Previous Page Next Page 
తామరకొలను పేజి 11


    "మాట...." అంది.
    చకచకా మెట్లు దిగుతున్న రమేశ్ వెనుదిరిగి ఏమిటన్నట్టు చూశాడు.
    "మీకు ఈ ఊరి ట్రాఫిక్ తో పరిచయం లేదు. ఒక్కోమారు మేమే తికమకపడిపోతాం. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త సుమండీ."
    రమేశ్ మాట్లాడకుండా దిగి వెళ్ళిపోయాడు.
    రత్న యోచనా క్రాంతురాలై ఇంట్లోకి వచ్చింది.
    రమేశుడి పరధ్యానాన్ని రత్న సూక్ష్మమైన కళ్ళు గమనించాయి. కనుకనే అతను వెళ్ళే టప్పుడు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించటం మరిచిపోలేదు.
    అనవసరంగా అతడి మనసు నొప్పించానేమోనని బాధపడుతోంది రత్న మనసు. అలాగే కూర్చుండి పోయింది.
    ఆశా ఇంటికి వచ్చి పలకరించినపుడే ఆమె ఈ ప్రపంచంలో పడింది. లేచి, ఆశకు అన్నంపెట్టి పడుకోబెట్టింది. తను పుస్తకం చేతికి తీసుకుని కూర్చుంది.
    రాత్రి తొమ్మిదిన్నర దాటినా, రమేశ్ రాక పోయేసరికి రత్న కంగారుపడింది.
    తన మాటలతో అతడి మనస్సు అల్లకల్లోల మయి ఉంటుంది.  ఇహ- ట్రాములు, బస్సులు తిరిగే ఆ మెయిన్ రోడ్డు గుర్తుకొచ్చేసరికి భయంతో ఆమె హృదయం కంపించింది.
    రమేశ్ ఇంకా ఇంటికి రాకపోవటానికి కారణమేమిటి?
    రత్న బాల్కనీలో నిల్చుని బయటకు చూసింది. రాత్రి తొమ్మిదిన్నర దాటినా సందడి ఏమాత్రం తగ్గ్లలేదు.
    ట్రాములూ, బస్సులు నిలకడ లేకుండా తిరుగుతున్నాయనిపించింది. రత్నకు ఎదురుగా ఉన్న మద్రాసీ హోటలులోని మేనేజర్ "పాన్" వేసుకుంటూ, కూర్చున్నాడు.
    రత్న లోపలికి వచ్చింది. తను వచ్చిన అయిదు నిముషాల్లోనే రమేశ్ కూడా వచ్చాడు.
    "అబ్బ, వచ్చారా! మీరు ఎంతకీ రాకపోయే సరికి ఎంత కంగారుపడ్డావని....."
    "కంగారెందుకు?"
    "ఈ ట్రాఫిక్ సందడీ అదీ మీకంతగా అలవాటులేదు."
    "అంత సుళువుగా నేను చావనులెండి."
    మళ్ళీ మాటలు ఆ విషయం వైపుకే వెడుతున్నట్టు కనిపించింది రత్నకు. మాట మారుస్తూ:
    "ఎందాకా వెళ్లారు?" అంది.
    "మాతుంగా మార్కెట్ కు వెళ్ళి వచ్చాను" అంటూ, జేబులోంచి బిస్కట్-ప్యాకెట్ తీసి:
    "ఆశా ఏదీ?" అన్నాడు.
    "పడుకుంది."
    "తరువాత ఇదివ్వండి."
    రత్న ప్యాకెట్టు విప్పి రెండు బిస్కట్లు రమేశుడి కిచ్చింది:
    "ఆశకు బదులు ఇప్పుడు మీరు తినండి."    
    వద్దనలేకపోయాడు రమేశ్.
    "భోంచేస్తారా?"
    "డాక్టర్ గారిని కూడా రానివ్వండి" అన్నాడు రమేశ్.
    శేషగిరి రాగానే అందరి భోజనాలూ అయ్యాయి. శేషగిరి రమేశుడితో కబుర్లకు దిగాడు.
    "ఏం చేస్తావయ్యా ఇకముందు? వచ్చే సంవత్సరం పరీక్షకు కడతావా?"
    రమేశుడికి ఏ విషయమైతే అక్కర్లేదో, అదే విషయం మాటల్లోకి వచ్చింది.
    "చూడాలి; నేనింకా ఏదీ నిశ్చయించుకోలేదు."
    "ఒద్దులే. అదేం బెంగపెట్టుకోకు. కొన్ని రోజులు క్కడ హాయిగా ఉండు. నేనూ మీ అన్నయ్యే అనుకో. నా పనుల ఒత్తిడివల్ల నేను నీతో ఎక్కువసేపు గడపలేకపోవచ్చు. కాని, రత్న ఉంటుంది. ఏం సంకోచమూ పెట్టుకోకు."
    రమేశ్ ఏం చెప్పాలో తోచక ఊరుకున్నాడు.
    శేషగిరి ఇక పడుకుందా మనుకునేసరికి డోర్ బెల్ మ్రోగింది. తనే వెళ్ళి తలుపు తీశాడు. వాళ్ళతో మాట్లాడి లోపలకు వచ్చి:
    "రత్నా! నేను డాంగే-ఇంటికి వెళ్ళివస్తాను. తలుపేసుకో" అని చెప్పి రమేశుడితో :
    "పడుకోవయ్యా; నాకోసం కాచుక్కుర్చోకు" అని చెప్పి, తన మందులపెట్టే తీసుకుని వెళ్ళిపోయాడు.
    "నిద్రవస్తోంటే పడుకోండి" అంది రత్న.
    "మధ్యాహ్నం బాగా నిద్రపోయానేమో; ఇప్పుడు నిద్రరావటంలా. మీరు పడుకోండి. డాక్టర్ వస్తే నేను తలుపు తీస్తాను."
    రత్న వెళ్ళిపోయింది. రమేశుడు లైటు ఆర్పేసి బాల్కనీలో నిల్చుని నక్షత్రాలు లెక్కపెట్టసాగాడు.
    శేషగిరి వచ్చేవరకు అలాగే రాతిబొమ్మలా ఆకాశం వైపుకు చూస్తూ నిల్చున్నాడు రమేశ్. శేషగిరి రాగానే తలుపు తీసి తన గదికి వెళ్ళి పడుకున్నాడు. అతడి మనసు ఆలోచనలతో ఊగిపోతోంది.
    "నేను ఎందుకు వచ్చానిక్కడికి? ఊరు విడిచి పారిపోతే, మనసులో అగ్ని చల్లారుతుందా? ఎంత పొరబాటు-ఆలోచనలతోనే తెల్లవారింది.
    ఉదయం కాఫీ తాగేటప్పుడు శేషగిరితో అన్నాడు:
    "నేను ఈ రోజు వెళ్ళిపోతాను."
    బ్రెడ్డు తింటున్న శేషగిరి ఆశ్చర్యంతో తలెత్తి చూసి "ఏమిటీ?" అన్నాడు.
    "నేను.....ఊరికి వెళ్ళిపోదామని......"
    "నిన్ననే వచ్చావ్, ఈ రోజు వెళ్ళిపోతావా?"
    "ఆఁ."
    "బొంబాయి చూడవా?"
    "ఏముంది చూడటానికి? ఒకటే సందడి."
    "నువ్వు ఇప్పుడప్పుడే వెళ్ళలేవు" ఖచ్చితంగా చెప్పాడు శేషగిరి.
    "ఏం?"
    "మళ్ళీ నేను వెళ్ళమనేవరకూ ప్రయాణం మాట తలపెట్టకు" - అంటూ వెళ్ళిపోయాడు శేషగిరి.
    రమేశ్ నిస్సహాయంగా రత్నవైపు తిరిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు.
    "నేను వెడతాను.
    "ఇంత త్వరగానా? మీ కిక్కడ కష్టంగా ఉందా?"
    దీని కేమని జవాబు చెప్పాలో తోచలేదు రమేశుడికి.
    "కష్టమనికాదు: నేను మీకంతా 'న్యూసెన్సు" గా ఉన్నాననిపిస్తోంది. ఊరికి వెళ్లిపోదామని ఉంది. వెడతాను-అంతే."
    "మా కంపెనీ అంత తొందరగా విసుగని పించిందా?"
    "అలా కాదు........"
    "ఇప్పుడు పంపలేం మిమ్మల్ని. సాయంత్రం సముద్రతీరానికి వెడదాం. సముద్రం చూడాలని లేదూ?"
    "దాన్నెందుకూ చూడటం......."
    "చూసి తీరాల్సింది సముద్రం. ప్రయాణం మాటే తలపెట్టకండి."
    రమేశుడికి కోపం, దుఃఖం పొంగివచ్చాయి. శేషగిరి-ముందు మాట్లాడాలంటే, సంకోచం అడ్డు వచ్చేది. ఎందుకోగాని, రత్న దగ్గర సంకోచం లేకుండా మనసు-విప్పి మాట్లాడగలిగేవాడు.
    "అయినా మధ్య మీ దేమిటీ బలవంతం నా ప్రయాణానికి."
    పని చేసుకుంటున్న రత్న వెనుదిరిగి చూసి:
    "ఎలా వెడతారో వెళ్ళండి చూద్దాం" అంది.
    "అలా కాదు; నన్ను పంపేయండి."
    "పంపక మిమ్మల్ని ఇక్కడే అట్టేపెట్టుకుంటా మనుకున్నారా? తప్పకుండా పంపుతాం. అన్నట్టు ఇక్కడి వంట వచ్చిందా మీకు?"
    "ఏదో ఒకటి-ఆకలవుతుంది కాబట్టి తినాలి అంతే. నేను అలా తిరిగి వస్తాను."
    "చాలా ఎండగా ఉంది. అనవసరంగా ఇప్పుడెందుకూ వెళ్ళటం? నిన్నటిలా నన్ను భయపెట్టకండి."
    "నిన్న మిమ్మల్ని భయపెట్టానా?"
    "అవును. నేనన్న మాటలకు అసలే మీరు నొచ్చుకున్నారు. అందుకే అంత భయపడ్డాను. ఇంకాస్సేపటిలో మీరు రాకపోయినట్టయితే నేనే వెతుక్కుంటూ వచ్చేదాన్ని. ఈ రోజు మాత్రం అలా చేయకండేం."
    "లేదు" అన్నాడు రమేశ్.
    తను పొద్దుకు సరిగ్గా ఇటికి వస్తేనేం, రాకపోతే-నేం? ఎందుకంతగా పట్టించుకోవాలి అనుకున్నాడు రమేశ్.
    సాయంత్రం దాదర్ బీచికి వెళ్ళటానికి సిద్ధమయింది రత్న, రాత్రి వంట తొందరగా పూర్తి చేసుకుని ఆశకు మంచి గుడ్డలు వేసి, తనూ చీర మార్చుకుని రమేశ్-గదిలోకి వచ్చి:    
    "వెడదామా?" అంది.
    "పదండి" రమేశ్ ఎలా ఉన్నాడో అలాగే బయల్దేరాడు.
    "మీ రింకా తయారవలేదు......."
    "ఇలాగే వస్తాను."
    ఏమో చెప్పాలనుకున్న రత్న, ఆ ప్రయత్నం మానుకుని, తలుపుకు తాళంవేసింది. ముగ్గురూ బయల్దేరారు.
    "బస్సులో వెడదామా? నడిచే వెడదామా?"
    రమేశ్ బదులు-చెప్పకమునుపే ఆశా:
    "బస్సులో వెడదామమ్మా" అంది.
    వాళ్ళు బీచి చేరేసరికి సుమారు ఆరు గంటలయింది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సముద్రపు గాలికోసం జనం గుంపులు గుంపులుగా వస్తున్నారు.
    ఇసుకలోకి అడుగు పెట్టగానే, ఆశా ఆనందంతో గంతులేసింది. ఇసుకలోనుండి ఆల్చిప్పలు, శంఖాలు ఏరి, దాచమని తల్లిచేతికిచ్సింది.
    రత్న ఇసుకమీద కూర్చుంటూ రమేశుడితో :
    "నే నిక్కడే కూర్చుంటాను. కావాలంటే మీరు అలాగే తిరిగి రండి" అంది.
    "అక్కర్లేదు; నేనూ ఇక్కడే కూర్చుంటాను" అంటూ, తనూ కూర్చున్నాడు.
    ఆశ గంతులేస్తూ నీళ్ళ దగ్గరకు వెడుతూంటే రత్న:
    "నీళ్ళదగ్గరగా వెళ్ళకు" అని కేకవేసింది.
    "అలలు చూస్తాను" అంది ఆశా.
    "దూరంనుండే చూడు; దగ్గరగా వెళ్ళకు."    
    రమేశ్ చేతివేలితో ఇసుకమీద గీతలు గీస్తూ కూర్చున్నాడు.
    సముద్రుడు ఆనందంతో ఉప్పొంగుతున్నట్టు అలలు ఎగిరెగిరి పడుతున్నాయి. నీలిరంగు అలలు ఒకదాని వెనకొకటి తరుముకుంటూ, ఒడ్డును చేరకమునుపే నవ్వుల పువ్వుల్ని వెదజల్లినట్లు, నీటిని విరజిమ్మి అతి వేగంగా వెనక్కు వెళ్లిపోతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS