తనతో చిన్నవాడు, ఆడి, పాడిన సావిత్రి ఈ నాడు తన స్వంత కొడుకు తల్లి. శ్రీనివాస్ .... తన కొడుకు....స్వంత కొడకు. నిజమా? నమ్మగలనా? శ్రీనివాస్ కేవలం నా రక్త మాంసాలే!
అనేకమయిన ఆలోచనామార్గాలలో విహరిస్తున్న ఆ హృదయంలో అవ్యాజమైన ప్రేమ జనించింది. ఇన్నాళ్ళుగా శ్రీనివాస్ ను ఒక వ్యక్తిగా, స్నేహితుడుగా అభిమానిస్తున్న ఆయన హృదయం మిక్కిలి విలువిన పుత్రుడన్న స్థానం ఇచ్చి, అంతులేని అనురాగాన్ని వర్షించింది. ఇన్నేళ్ళు తండ్రిగా ఆ స్థానాన్ని స్వీకరించే భాగ్యం కలగని తను ఈనాడు ఒకరికి కన్నతండ్రి! ఏనాడో తన కొక కొడుకు కావాలని కలలు కన్న తనకు, కలలు గాకాక నిజరూపంలో సజీవంగా ప్రత్యక్షమై కళ్ళ ఎదుట సాక్షాత్కరిస్తూంటే ఎలాగ నమ్మకపోవడం?
టక్కున చాలారోజులక్రితం అనూరాధ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. 'మిమ్మల్ని, శ్రీనివాస్ ను పక్కగా ఉంచి బంధువులంటే ఇట్టే నమ్ముతారు!'
దగ్గిర బంధువులు ... రక్త సంబంధీకులు. తన పోలికలతో, తన విద్యతో మెడిసిన్ పాసై మొదట్లో ఎదురయిన చిన్న చిన్న అనుభవాలతో నిరుత్సాహపడి దానికి స్వస్తి చెప్పిన తన కొడుకుకు ఎలాగైనా ధైర్యం చెప్పాలి. తన శక్తికి వీలయినంతలో అతనిని నిపుణుడుగా తీర్చిదిద్దాలి. ఆనందాతిశయంలో తేలిపోతున్న కృష్ణమూర్తి గారి హృదయంలో తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి. శ్రీనివాస్ కు ఎదురయినవి ఎలాంటివో, అతని ఉద్దేశాలేమిటో అన్న ఆలోచన కూడా ఆయనకు ఆ క్షణంలో తట్టలేదు.
వంటవాడు వచ్చి, భోజనానికి పిలిచేసరికి వాస్తవంలోకి ఊడిపడ్డాడు. చదువుకుందామని తెచ్చుకున్న న్యూస్ పేపరు ఒడిలోంచి జారిపడ్డది. ఆయన చెంపలు ఆర్ద్రతతో తడిసిఉన్నాయి. పైన ఉన్న పున్నమి చంద్రుడు పువ్వులా పయనిస్తున్నాడు.
16
దేశమంతా నమోత్సాహంతో జరుపుకునే దీపావళి. ఆనాడు అసుర సంహారంతో ఆనందోత్సవాలతో మిన్నంటేటట్లు వెలువడిన శబ్ద తరంగాలు ఈనాడు ఇంటింటా వెలిగే దీపాలుగా, ధనధనా మోగే టపాసులుగా మారిపోయాయి.
రంగురంగుల విద్యుద్దీపాల తోరణాలతో, రకరకాల దివ్యాలంకరణలతో రోడ్లు కలకలలాడుతున్నాయి, కొత్త పెళ్ళిపందిరిలా. చిన్న పిల్లలు ఆనందం పట్టలేక సీమ టపాకాయల్లా గంతులు వేస్తున్నారు. అత్తవారింటికి వచ్చిన అల్లుళ్ళతో, వేళాకోళంచేసే బావమరుదులతో ఇంటింటా ఆనందం! ప్రతి ఇంటా పరమానందం! దీపాల వెలుగులో దేవతలు దిగుతున్నారు. దీపావళి ... ఇంటింటా తిమిరావళిని పోగొట్టి దివ్వెల వెలుగులో దివ్యానుభూతిని కొనితెచ్చే దీపావళి.
శ్రీనివాస్ రాజశేఖరం గారి ఇంటికి విందుకు వచ్చాడు. లలిత చెప్పే మాట లైనా వినిపించుకోకుండా లాక్కువచ్చింది అనూరాధ. ఇద్దరూ కలిసి ఇంటినిండా పిట్టగోడలనిండా దీపాలు వెలిగించారు. శ్రీలక్ష్మి పెరట్లో తులసిచెట్టు దగ్గిర దీపారాధన చేసి వాకిట్లోకి వచ్చి నుంచుంది. అనూరాధ కాసిని టపాకాయలు కాలుస్తూ ఉంటే జేబులో చేతులు పెట్టుకుని చిరునవ్వుతో తిలకిస్తూ నుంచున్నారు శ్రీనివాస్ కృష్ణమోహన్ లు.
"మీ రిద్దరూ కూడా కాల్చండి కాసిని" అంది శ్రీలక్ష్మి. ఇద్దరూ చిరునవ్వులతో ఒకరి ముఖం ఒకరు చూచుకుని 'ఆఁ, ఏమిటీ?' అని ఊరుకున్నారు.
"ఆఁ! ఏమిటీ....ఏమిటీ? ఏదో మానుకోలేక పండుగలు జరుపుకోవడం గాని, పసిపిల్లలుంటే గాని పండక్కి అందంరాదు" అంది నిట్టూరుస్తూ.
తల్లి మాటలకు నవ్వుతూ "కమాన్, శ్రీనివాస్, కాసిని టపాకాయలు కాల్చి గంతులు వేస్తేగాని మా అమ్మకు తృప్తికలిగేలా లేదు" అన్నాడు.
"మీరు గంతులు వేస్తే వస్తుందేమిటి ఆ అందం! వేసే రోజుల్లో మీరు వేశారుగా! ఇక ఇప్పుడు మీ పిల్లలు వెయ్యాలి" అంది నవ్వుతూ.
"ఈ కాలం కుర్రాళ్ళకు ఎంతైనా సరదాలు తక్కువ" అంటూ తామే పెద్ద తోటా వెలిగించే ప్రయత్నంలో పడ్డారు రాజశేఖరంగారు.
సీమ టపాకాయలు వెలిగించబోతున్న కృష్ణమోహన్ ని చూచి చెవులు మూసుకుంటూ, "అవి వద్దు లెండి, బాబూ! గుండెల్లో దడ వస్తుంది" అంది లలిత.
"దీపావళి నాడు గుండెల్లో దడేమిటి? భయంలేదు లెండి. ఇద్దరు డాక్టర్లం ఇక్కడ ఉండి, మీకు దడ రానీయం" అంటూ అది వెలిగించి ప్రత్యేకంగా ఆమె పక్కకు వచ్చి నుంచున్నాడు కృష్ణమోహన్. శ్రీనివాస్ వినీ విన్నట్లు తన దృష్టి మరో పక్కకు మరల్చుకున్నాడు.
లలిత వెనకగా వచ్చి ధన్ మని ఉల్లిపాయ పేల్చింది అనూరాధ. చప్పుడుకు ఉలిక్కిపడి ముందుకు తూలేఅంత పనయి ముందు పేలుతున్న సీమ టపాకాయను చూచి తిరిగి వెనక్కి తగ్గి అనూరాధవంక చురచురా చూస్తూ ఆగిపోయింది. పక్కపక్కనే నుంచున్న అనూరాధా లలితలను పోల్చకుండా ఉండలేకపోయాడు కృష్ణమోహన్. గలగలా పారే సెలయేరు ఒకరు. నిండుగా ప్రవహించే నది మరొకరు. పౌర్ణమినాటి సుధాకరుని సౌందర్యం లలితది. అర్ధభాగం మరుగునపడినా చంద్రవంక లోని చక్కదనం అనూరాధది.
తుళ్ళుతూ, నవ్వుతూ టపాకాయల తతంగం పూర్తిచేసి ఊరు చూడటానికి బయలుదేరారు అందరూ. అప్పుడే జ్యోతులు మిణుకుమిణుకు మంటున్నాయి. 'ఏం రోజులో, ఏం వస్తువులో! కల్తీ సరుకులు, ఒకటే ఖరీదులు! వట్టి పాడునూనె అప్పుడే ఎలా కడకట్టిపోతున్నాయో దీపాలు!' అనుకుంది శ్రీలక్ష్మి.
దీపావళిలాంటి మరో పండుగ ఉండదేమో. ఇంటికి అందం, ఇంట్లో ఆనందం కలిగించే పండుగ కనులకు పండుగ, జేబులకు దండగ కలిగించే పండుగ.
భోజనాల అనంతరం లలితను దింపడానికి కారులో బయలుదేరాడు కృష్ణమోహన్. ఇంకా కొన్ని రోడ్లమీద అక్కడక్కడ కొంచెం ఓపిక, స్తోమతు రెండు ఉన్నవాళ్ళు టపాకాయలు కాలుస్తూనే ఉన్నరు. ఒక సందు మలుపు దగ్గిరికి వచ్చేసరికి అప్పుడే అంటించినట్లున్నారు చిచ్చుబుడ్డి. సన్నసన్నగా రవ్వలు పైకి వస్తున్నాయి రోడ్డు మధ్యగా. వెంటనే బ్రేక్ వేసి కొంచెం వెనక్కి తిప్పాడు.
చిచ్చుబుడ్డిలోంచి మిణుగురులు సన్నసన్నగా బయలుదేరి జోరుగా ఆకాశం ఎత్తున ఎగరసాగాయి మిరుమిట్లు గొలుపుతూ.
సీటుమీదికి జారగిలపడి చిచ్చుబుడ్డి అందాన్ని తిలకిస్తూ "కటిక చీకట్లోను, కనులు మిరుమిట్లు గొలిపే కాంతిలోను ఎన్ని రూపాలయినా చూడవచ్చు. ఏమంటారు?" అంది.
"ఆ రూపాలనే భ్రమ అంటారు. ఇంతకీ మీకేం కనిపిస్తూంది?"
"మూడు అక్షరాలతో ఒక రూపం కనిపిస్తూంది."
"ఎవరిదో?"
"మీదే."
"బావుంది. ఎదురుగుండా ఉంటే, వెలుగులో ఊహించుకుని చూడవలిసిన అవసరం ఏముంది?"
"మీరు ఎదురుగుండా ఉన్నది నాకుకాదు. వెలుగుకు. అందుకనే అద్దంలోనించి ప్రతిబింబించి వెలుగులో కనబడుతూంది."
దూరంగా పోబోతున్న సంభాషణ ఆపటానికి మౌనమే మార్గం అన్నట్లు మాట్లాడకుండా కూర్చుంది.
"మీరు, మీ అమ్మగారు మా నాన్నకు చాలా పని కలిపిస్తున్నారే!" అన్నాడు ఆమె ధోరణి గమనించాలని.
ప్రశ్నార్ధకంగా కళ్ళెత్తి చూచింది.
"మీ బావగారి విషయం తెలిసింది అనూరాధ మూలంగా."
ఆ మాటతో ముఖం కొంచెం ఎర్రబడ్డది. కళ్ళల్లో ఏవో ఛాయలు అలుముకున్నాయి. కొంచం బాధగా "ఎదుటివారి వ్యక్తిగత విషయాలు ఎత్తి బాధపెట్టాలనుకునే వారు ఉండకుండా ఉండరు కాబోలు" అంది.
విస్తుపోయాడు. ఆమెనుండి ఆ విధమయిన విమర్శన వస్తుందని ఎదురు చూడలేదు. కొంచెం తీవ్రంగా నొచ్చుకుంటున్నట్లు "అయామ్ సారీ. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కేవలం మీ స్వంత విషయాలలో కుతూహలమే తప్ప..."
"ఫరవాలేదు. చిచ్చుబుడ్డి ఆరిపోయింది" అంది ముభావంగా.
ఆమెవంక నిశితంగా చూచి మౌనంగా కారు ముందుకు పోనిచ్చాడు.
* * *
17

రాత్రి ఎనిమిది గంటలయినా శ్రీనివాస్ జాడ కనిపించకపోవడంతో కారు పంపించారు కృష్ణమూర్తిగారు. అప్పుడే స్నానంచేసి బట్టలు వేసుకుని సిద్ధం అవుతున్న శ్రీనివాస్ కు వాకిట్లో కారు చూడగానే గౌరవంతోపాటు అభిమానం కూడా ఎక్కువయింది. "ఏమిటీయన, ఇంత పెద్ద మనిషి, ఇలాటి విషయాలలో ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తారు!' అనుకున్నాడు.
ఆ రోజు పొద్దున్నే శ్రీనివాస్ కు కృష్ణమూర్తిగారి దగ్గిరనుండి కబురు వచ్చింది, ఆ రాత్రి వాళ్ళింటికి ఆహ్వానంతో శ్రీనివాస్ కు స్వతహాగా ఇలాటివి ఇష్టం ఉండవు. కొందరి వ్యక్తులలో ఉండే విశేషగుణమేమోగాని, వాళ్ళు అందరిచేత ఆకర్షించబడతారు. దాదాపు అదే కోవలో చెందినవారేమో కృష్ణమూర్తిగారు, శ్రీనివాస్ కూడా. మామూలుగా నిర్మొహమాటంగా ప్రవర్తించగలిగేవాడే అయినా కృష్ణమూర్తి గారికి మాత్రం ఎక్కువగా ఎదురు చెప్పలేదు.
