5
తరువాత నెల రోజుల కనుకుంటా వదిన దగ్గిర్నించి చిన్న ఉత్తరం వచ్చింది. "ఏమాత్రము అవకాశమున్నను వెంటనే ఒక్కసారి రావాల్సింది. ఆతృతకు ఎట్టి కారణమును లేదు.' ఎన్నిసార్లు చదివినా అందులో అంతకంటే అక్షరాలూ లేవు. నా గుండెలు దడదడ కొట్టుకున్నాయి. ఎప్పుడూ ఆమె నన్నిలా రమ్మని రాయలేదు. నా ప్రాణం ఇక అయిదు నిమిషాలు ఆగలేదు. సమయానికి అయన ఇంట్లో లేరు. చిన్నారి ఒంట్లో ఎలా ఉందొ!
'అమ్మా రేపు అత్తా వస్తానన్నది కదటే?' అంది మధురిమ. త్రుళ్ళి పడ్డాను. అదేమిటో ఆ మాటే జ్ఞాపకం లేదు నాకు! ఆయనకి వరసకి అక్కయిన ఒకామె కామేశ్వరి అని మెడ్రాసు లో ఉంది. మా పెళ్ళికి చూశాను ఆవిణ్ణి అంతే. ఈలోగా వాళ్ళను రమ్మని ఎన్నోసార్లు రాశారు అయన.
'చేసేది పెద్ద వ్యాపారమైనా , క్షణం తీరిక లేకపోయినా యింకా మా బావ గవరయ్యే నయం ఉత్తరం రాస్తే వెంటనే జావాబురాస్తాడు. దీనికి ఎక్కడలేని గర్వమూను. మనలాంటి బీదవాళ్ళ ఇళ్ళకి అదెందుకు వస్తుంది. ఈ వూరు మీద నుంచి వెడుతూ కూడా ఒక్క పూట దిగదు మనింట్లో. పోన్లే యిప్పుడు మన కొచ్చిన లోపమేమిటి గనక!" అనేవారు అయన.
"ఆవిడకేం పన్లున్నాయో ఎందుకు రాలేదో ఎందుకొచ్చిన వ్యాఖ్యానాలు? ఆవిడ తమ్ముడికి పెళ్ళి కూతుర్ని చూసుకోవడం కోసం మన ప్రాంతాలకి వస్తుందని విన్నాను. వెంటనే రమ్మని రాయండి.'
'నేను పిలిస్తే ఇది వరకే వచునేమో!'
'మరి?"
'బాగుంది! అది కూడ నాచేత చెప్పించుకోవాలా?'
'సరే - పెద్ద భాగ్యమా ఏమిటి?' వెంటనే ఆవిడా పేర తప్పకుండ ఇక్కడ పది రోజులు పాటు దిగి మరీ వెళ్ళవలసిందని రాసి ఆయనకి చూపించాను.
'భేష్, ఇంతకన్నా కావలసినదేముంది? ఈ దెబ్బతో మా కామేశ్వరక్కయ్య వచ్చి తీరుతుంది చూడు' అన్నారు అయన. అలా అన్నట్టే వారం తిరక్కుండా జవాబు రానే వచ్చింది. పినతల్లితో సహా ఆవిడ వస్తున్నదట.
ఇంతట్లో మా వదిన దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. నేనేం చేసేది? వెంటానే వెళ్ళి ఆప్తురాలైన వదినను అదుకోనా? రాకరాక అయన తరపున అతిధులు ఇంటి కొస్తూంటే ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోనా? వాళ్ళు మర్నాడు మెయిల్లో వస్తున్నారు. ఈయనేమో సమయానికి వూళ్ళో లేరు.
వదిన ఉత్తరం మళ్ళీ చూసుకున్నాను. 'ఆతృతకి ఎట్టి కారణమును లేదు' నిజానికి ఆ అక్షరాలే నా కెక్కువ ఆతృత కలిగించాయి. ఏమైతే నేం ఆ నాటికి ప్రయాణం వాయిదా వేసుకున్నాను. కన్ను మూస్తే చాలు కలచి వేసే అన్నయ్య మొహం, కష్టపడుతున్నట్టున్న చిన్నారి మొహం కనిపించేవి.
పొద్దుటే కామేశ్వరీ వాళ్ళూ వస్తారేమో నని మధురిమను తీసుకుని మెయిలు కి వెళ్ళెను. వాళ్ళు రాలేదు. తరువాత పాసెంజరుంటే దానికీ మారాం. అప్పుడూ రాలేదు. ఇక నేను ఆగలేక ఆయన పేర ఉత్తరం రాసి, తాళాలు పక్కింటి వాళ్ళ కిచ్చి బయలుదేరి పోయాను.
వీధితో పడక్కుర్చీలో దిగాలు పడిన మొహంతో కూచున్న అన్నయ్యను చూడగానే ఆశుభాన్ని వూహిస్తూ నా గుండెలు దడదడ కొట్టుకున్నాయి. కుడి చేతి చూపుడు వేలితో గాలిలో సున్నా చుట్టేడు. నా గుండె నీరాయి పోయి అక్కడే చతికిలబడి పోయాను. వదిన నన్ను కౌగలించుకుని బావురుమంది. చిన్నారి ఆ తెల్లారుఘామునే పోయింది. కాళ్ళూ, చేతులు సన్నబడి పోయి బల్ల ఎక్కువై పోయి తినడానికి వీలులేక తిరగడానికి శక్తి లేక అలా గంటల తరబడీ చూస్తూ కూచునేదిట.
నేను కాశీ నుండి తిరిగి వచ్చే రోజున రైలు దగ్గిర చిన్నారి నా కళ్ళకు కట్టింది. అప్పుడే అడిగాను.
"ఏంరా పిల్ల ఎదుగూ బొదుగూ లేకుండా ఇలా ఉంది?" అని.
'కొందరు నిలువుగా పెరుగుతారు. కొందరు అడ్డంగా ఎదుగుతారు. ఇది గుడ్రంగా ఏదుగుతోంది. అంతే!' అని నవ్వేడు. అందులో ఆర్ద్రత లేదు. స్వాభావికత లేదు. గుండెలు బద్దలయ్యే ఆ నవ్వుకి అర్ధం ఇదన్న మాట!
అసలు చిన్నారికి బల్ల అని పోల్చుకోడానికే చాలా ఆలశ్యం అయిపోయిందిట. ఇప్పిస్తున్న ఇంగ్లీషు మందులు ఆపి యితరమైన మందులు ఇప్పించే లోగా వ్యాధి ముదిరి పోయిందిట.
'నిజానికి మన చదువులూ సంస్కారమూ అన్నీ చాలా వెనక బడి ఉన్నాయి. కనీస వైద్యా పరిజ్ఞానం ఇవ్వని విద్య మనల్ని ఎక్కడికి తీసి కేడుతున్నాయి? ఈ విధంగా ఆలోచిస్తే మంగళ చాడువుకోలేదన్న విషయం కూడా నన్నేక్కువ బాధించడం లేదు. రెండో మూడో ఇంగ్లీషు ఎస్సేలూ, నాలుగో ఐదో జామెట్రీ దీరమ్స్ కంఠతా పట్టి ప్యాసైనా పరీక్షలు మన జ్ఞానాన్ని ఎంతవరకూ పెంచుతున్నాయి అన్నాడు ఎప్పుడు లేనిది నిస్పృహగా.
'నా చదువూ అలాంటిదే గద , మరి నన్నెందుకు అంతగా ప్రోత్సహిస్తావ్?' ఎదురు చూడని ఈ ప్రశ్నకు అన్నయ్య తెల్లబోతాడేమో అనుకున్నాను. ఉహు. ఒక్క నిమిషం అలోచించి జవాబు చెప్పాడు.
'మంగళకి నీకూ మనస్తత్వంలో చాలా తేడా ఉంది మంజూ! వంటలోనూ, పిల్లలతోనూ ఇంకా టైం ఉంటె ఏ రామాయణం లోని పద్యాలో చదువుకుంటూ తను కాలక్షేపం చెయ్యగలదు. మన బుర్రలకి 'యాక్టీవిటీ' ఎక్కువ. అలా గడపలెం. ఎప్పటి కప్పుడు ఏదో ఒకటి కల్పించుకుంటే గాని నీ బుర్ర తిన్నగా ఉండదు. అందుకని అది అస్తమానూ ఎంగేజ్ అయి ఉండడం మంచిది. దానికి నీ విషయంలో ఇంతకన్న మంచి పద్దతి లేదు మరి!'
'అయితే బ్రతికున్నన్నళ్ళూ నేనిలాగ చదువు కుంటూనే ఉండాలందుకూ?'
'అదేం ప్రశ్న? దానికేం గాని ముఖ్యంగా ఈ డిగ్రీల వల్ల వ్యక్తిగతంగా మనం ఎంతవరకూ వికాసం చెందుతున్నామూ అని. నా మటుకు నేను సాధించేముంది ఐదేళ్ళలో ముగ్గురు పిల్లల్ని కనడం తప్ప!"
మనస్పూర్తిగా దోషం చేసినట్టు ఒప్పుకుంటున్నట్టున్న అన్నయ్య ముఖం చూస్తె ఎలాంటి వాళ్ళ కయినా వివేకోదయం అవుతుంది.
'సీత పుట్టినపుడు మీ వదినకు జబ్బు చేసింది. మళ్ళీ అర్నెలు తిరగలేదు. ఇది కడుపున పడింది. ఇంత దగ్గిర దగ్గిరగా పుట్టిన పిల్లలకు ఆరోగ్యం ఎలా ఉంటుంది? పుట్టిన దగ్గర్నుండీ మిగిలిన పిల్లల్లా దానికి తగిన ఆరోగ్యమూ పెరుగుదలా లేవు. ఈనాడు అది ఈ విధంగా పోయిందంటే దాని కోసం తల్లి బెంగ పెట్టుకుందంటే పిల్ల లిద్దరూ తల్లి మొహం చూసి బిక్కుబిక్కుమంటూన్నారంటే ఇంట్లో ఇంత చీకటిని ప్రసరింప చేసిన నాకేమిటి శిక్ష!'

మేమిద్దరం వద్దంటున్నా వినకుండా ఆవాళే అన్నయ్య బ్యాంకుకి వెళ్ళిపోయాడు! వదిన వీధి తలుపు వేసి వస్తూ అంది.
'మొత్తానికి చిత్రమైన మనిషి. వారం రోజుల బట్టి మాటామంతీ లేదు. పిల్లని ఒంట్లో కూచోబెట్టుకుని దానితో పాటు తనూ బాధపడుతూ కూచున్నాడు. ఇవాళ నువ్వచ్చేసరికి ఇలా లెక్చర్లు దంచుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అదలా ఉంచి నీకు ఉత్తరం రాద్దామంటే తను రాయరు, నన్ను రాయనివ్వరు. 'వెర్రి మొద్దు, అదోచ్చి ఏం చేస్తుంది!' అంటారు . వద్దని పైకి అంటున్నా ప్రతి క్షణం నిన్నే తలచుకుంటున్నారని ఎవరి కెనా యిట్టె తెలుస్తుంది. అందుకే రాశాను. ఏం చెయ్యడం, దురదృష్టవంతులం. దాన్ని దక్కించుకోలేక పోయాం. ముందుగానే కనుక్కుంటే పిల్ల బ్రతుకునేమో!
వదిన కళ్ళమ్మట , జలజల కరిగిన మైనపు వత్తి చుక్కల్లా కన్నీటి బొట్లు రాలేయి. ఆమెను వూరుకో బెడదామనుకున్న నాకే దుఃఖం ఆగలేదు.
ఒకవంక నా మనసంతా ఇంటి వైపే ఉంది. అయన కాంపు నుంచి ఎప్పుదోచ్చారో.... వారి బంధువులు గాని వచ్చి ఎవరూ లేరని వెళ్ళిపోయారో ఏమిటో.... సమయానికి నేను లేక పొతే అయన ఏమనుకుంటారో ఏమిటో... ఇలా భయందోళనలలో బాధపడ్డాను. ఇవతల వీళ్ళకు తగని కష్టమోచ్చినప్పుడు కూడా దగ్గిరుండి నాకు తోచిన సహాయం చెయ్యలేక పోయాను గదా అనిపించింది.
ఆ మర్నాడు సాయంకాలం అన్నయ్య వస్తూనే అన్నాడు.
'హార్టీ కంగ్రాచ్యులేషన్సు మంజులా ...నువ్వు పరీక్ష ప్యాసయ్యవు. అతన్ని పరీక్ష ప్యాసు చేయించడం లో మాత్రం ఫేలయ్యావు!"
నా కాళ్ళ కింద భూమి పక్కకి జరిగిందా అనిపించింది.
'నీకెలా తెలిసిందిరా అన్నా?'
'ఇక్కణ్ణించి పరీక్షకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారుగా మరి! వాళ్ళతో మీ నెంబర్లు కూడా ఇచ్చెను. ఏది ప్యాసైంది. నీ నెంబరు నాలుగొందల ఒకటి కదూ?' అవునన్నాను. అయన నెంబరూ సరిగ్గానే చెప్పేడు. ఆయన్ది పోయిన మాట నిజమే. నా గుండెలు కొట్టుకున్నాయి.
'ఇప్పుడింకొక అరగంటలో ప్యాసెంజరుందిగా , పోతాన్రా' అన్నాను.
"అదేమిటే, రేపు వెడతానన్నావ్గా?"
'లేదురా, వెళ్ళిపోవాలి చెప్పకుండా వచ్చానని ముందే చెప్పేగా?'
"ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఇద్దరూ సరదాగా ప్యాసై ఉంటె బాగుణ్ణు.' అంది వదిన నా మనసులో మాటను.
'లేదు, బావ ప్యాసై దానిది పోయినా అదింకా సంతోషించి ఉండును.' అన్నాడు అన్నయ్య నాలో మనసులోని మాటను.
'అయినా ఏం పరీక్షలో ఏం లోకమూ ఎప్పుడయి పోతాయో పిల్ల సన్నబడి నల్లబడి పొయిండమ్మా' అంది వదిన. నేనీ మాట లేవీ వినడం లేదు. గబాగబా మధురమకు జడలు వేసి రిబ్బన్లు పెట్టి బట్టలు సర్దేసి మొహం రుద్దుకుని సిద్దపడి పోయాను. వీధిలోకి వచ్చి కనబడిన ఖాళీ రిక్షాలో సామాన్లు పెట్టించి 'పదరా అబ్బాయ్ స్టేషను కి' అన్నాను. రిక్షా కన్న, రైలు కన్నా తొందరగా పరిగెడదామని నా మనసు ఆరాట పడుతోంది. ఒక ప్రశ్నకు జవాబు తెలియాలి' ఈ పరీక్ష ఫలితాల మీద అయన ప్రభావం ఎలా ఉంటుంది?'
* * * *
