Previous Page Next Page 
మమత పేజి 11

 

    చివరకు రంగాజమ్మ నెత్తిన తులసి దళాలు వేసి, శఠగోపం పెడుతున్న అర్చకులు మహాదానందాచార్యుల వారు గూడా బ్రహ్మానంద పడిపోతూ కొయ్యబారి పోయారు. ఒక్క క్షణం స్వామి సాన్నిధ్యంలో - అంతమంది నిలబడ్డాననే విషయం మరచి.
    'తాను ధర్మకర్త గనక - అంత డబ్బు తగలేసి- మున్నూట పదహార్లిచ్చి - స్వామి వారికంటూ మేళం తెప్పించాడు. చివరకు తానె స్వామై కూర్చున్నాడు. అంత బహిరంగంగా అంతమంది జనంలో ఆ జాణతో ఆ పిచ్చి శృంగార మేమిటయ్యా అనే వాడు లేక గానీ' అంటూ వరసకు బావగారైన గురవేశ్వర్రావు చెవులు కొరుకుతూ వాపోయిన కరణం , అంతలో తేలుకుట్టి నట్లు ఎగిరిపడి 'నా పది రూపాయల నోటు అంటూ కేకపెట్టాడు.
    వారం రోజుల తర్వాత -
    ఆ వార్తా అడివి మంటలా వ్యాపించింది.
    రాజయ్య గారి వంటి కులీనుడు- రంగాజమ్మ వంటి 'చెడిపోయిన మనిషిని చేరదీసి ,సమస్త ప్రపంచాన్నీ విస్మరించి 'నరకంలో పడిపోయి ' ఆ'కొంపలు కూలే' జాణతో 'గవ్వలాడుతూ' కాలక్షేపం జేస్తాడని - ఆ పరగణాలో ఎవ్వరూ కలగనలేదు.
    'రహస్యం దాగుతుందిటయ్యా! నాలుగు రోజులు కొకసారి పూలరంగడులా బయలు దేరి పోతున్నది ఎక్కడికంటావ్? పిఠాపురం స్టేషన్లో మా వియ్యంకుడికి కనిపిస్తూనే వుంటాట్ట. ఎవరు వియ్యంకుడంటే? గూడ్సు క్లర్కు చేయడం లా అయన' - కరణం గున్నేశ్వర్రావు.
    'అయితే పూర్తిగా మునిగిపోయి నట్లే నన్నమాట? ఎంత చిత్రం?'
    -వరసకు బావమరిది గురవేశ్వర్రావు -
    'చిత్రమే ముంది బావా? అసలు చీర లోనే వుంది. ఆ మహత్యం ఊరికినే అన్నారూ మహానుభావులూ/ ఎంత వారలైనా కాంతాదాసులే- అంటూ - '
    'చివరకు మహాసాద్వి సీతమ్మ తల్లికి యింత అన్యాయం తల పెట్టాడన్న మాట.'
    'అన్యాయ మేముందిలే ఈవిడకు మాత్రం పిల్లా మేకా ఏముంది గనక?'
    'ఏం మాటా బావా? భార్య కడుపున బిడ్డలు పుట్టలేదని-పడుపు కత్తేతో కాపురం వెలగబెట్టటం న్యాయమంటావా? కాకినాడ పరగణా మొత్తాన్ని ఒక అట ఆడిస్తున్నదట ఈ మహాతల్లీ.'
    భర్త ఆదేశం ప్రకారం కరణం గారి భార్య కనకమ్మ గారు స్వయంగా వచ్చి, జరుగుతున్న ఘోరం గురించి- రాజయ్య గారి భార్య సీతమ్మ గారిని హెచ్చరించింది.
    గిట్టని వాళ్ళ మాటలండి వదినగారు యివన్నీ . ఇన్నాళ్ళూ అలా నిప్పులా బ్రతికిన వారు - యిప్పుడటువంటి పని చేస్తారా?' అంటూ సమాధానం చెప్పినా - అంతకుముందే మనస్సులో మెదులుతున్న అనుమానం కొద్దీ -
    ఒకనాటి రాత్రీ భోజనాలయాక -
    పందిరి మంచం మీద తాంబూలం నవులుతూ పడుకున్న భర్త పాదాలు వత్తుతూ -- 'ఇలా అనుకుంటున్నా రండీ ఊళ్ళో" అంది తల వంచుకునే సీతమ్మ గారు-
    'అసలు సంగతి ఏమిటి?' అని నిగ్గతీయకుండానే.
    పది క్షణాలు ఆలోచనల్లో మునిగి నమ్ముతున్నావటే అమ్మీ నువ్వు!' అన్నారు రాజయ్యగారు.
    'ఎలా నమ్ముతానండి మీరు అటువంటి పని చేస్తారంటే?'
    'నమ్మలేదన్న మాట'
    'ఒకనాటికి నమ్మను'
    'ఎందుకని'
    'పదేళ్ళు కాపరం చేసినదాన్ని మీ మనస్సు రవ్వంత కనిపెట్టలేనా?'
    'ఏం కనిపెట్టావే నా మనస్సు?'
    పల్చటి నవ్వు తృప్తిగా మెదలింది రాజయ్య గారి పెదమల మీద.
    'ఒకళ్ళకు అన్యాయం చేయరని'
    'అంటే ఏమిటే?'
    'భగవంతుడు విషం పెడతాడుటండీ ఎవరికైనా?'
    రాజయ్యగారు నిట్టుర్చారు.
    'అమ్మీ! ఒకమాటడగనా?
    'ఏమిటండీ - అందరూ - పదిమంది పలురకాల మాటలంటుంటే మాటవరసకు అడిగాను గానీ- మీరు అంతగా పట్టించుకోవాల్సిన పని లేదీ మాట'
    'కాదె! పోనీ మాటవరస కే అడుగుతున్నా చెప్పు. రంగాజమ్మను గురించి నీ అభిప్రాయమేమిటి?'
    'బావుందండీ మీరడిగేది. అభిప్రాయాలంటూ వుండడానికి ఆవిడ నకేమవుతుందని - అసలు ఎక్కువ గుర్తు కూడా లేదావిడ.'
    'ఆనాడు చూశావుగదుటే కళ్యాణ మంటపం లో'
    'ఏమో! అప్పుడే మరిచి పోయాననుకోండి.'
    'అమ్మీ! ఒక నిజం చెప్తాను నమ్ముతావా?'
    'ఎందుకు నమ్మనండీ?'
    'అందరూ అనుకుంటున్నట్లు - అలా పుట్టినా - చెడ్డ మనిషి కాదు రంగాజమ్మ.'
    'మీకెలా తెలుసండి ఆవిడ మంచి చెడ్డలు.'
    'బాధపడనంటే జరిగింది చెప్తాను.'
    'చెప్పండి'
    'ఆ మాట నిజమేనే సీతా! ఇన్నాళ్ళూ నీకు చెప్పలేకపోయాను. ఎలా చెప్పాలో తెలియక. నీ దగ్గర ఎప్పుడూ ఏ రహస్యమూ దాసినవాణ్ణి కాదు!
    జరిగిన కధంతా చెప్పాడు రాజయ్య గారు.
    చెప్పి - చివరకు 'అమ్మీ బాధపడుతున్నావా ' అన్నారు.
    'లేదండీ నమ్మలేకుండా వున్నాను'
    తర్వాత మాట్లాడలేక పోయింది సీతమ్మ గారు. పురుగు తాకినట్లు రక్తం విరిగింది. తల తిరిగింది.
    కళ్ళు తుడుచుకుంది. మౌనంగా రోదిస్తున్న మనస్సును పగిలిపోకుండా చిక్క బెట్టుకుంటూ --
    '.......' సీతమ్మగారి ముఖంలోకి చూశారు రాజయ్యగారు.
    భర్త ముఖంలోకి క్రొంగొత్త మనిషిని పరీక్షించి చూస్తున్నట్లు- సూటిగా చూస్తున్నది సీతమ్మ గారు.
    తల వంచుకున్నారు రాజయ్యగారు.
    జీవితంలో మొదటిసారి భార్య చూపుల్ని భరించలేక బెదిరి చెదిరి పోయాయి అయన చూపులు.
    పాపంలా కురుస్తున్న చీకటిని పులుముకుంటూ రివ్వున కిటికీ తలుపును ఊడగొట్టి శబ్దం చేస్తూ గది;లో ప్రవేశించిన గాలి తాకిడికి త్రుళ్ళిపడింది సీతమ్మ గారు. రాజయ్యగారి వంట్లో రక్తం చల్లబడి - జివ్వున లాగింది ప్రాణం.    'పడుకోవే వెర్రి దానా! నీకేం అన్యాయం జరుగదులే.'
    'నాకు తెలుసండీ.'
    
                              *    *    *    *
    'ఏమండీ .'
    గ్లాస్కో పంచ కట్టి -సిల్కు లాల్చీ తొడుక్కుని లెదరు బాగుతో ప్రయాణమై వెళ్తున్న భర్తను వెనక్కు పిలిచింది సీతమ్మ గారు.
    ఆగాడు రాజయ్య గారు.
    'ఎక్కడికి వెళ్తున్నారు?'
    'పిఠాపురం.'
    'నాకిష్టం లేదండి!'
    'వెళ్తున్నాను.'
    దుఃఖభారాన్ని ఆపుకోలేక కుమిలి పోయింది సీతమ్మ గారు.
    వెనక్కు తిరిగి వచ్చి రాజయ్య గారు "సీతా! ఏం చెప్పను . దాన్ని చూడకుండా ఉండలేక పోతున్నానే' అన్నారు.
    "నేనేం తక్కువ చేశాను మీకు?'
    'ఎవరన్నా రామాట?'
    'ఏం పాపం చేశాను. ఎలా భరించగలమంటారు? నేను బ్రతికలేనండి.'
    భర్త పాదాల మీద పడి రోదించింది సీతమ్మగారు. రాజయ్యగారు ప్రయాణం మానుకున్నారు. మౌనంగా తిరిగిపోయి  పందిరి మంచం మీద ఆ బట్టలతో అలాగే పడుకున్నారు. బయటకు రాలేదు. రాత్రి భోజనం చేయనంటూ అలాగే పడుకున్నారు. సీతమ్మ గారి సహనం ప్రయోజనం లేకపోయింది. నాలుగు రోజులు అయన భోజనం చేయలేదు. భర్తను అనుసరించింది భార్య. చివరకు 'వెళ్ళి రండి. మీరు పది కాలాల పాటు చల్లగా ఉంటె అదీ పదివేలు నాకు' అంది సీతమ్మగారు.
    'మనస్పూర్రిగా అంటున్నావా సీతా?'
    'కట్టుకున్న భార్య ఎంత మనస్పూర్తిగా అనగలదో అంత మనస్పూర్తిగా అన్నానండి. నాకు తెలుసు , ఎంత పాపిష్టి దాన్ని కాకపోతే యిటువంటి గొడ్రాలు బ్రతుకై పోతుంది నాది?
    భర్త పాదాల దగ్గర అలాగే పడుకుని కళ్ళు మూసుకుంది. పక్కన పడుకో మన్నారు రాజయ్యగారు. బలవంత పెట్టారు. 'నాకు యిక్కడే బావుందండీ . బ్రతికి నంతకాలం ఈ మాత్రం చోటు దొరికితే చాలు నాకు' అంది ఒదిగి కాళ్ళు ముడుచు కుంటూ.

                          *    *    *    *

    ఈ సంఘటన జరిగి యిప్పటికి మూడు నెలలు దాటిపోయినా , రంగాజమ్మ విషయం ఎప్పుడూ భర్త దగ్గర ప్రస్తావించలేదు సీతమ్మగారు.
    'అలా సంసారం తగలబెడుతుంటే చూస్తూ ఊరుకుంటావేం వదినా? నీకు నోట్లో నాలుక లేదని, అలా దోచి పెట్టేస్తున్నాడే. నల్లరేగడి చెరుగు క్రింద ఆ నాలుగెకరాలు బేరం పెట్టమని మళ్ళీ మీ అన్నయ్యను పురమాయించారట? అంటూ మరొకమారు పనిగట్టుకొని వచ్చి రహస్యంగా చెప్పి హెచ్చరించింది కరణం గారి భార్య కనకమ్మ గారు. బేరం కుదరగానే వచ్చిన కమిషను తో నాన్తాడు చేయిస్తానని భర్త ఆశ పెట్టిన తర్వాత.
    'ఆయనకు మనం చెప్పేది ఏముంది వదినా? అన్నీ తెలిసినాయన. పొలమంటావా? ఇవాళ అమ్ముతారు. రేపు కొంటారు. ' అంటూ నిర్లిప్తంగా సమాధానం చెప్పి - 'మీ అబ్బాయి కేమన్నా సంబంధాలు చూస్తున్నారుటమ్మా' అంటూ మాట మార్చింది సీతమ్మ గారు.
    మర్నాటి ఉదయం నీలాటి రేవు దగ్గర కనకమ్మ గారి అధ్యక్షతన సమావేశ మైన ఆ గ్రామ మహిళామండలి అమిత శ్రద్దా శక్తులతో సీతమ్మ గారి సంసారం గురించి చర్చింది, 'భగవంతుడు కూడా యింక ఆ కాపరాన్ని నిలబెట్టలేడు' అనే నిర్ణయానికి వచ్చి - తనకు యిష్టమయ్యే  పంపిస్తున్నది సీతమ్మ మొగుణ్ణి దాని దగ్గరకు' అంటూ తీర్పులు చెప్పుకుని ఎవరి ముక్కుల మీద వాళ్ళు వ్రేళ్ళు వేసుకుంటూ ఉమ్మడి గా మునిగారు రేవులో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS