Previous Page Next Page 
జీవన వలయం పేజి 12


    'వెళ్ళొస్తాను, నజ్ మా' అన్నాను.
    నా దగ్గరగా వచ్చి 'నన్నుక్షమించు, లతా వారిలాటి వారిని తీసుకొస్తారని తెలిస్తే నిన్ను ఆపేదాన్ని కాదు' అంది.
    'ఫర్వాలేదు ఇందులో నీ తప్పేం ఉంది?' అంటూ వచ్చేశాను. గది దాటి ఇవతలకు వస్తూ వెనక్కు తిరిగి నజ్ మాను చూశాను. రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తూంది. మారు మాట్లాడకుండా వచ్చేశాను. నజ్ మా లాటి స్త్రీలు ఏడ్పులోనే కొంత మనశ్శాంతిని పొందుతారు.
    రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను గడిచి పోతున్నాయి. చాలా రోజుల వరకు నజ్ మాను కలుసుకోలేదు. ఒక రోజు బాషాయే మా ఇంటికి వచ్చాడు. ఈ మధ్య నజ్ మాను రెండు సార్లు పుట్టింటికి తీసుకొస్తే ఒకటి రెండు రోజులకంటే ప్రభాకర్ ఆమె నిక్కడ ఉండనివ్వలేదని చెప్పాడు. తరవాత పరీక్షల గొడవలో పడి నజ్ మా విషయం ఆలోచించటం మానివేశాను. ఆఖరు పరీక్ష వ్రాసి నేను, అన్నయ్య నాన్నగారితో సినిమాకి వెళ్ళాం. అమ్మకు ఒంట్లో బాగుండలేదని రాలేదు. కాని మేము తిరిగి వచ్చేటప్పటికి ఆమె ఇంట్లో లేదు. జవాను అమ్మ నజ్ మా నాన్నగారికి చాలా జబ్బుగా ఉన్నట్లు తెలిసి అక్కడికి వెళ్లిందని చెప్పాడు. ఆ రాత్రి ఎలాగో గడిచింది. అమ్మ రాలేదు. తెలతెలవారుతుండగా వచ్చి, "డాక్టర్లు ఏమీ లాభం లేదని చెప్పారు. ఆయన మరణం రోజుల్లోనే అని చెప్పారు. పోనీ, కన్నబిడ్డ ఊర్లోనే ఉందికదా అని నేనే కబురు పంపమన్నాను. ఆ పిల్ల వస్తేనా? మా ఆయన లేడు, వచ్చాక అడిగి వస్తాను అందట...విన్నావా, లతా? ఇన్నాళ్ళూ పెంచిన తండ్రి బ్రతుకుల్లో ఉంటే ఏ భర్త అయినా వెళ్ళవద్దంటాడా? అంత జబ్బుగా ఉందని కబురు వెళితే చూడటానికి రాకుండా ఉండటానికి ఆ అమ్మాయి మనస్సెలా ఒప్పిందో" అని విసుక్కొంది అమ్మ.
    'నువ్వలా నజ్ మాను నిందించవద్దమ్మా. ఏదో కారణం ఉండబట్టే వచ్చి ఉండదు' అన్నాను.
    'నువ్వు మరీ చెబుతావే విడ్డూరం. ప్రాణం మీదికి వస్తే రానిది మరెప్పుడు వస్తుందేమిటి?' కోపంగానే అంటూ వంట ఇంట్లో ప్రవేశించింది అమ్మ. దీనంగా విలపిస్తున్న నజ్ మా నా స్మృతి పథంలో మెదిలింది. తండ్రిని  చూడాలని ప్రాణం కొట్టుకులాడుతున్నా చూడటానికి నోచుకోని నిర్భాగ్యురాలు. నజ్ మా బాధ ఎవరి కర్ధమవుతుంది?
    మళ్ళీ అమ్మతో కలిసి నేను వెళ్ళేటప్పటికి నజ్ మా వాళ్ళ నాన్నకు చాలా సీరియస్ గా ఉంది. ఇంటినిండా బంధువులు, స్నేహితులు ఉన్నారు. అంతా నజ్ మా రాలేదని రకరకాలుగా చెప్పుకొంటున్నారు. చివరకు బాషా వెళ్ళి పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసరికి నజ్ మా భోరుమని ఏడ్చేసిందట. ప్రభాకర్ కూడా ఆమెతో రావటం అందరికి కాకపోయినా నాకు ఆశ్చర్యం కలిగించింది. మంచి స్థితిలో ఉండగా మామగారితో మాట్లాడలేదు కాని తెలివిలేకుండా పడిఉన్న ఆయనను మాత్రం చూసి వెళ్ళాడు ప్రభాకర్. ఇక నజ్ మాకు మాటలే కరువయినాయి. కళ్ళు మాత్రం చెరువు లయినాయి.
    పగలంతా నజ్ మా తండ్రికి స్పృహ లేదు. ఆ రాత్రి గడవటం కష్టమని డాక్టర్ చెప్పాడు. వెళ్ళవలసిన బంధువులంతా ఆగిపోయారు కాని ప్రభాకర్ నజ్ మాను తీసుకెళ్ళడానికి వచ్చాడు. బంధువులంతా ఇలా ఉంటే ఎలా వెళతావు? ఈ ఒక్క రాత్రి ఉండు అంటున్నారు. వాళ్ళకు నజ్ మా కన్నీరే సమాధానం. వెళుతూ నా దగ్గరకు వచ్చింది. 'నే నేం చెయ్యను, లతా! వెళుతున్నాను. కాని వీళ్ళంతా నాన్నమీద నాకు ప్రేమ లేదనుకుంటారేమోనని భయంగా ఉంది' అంది ఏడుస్తూ.
    'ఏడవకు, నజ్ మా. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నీవు వివాహితవు. నీ భర్త తరవాతే అందరూ వెళ్ళు. ఏ కూతురుకైనా తన తండ్రిపై ప్రేమ లేకుండా ఉంటుందా? అలా అనుకొనేవారు మూర్ఖులు' అని అనునయించాను. అంతకంటే నేను మాత్రం చేయగలిగింది ఏముంది?' ఒక నిట్టూర్పు విడిచింది లత.
    "తరవాత ఏమైంది?" ఆసక్తిగా అడిగాడు మధు.
    తెల్లవారిన తరవాత ఆయన పరిస్థితి మరీ విషమించింది. రెండు కబుర్లు వెళ్ళినా నజ్ మా రాలేదు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన ఈ ప్రపంచానికి దూరమయ్యారు. బంధువుల దీన విలాసాలమధ్య ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలైనవి. అప్పటికి ఆయన మరణించి మూడు గంటలైంది. శవాన్ని తీసుకువెళ్ళబోతున్న సమయంలో నజ్ మా, ప్రభాకర్ వచ్చారు. అంత దుఃఖంలోను ఆమెనంతా చిత్రంగా చూశారు. అవును, మరి! ఊర్లో ఉన్న కూతురు తండ్రి అవసానసమయంలో దగ్గర లేకపోగా మరణించగానే కూడా రాలేదు. అంతా పూర్తయిన తరవాత ఆ సాయంత్రమే ఇంటికి వెళుతూ నజ్ మా నా దగ్గరకు వచ్చింది. 'పరాయి దానవైన నీవు, మీ అన్నయ్య మా కుటుంబాన్ని ఈ స్థితిలో వదిలి వెళ్ళలేక ఉండిపోయారు. కాని నేను... నేను...' ఇక మాట్లాడలేక ఏడవటం మొదలుపెట్టింది నజ్ మా. ఆమె నెలా సముదాయించాలో కూడా నాకు తెలియలేదు. 'ఊరుకో, నజ్ మా. జరిగిపోయిన దానికి విచారించి ఏమి లాభం?' అన్నాను.
    'అదికాదు, లతా. నాన్న తెలివిలో ఉండగా కనీసం ఆయనను కళ్ళారా చూడలేకపోయాను. నాన్న నోటి నుండి నే నొక చల్లని మాట వినలేకపోయాను. ఆయన బ్రతకరని తెలిసీ ఆయనను వదిలి వెళ్ళిపోయాను. అవసానసమయంలో దగ్గర ఉండలేక పోయాను. జీవితంలో నాన్న నాకు మళ్ళీ కనిపించరు. కాని ఈ వేదన మాత్రం నన్ను జీవితాంతం దహిస్తూ ఉంటుంది.' ప్రభాకర్ రావటంతో అతనితో కలిసి వెళ్ళింది కన్నీళ్లు తుడుచుకుంటూ.
    "ఎందు కా వెధవ ఏడ్పు? ఏడిస్తే చచ్చినవాళ్ళు వస్తారా?" కసురుకొంటున్న ప్రభాకర్ ను చూసి నా హృదయం జాలిగా నవ్వింది. చూశావా, మధూ, తండ్రి పోయినా, కనీసం ఆ ఇంట్లో తల్లి దగ్గర ఉండి యైనా ఓదార్పు పొందలేని భార్యను ఓదార్చే ఆయన విధానం!    
    "ఒక చిన్న ప్రశ్న, అక్కా మరి నజ్ మాను పుట్టినింట్లో ఉంచడానికి ఆయ నెందు కిష్టపడేవాడు కాదు?"    
    "ఓరి పిచ్చి మధూ, తన ఇంట్లోనే ఆమెను అంత కట్టడిలో ఉంచాడు గదా. పుట్టింట్లో ఆమె ఎలా ప్రవర్తిస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో నని అతని భయం. ఆమె తన సమక్షంలో, తన ఇంట్లో ఉంటేనే తనకు ధైర్యం."
    "నిజంగానే అలా భావించేవా డంటావా? లేక ఆమెను హింసిస్తానికే అలా చేసేవాడంటావా?"
    "ఏమో? ఎలా చెప్పగలం? అది ఒక విధమైన మానసిక దౌర్భల్యం కావచ్చు. ఆమె నిజాయితీ పై నమ్మకం ఉన్నా ఏదో ఒక మూల అనుమాన పిశాచం అవహిస్తూ ఉండేదేమో! ఏది ఏమైనా నజ్ మా అతని సమక్షంలోగాని, పరోక్షంలోగాని మగవారితో మాట్లాడేది కాదు. కనీసం కన్నెత్తి చూసేది గాదు. పెండ్లి కాకముందు మాట్లాడేవారితో కూడా మాట్లాడటం మానివేసింది. అతని వెంట కార్లో వెళ్ళినా, సినిమాకు వెళ్ళినా తల వంచుకొని కూర్చోటం అలవాటు చేసుకొంది. అయినా ఆమెకు సుఖం లేదు. శాంతిలేదు, దయామయుడైన భగవంతుడు ఒక్కొక్కరి జీవితాన్ని ఇలా ఎందుకు చేస్తాడో తెలియదు.
    తరవాత వారం రోజులకు నజ్ మా నన్ను వెంటనే రమ్మని కబురు చేసింది.
    'రెండు రోజులనుండి ఆయన ఇంటికి రావటం లేదు' అంది నన్ను చూసి.
    'ఆఫీసుకు ఫోను చేశావా?'
    'అమ్మో! ఇంకేమైనా ఉందా? వచ్చిన తరవాత ఆయన కోసం భరించే స్థితిలో లేను' అంది నిర్జీవంగా.
    నేనే ఆఫీసుకు ఫోను చేశాను. మేనేజర్ అందుకొని ప్రభాకర్ రెండు నెలలు సెలవు పెట్టాడని, నాలుగు రోజులనుండి ఆఫీసుకు రావటంలేదని చెప్పాడు. చలనం లేని బొమ్మలా కూర్చున్న నజ్ మాతో నేనేమీ మాట్లాడలేకపోయాను. ఆ రాత్రి నే నామె దగ్గరే ఉన్నాను. మరురోజు అతని దగ్గరనుండి ఉత్తరం వచ్చింది- నజ్ మా ను తన దారి తనను చూసుకోమని, అతడి దగ్గరకు రావటానికి ప్రయత్నించవద్దని. నేను అమ్మను రమ్మని ఇంటికి కబురు చేశాను. అమ్మ, అన్నయ్య వచ్చారు. అమ్మ నాన్నను, అన్నయ్యను పంపి ఏదోవిధంగా ప్రభాకర్ నజ్ మాను తీసుకెళ్ళే టట్లు చేస్తానంది. అన్నయ్య విడాకులిమ్మన్నాడు. నజ్ మా దేనికీ ఒప్పుకోలేదు.
    'ఆయనకు నాపై అంత విముఖత్వం కలగటం నా దురదృష్టం. నన్ను వదిలించుకొని వెళ్ళిన ఆయన దగ్గరకు మళ్ళీ నే వెళ్ళలేను. ఆయనతో తెగ తెంపులు చేసుకోనూ లేను. ఏనాటికైనా ఈ దీనురాలిపై జాలి కలిగి రాకపోతారా? ఆ రోజు కొరకు ఎదురుచూస్తూ ఉంటాను' అంది. ఆ తరవాత నజ్ మాకు ప్రయత్నించి మళ్ళీ ఉద్యోగం ఇప్పించారు నాన్న, అన్నయ్య, నజ్ మా వాళ్ళ పుట్టింటికి వచ్చేసింది.
    అటు తరవాత రెండేళ్ళకునేను సుధను ప్రసవించ డానికి వెళ్ళినప్పుడు కాబోలు చెప్పింది- ప్రభాకర్ మళ్ళీ వాళ్ళ కులంలో అమ్మాయినే పెళ్ళి చేసుకొన్నాడనీ, వాళ్ళకు అతడి మొదటి వివాహం సంగతి కూడా తెలుసుననీ. ఆమెది ఏ ఊరో, ఎవరి కూతురో కూడా చెప్పింది.
    "ఎవరక్కా ఆ రెండవ నిర్భాగ్యురాలు?"
    "తెలుసుకొని ఏం చేస్తావు? ఆమె నీ వనుకొన్నట్లు నిర్భాగ్యురాలు మాత్రం కాదు. అదృష్టవంతురాలే అయింది. కేవలం కులాభావం తలఎత్తి అది భరించలేక ప్రభాకర్ నజ్ మాను వదిలించుకోవడానికి అలా ప్రవర్తించాడు."
    మధు వింటూ కూర్చున్నాడు.
    "ఇప్పుడు చెప్పు, తమ్ముడూ! అసలే హృదయం పగిలిన నజ్ మా ప్రతి సారి సీరియల్ గా పడుతున్న ఈ నవల చదువుతూ, తన సంసారాన్ని, గతస్మ్రుతులను జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఎంత కృంగిపోతుందో ఆలోచించు." మధు ఏమీ మాట్లాడలేదు. గంభీరంగా లేచి నిలుచున్నాడు.
    "అక్కా, ఒక్కసారి ఆ ప్రభాకర్ రెండవ సంబంధం వివరాలు చెప్పు."
    "ఎందుకు?"
    "ఊరికే విందామని." చెప్పింది లత. మధు ముఖం నల్లగా మాడిపోయింది.
    "ఏం, తమ్ముడూ, అలా అయిపోయావు? వాళ్ళు నీకు తెలుసా?" అంది అనునయంగా.
    "తెలుసు. ప్రభాకర్ మామగారు సునీత మేనమామ. అతడి భార్య సునీత మామయ్య కూతురు ఉమాబాల."
    "నిజమా? నీ కెలా తెలుసు?"
    "ఇది ముమ్మాటికీ నిజం. ఈమధ్య ప్రభాకర్, ఉమాబాల సునీత వాళ్ళింటికి వచ్చి పది రోజులు ఉండి వెళ్ళారు. ఆ రోజు సునీత చెపితే ఏదో అనుకొన్నాను. ఈ రోజు నిజం తెలిసింది."
    "అవును ఇలాంటిదే ఏదో అయిఉంటుందని అనుమానించాను. సునీత అంత సహజంగా ఎలా వ్రాయగలిగిందో ఇప్పుడు అర్ధమౌతూంది." ఆమె మాటలు పూర్తి కాకుండానే మధు వెళ్ళిపోయాడు.
    
                              *    *    *

    నజ్ మా కథ విన్నప్పటినుండి మధు మనస్సు అల్ల కల్లోల మయింది. నజ్ మా ఎవరో తనకు తెలియదు. ఆమె బాధలు తను చూడలేదు. అయినా ఆ అజ్ఞాత వ్యక్తిపై అతడికి ఎనలేని జాలి కలుగుతూంది. ఆమె నొక్కసారి చూడాలని మనస్సు ఆరాట పెట్టుతూంది. ఆలోచనలతో సతమతమవుతున్న మధు ముందు అప్పుడే వచ్చిన పత్రిక నుంచి వెళ్ళాడు గోవిందు. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని సునీత సీరియల్ నవల 'పగిలిన హృదయాలు' చదవటం మొదలు పెట్టాడు.    
    "సలీం అప్పుడే రమ మాతృత్వాన్ని పొందబోతున్న విషయం తెలుసుకొని ఆనందంగా ఆమెను దగ్గరకు తీసుకొని అభినందించి, నా కెందుకు చెప్పలేదని నిష్టూరమాడతాడు. అతనిని విదిల్చివేసి "మీకు కూడా ఇలాటి వార్త సంతోషం కలిగిస్తుందా ఏమిటి?" అని అతని ఆనందాన్నంతా మంట గలిసిపోతుంది." ఇంతవరకు చదివి మధు ఆలోచనలో పడ్డాడు. ఇదే సంఘటన లత తనకు చెప్పింది. కాని విదిలించినది భర్త. ఇక్కడ భార్య. ఇలా ప్రతిసారీ సునీత నవలను లత చెప్పిన కథతో పోల్చి చూసుకొంటున్నాడు మధు. పోయినసారి పత్రికలో పిక్ నిక్ కు అంతా రెడీ అయినా నేను రానని భీష్మించి కూర్చుని సలీమ్ ఆనందాన్ని రమ రసాభాస చేసిన సంఘటన ఉంది. పత్రిక మూసి పక్కన పెట్టాడు. ఏదో ఆలోచిస్తూ చాలాసేపు అటూ ఇటూ పచార్లు చేశాడు హాల్లో. ఆ తరవాత సగం వరకు గీచిన సునీత చిత్రాన్ని తదేకంగా చూస్తూ నిలుచున్నాడు. అతనికి తెలియకుండానే అతనిలో నుండి దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది. ఏదో నిర్ధారణ చేసుకొన్నట్టు అలమారులో ప్లాస్కు తీసి కాఫీ వంచుకొన్నాడు. ఆ తరవాత తెల్లకాగితాలు ముందు వేసుకొని కలం చేతిలోకి తీసుకున్నాడు. నాలుగు పేజీలు  చకచక వ్రాసి కుర్చీలో వెనక్కు చేరగిలపడ్డాడు.
    "ఇదుగో, తమ్ముడూ, అన్నయ్య ఉత్తరం వ్రాశాడు" అంటూ వచ్చిన లత క్షణం అలాగే అతని వంక చూసి, "ఏం, నీవూ రచనలు మొదలు పెట్టావా?" అంది.
    "ఏం, వ్రాయకూడదా?" నవ్వుతూ అన్నాడు మధు.
    "సరి, సరి. అక్కడ ఆయన, ఇక్కడ నువ్వూ వ్రాస్తూ కూర్చుంటే ఇక నే నెవరితో మాట్లాడను?" అంటూ తానూ ఒక కుర్చీ లాక్కుని కూర్చుంది.
    "నీవు మాట్లాడుతూ కథలు చెప్పు. సరేనా?"
    "కథంటే గుర్తు వచ్చింది. ఆ నవల సునీత కిచ్చావా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS