"ఇప్పుడు చూడ్డానికి వచ్చావుకాని శాంతకి ఇలా ఎప్పటినుంచి ఉందో తెల్సా?" అంది రమణమ్మగారు.
"నాకు ఇప్పుడే తెలిసింది మేనేజరుగారు చెప్తే ఎప్పటినుంచేవిటి ఈ అనారోగ్యం?"
"పండగల ముందు నీకు చీర తీసుకుని ఇద్దరూ మీ ఇంటికి వచ్చారు జ్ఞాపకం ఉందా? అప్పటి నుంచి ఆ రోజు కారో మీ ముగ్గురూ హాస్పిటల్ కి వెళుతూ వుంటే శాంతకి తలనొప్పి వచ్చిందట. ఇంటికి వచ్చేసింది ఆ రాత్రి మా అల్లుడు పొద్దుపోతేనే కాని ఇంటికి రాలేదు. దానిమీద ఇద్దరూ ఏదో మాటామాటా అనుకున్నారు. ఆ రాత్రి ఎవళ్ళూ భోజనం చెయ్యలేదు. పండగ మూడురోజులూ జగపతి ముభావంగానే ఉన్నాడు. శాంత ఆ మూడురోజులూ సరిగా భోజనం చెయ్యలేదు. అదే మొదలు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్కలాగ ఉంది."
"అయ్యో పాపం!"
"శాంత మరీ మనసు పాడుచేసుకోడానికి, పండగల్లో అతని ప్రవర్తన కొంత కారణం. భోజనం వేళకి వచ్చేవాడు కాని పగలల్లా ఎక్కడో తిరిగేవాడు. బహుశా మీ యింటికొచ్చి నీతో కబుర్లు చెబుతూ కూచుంటున్నాడెమో అనుకున్నాం."
"అబ్బే - శాంతతో కలిసి మా యింటికి రావడమే మళ్ళీ రాలేదండి జగపతి."
"అయినా ఒక్కమాట చెప్తాను విను అమ్మాయి! మీ ఆయనా పుట్టెడు రోగంతో ఉన్నాడు. నువా ఎర్రగా బుర్రగా వయస్సులో వున్నావు. మొగాళ్ళతో స్నేహం. వాళ్ళు నీకు చీరలు పెట్టడం, నువ్వు వాళ్ళతో కలసి కార్లో షికారు విరగడం ఇవేం బాగోలేవు. నిక్షేపం లాంటి నా కూతురు కాపురం నీ ధర్మమా అని ఇలా అయిందా? ఇంకా ఎంతమంది కాపురాలు పుణ్యం కట్టుకుంటావు తల్లీ!" ఆ మాటలు విని పిడుగులు పడుతున్నట్లు సునంద నిశ్చేష్టురాలై, వుండిపోయింది, తల తిరిగిపోయి కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నోటమాట లేక కళ్ళు వెంబడి నీళ్ళు కారుస్తూ నిస్సహాయంగా నిలబడిపోయింది. స్పృహ తప్పి పడిపోబోయి పక్కనే వున్న సోఫాని ఆనుకుంది. అనుకోని, రమణమ్మగారి కేసి జాలిగా చూసింది సునంద.
ఆ చూపులో "నేను మీ అమ్మాయి లాంటి దాన్ని. నన్ను ఇంతలేసి మాటలు అనడం మీకు భావ్యమేనా? మా ఆయనకి జబ్బుచేసి హాస్పిటల్ లో ఉంటే, రోజు గడిచే దిక్కులేక ఈ ఉద్యోగంలో చేరాను కదా అని మీకు లోకువగా కనిపిస్తున్నానేమో కాని నేనూ పరులైన కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్నే, ప్రస్తుతం నా దీనస్థితిని అలుసుగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్లు అనేస్తారా? ఇంత నీచంగా మాట్లాడతారా? సరే-సరేలెండి" అనేభావం ద్యోతకం అయింది.
శాంతా, రమణమ్మ గారూ, సునంద ఉనికిని గమనించనట్లే కూర్చున్నారు. యింక అక్కడ ఒక్క క్షణం ఉండలేక మనస్సంతా వికలం అయిపోయి, వెనక్కి తిరిగింది సునంద. అప్పుడే లోపలికి వస్తూన్న మేనేజరు ఎదురయ్యారు. "ఏవమ్మా వెళుతున్నావా? మా శాంతని పలకరించావా? ఏమంది?" అన్నారు. బలవంతంమీద గాంభీర్యాన్ని ముఖంలోకి తెచ్చుకుంటూ. "ఆ....పలకరించానండి. ఆలోచనల్లో ఆరోగ్యం తెచ్చుకుంటే శరీరంలో అదే వస్తుందండి ఆరోగ్యం" అంది. మేనేజర్ కి ఆ మాట సందర్భం తెలియలేదు. అందుకే అర్ధం కాలేదు. సునంద చేతులకేసి చూశారు మేనేజరుగారు. చేతిలో పండుకని, తాంబూలంకాని కన్పించలేదు. ఇంటికొచ్చి వెడుతూన్న ముత్తైదువుకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వడంకూడా తెలియదేవిటి దీనికి" ని మనస్సులో అనుకొని గట్టిగా "ఏమేవ్! అమ్మాయి వెళుతోంది" అన్నాడు అర్ధస్ఫూర్తితో.
"వెళ్ళమనండి" అని లేకుండా అక్కడ నుంచే సమాధానం చెప్పింది రమణమ్మగారు.
మేనేజర్ కి పెళ్ళాం మీదా, శాంత మీదా పట్టలేనంత కోపం వచ్చింది. సునంద వెళ్ళి పోతూంటే తమకేం వచ్చినట్లు ఏమిటి అలా కూచుంటారు? అధమం గేటుదాకైనా వెళ్ళి దిగబెట్టరేం?
సునంద వెనకాలే నడుస్తూ "నువ్వేం అనుకోకు అమ్మా! చదువుకోక తల్లీ, చదువుకుని కూతురూ బొత్తిగా సంస్కారం లేకుండా తయారయ్యారు అన్నారు మేనేజరు.
ఆ మాటలు విని వెనకనుంచి రమణమ్మగారు "ఆ....ఉద్యోగాలంటూ ఆఫీసుల్లో జేరి మొగాళ్ళ మతులు పోగొట్టి. కొంపలు కూల్చే సంస్కారం మా లెవరికీ లేదు లేండి" అంది.
మేనేజరు వెనక్కి తిరిగి చూశారు.
ఆయన ముఖంలో కోపం కణ కణలాడింది.
"ఏవిటే ఆ మాటలు? బుద్ది ఉండకర్లే? ఆ అమ్మాయి చిన్నధైనా పెద్ధలెక్కల్లో మనిషి. ఏవనుకున్నానో ఆఫీసులో వాళ్ళంతాచెయ్యెత్తి మొక్కుతారు. వీధిలోకి వచ్చి ఉద్యోగం చేస్తే ఇంక చెడి పోయినట్లే లెక్క? ఇళ్ళల్లో ఉండి ఊళ్ళు చక్కబెడుతున్న వాళ్ళులేరూ? అయినా నీకు ఏం చెవితే అర్ధం అవుతుందిలే. కూపస్త మండూకా నివి. ఇంట్లో వుండి కబుర్లు కాదు: వీధిలో పది మంది మొగాళ్ళ మధ్యనా మసులుతూకూడా 'ఓహో అనిపించుకోవాలి" అన్నారు కోపంగా మేనేజర్.
అప్పటకప్పుడే సునంద వీధిగేటుదాటి వెళ్ళిపోయింది.
'ఓహో ఏం ఖర్మం? భేష్ భేష్ అనికూడా అనిపించుకుంటుంది-సిగ్గులేకపోతేసరి ఇన్నేళ్ళు వచ్చాయి అయినా వన్నెల విసినికర్రల వల్లో పడడం. వాళ్ళని వెనకేసుకు రావడం పెళ్ళాం బిడ్డల ఎదురుగా.....' అంది రవణమ్మగారు.
"ఛీ.....ఛీ.... నీది నోరుకాదే.....అయినింటి బిడ్డ! ఆ అమ్మాయిని ఆడిపోసుకుంటున్నావు. మంచిదికాదు. తెలియక. నేనాపిల్లని ఇక్కడికి పంపించాను. నా కారణంగా పాపం ఆ పిల్ల ఏం కుమిలి కుమీ ఏడుస్తోందో -నీలాంటి మూర్ఖుల వాళ్ళే ఇవాళ దేశంలో స్వేచ్చగా జీవించడానికి లేకుండా ఆడవాళ్ళ పరిస్థితి ఇలావుంది" అంటూ ఏక బాధ పడసాగారు మేనేజరు.
ఆ రాత్రంతా తన దురదృష్టానికి ఎక్కెక్కి ఏడుస్తూనే ఉంది సునంద, కళ్ళు జ్యోతుల్లాగ వాచిపోయేలాగ-
9
రోజులూ, నెలలూ గతించిపోతున్నాయి. వందలూ వేలూ ఖర్చయిపోతున్నాయి. సునంద వంట్లో శక్తీ. ఓర్పు నశించిపోతున్నాయి.
శివరాం అనారోగ్యానికి మాత్రం ఓ ఒడ్డూ దరీ కనిపించడంలేదు మందుల దారి మందులది, జబ్బుదారి జబ్భుది. ఇలా ఉంది. కొన్నాళ్ళు గోల్డ్ ఇంజక్షనులు అయ్యాయి. కొన్నాళ్ళు ఎయిర్ ఇంజక్షనులు అయ్యాయి. వ్యాధి మాత్రం ఏం మళ్ళలేదు. నెలాఖరు వచ్చిమళ్ళీ ఎక్స్ రే తీస్తారన్నప్పుడల్లా, ఆసక్తితో ఎదురు చూడ్డానికి బదులు, భయతో వణికిపోవలసివస్తోంది. లంగ్ ఇంకా చెడిపోయిందని ఏం దుర్వార్త చెవిని పడుతుందో భగవంతుడా అనుకుంటూ, కష్టాలు పడిన వాళ్ళూ వున్నారు కాని ఇంత చేటా? ఇంకీ పరీక్షకి అంతులేదూ? సునంద మనస్సులో కృంగిపోయి వేదనతో కుమిలిపోసాగింది. ఆమెకేం దిక్కు తోచడం లేదు. ఆఫీసులో చాకిరీ, గోపాలం సంపాదన మీద ఆధారం, రత్నం ఉదాసన చూపులకి తల ఒగ్గడం, మంచానికి అల్లంటిపోయి రోజు రోజుకీ క్షీణిస్తూన్న శివరాం ని చూడలేక అల్లాడి పోవడం. హాస్పటల్ కీ, ఇంటికీ మద్యన ఈ తిరగడం. తీవ్రంగా తనలో లేచే కోరికల జ్వాల లకి నిద్దర పట్టక రాత్రిళ్ళు నరక యాతన అనుభవిస్తూ ఉండడం, ఇవన్నీ ఇనక ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళు? తనకీ యాతనల నుంచి విముక్తి లేదా? తన బతుక్కి ఇంక వెలుగు రాదా?

ఇలా తను మౌనంగా ఏడుస్తూ, కనిపించ కుండా మొహం చాటేసిన ఆ దేవుణ్ణి కాస్త కనికరించమని వేడుకుంటూ, దేవుడు మందిరం ఎదురుగుండా కూచుని పూజ చేసుకొంటూన్న సునందకి వీధి గదిలోంచి కేకలు వినిపించాయి. రత్నాన్ని కాబోలు గోపాలం కేకలేస్తున్నాడు.ఇవతల బాబిగాడు ఏడుస్తున్నాడా - అవతల నాకు ఆఫీసు టైము అవుతోందా - వంటింట్లో వదిన ఒక్క త్తే పనులన్నీ చేసుకుంటూ పొట్టు పొట్టు అవుతోందా? - నువ్విలా మంచం నడుం ఎక్కి ఏవిటిలా వార్తాపత్రిక చదువుతూ కూర్చోవడం? .... లే ఈ పాటికి ఆ మేగ్ జైన్ అవతల పెట్టి బాబిగాడిని తీసి వంటిల్లు తుడిచి కంచాలూ పీటలూ వేసి మంచినీళ్ళు పెట్టు నేను భోజనానికి వస్తున్నా....ఏం.....లేస్తావా. లేక ఆ మేగ్ జైన్ లాగి అవతల పారెయ్యమంటావా?"
"ఉండండి....బాబ్బాబు మీకు పుణ్యం ఉంటుంది. ఒక్క నిముషం ఇంకొక్క అరపేజీ ఉంది సీరియల్. కథ మంచి రసపట్టులో ఉంది. పాపం కథానాయిక చాలా కష్టంలో ఉంది."
"కథల్లో కష్టాలకేంలే.....ఆ రచయిత సృష్టించినవి. ఉండాలంటే ఉంటాయి పోవాలంటే పోతాయి. కాని బ్రతుకులో నిజంగా కష్టాలు అనుభవిస్తూ కథానాయికలు కాక పోవటం అటుంచి అథమం తోటివారి సానుభూతికైనా నోచుకోని సాధ్వీమ తల్లులు ఎంత మందో అజ్ఞాతంగా ఉన్నారు. ఇంకా కథ లోకం కట్టిపెట్టి యదార్ధ లోకంలోకి రా....లే"
"ప్లీజ్.....ఒక్క నిముషం"
"చెబుతూంటే బుద్దిలేదూ! పనులేం లేక పది దస్తాలు ముందేసుకొని వాళ్ళేదో నాలుగు అవకతవక రాతాహాలు రాస్తే. ఆ పత్రికలవాళ్ళు అచ్చువెయ్యడం. నీలాంటి వాళ్ళు ఇళ్ళల్లో పనులు మానేసి ఎంతో ఆసక్తితో కొంపలు మునిగిపోయినట్లు చదవడం. పెళ్ళి కానివాళ్ళూ, పెళ్ళయి భార్యతోగాని భర్తతోకాని ఆదర్శదాంపత్యం కుదరనివాళ్ళూ భర్తో భార్యో పొరుగూళ్ళో నో ఫారిన్ లోనో ఉంటే, ఏమీ తోచక ఇదయే వాళ్ళూ, జీవితంలో ఆదర్శాలు పట్టుకుని వేళ్ళాడి బతుకు పందెంలో ఓడిపోయేవాళ్ళూ, వాళ్ళేనో తోచక కాలక్షేపం కోసం నవల్లూ సీరియల్లూ రాస్తే రోజుకి ఇరవై నాలుగుగంటలూ కూడా సరిపోక ఛస్తూన్న మనలాంటి మధ్యతరగతివాళ్ళం అని పట్టుకుని వేళ్ళాడుతూ, అసలు పనులు మానుకోవడమా? .......ఊ....లే....లేస్తావా లేదా?"
