అప్పటికి పదకొండు గంటలు దాటుతోంది. ఆకలితో, నీరసంతో, కళ్ళు తిరుగుతున్నాయ్ వాళ్ళకు. అలాగే నిర్జీవంగా నిలబడ్డారు క్యూ వెనక. భక్తులందరి కీ 'క్యూ' శిక్ష చాలదా అన్నట్టు వానర మూక కూడా వాళ్ళను ఏడిపించసాగినాయ్. జనం నిలబడే చోట ఉన్న దేవాలయం కప్పు మీద నిల్చున్న కోతులు ఒక్కొక్కటే చటుక్కున క్రిందకు దూకి భక్తా గ్రేసర చక్రవర్తుల హస్తాలలో నుండి దేవునికి సమర్పించటం కోసం తీసుకుపోతున్న ఫల పుష్పాది ప్రసాదాలను అమాంతం లాగేసుకుని, సుష్టు గా తింటున్నాయ్. వో పక్క తాము అంత భక్తీ తో డబ్బు ఖర్చు పెట్టి కొన్న దైవ ప్రసాదాన్ని కోతులెత్తుకు పోయినాయని కడుపు మంటగా ఉన్నా వెంటనే అలా దైవ ప్రసాదాన్ని కొతులేత్తుకుపోవటం శుభ లక్షణ మని సరిపెట్టు కున్నారు. 'వెంకటేశ్వర స్వామి కి బదులు, ఆంజనేయ స్వామికి సమర్పించెం అనుకుందాం.' అంటూ సమాధానం చెప్పుకుని వట్టి చేతుల్తో నే ముందుకు నడచేరు. ఎందుకంటె మళ్ళీ ప్రసాదాన్ని కొనటానికి కనుక వాళ్ళు బయటకు వెళ్ళేరంటే తిరిగి దైవ దర్శనం చేసుకునేప్పటికి పునర్జన్మ ఎత్తవలసి వస్తుందని వాళ్ళకు తెలుసు.
క్యూ లో నిల్చుని వోసారి వెనక్కి తిరిగి చూసింది కళ్యాణి. ఆమె వెనక అంతకు ముందు ఆ మనుషులకు ముడుపులు చెల్లించి, క్యూ లో కాకుండా అడ్డ దారిన దైవ దర్శనం చేసుకోవటానికి తమతో పాటు అత్రపడిన కుటుంబాల వారు కూడా ఉన్నారు. అందులో ఒకామె కళ్యాణి ని చూస్తూనే నీరసంగా నవ్వింది. కళ్యాణి కి కూడా నవ్వు వచ్చింది.
ఆ నవ్వులో 'చూసేరా! ఆ వెధవలు ఎంత మోసం చేసేరో!' అన్న కసీ ఉంది. ఆ మోసానికి లొంగి పోయిన తమ తెలివి తక్కువతనానికి పొందే సిగ్గూ ఉంది. క్యూ కదులుతోంది మెల్లగా -- చాలా మెల్లగా భారతదేశపు పంచవర్ష ప్రణాళికల ఫలితాలలా సగటు మానవుడి జీవన ప్రమాణం లా, సగటు మానవుడి జీవన ప్రమాణం లా, నేటి యువతరం లోని అభ్యుదయ భావాల్లా, నవమాసాలు నిండిన గర్భిణి స్త్రీ లా, వర్షా కాలంలో మందంగా ప్రవహించే మూసీ నదిలా ..... ఏ ఉపమానమైనా చెప్పుకోవచ్చు దూరంగా నిలబడి ఆ క్యూని చూస్తున్నవారు. కాని నిజంగా ఆ క్యూలో నిలబడ్డ వారి ప్రాణాలు మాత్రం గాలిలో తెలిపోతున్నాయ్. కడుపులో కరకరమనే ఆకలి. దైవదర్శనం ఎప్పుడో అన్న ఆత్రం , పిల్లల ఏడ్పులు, పెడ బొబ్బలు , వీళ్ళందరినీ ఊరిస్తూ ఒకతను పెద్ద బుట్టలో ఎఱ్ఱగా కాలిన వడలను అమ్ముతున్నారు. పెద్ద వాళ్ళందరికీ వాటిని చూస్తుంటే నోరూరుతున్నా, దైవదర్శనం చేస్తే తప్ప యేమీ తినకూడదు. కనుక ఆ నీటిని మింగేసి , దాహం తీర్చుకుని పిల్లలకు మాత్రం కొనిచ్చేరు. కళ్యాణి కూడా పిల్లలిద్దరికీ చేరోకటి కొనిచ్చింది. దాంతో కొన్ని నిమిషాల పాటు పిల్లల ఏడుపు సర్దు మణిగింది.
కాంతారావు కీ, కళ్యాణి కి కాళ్ళు పీక్కుపోతున్నాయ్- మూడు గంటల నుండి నిల్చుని ఉండటం వల్ల కోతులేక్కడ ఎత్తుకు పోతాయోనని కల్యాణి కొబ్బరి కాయను అరటి పళ్ళను చీర చెంగు చాటున దాచేసుకోంది. నడుస్తోంది క్యూ, మెల్లగా అతి మెల్లగా...ఐతే ఎంత మెల్లగా నడచి నప్పటికీ మొత్తానికి దేవాలయం లోకి గంటలో గానే ప్రవేశించారు. ఆ విషయం కాంతారావు నీ కళ్యాణిని మాత్రమే కాక వారి లాగే మోసపోయిన మిగతా కుటుంబాల వాళ్ళని కూడా ఆశ్చర్య పరచింది. చూట్టానికి పెద్దగా కనబడుతున్నప్పటికి ఆ క్యూ ని క్రమ బద్దంగా టైము ప్రకారం నడిపించడం వల్ల ఒక గంట అటూ ఇటూ క్యూ వెనుక నున్న మనిషి దైవదర్శనం చేసుకో వచ్చు.
ఈ విషయం తెలియక అనవసరంగా ముక్కూ మొహం తెలియని వాళ్ళ మొహాన డబ్బు పారేసి పైగా రెండు గంటల పాటు ఎండలో నిల్చున్న తమ బుద్ది హీనతను తలుచుకుని 'ఈసారి తిరుపతి వచ్చినప్పుడు అంత బుద్ది తక్కువ పని చస్తే చెయ్యకూడదు.' అని అందరూ గట్టిగా లెంపలు వాయించుకున్నారు.
క్యూలో నిలబడటం ఒక తంతు దేవాలయం లోకి ప్రవేశించేక ఆ గర్భగుడి లోని గందరగోళం మరొక తంతు. కొబ్బరి కాయలను దేవుడి ముందు కొట్టటానికి వీల్లేదట. గర్బగుడి కి బయట నే కొట్టి లోపలికి ప్రవేశించాలి. ' ఆమాత్రానికి మన యింటి దగ్గరే కొట్టుకోవచ్చుగా!' అనుకుంది కళ్యాణి.
వెలుగులో నుండి ఒక్కసారిగా గర్బ గుడిలోకి ప్రవేశించే సరికి కళ్ళకు యేమీ కనపడలేదు. దాంతో పిల్లలిద్దరూ ఏడుపు లంకించుకున్నారు. వాళ్ళ నోళ్ళు మూసి తడుముకుంటూ ప్రదక్షిణ ప్రారంభించేరు. ఒకే ఒక ప్రదక్షిణం చేయాలి. కుడి వైపు నుండి మొదలు పెట్టి మధ్యలో మందస్మిత వదరనారవిందుడైన శ్రీనివాసుని సందర్శించి, ఆపైన ఎడమ వైపుగా తిరిగి బయటకు వచ్చేయాలి. దైవం వైపుగా ప్రయాణం చేస్తున్న వారిలో ఉత్సాహోద్రేకాలు మిన్నుముట్టుతున్నాయ్. 'గోవిందా! గోవిందా!' అని భక్తీ పారవశ్యంతో కేకలు పెడ్తూ దైవాన్ని సమీపించేరు. కాని అంత కష్టపడి వచ్చి దైవ సమక్షంలో నిలబడేసరికి పూజారి ఒక్క క్షణం కూడా వాళ్ళను నిలబదనీయ కుండా 'యింకా పదండి, పదండి' అని వాళ్ళను తోసేస్తున్నాడు. కొందరు మహా భక్తులు తాము తెలుగు సినిమా లలో చూసే వెంకటేశ్వర స్వామి యీయనా కాదా అని పరీక్షించదలచుకుని మరో రెండు నిమిషాల పాటు మొండి కెత్తి నిలబడి చూస్తుంటే పూజారి వాళ్ళను పశువులను అదలించి నట్టు అదిలించి ఒక్క తోపుతో ముందుకు పంపేడు. తమలోని నిరాశ ను కప్పి పుచ్చుకునేందుకు ఆ మూడవ తరగతి భక్తులు (మొదటి, రెండవ తరగతి భక్తులు 'డబ్బు' కట్టి దేవుడి ని ఎక్కువసేపు చూడవచ్చు) వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ 'గోవిందా , గోవిందా!' అనుకుంటూ బయటకు వచ్చేసేరు.
'దేవుడు వరమిచ్చినా పూజారి వర మీయడని అందుకే అంటారు కాబోలు' అనుకుంది కళ్యాణి.
కాంతారావు యేమీ అనుకోలేదు కాని, అతని మనసు మాత్రం ఏదో వెలితి గా ఉన్నట్లని పించింది.
అతను ఎంయే పరీక్ష బెనారస్ లో వ్రాసేడు. కాశీ విశ్వేశ్వరుని దేవాలయం లో కూడా యిదే తంతు. ఇంకా యిక్కడి పూజారులు నయం. కాశీలో అయితే అడుగడుక్కి 'వో నల్ల రాతినో, బొమ్మనో పెట్టుకుని పండాలు (పూజారులు) కూర్చుని వచ్చిన భక్తులన్దరినీ డబ్బు లేసె దాకా పీక్కు తింటారు. విశ్వనాధుని చూసి మళ్ళీ దేవాలయం లో నుండి బయటపడేసరికి కనీసం వో పాతిక మంది పండాలకయినా ముడుపు చెల్లించుకోక తప్పదు. ఆ తంతంతా చూస్తుంటే ఎంత భక్తుడి కైనా 'వీరు పండాలా, గూండాలా?" అన్న ప్రశ్న జనించక మానదు. ఆఖరికి దైవ కార్యాలు కూడా యింత అల్పంగా తయారయినా యంటే యేమనుకోవాలి? ఈ కాలంలో పుణ్య క్షేతాలన్నీ వ్యాపార స్థలాలా ఉంటున్నాయేతప్ప మనశ్శాంతి ని , ఆత్మ వికాసాన్ని కలిగించే వాతావరణమే ఉండటం లేదు అక్కడ.
దీనికి కారణం మరేం లేదు. ఇలాటి పుణ్య క్షేత్రాలకు వచ్చే వాళ్ళలో నూటికి తొంబై మంది మనశ్శాంతి కోసం కాక పాప పరిష్కారం కోసం వస్తున్నారు. అందుకే దేవాలయల్లోని దైవం వట్టి రాతి విగ్రహం గానే మిగిలి పోతున్నారు. మానవుల హృదయాల్లోని దైవత్వం ఎప్పుడు సమసి పోతుందో అప్పుడు దేవాలయాలకు విలువే ఉండదు.
గర్భగుడి లో నుండి బయటకు వచ్చేసరికి అందరి శరీరాలు చెమట తో తడిసి ముద్దయిపోయినాయ్. గర్బగుడి లో వారు పొందలేని ఆత్మశాంతి కి ప్రతిగా కడుపు శాంతి కోసం ప్రతి భక్తుడికి ఆకుల నిండా పులిహోరా, దద్దోజనం పంచి పెడుతున్నారు ఉచితంగా దేవాలయం ఎదురుగా. వాటిని తీసుకుని బయటకు వెళ్ళి, తిని కడుపు నింపుకున్నారు. అప్పటికి ఒంటి గంట కావస్తోంది. అప్పుడు హోటలు కి వెళ్ళి భోజనం చేసి పిల్లలకు పాలు ఫ్లాస్కు లో పోయించుకుని తమ కాటేజీ కి తిరిగి వెళ్ళేరు. వో గంట పిల్లలను నిద్రపుచ్చి తాము కూడా విశ్రాంతి తీసుకున్నారు కళ్యాణి, కాంతారావు లు.
