'నజ్ మా నింకా తీసుకురాలేదా?' అని అడిగాను.
'నాలుగు రోజుల నుండి అబ్బాయి రోజూ వెళుతూనే ఉన్నాడమ్మా నజ్ మాను తీసుకురావడానికి. ఆయన రేపు పంపిస్తా, రేపు పంపిస్తానంటున్నారట. ఈ రోజు మా మరిది వెళ్ళి గట్టిగా అడిగితే "పండుగ రోజు పొద్దుట తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రానికి పంపించెయ్యండి' అని చెప్పారట. విన్నావా, తల్లీ? ముగ్గురు అన్నదమ్ములకూ అది ఒక్కతే ఆడపిల్ల గదా! మా మరుదులు దానిని సొంతబిడ్డలాగ చూసుకొంటారు. వచ్చి పది రోజులు ఉంటుందని ఆశ పడ్డాం. ఇన్నాళ్ళకు వాళ్ళ నాన్న తీసుకురావడానికి ఒప్పుకొంటే ఆయనిలా అన్నాడట. ఇంతకీ నా కర్మ, తల్లీ, మా కులంలో చేసుకొంటే ఏ గొడవా ఉండేది గాదు" అంటూ ఎంతో బాధ పడింది. పాపం, నజ్ మాకు నేను ఊహించి నట్లు పుట్టింట్లో ఉండే ఆనందం కూడా లేదన్న మాట!" కొంచెం ఆగి ఊపిరి పీల్చుకొంది లత.
"ఇంతకీ ఆ మహానుభావుడు పండుగరోజుకైనా పంపాడా?" అని అడిగాడు మధు.
"ఆఁ! ఆ ఉదయం నజ్ మా అన్న వెళ్ళి ఇద్దరినీ రమ్మని ఎంతో ప్రాధేయపడ్డాడట. కాని ప్రభాకర్ తనకు వీలుండదని, నజ్ మాను తీసుకెళ్ళమని చెప్పాడట. వెళ్ళబోతూన్న నజ్ మాతో 'సాయంత్రం ఏడు గంటలకు నువ్వు మళ్ళీ ఇక్కడుండాలి' అని తీక్షణంగా చూసిన ప్రభాకర్ చూపుకు నజ్ మా తట్టుకోలేక 'అలాగే' నన్నట్లు తల ఊపి వచ్చింది.
చిన్నతనంలో నాకూ, అన్నయ్యకూ ఒక సరదా ఉండేది. మన పండుగలకు మహమ్మదీయులూ, క్రిస్టియన్స్ స్నేహితులను ఆహ్వానించేవాళ్ళం. వాళ్ళతో పాటు భోజనం చేసి మన పండుగ విశేషాలు ముచ్చటిస్తూ గడిపేవాళ్ళం. వాళ్ళు మళ్ళీ మమ్ములను తమ పండుగలకు ఆహ్వానించేవాళ్ళు. మేము వెళ్ళేవాళ్ళం. దీనికి మా అమ్మ కాని, నాన్నకాని ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. ఆ వాడుక ప్రకారమే రంజాన్ రోజు రాత్రి నేనూ, అన్నయ్యా నజ్ మా పుట్టింటికి వెళ్ళాం. అప్పటికే నజ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సంగతి విని అన్నయ్య ఆశ్చర్యపోయినా నే నాట్టే ఆశ్చర్యపోలేదు. 'అంత త్వరగా వెళ్ళిపోయిందేం?' ఆశ్చర్యంగానే అడిగాడు.
"ఏం చెప్పమన్నావు, రాజా! పొద్దుటే ఆయన చెప్పి పంపాడు- ఏడు గంటలకు పంపించెయ్యమని. కాని మేమే దానిని బలవంతంగా ఆపాము. ప్రభాకర్ ను తీసుకురావడానికి ఇంటికి వెళ్లాను. ఆయన ఇంట్లో లేడు. ఆఫీసు కెళ్ళి రమ్మని బ్రతిమిలాడితే తాను రాలేదని, ఏమీ అనుకోవద్దని మర్యాదగానే నిరాకరించాడు. నేను వచ్చేశాను. నీలాగా ఏడు గంటలకు నజ్ మా వెళ్ళిపోతానని గొడవ. ఒక్క రాత్రీ ఉండి రేపు వెళ్ళవచ్చులే అని బలవంతంగా ఉంచాము. కాని అది భయపడుతూనే ఉంది. భయపడినట్లే ఆయన వెంటనే రమ్మని కారు పంపాడు. ఇంకేముంది? ఇది వణికిపోతూ కారెక్కింది. అమ్మ భోజనంచేసి వెళ్ళమన్నా వినిపించుకోలేదు. అప్పుడు గబగబా వాళ్ళిద్దరకూ కారియర్ లో భోజనం పెట్టి ఆ కార్లో పెట్టాం' అని ఒక నిట్టూర్పు విడిచాడు బాషా.
'అయితే నజ్ మా పతివాక్యాన్ని, తు చ తప్పకుండా పాటిస్తూందన్న మాట!' నవ్వుతూ అన్నాడు అన్నయ్య.
'ఏమోనయ్యా. నీ నిప్పుడైతే నవ్వుతున్నావు కాని వెళ్ళేటప్పుడు దాని ముఖం చూడాల్సింది ఎలా ఉందో. నువ్వుండమ్మా, నేను ఆయనకు కబురు చేస్తానంటే నీకు తెలియదమ్మా అంటూ ఒకటే వణికిపోవటం. ఏం విడ్డూరమో, నాయనా, మేమంతా ఇలాగే చేశామా! వస్తానన్న వేళకు కొంచెం అటు ఇటు అయితేనే కొంప ములిగినట్లు భయపడతారేమిటీ' అంది వాళ్ళమ్మ. అవును! ఆమెకు నజ్ మా పరిస్థితి ఏం తెలుస్తుంది? ధనవంతుడైన భర్త! ప్రేమించి పెళ్ళి చేసుకొన్న భర్త! ఆమె నెంత గౌరవిస్తాడో అని ఊహించుకొని ఉంటుంది. ఆ మరురోజు ప్రత్యేకంగా నజ్ మా దగ్గరకు వెళ్ళాను. ప్రభాకర్ ఇంట్లో లేడు. 'రాత్రి అంత త్వరగా వచ్చాశావే? నీవు ఉంటావని సరదా పడి నేను వచ్చాను' అన్నాను.
'నీలాగ నేనూ అవివాహితనయితే నీ సరదాలు తీర్చగలిగేదాన్ని' అంది నవ్వుతూ. తరవాత చెప్పింది.
'ఆయన ఏడు గంటలకే రమ్మన్నారని నేను వెళతానంటే అమ్మ, పిన్నీవాళ్ళు నన్ను కోప్పడి ప్రభాకర్ ను కూడా తీసుకురమ్మని అన్నయ్యను పంపారు.అల్లుడు, కూతురు ఆ ఇంట్లో భోజనం చేసి, కనీసం ఆ రాత్రి నిద్రించాలని వారెంతో కుతూహలపడ్డారు. ఇలా కోరటంలో చిత్రమేముంది? నీకు తెలుసుగా, లతా? ఇద్దరు బాబాయిలకు, నాన్నకు కలిసి ఆడపిల్లను నే నొక్కదాన్నే కదా! అందరికీ నే నంటే ప్రాణం. పిన్ని చెప్పినా వినకుండా ఆయన వస్తారని, పండుగరోజని నన్ను అలంకరించి కొత్తబట్టలు కట్టింది. కాని ఆయన ఆకక్డకు రాలేదు గాని నేనే ఆయన దగ్గరకు వచ్చేశాను. 'వచ్చిన తరవాత ఏమైందో తెలుసా?' అంది నా వంక చూస్తూ.
నేను చెప్పమన్నట్లు చూశాను.
'నేను వచ్చేటప్పటికి ఆయన సోఫాలో కూర్చున్నారు. ముఖం ఎంతో దిగులుగా ఉంది. నేను భయపడుతూనే లోపల అడుగు పెట్టాను. తలఎత్తి చూసి "ఇలా వచ్చి కూర్చో" అన్నారు. అలాగే భయపడుతూ వచ్చి సోఫాలో ఆయన పక్కనే కూర్చున్నాను. ఒక్కసారి నన్ను పైనుండి కిందవరకూ చూశారు. డ్రైవరు కారియర్ లోపల పెట్టి తాళాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన లేచి తలుపు వేసి ఒక్కొక్క అడుగూ నా వైపు వేస్తూ వచ్చి అనను గుచ్చి గుచ్చి చూడటం మొదలు పెట్టారు. నిలువెల్లా వణికిపోతూ నేను లేచినిలుచున్నాను.
"నజ్ మా!" ఆప్యాయంగానే పిలిచారు.
"భర్త పరోక్షంలోకూడా ఇంతగా అలంకరించుకొనే నిన్నేమనుకోవాలి?" ఒక్కసారి నా గుండె ఆగిపోయి నట్లు అనిపించింది. ఒక్కసారి నన్ను నేను చూసుకొన్నాను. తెల్లని జరీ అంచు జార్జెటు చీరె, పాలమీగడ లాంటి తెల్లని సిల్కు జాకెట్టు, మెడలో ఆయన పెండ్లయిన కొత్తలో కొని ఇచ్చిన పెద్ద లాకెట్ గల ముత్యాలహారం, చెవులకు ముత్యాల రింగులు, అరచేతులు, కాళ్ళు గోరింటాకు తో ఎర్రగా పండినాయి. తలను చక్కగా దువ్వి వేసిన పెద్ద సిగ. ఆ సిగచుట్టూ అరవిచ్చిన మల్లెలు! ఇదీ నా అలంకరణ. పిన్ని చేసింది, నేను అడుగులో అడుగు వేసుకొంటూ ఆయనను సమీపించాను.
"ఈ అలంకరణ మీ కోసమే చేయించుకొన్నాను. నన్ను నమ్మండి. నా శీలాన్ని ఇలా శంకించి నన్ను చిత్రవధ చేయకండి. నా కలాటి తలపులే కలిగిననాడు నా ప్రాణాలనైనా విడుస్తాను కాని అలాటి నీచపు పనులు కాదుగదా- ఆలోచనకూడా నాకు లేదు. మీ పాదాలంటి ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్మండి" అంటూ ఆయన కాళ్ళు పట్టుకొని దుఃఖాన్ని ఆపుకోలేక విలపించసాగాను. కొంచెం సేపటికి ఆయన నన్ను లేవనెత్తుతూ, "నమ్మాలనే అనుకొంటున్నాను. అయినా నజ్ మా, నేను లేనప్పుడుకూడా తెల్లనైన నీ ముఖం స్నో పౌడర్ లతో మరింత తెల్లగా ఎందుకుచేసుకోవటం?" అంటూ వెళ్ళిపోయారు. అంత ప్రశాంతంగా ఆ గొడవ ముగిసినందుకు సంతోషించాను' అంది."
"అంటే?" అర్ధం కానట్లు అడిగాడు మధు.
"ఏముంది? ఆయన లేనప్పుడు ఆమె పౌడరు రాసుకోకూడదు. తల దువ్వుకోకూడదు. తెలిసిందా?"
"అక్కా, ఈ కథే నువ్వుకాక మరెవరు చెప్పినా నమ్మలేకపోయేవాడిని."
"అవును, తమ్ముడూ! ప్రపంచంలో నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయి. కథలలో చదివినప్పుడు, సినిమలు చూసినప్పుడు నిజజీవితంలో ఇలా జరుగుతుందా అని శంకిస్తాము. కాని అంతకంటే విచిత్రాలు జీవితంలో కనిపిస్తాయి."
"అయితే భార్య నింత అనుమానించే ఆ ప్రభాకర్ తాను పరాయి స్త్రీలతో మాట్లాడకుండా ఉండేవాడా?" అడిగాడు మధు.
"అదీ చెపుతాను, విను. ఒక రోజు నే వెళ్ళేటప్పటికి నజ్ మా హడావిడిగా పని చేసుకుంటూంది.
'ఏమిటి హడావిడిగా ఉన్నావు?' అంటూ వెళ్లాను.
'సమయానికి వచ్చావు. రా, సహాయం చేద్దువు గాని' అంటూ రవ్వ నా ముందుంచి, 'ఇది లడ్డూలు చుట్టు' అని చెప్పి తాను మరో పని చూసుకుంటూంది,
'నీ కెందుకొచ్చిన బాధ, నజ్ మా? మీ ఆయన వంటమనిషిని పెట్టి చేయిస్తాడుగ? నువ్వు దర్జాగా కూర్చోకూడదూ!' నవ్వుతూ అన్నాను.
'అవునవును. నా కూరలకే పది వంకలు పెడుతూ రెండు రోజుల కొ పళ్ళెం విసిరికొట్టుతూ భోజనం చేసే ఆయన ఇహ వంటమనిషి వంట తినాల్సిందే. ఆ మనిషి వెంట చేయటం దేవుడెరుగు. ఆవిడ ముందు నా మర్యాద మంటగలవటం నా కిష్టం లేదు.' నవ్వుతూనే చెప్పినా ఆ కంఠంలోని బాధను అర్ధం చేసుకొన్నాను.
'సరే! ఈ ఏర్పాట్లన్నీ చూస్తే ఎవరికో పార్టీ ఇచ్చేటట్లు ఉన్నావే?' అన్నాను.
'నే నివ్వటమేమిటి? వారి స్నేహితుల్ని పిలిచారట. ఇందాకే కబురు చేశారు' అంది. ఆ పనీ, ఈ పనీ అందుకొని నే నిక వెళదామని లేచాను.
'కొంచెంసేపు ఉండకూడదూ? వాళ్ళు వచ్చి వెళ్ళాక వెళుదువుగానిలే.' బతిమిలాడింది నజ్ మా.
'వద్దు బాబూ. ప్రభాకర్ వస్తే ఏమైనా అంటాడేమో నిన్ను.'
'అనరులే. నువ్వు ఆడస్నేహితురాలివేగా?' అంది.
అంతలో బయట కారాగింది. అందులోనుండి ప్రభాకర్ తోపాటు బిలబిలమంటూ ఆరుగురు అమ్మాయిలు దిగారు. వెళ్ళబోతున్న నన్ను ప్రభాకర్ ఆపి, 'అరె! మీరు వెళ్ళిపోతున్నారా? వీల్లేదు. రండి. వీళ్ళందర్నీ నేను టీకి తీసుకొచ్చాను. మీరుకూడా మాతో కలిసి టీ తాగవలసిందే' అని మళ్ళీ ఇంట్లోకి తీసుకువచ్చాడు.
లేతనీలం గుడ్డ పరిచిన బల్లమీద అదే రంగు సాసర్లు పరిచింది నజ్ మా. ఇద్దరం కలిసి పదార్ధాలన్నీ వడ్డించాం' అన్నిటితో నిండిన ఆ బల్ల రంగురంగుల తినుబండారాలతోనూ, రకరకాల పండ్లతోనూ చూడటానికి కనులపండువుగా ఉంది. అంతలో ప్రభాకర్ ఆ వచ్చిన ఆరుగురినీ లోపలకు తీసుకువచ్చి పరిచయం చేశాడు. ఒకామె టైపిస్టు. రెండవ ఆమె స్టెనో. తక్కిన నలుగురూ క్లర్క్సు అందరూ కూర్చున్న తరవాత టైపిస్టు 'మేమేకాక మీకు ఇంకా ఆడస్నేహితులున్నారన్నమాట' అంది ఓరగా నన్ను చూస్తూ పమిట సర్దుకుంటూ.
'ఒట్టి ఆడస్నేహితులేం ఖర్మ! అందమైన ఆడ స్నేహితులను' అంది స్టెనో మెడలో నెక్లేసు సరిచేసుకొంటూ వంకరగా నవ్వుతూ.
'ఆమె నా ఫ్రెండ్ గాదు. నజ్ మా ఫ్రెండ్' అన్నాడు ప్రభాకర్ మామూలుగా.
'ఆమెకే ఫ్రెండ్ కావచ్చు. కాని వచ్చే దెవరి కోసమో?' అందుకొంది ఒక క్లర్క్ ఎగతాళిగా నవ్వుతూ.
నా హృదయం ఒక్కసారి భగ్గుమంది. లేవబోయాను కాని నజ్ మా నా కాలిని చేతితో నొక్కిపట్టి లేవనీయ లేదు. ఆ తరవాత ప్రభాకర్ వాళ్ళకు కొందరికి నోటికి రానే పండ్లముక్కలు అందిస్తే, వాళ్ళు పోటీపడుతూ అతనికి తినిపించటం మొదలు పెట్టారు. బయటకు వెళుతున్న వాళ్ళను కన్నార్పకుండా చూస్తున్న నేను స్టెనో ప్రభాకరం నడుంచుట్టూ చేయి వేస్తే అతడు ఆమె భుజంపై చేయివేసి నడిపించుకు వెళ్ళడం కళ్ళారా చూశాను. అతడు వారితో ఆడే పరిహాసాలు, వాళ్ళ అతిచనువు, కొంటెమాటలు అన్నీ వింటున్న నేను అసహ్యంతో బిగుసుకు పోయాను. తన భార్య పరపురుషునితో మాట్లాడగూడదని నిబంధనలు విధించే భర్త తాను మాత్రం తన భార్య ఎదురుగానే పరస్త్రీలతో సరసాలాడవచ్చు. అంత అవమానాన్ని భరిస్తూన్న నజ్ మాను చూసి నే నేమనుకోవాలి? ఇలా అనుకొంటూ నజ్ మా వంక చూశాను. ఆమె తల వంచుకొని నిలబడి ఉంది. ఆ ముఖంలో నాకే భావం కనిపించలేదు. కేవలం నిర్లిప్తంగా మాత్రం ఉంది.
