Previous Page Next Page 
ముద్ద మందార పేజి 11

 

    "కోర్కె అసంబద్ధమైనదయితే తీర్చాల్సిన బాధ్యత మనకి లేదు. కానీ సమంజసమైన కోర్కె తీర్చకపోతే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా-- ఎన్ని సంబంధాలు చూసినా, నువ్వు వద్దంటూన్నావట-- నీ మనస్సులో ఏదైనా వుంటే చెప్పాలీ అంతే గాని పెళ్ళోద్దు పెళ్ళోద్దని అంటే ఎలా -- పెళ్ళనేది అపకూడని, జరిగి తీరవలసిన ఒక కార్యం. మనిషికి అత్యంత ఆవశ్యకమైనది. పెళ్ళోద్దు అని సవాలక్ష సార్లు గోల పెట్టిన వాళ్ళు కావాలోయ్ బాబూ అన్న వాళ్ళ కన్నా ముందు చేసుకున్నారు. అసలింతకీ నీ మనస్సులో ఏదైనా వుంటే నాతొ చెప్పు" అని అతని భుజం తట్టాను. సూర్యం కదలబారాడు. విజయం నాదే.
    "పిచ్చివాడా! ఎవరినైనా ప్రేమించావా నాతొ చెప్పు. నేను మీ వాళ్ళకి నచ్చ చెప్తాను. ప్రయత్నిస్తాను" అన్నాను. సూర్యం కళ్ళు మెరిశాయి. "కూర్చో కూర్చుని చెప్పు" అంటూ కుర్చీలో కూర్చున్నాను.
    వో నిముషం ముప్పావు నిశ్శబ్దంగా గడిచాక, తను శారదని వో అమ్మాయిని ప్రేమించినట్టూ, ఆమె 'లా' కాలేజీ లో బి.యల్. చదువుతున్నట్టు చెప్పాడు. ఎకనామిక్స్ ఎమ్మే చదివి ఉద్యోగం చేసుకుంటున్న సూర్యం లా చదువుతున్నమ్మాయిని ఎలా ప్రేమించాడో ....అయినా అది నిర్వివాదాంశం. నేను అతని ప్రేమను సమర్ధించి వాళ్ళ వాళ్ళకి చెప్తాననీ , నచ్చ చెప్తానని మాటిచ్చాను. సూర్యం నాకేసి చూశాడు.
    "వెరీ గుడ్. మంచి పని చేశావు. నీకు తగిన అమ్మాయిని నువ్వే వెతికి చూసుకోవడం వల్ల ఆ కష్టం మీ వాళ్ళకు లేకుండా చేసినవాడివయ్యావు. అయితే ఆమె ఫోటో ఏదైనా నీ దగ్గరుంటే చూపించు నా కివ్వు. వాళ్ళని గురించిన విషయాలు కొన్ని చెప్పు" అన్నాను. సూర్యం దిగ్గున లేచి , వెళ్ళి ఫోటో పట్టుకు వచ్చాడు. అమ్మాయి బాగానే వుంది. సూర్యం నా ముఖం కేసి ఆత్రంగా చూస్తున్నాడు.
    నేను గొంతు సవరించుకున్నాను.
    "అయితే నీ ప్రేమ సంగతి ఆ పిల్లకు తెలుసా! ఆమె కూడా నిన్ను ప్రేమించిందా! వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళకి.... అంటే ఆ పిల్లకి నిన్ను వివాహం చేసుకోవాలని ఉన్నట్టు తెలుసా' అన్నాను.
    "తెలుసండి . చాలాసార్లు వాళ్ళ యింటికి వెళ్ళాను. వాళ్ళ నాన్నగారూ, అమ్మగారూ చాలా మంచి వాళ్ళు." అన్నాడు సూర్యం సిగ్గుపడుతూ.
    నేను లేచి సూర్యం భుజం తట్టి, "సరేలే! నువ్వెళ్ళు. రేపు ఉదయం మనిద్దరం వాళ్ళింటికి కెళ్దాం. నువ్వు నిశ్చింతగా ఉండు. అన్నీ నే చూస్తాను . ఏం" అన్నాను. సూర్యం కృతజ్ఞతపూర్వకంగా నాకేసి చూసి, "థాంక్యూ సర్" అని నెమ్మదిగా క్రిందికి వెళ్ళిపోయాడు. నేను కుర్చీలో కూలబడ్డాను. జీవితంలో ఒక మంచి పనయినా చేసినందుకు ప్రాణం హాయి నిచ్చింది.
    సూర్యం క్రిందకు వెళ్ళిన పావుగంటకు భాస్కరం, సుమతి మేడమీదికి వచ్చారు. విషయమంతా వాళ్లతో చెప్పి, అమ్మాయి ఫోటో చూపించాను. అమ్మాయి వాళ్ళిద్దరికీ నచ్చింది. "మిగతా విషయాలు రేపు వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడుతాను. తరువాత పెళ్ళి చూపులకు మీరు రావచ్చు.  ఏమంటారు' అన్నాను. ఇద్దరూ సరేనన్నారు. భార్యా భర్త లిద్దరూ నన్ను తెగ మెచ్చుకున్నారు.
    రాత్రి పన్నెండింటికి పక్క మీదకు చేరాను. నిద్ర పట్టలేదు. మనస్సులో రాధ మెదిలింది. ఆనాడు నేనూ, రాధ , భాస్కరం సుమతి కలిసి వుండే ఇల్లు భాస్కరం కొనేశాడు. ఈనాడు ఆ యింట్లో నేను పడుకుంటే ఆనాటి జీవితం గుర్తు రాసాగింది.
    మా సంసార జీవితం హాయిగా వో సంవత్సరం గడిచింది. నాన్నగారు వ్యాపారంలో కూడా బాగా డబ్బు గణించడం వల్ల,  వస్తూండడం వల్ల, అప్పుడప్పుడు పెద్ద మొత్తాలు ఖర్చుల కుంచుకో అంటూ పంపేవారు. మాకన్నా రాధా వాళ్ళు ధనికులవడం వల్ల ఆమెకు అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారు పంపివేశారు.
    కాల గమనంలో దాని యాంత్రిక చక్రాల క్రింద పడి నేను సింహాచలం సంగతి మరచిపోయాను. ఆరోజు శుక్రవారం. రాధ దేవునికి పూజ చేసింది. నేను బజారు నుంచి అప్పుడే లోపలకు వస్తున్నాను. గుమ్మం ముందో మందార పువ్వు పడి వుంది. నా కాలి క్రింద పడి, నలగబోయింది. గమ్మున కాలిని వెనక్కు లాక్కుని పువ్వు తీసి, చేత్తో పట్టుకున్నాను.
    ముద్ద మందార!
    నా మనస్సులోకి సింహాచలం వచ్చింది. నాకోసం, నా భవిష్యత్తు కోసం సర్వం త్యాగం చేసిన ఒక జీవిని మోసం చేసి, నేను సుఖాలనుభావిస్తూ, ఆమెను మరచిపోయాను. నేను మహా పాపిని. భగవంతుడు యింతవరకూ నా పాపాలకు ఏ విధమైన శిక్షా వేయలేదు. ఇక ముందేలాటి శిక్ష వేస్తాడో.
    "ఏవిటా మందార పువ్వును పట్టుకుని అలాగే నిలబడి పోయారు' అంది రాధ.
    నేను ఉలిక్కిపడి ఆమె కేసి చూశాను.
    "ఏయ్ మిమ్మల్నే-- ఏమిటా పరధ్యానం" అంటూ రాధ నా చేతిలో మందార పువ్వును లాక్కుని నేల మీద పడేసి ఫక్కున నవ్వింది.నా శరీరం కోపంతో వేడెక్కింది . "ఏయ్" అని మిన్ను విరిగేలా అరిచాను. రాధ హడలిపోయింది. గడచిన రోజుల్లో ఆమెను ఒక్క సారయినా కోప్పడలేదు. నా నోట్లోంచి ఉదృతమైన ముక్క రాలేదు. ఆమె భయ పడింది.
    నాకు కోపం చల్లారలేదు. నేలమీద పడిన మందార పువ్వు తీసుకుని నా గదిలోకి వెళ్ళి లోపల గడియ వేసుకుని , మంచం మీదకు చేరాను. నా హృదయం ఎండిపోయింది. మందార రేకుల మధ్య సింహాచలం కనుపించింది.
    గోపాల్ పూర్ వదిలి ఏడాది దాటింది. సింహాచలానికి పాటికీ మగపిల్లాడు పుట్టి ఉంటాడు. అంటే నాకు.....
    ముచ్చెమటలూ పోశాయి.
    రాధ కాస్సేపటికి నెమ్మదిగా తలుపు తట్టింది. లేచి వెళ్ళి తలుపు తీశాను. "వంటయ్యింది" అంది. .... నా మనస్సు యీ లోకంలో లేదు. "నా కాకలిగా లేదు" అన్నాను. రాధ కళ్ళ వెంట నీరు తిరిగింది. బ్రతిమాలబోయింది గానీ నేను అవకాశం ఇవ్వక, వెళ్ళి మంచం మీద పడుకున్నాను. ఇంతలో భాస్కరం, సుమతి వచ్చారు. "ఏమిటోయ్ ఎన్నడూ లేనిది, మా దిష్టి ఏమైనా తగిలిందేమిటి? లేలే పన్నెండయ్యింది . అవతల రాధమ్మ కూడా భోజనం చైలేదు" అన్నాడు భాస్కరం.
    నాకు బహుశా అందరూ బ్రతి మాలడం వల్లనుకుంటాను. పంతం ఎక్కువయ్యింది. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పలేదు. సుమతి కూడా నచ్చ చెప్పింది. రాధ వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ ఆమె వెనకాల వెళ్ళారు. నేను తల మంచం కోడు కేసి బాడుకున్నాను. ఎడుద్డామనుకున్నా ఏడుపు రాలేదు. గుండెలో ఏదో మంట పెట్టినట్టయ్యింది.
    నేనెలా ఎంత సేపుండి నిద్రలోకి జారిపోయానో తెలీదు కానీ, లేచేసరికి నాలుగయ్యింది. కళ్ళు పీకడం ప్రారంభించాయి. బయటకు వచ్చాను. రాధ కుర్చీలో కూర్చుని వుంది. రాధ ముఖం పీక్కుపోయి వుంది. ఈ విషయాన్ని ఇంకా పెంచడం మంచిది కాదని, "రాదా, ఆకలేస్తోంది. తినడానికేమైనా వుంటే పెట్టు" అంటూ ఆమె పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. రాధ ముఖంలో వేయి దీపాలు వెలిగాయి. గమ్మున లేచి, కన్నీరు పైట చెంగుతో తుడుచుకుంటూ వంటింట్లోకి పరిగెత్తింది. ఇంతలో మళ్ళీ సుమతీ, భాస్కరం వచ్చ్జారు. ఆలస్యం చేస్తే వాళ్ళు మళ్ళీ విషయమంతా తవ్వి బయటకు తీస్తారని, " మాంచి సినిమా ఏదైనా వుంటే చెప్పవోయ్. వెళ్దాం. భోజనాలు కావలిసోస్తే హోటల్లో చేద్దాం . ఏం?" అన్నాను. ఈలోగా టిఫిను పట్టుకుని రాధ వచ్చింది. రాధను కూడా అడిగాను. రాధ తల ఊపింది. "అయితే గబగబ తెమలండి" అన్నాను.

                              *    *    *    *
    రాత్రి పడుకోబోయే ముందు రాధ నా దగ్గరకు వచ్చి , "నాకో వరం యివ్వాలి" అంది. "వరమా! వరం ఏమిటి" అన్నాను. నేను రాధ గాజులు సవరిస్తూ "వరాలు యివ్వడాలూ, కోరుకోడాలూ యీ కాలంలో ఎక్కడున్నాయి?" అన్నాను. రాధ నెమ్మదిగా నా పక్కన కూర్చుని, "మన జీవితంలో యిలాటి రోజు రాకూడదని నాకు మీరు వరం యివ్వాలి. మీ మనస్సులో ఉన్న విషయం దాచి, నన్ను బాధ పెట్టి, మీరు బాధపడేకన్నా నా వల్ల ఏదైనా జరగకూడనిది జరిగితే శిక్షించండి. మీ అండన బ్రతకాల్సిన దాన్ని. నన్ను నిర్లక్ష్యం చేస్తే బ్రతకలేను" అంటూ వెక్కివెక్కి ఏడుస్తూ నా గుండె మీద వాలిపోయింది.
    నా గుండె వేయి ముక్కలయింది.
    రాధని నా గుండెకు హత్తుకుని, కన్నీరు తుడుస్తూ, "ఛ . ఏమిటది? నీవల్లే మీ జరగలేదు. ఏమిటో నాకు మనస్సు బాగులేదంతే. ఇంకెప్పుడూ అలాగ చేయనులే. నా మాట విను. నీ కంటినీరు నేను చూడలేను" అన్నాను. రాధ కన్నీరు తుడుచుకుంటూ సరిగ్గా కూర్చుంది. రాధ మనస్సుని మళ్ళించాలని , పక్కనున్న పుస్తకం తీసి రాధ చేతికిస్తూ, "ఈ కధ నువ్వు చదువుతుంటే నేను వింటాను. ఇలా నీతల నా ఒళ్లోపెట్టుకుని , అలా పడుకుని చదువు" అన్నాను. రాధ పుస్తకం అంది పుచ్చుకుని, నే చెప్పినట్టు పడుకుని, కధ చదవ నారంభించింది. పారిపోతున్న మనస్సును అదుపులోకి తెచ్చుకుంటూ కధకి వూకొట్ట నారంభించాను. కాస్సేపటికి రాధ నిద్రాదేవత ఒళ్ళో వాలిపోయింది. ఆమెకు నిద్రాభంగం కలుగకుండా చేతిలో పుస్తకం తీశాను. ముక్కు మీద పట్టిన చమట తుడిచాను. కనుబొమ్మలు సరిచేసి, నుదుట పడ్డ ముంగుర్లు వెనక్కు తీశాను.
    తన జీవితాన్ని నా జీవితానికి ముడివేసి , నిశ్చింతగా కాలం గడుపుతున్న రాధ.... వంచకుడ్నాయిన నేను-- నామీద నాకే జుగుప్స కలిగింది. అలాగే కూర్చుని రాత్రంతా గడిపాను. తెల్లవారుజామున అయిదింటికి  రాధకి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి నాకేసి చూసి, తిరిగి మూసుకో బోయి , మళ్ళీ తిరిగి, గమ్మున లేచింది. "రాత్రంతా యిలా కూర్చునే ఉన్నారా" అంది.
    "ఏం చైను. వో సుకుమారి నా ఒళ్ళో తలపెట్టి పడుకుంటే ఆమెకి నిద్ర భంగం చేసే సాహసం వుందానాకు?" అన్నాను. ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి.
    రాధ అమాయకత్వం చూసిన కొద్దీ నాకు మానసిక బాధ అధికంగా ఉండేది. రాధ ముఖంలోకి కొన్నిసార్లు సూటిగా చూడలేక పోయేవాణ్ణి.
    కొన్నాళ్ళు జరిగాయి. ఎన్నాళ్ళు జరిగాయో?"

                                 *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS