నాయి.
"ప్రకాశం ఒక విషయమయ్యా" అన్నారు.
"ఏమిటండి?"
"సుందర చాలా డీలా పడిపోతుంది."
"ఎందుకండీ?"
"ఇంకెందుకు? ఉమాపతి కోసం. ఎంతయినా కన్న కడుపు కదూ? వాడి వద్ద నుంచి ఉత్తరం వచ్చి రెండు నెలలైంది. ఈ రెండు నెలలుగా నేనొక పైసా కూడా పంపలేదు. వాడు తింటున్నాడో, పస్తుఉంటున్నాడో తెలియటం లేదు." కళ్ళనిండా నీళ్ళతో అన్నారు విశ్వనాధయ్య గారు.
"మీరొకసారి మద్రాసు కు వెళ్ళి రండి. మీరు వెళ్ళితే అతడు తప్పకుండా వస్తాడు. అతణ్ణి ఆ వాతావరణం లోంచి తప్పించాలి."
"అవును, ప్రకాశం. నా భయాలతో వాణ్ణి సగం నేనే నాశనం చేశాను. వీలు చూసుకొని వెళతాను." అంటూ విశ్వనాధయ్య గారు లేచారు.
